24. ఇరువది నాల్గవ అధ్యాయము
ధృతరాష్ట్ర సంజయ సంవాదము.
ధృతరాష్ట్ర ఉవాచ
కేషాం ప్రహృష్టాస్తత్రాగ్రే యోధా యుధ్యంతి సంజయ ।
ఉదగ్రమనసః కే వా కే వా దీనా విచేతసః ॥ 1
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు.
"సంజయా! అపుడు ఎవరి పక్షంలోని వీరులు సంతోషంతో ముందుగా యుద్ధం చేశారు? ఎవరి మనసుల్లో ఉత్సాహం నిండి ఉంది? ఎవరు మనసు చెడి దీనులయ్యారు? (1)
కే పూర్వం ప్రాహరంస్తత్ర యుద్ధే హృదయకంపనే ।
మామకాః పాండవేయా వా తన్మమాచక్ష్వ సంజయ ॥ 2
మనస్సు చలించి పోయే ఆ యుద్ధంలో ముందు ఎవరు కొట్టారు? నావాళ్లా? పాండవులా? సంజయా! ఆ విషయం నాకు చెప్పు. (2)
కస్య సేనాసముదయే గంధమాల్యసముద్భవః ।
వాచః ప్రదక్షిణాశ్చైవ యోధానామభిగర్జతామ్ ॥ 3
ఎవరి సేనలలో సుగంధ మాలికలు ఉద్భవించాయి? గర్జించే ఏ యోధుల మాటలు సమర్థాలుగా, సవ్యంగా ఉన్నాయి?" (3)
సంజయ ఉవాచ
ఉభయోః సేనయోస్తత్ర యోధా జహృషిరే తదా ।
స్రజః సమాః సుగంధానామ్ ఉభయత్ర సముద్భవః ॥ 4
సంజయుడు చెపుతున్నాడు.
"రెండు సేనల యోధులూ సంతోషంతోనే ఉన్నారు. సుగంధ మాలికల ఉద్భవం కూడా సమానంగానే ఉంది. (4)
సంహతానామనీకానాం వ్యూఢానాం భరతర్షభ ।
సంసర్గాత్ సముదీర్ణానాం విమర్దః సుమహానభూత్ ॥ 5
భరతర్షభా! రెండు పక్షాల సైనికుల వ్యూహాలూ రణోత్సాహంతో కలిసినపుడు తీవ్ర సంఘర్షణ జరిగింది. (5)
వాదిత్రశబ్దస్తుములః శంఖభేరీవిమిశ్రితః ।
శూరాణాం రణశూరాణాం గర్జతామితరేతరమ్ ।
ఉభయోః సేనయో రాజన్ మహాన్ వ్యతికరోఽభవత్ ॥ 6
రాజా! వాద్యాల ధ్వనులతో, శంఖాల భేరుల ధ్వనులతోను, పరస్పరం గర్జించుకొనే రణ వీరుల ధ్వనులతోనూ రెండు సేనలలోను పెద్ద కోలాహలం ఏర్పడింది. (6)
అన్యోన్యం వీక్షమాణానాం యోధానాం భరతర్షభ ।
కుంజరాణాం చ నదతాం సైన్యానాం చ ప్రహృష్యతామ్ ॥ 7
భరతర్షభా! ఒకరినొకరు చూసుకొంటూ గర్జించే సైనికుల యొక్క ధ్వనులు, ఘీంకరించే ఏనుగుల శబ్దాలూ సైనికుల ఉత్సాహ ధ్వనులూ అన్నీ కలిసి మహాధ్వని ఏర్పడింది." (7)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి ధృతరాష్ట్రసంజయసంవాదే చతుర్వింశోఽధ్యాయః ॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదమను ఇరువది నాలుగవ అధ్యాయము. (24)