23. ఇరువది మూడవ అధ్యాయము
అర్జునుడు చేసిన దుర్గాస్తుతి.
సంజయ ఉవాచ
ధార్తరాష్ట్రబలం దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ।
అర్జునస్య హితార్థాయ కృష్ణో వచనమబ్రవీత్ ॥ 1
సంజయుడు చెప్పాడు.
యుద్ధానికి వచ్చిన కౌరవ సేనను చూసి, కృష్ణుడు అర్జునుని హితం కోరి, ఇలా అన్నాడు. (1)
శ్రీభగవానువాచ
శుచిర్భూత్వా మహాబాహో సంగ్రామాభిముఖే స్థితః ।
పరాజయాయ శత్రూణాం దుర్గాస్తోత్రముదీరయ ॥ 2
భగవానుడు చెపుతున్నాడు.
'అర్జునా! నీవు యుద్ధాభిముఖుడవై ఉన్నావు. శత్రువుల పరాజయం కోసం శుచివై దుర్గాస్తోత్రం పఠించు.' (2)
సంజయ ఉవాచ
ఏవముక్తోఽర్జునః సంఖ్యే వాసుదేవేన ధీమతా ।
అవతీర్య రథాత్ పార్థః స్తోత్రమాహ కృతాంజలిః ॥ 3
సంజయుడు చెపుతున్నాడు.
వాసుదేవుడిలా చెప్పగానే అర్జునుడు రథం దిగి, అంజలి ఘటించి, దుర్గాస్తోత్రం ఇలా పఠించాడు. (3)
అర్జున ఉవాచ
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని ।
కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణపింగలే ॥ 4
అర్జునుడు చెపుతున్నాడు. సిద్ధ సేనా నాయకులారా! నీకు నమస్కారం. ఆర్యురాలా! నమస్సు. మందర పర్వతం మీద నివసించే దేవీ! నమస్సులు. కుమారి, కాళి, కాపాలి, కపిల, కృష్ణపింగళ అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన నీకు నమస్సులు. (4)
భద్రకాలి నమస్తుభ్యం మహాకాలి నమోఽస్తు తే ।
చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని ॥ 5
భద్రకాళి, మహాకాళి అయిన నీకు నమస్సులు. దుష్టులపై చాలా కోపం చూపే నీకు సమస్సులు. భక్తులను సంకటం నుండి తరింపజేసే నీకు నమస్సులు. నీ శరీరం దివ్యవర్ణంతో శోభిస్తుంది. నీకు నమస్సులు. (5)
కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే ।
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే ॥ 6
దేవీ! నీవు కత్యయన మహర్షి వంశంలో పుట్టిన సౌమ్యురాలవు. మహైశ్వర్య పరురాలవు. క్రూరులపట్ల భయకరంగా ప్రవర్తిస్తావు. జయం, విజయం ప్రసాదించ గల దానవు. నెమలి ఫింఛాన్ని, నానాభరణాలను ధరించినదానవు. నీకు నమస్సులు. (6)
అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి ।
గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే ॥ 7
భయంకర త్రిశూలమూ ఖడ్గ, ఖేటకాలనే ఆయుధాలు ధరించినదానవు. నందగోపుని వంశంలో పుట్టిన దానవు. శ్రీకృష్ణునికి చెల్లెలివి అయినా గుణ జ్యేష్ఠురాలవు నీకు నమస్కారం. (7)
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని ।
అట్టహాస కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే ॥ 8
మహిషాసురుని రక్తం మీద ప్రీతికలదానవు (సంహరించిన దానవు). కుశిక వంశంలో పుట్టి కౌశికి అని పేరు పొందావు. పీతాంబరం ధరిస్తావు. శత్రువులను చూసి, అట్టహాసం చేస్తావు. అపుడు నీ ముఖం చక్రవాక పక్ష్వలె పక్షివలె ఉద్దీప్తమై ఉంటుంది. నీకు యుద్ధమంటే ప్రీతి. అటువంటి నీకు నమస్సులు. (8)
ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని ।
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే ॥ 9
నీవు ఉమ, శాకంభరి, శ్వేత, కృష్ణ, కైటభనాశిని, హిరణ్యాక్షి, విరూపాక్షి, సుధూమ్రాక్షి, అనే పేర్లతో పిలువబడుతుంటావు. నీకు నమస్కారాలు. (9)
వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి ।
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥ 10
వేదనాదం నీరూపం. నీవు మిక్కిలి పవిత్రురాలవు, బ్రాహ్మణప్రియవు. నీ నుండి వేదాలు పుట్టాయి. జంబూద్వీప నగరాలలో నిత్యమూ సన్నిహితంగా ఉంటావు - అట్టి నీకు నమస్సులు. (10)
త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ ।
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని ॥ 11
విద్యలన్నిటికీ నీవే బ్రహ్మ విద్యవు. శరీరధారులకు మోక్షస్వరూపిణివి. కుమారస్వామి తల్లివి. భగవతీ! దుర్గమమైన ప్రదేశాల్లో ఉండే దుర్గాదేవివి. నీకు నమస్సులు. (11)
స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ ।
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ॥ 12
సావిత్రీ! స్వాహా, స్వధా, కలా, కాష్ఠా, సరస్వతీ, వేదమాతా ఇవన్నీ నీ పేర్లే. అలాగే వేదాంత స్వరూపానివి కూడా - నీకు నమస్సులు. (12)
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా ।
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్ రణాజిరే ॥ 13
మహాదేవీ! పరిశుద్ధమైన అంతరాత్మతో నిన్ను స్తుతించాను. నీ అనుగ్రహం వల్ల యుద్ధ రంగంలో నాకు సదా జయం కలుగుగాక! (13)
కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ ।
నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్ ॥ 14
తల్లీ! అడవుల్లో, భయంకర మయిన దుర్గమ ప్రదేశాల్లోను, భక్తుల నివాసాల్లోను, పాతాళంలోనూ నీవు నిత్యమూ నివసిస్తావు. దానవులను యుద్ఢంలో జయిస్తావు. నీకు నమస్సులు. (14)
త్వం జంభనీ మోహినీ చ మాయాహ్రీః శ్రీస్తథైవ చ ।
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥ 15
దేవీ! నీవే జంభని, మోహిని, మాయ, హ్రీ, సంధ్య, ప్రభావతి, సావిత్రి, జనని అనే నామాలతో ప్రసిద్ధురాలవు. (15)
తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిః చంద్రాదిత్యవివర్ధినీ ।
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ॥ 16
తుష్టి, పుష్టి, ధృతి, చంద్రసూర్యులను వృద్ధి పరచే దీప్తి, నీవే. ఈశ్వరాదుల ఐశ్వర్యం నీవే. యుద్ధభూమిలో సిద్ధులూ చారణులూ నిన్ను చూస్తారు - అట్టి నీకు నమస్సులు.' (16)
సంజయ ఉవాచ
తతః పార్థస్య విజ్ఞాయ భక్తిం మానవవత్సలా ।
అంతరిక్షగతోవాచ గోవిందస్యాగ్రతః స్థితా ॥ 17
సంజయుడు చెపుతున్నాడు.
అపుడు మానవులపై వాత్సల్యం కల దేవి అర్జునుని భక్తిని తెలుసుకొని, ఆకాశంలోనే గోవిందుని ఎదుట నిలిచి, ఇలా అంది. (17)
దేవ్యువాచ
స్వల్పేనైవ తు కాలేన శత్రూన్ జేష్యసి పాండవ ।
నరస్త్వమసి దుర్ధర్ష నారాయణసహాయవాన్ ॥ 18
అజేయస్త్వం రణేఽరీణామ్ అపి వజ్రభృతః స్వయమ్ ।
దేవి అన్నది.
'అర్జునా! కొద్ది కాలంలోనే నీవు శత్రువులను జయిస్తావు. నారాయణుడు సహాయకుడయిన నరుడవు నీవు - యుద్ధంలో శత్రువులకు నీవు అజేయుడవు. స్వయంగా ఇంద్రుడు కూడ నిన్ను జయింపలేడు.' (18 1/2)
ఇత్యేవముక్త్వా వరదా క్షణేనాంతరధీయత ॥ 19
లబ్ధ్వా వరం తు కౌంతేయః మేనే విజయమాత్మనః ।
ఆరురోహ తతః పార్థః రథం పరమసమ్మతమ్ ॥ 20
కృష్ణార్జునావేకరథౌ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।
వరమిచ్చిన దుర్గాదేవి ఇలా చెప్పి, క్షణంలో అంతర్ధాన మయింది. అర్జునుడు వరం పొంది, తన విజయం తప్పదనుకొన్నాడు. వెంటనే అర్జునుడు పరమ సుందరమైన రథం ఎక్కాడు. ఒకే రథం మీద నిలిచి కృష్ణార్జునులు దివ్య శంఖాలు పూరించారు. (19, 20 1/2)
య ఇదం పఠతే స్తోత్రం కల్య ఉత్థాయ మానవః ॥ 21
యక్షరక్షఃపిశాచేభ్యః న భయం విద్యతే సదా ।
ఉదయమే లేచి ఈ స్తోత్రం చదివిన మానవునికి యక్షరాక్షస పిశాచాల భయం ఎన్నడూ ఉండదు. (21 1/2)
న చాపి రిపవస్తేభ్యః సర్పాద్యా యే చ దంష్ట్రిణః ॥ 22
న భయం విద్యతే తస్య సదా రాజకులాదపి ।
వివాదే జయమాప్నోతి బద్ధో ముచ్యేత బంధనాత్ ॥ 23
వానిక్ విషపుకోరలుండే సర్పాదుల వల్ల భయం ఉండదు. వానికి శత్రుభయం ఉండదు. రాజభయం కూడా వానికి కలగదు. వివాదంలో వానికే భయం కలుగుతుంది. బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు. (22,23)
దుర్గం తరతి చావశ్యం తథా చౌరైర్విముచ్యతే ।
సంగ్రామే విజయేన్నిత్యం లక్ష్మీం ప్రాప్నోతి కేవలామ్ ॥ 24
కష్టాల నుండి బయటపడతాడు. దొంగల బెడద నుండి బయటపడతాడు. యుద్ధాల్లో విజయం పొందుతాడు. స్వచ్ఛ మయిన ఐశ్వర్యాన్ని పొందుతాడు. (24)
ఆరోగ్యబలసంపన్నః జీవేద్ వర్షశతం తథా ।
ఏతద్ దృష్టం ప్రసాదాత్ తు మయా వ్యాసస్య ధీమతః ॥ 25
ఆరోగ్య బలాలతో నిండి నూరేళ్లు సుఖంగా జీవిస్తాడు. రాజా! ఇదంతా నాకు వ్యాసుని అనుగ్రహం వల్ల కనపడింది. (25)
మోహాదేతౌ న జానంతి నరనారాయణావృషీ ।
తవ పుత్రా దురాత్మానః సర్వే మన్యువశానుగాః ॥ 26
మోహం వల్లను, కోపం వల్లను దురాత్ములయిన నీ కొడుకులంతా నరనారాయణులను తెలుసుకోలేక పోతున్నారు. (26)
ప్రాప్తకాలమిదం వాక్యం కాలపాశేన గుంఠితాః ।
ద్వైపాయనో నారదశ్చ కణ్యో రామస్తథానఘః ।
అవారయంస్తవ సుతం న చాసౌ తద్ గృహీతవాన్ ॥ 27
కాలపాశంతో బద్ధుడైన నీ కొడుకుకును వ్యాసుడు, నారదుడు, కణ్వుడు, పరశురాముడూ వారించారు. కాని నీ కొడుకు దుర్యోధనుడు గ్రహింపలేకపోయాడు. (27)
యత్ర ధర్మో ద్యుతిః కాంతిః యత్ర హ్రీః శ్రీస్తథా మతిః ।
యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః ॥ 28
ఎక్కడ న్యాయం, తేజస్సు, ఇచ్ఛ, లజ్జ, లక్షి, బుద్ధి, ధర్మమూ ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది." (28)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి దుర్గాసోత్రే త్రయోవింశోఽధ్యాయః ॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున దుర్గాస్తోత్రమను ఇరువది మూడవ అధ్యాయము. (23)