21. ఇరువది యొకటవ అధ్యాయము

కౌరవసేనను చూసి ధర్మరాజు విషాదము.

సంజయ ఉవాచ
బృహతీం ధార్తరాష్ట్రస్య సేనాం దృష్ట్వా సముద్యతామ్ ।
విషాదమగమద్ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
"యుద్ధానికి సిద్ధమై ఉన్న పెద్ద కౌరవ సేనను చూసి కాంతేయుడైన ధర్మరాజు ఎంతో విషాదం పొందాడు. (1)
వ్యూహం భీష్మేణ చాభేద్యం కల్పితం ప్రేక్ష్య పాండవః ।
అక్షోభ్యమివ సంప్రేక్ష్య వివర్ణోఽర్జునమబ్రవీత్ ॥ 2
భీష్ముడు పన్నిన అభేద్యమయిన వ్యూహం చూసి, ధర్మరాజు దాన్ని బ్రద్దలు చేయలేమని తలచి, అర్జునునితో ఇలా అన్నాడు. (2)
ధనంజయ కథం శక్యమ్ అస్మాభిర్యోద్ధుమాహవే ।
ధార్తరాష్ట్రైర్మహాబాహో యేషాం యోద్ధా పితామహః ॥ 3
మహాబాహూ! అర్జునా! పితామహుని రక్షణలోని కౌరవులతో యుద్ధం చెయ్యడం మనకు శక్యమా! (3)
అక్షోభ్యోఽయమభేద్యశ్చ భీష్మేణామిత్రకర్షిణా ।
కల్పితః శాస్త్రదృష్టేన విధినా భూరివర్చసా ॥ 4
అధిక తేజస్వి, శత్రునాశకుడూ అయిన భీష్ముడు యథావిధిగా కల్పించిన ఈ వ్యూహం కదలింపరానిది, భేదింపరానిది. (4)
తే వయం సంశయం ప్రాప్తాః ససైన్యాః శత్రుకర్షణ ।
కథమస్మాన్మహావ్యూహాత్ ఉత్థానం నో భవిష్యతి ॥ 5
శత్రుకర్షణా! ఈ మహా వ్యూహం నుండి మనం ససైన్యంగా ఎలా బయట పడతామా అని సంశయం కలిగింది.' (5)
అథార్జునోఽబ్రవీత్ పార్థం యుధిష్ఠిరమమిత్రహా ।
విషణ్ణమివ సంప్రేక్ష్య తవ రాజన్ననీకినీమ్ ॥ 6
రాజా! అపుడు శత్రు నాశకుడయిన అర్జునుడు "నీ సేనను చూసి ధర్మరాజు విషాదం పొందుతున్నా" డని భావించి, ఇలా అన్నాడు. (6)
ప్రజ్ఞయాభ్యధికాన్ శూరాన్ గుణయుక్తాన్ బహూనపి ।
జయంత్యల్పతరా యేన తన్నిబోధ విశాంపతే ॥ 7
'తెలివితేటలచేత, సద్గుణాల చేత, సంఖ్యచేత అధికులయిన శూరులను తక్కువ వారు ఎలా జయిస్తారో చెపుతాను విను రాజా! (7)
తత్ర తే కారణం రాజన్ ప్రవక్ష్యామ్యనసూయవే ।
నారదస్తమృషిర్వేద భీష్మద్రోణౌ చ పాండవ ॥ 8
రాజా! నీకు అసూయలేదు. అందుచేత నీ కా యుక్తి చెపుతాను. ఆ యుక్తిని నారద మహర్షి, భీష్మద్రోణులు మాత్రమే ఎరుగుదురు. (8)
ఏనమేవార్థమాశ్రిత్య యుద్ధే దేవాసురేఽబ్రవీత్ ।
పితామహః కిల పురా మహేంద్రాదీన్ దివౌకసః ॥ 9
ఇదే విషయాన్ని పూర్వం దేవదానవ యుద్ధం జరుగుతున్నపుడు బ్రహ్మదేవుడు మహేంద్రాది దేవతలతో చెప్పాడు. (9)
న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః ।
యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేవ చ ॥ 10
సత్యం అక్రూరత, ధర్మం, ప్రయత్నమూ కలవారు జయించినట్లుగా కేవలం బల పరాక్రమాలు కలవారు జయించలేరు. (10)
త్యక్త్వా ధర్మం చ లోభం చ మోహం చోద్యమమాస్థితాః ।
యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ ॥ 11
అధర్మం, లోభం, మోహం విడిచి ప్రయత్నపరులై, అహంకార రహితులై, యుద్ధం చేయండి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే జయమూ ఉంటుంది. (11)
ఏవం రాజన్ విజానీహి ధ్రువోఽస్మాకం రణే జయః ।
యథా తు నారదః ప్రాహ యతః కృష్ణస్తతో జయః ॥ 12
రాజా! ఇది తెలుసుకో! మనకు యుద్ధంలో జయం నిశ్చయం. నారదుడు చెప్పినట్లు ఎక్కడ కృష్ణుడుంటాడో అక్కడే జయం కలుగుతుంది. (12)
గుణభూతో జయః కృష్ణే పృష్ఠతోఽభ్యేతి మాధవమ్ ।
తద్ యథా విజయాశ్చస్య సన్నతిశ్చాపరో గుణః ॥ 13
విజయం కృష్ణుని ఒక గుణం. అది కృష్ణుని వెంట ఉంటుంది. విజయం వలెనే వినయం కూడా రెండో గుణం.(13)
అనంతతేజా గోవిందః శత్రుపూగేషు నిర్వ్యథః ।
పురుషః సనాతనమయః యతః కృష్ణస్తతో జయః ॥ (14)
గోవిందుని తేజస్సు అనంతమైనది. శత్రుమధ్యంలో ఉన్నా వ్యథ చెందడు. ఆయన సనాతనుడైన పురుషుడు. అందుకే కృష్ణుడు ఉన్న పక్షానికే విజయం లభిస్తుంది. (14)
పురా హ్యేష హరిర్భూత్వా వికుంఠోఽకుంఠసాయకః ।
సురాసురానవస్ఫూర్జన్ అబ్రవీత్ కే జయంత్వితి ॥ 15
శ్రీకృష్ణుడు ప్రతిహతి నెరుగడు. ఆయన బాణం అమోఘం. ఇతడే పూర్వం హరిరూపంలో ప్రత్యక్షమై దేవదానవులను గంభీరస్వరంతో "మీలో ఎవరికి జయం కావాలి? అని అడిగాడు. (15)
కథం కృష్ణ జయేమేతి యైరుక్తం తత్ర తైర్జితమ్ ।
తత్ ప్రసాదాద్ధి త్రైలోక్యం ప్రాప్తం శక్రాదిభిః సురైః ॥ 16
'మేం ఎలా జయిస్తాం?" అని అడిగిన దేవతలు జయించారు. ఆయన అనుగ్రహంతోనే ఇంద్రాది దేవతలు త్రిలోకసామ్రాజ్యం పొందారు. (16)
తస్య తే న వ్యథాం కాంచిత్ ఇహ పశ్యామి భారత ।
యస్య తే జయమాశాస్తే విశ్వభుక్ త్రిదివేశ్వరః ॥ 17
భారతా! శ్రీకృష్ణుడు విశ్వంభరుడు. స్వర్గాధిపతి. ఆయన నీకు జయం కలగాలని అనుకొంటున్నాడు. అందుచే నీవు ఏ మాత్రమూ వ్యథ చెంద వలసిన పనిలేదు.' (17)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి యుధిష్ఠిరార్జునసంవాదే ఏకవింశోఽధ్యాయః ॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరార్జున సంవాదమను ఇరువది యొకటవ అధ్యాయము. (21)