22. ఇరువది రెండవ అధ్యాయము

యుధిష్ఠిరుని యుద్ధ యాత్ర.

సంజయ ఉవాచ
తతో యుధిష్ఠిరో రాజా స్వాం సేనాం సమనోదయత్ ।
ప్రతివ్యూహన్ననీకాని భీష్మస్య భరతర్షభ ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
భరతోత్తమా! ధర్మరాజు భీష్ముని సేనను ఎదుర్కొనటానికి తగిన ప్రతివ్యూహం పన్నుతూ, యుద్ధానికి తన సేనను పురికొల్పాడు. (1)
యథోద్దిష్టాన్యనీకాని ప్రత్యవ్యూహంత పాండవాః ।
స్వర్గం పరమమిచ్ఛంతః సుయుద్ధేన కురూద్వహాః ॥ 2
కురుకుల ధురంధరులైన పాండవులు ఈ యుద్ధం ద్వారా శ్రేష్ఠ మయిన స్వర్గం కోరుతూ యథాశాస్త్రంగా ప్రతి వ్యూహం రచించారు. (2)
మధ్యే శిఖండినోఽనీకం రక్షితం సవ్యసాచినా ।
ధృష్టద్యుమ్నశ్చరన్నగ్రే భీమసేనేన పాలితః ॥ 3
వ్యూహానికి మధ్యలో అర్జున రక్షణలో శిఖండి సైన్యం ఉంది. అగ్రభాగంలో భీముని రక్షణలో ధృష్టద్యుమ్నుడు సంచరిస్తున్నాడు. (3)
అనీకం దక్షిణం రాజన్ యుయుధానేన పాలితమ్ ।
శ్రీమతా సాత్వతాగ్య్రేణ శక్రేణేవ ధనుష్మతా ॥ 4
రాజా! వజ్రవ్యూహం దక్షిణ భాగాన్ని ధనుర్ధారి అయిన ఇంద్రునివలె శ్రీమంతుడు, సాత్వత శ్రేష్ఠుడైన యుయుధానుడు రక్షిస్తున్నాడు. (4)
మహేంద్రయానప్రతిమం రథం తు
సోపస్కరం హాటకరత్నచిత్రమ్ ।
యుధిష్ఠిరః కాంచనభాండయోక్త్రం
సమాస్థితో నాగపురస్య మధ్యే ॥ 5
గజసైన్యం మధ్యలో ధర్మరాజు ఇంద్రరథంలా ఉన్న రథమెక్కి ఉన్నాడు. ఆ రథం బంగారంతో, రత్నాలతో చిత్రితమై, పరికరాలన్నిటితో నిండి ఉంది. దానిలో బంగారు నగల పెట్టె, నడుముకు బిగించే బంగరు త్రాడు ఉన్నాయి. (5)
సముచ్ఛ్రితం దంతశలాకమస్య
సుపాండురం ఛత్రమతీవ భాతి ।
ప్రదక్షిణం చైనముపాచరంత
మహర్షయః సంస్తుతిభిర్మహేంద్రమ్ ॥ 6
ధర్మజుని శిరసుపై ఎత్తిన దంతపు వెల్లగొడుగు ఎంతో సొగసుగా ఉంది. మహర్షులు మహారా జయిన ధర్మజుని స్తుతిస్తూ, ప్రదక్షిణం చేశారు. (6)
పురోహితాః శత్రువధం వదంతః
బ్రహ్మర్షిసిద్ధాః శ్రుతవంత ఏనమ్ ।
జప్యైశ్చ మంత్రైశ్చ మహౌషధీభిః
సమంతతః స్వస్త్యయనం బ్రువంతః ॥ 7
శాస్త్రమెరిగిన పురోహితులు, బ్రహ్మర్షులు, సిద్ధులు, జపాలతో, మంత్రాలతో, ఓషధులతో ధర్మజునికి శుభం కోసం, శత్రువధ కోసం ఆశీస్సులు పలికారు. (7)
తతః స వస్త్రాణి తథైవ గాశ్చ
ఫలాని పుష్పాణి తథైవ నిష్కాన్ ।
కురూత్తమో బ్రాహ్మణసాన్మహాత్మా
కుర్వన్ యయౌ శక్ర ఇవామరేశః ॥ 8
తరువాత ధర్మరాజు ఇంద్రునివలె ప్రకాశిస్తూ వారికి వస్త్రాలు, గోవులు, ఫలాలు, పుష్పాలు, బంగారు నాణాలు దానం చేస్తూ యుద్ధానికి వెళ్లాడు. (8)
సహస్రసూర్యః శతకింకిణీకః
పరార్ ద్ధ్యజాంబూనదహేమచిత్రః ।
రథోఽర్జునస్యాగ్నిరివార్చిమాలీ
విభ్రాజతే శ్వేతహయః సుచక్రః ॥ 9
అర్జునుని రథం జ్వాలలతో నిండిన అగ్నివలె తేజరిల్లుతోంది. దానిపై సూర్యాకృతిలో వేలచక్రాలు వెలుగుతున్నాయి. వందలకొలది చిరుగజ్జెలున్నాయి. ఎంతో విలువైన జాంబూనదసువర్ణంతో అలంకరింపబడి శోభిస్తోంది. తెల్లనిగుర్రాలు, అందమైన చక్రాలు దాని కున్నాయి. (9)
తమాస్థితః కేశవసంగృహీతం
కపిధ్వజో గాండివబాణపాణిః ।
ధనుర్ధరో యస్య సమః పృథివ్యాం
న విద్యతే నో భవితా కదాచిత్ ॥ 10
గాండివం చేతబట్టిన కపిధ్వజుడు ఆ రథం మీద ఉన్నాడు. కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునునితో సమానుడయిన ధనుర్ధరుడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. ఇక పుట్టబోడు. (10)
ఉద్వర్తయిష్యంస్తవ పుత్రసేనామ్
అతీవ రౌద్రం స బిభర్తి రూపమ్ ।
అనాయుధో యః సుభుజో భుజాభ్యాం
సమ్మంత్రయేత్కార్యమహీనకాలమ్ ॥ 11
చక్కని భుజబలం కల భీముడు ఆయుధం లేకపోయినా కేవలం భుజాలతో పదాతులను, అశ్వాలను, ఏనుగులను యుద్ధంలో భస్మం చేయగలడు. అతడు నీ కొడుకు సేనలను కలచివేస్తూ రౌద్ర రూపం ధరిస్తున్నాడు. (11)
స భీమసేనః సహితో యమాభ్యాం
వృకోదరో వీరరథస్య గోప్తా ।
తం తత్ర సింహర్షభమత్తఖేలం
లోకే మహేంద్రప్రతిమానకల్పమ్ ॥ 12
సమీక్ష్య సేనాగ్రగతం దురాసదం
సంవివ్యథుః పంకగతా యథా ద్విపాః ।
వృకోదరం వారణరాజదర్పం
యోధాస్త్వదీయా భయవిగ్నసత్త్వాః ॥ 13
భీముడు నకుల సహదేవులతో కలిసి ధృష్టద్యుమ్నుని రక్షిస్తున్నాడు. అతడు సింహాలతో, ఆబోతులతో ఉన్నత్ముడై క్రీడిస్తాడు. లోకంలో ఇంద్రసముడు, అసాధ్యుడైన భీముని పాండవ సేనముందు చూసి, నీ సైనికులు భయోద్వేగంతో బురదలో చిక్కిన ఏనుగులవలె వ్యథ చెందారు. (12,13)
అనీకమధ్యే తిష్ఠంతం రాజపుత్రం దురాసదమ్ ।
అబ్రవీద్ భరతశ్రేష్ఠం గుడాకేశం జనార్దనః ॥ 14
సేనా మధ్యంలో నిలిచిన దుర్జయుడు, గుడాకేశుడు, భరతశ్రేష్ఠుడయిన అర్జునుని చూసి, కృష్ణుడు ఇలా అన్నాడు. (14)
వాసుదేవ ఉవాచ
య ఏష రోషాత్ ప్రతపన్ బలస్థః
యో నః సేనాం సింహ ఇవేక్షతే చ ।
స ఏష భీష్మః కురువంశకేతుః
యేనాహృతాస్త్రిశతం వాజిమేధాః ॥ 15
వాసుదేవుడు చెపుతున్నాడు. 'సేనా మధ్యం నుండి రోషంతో ఉడికిపోతూ మనలను సింహంలా చూస్తున్నవాడే కురువంశోన్నతుడయిన భీష్ముడు. ఆయన ఇప్పటికి మూడు వందల అశ్వమేధాలు చేశాడు. (15)
ఏతాన్యనీకాని మహానుభావం
గూహంతి మేఘా ఇవ రశ్మిమంతమ్ ।
ఏతాని హత్వా పురుషప్రవీర
కాంక్షస్వ యుద్ధం భరతర్షభేణ ॥ 16
పురుషశ్రేష్ఠా! మేఘాలు సూర్యుని కప్పివేసినట్లు కౌరవసేనలు మహానుభావుడయిన భీష్ముని కప్పివేశాయి. ముందు వీళ్లందరినీ చంపి, తరువాత భరతోత్తముడైన భీష్మునితో యుద్ధం చెయ్యి.' (16)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీకృష్ణార్జునసంవాదే ద్వావింశోఽధ్యాయః ॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణార్జున సంవాదమను ఇరువది రెండవ అధ్యాయము. (22)