25. ఇరువది అయిదవ అధ్యాయము
భగవద్గీత - (1) అర్జునుని విషాదము.
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥ 1
ధృతరాష్ట్రుడు అడిగాడు.
"సంజయా! ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికై చేరిన నా పుత్రులూ, పాండుపుత్రులూ ఏం చేశారు?" (1)
సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥ 2
సంజయుడు చెపుతున్నాడు.
"వ్యూహంగా నిలిచిన పాండవుల సేనను చూసి, రాజయిన దుర్యోధనుడు ద్రోణుని చేరి ఇలా అన్నాడు. (2)
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ 3
ఆచార్యా! బుద్ధిమంతుడయిన నీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత వ్యూహంగా నిలుపబడిన పాండవుల మహాసేనను చూడు. (3)
అత్ర శూరా మహేష్వాసాః భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥ 4
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబశ్చ నరపుంగవః ॥ 5
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభ్రద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ 6
ఆ సేనలో యుద్ధంలో భీమార్జునులతో సమానులై, ధనుర్ధారులయిన వీరులు సాత్యకి, విరాటుడు, మహారథికుడయిన ద్రుపదుడు, ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడయిన కాశిరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడయిన శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు ఉన్నారు. వీరంతా మహారథులు. (4-6)
అస్మాకం తు విశిష్టా యే తాన్ నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥ 7
బ్రాహ్మణోత్తమా! మన పక్షంలో ప్రధానులయిన వారిని మీరు తెలిసికొనండి. నా సైన్యంలోని నాయకులను గూర్చి మీ అవగాహనకోసం మీకు తెలియజేస్తాను. (7)
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥ 8
గురుదేవా! మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధజేత అయిన కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఉన్నారు. (8)
అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ 9
ఇంకా ఇతర వీరులంతా యుద్ధనిపుణులు. నానాశస్త్రాస్తాలు ధరించి నాకోసం ప్రాణాలు విడవటానికైనా సిద్ధంగా ఉన్నారు. (9)
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ ।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥ 10
భీష్ముడు రక్షించే మన సేన పరిపూర్ణం అయినట్లుగా ఉంది. భీముడు రక్షించే పాండవ సేన ఆ పరిపూర్ణంగా ఉంది. (10)
వి॥ 1. పర్యాప్తం = పారణీయం. పరివేష్టింపదగినది - చుట్టు ముట్ట దగినది. (నీల)
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥ 11
అందుచేత అన్ని వ్యూహ ద్వారాలలో వివిధ సేనాభాగాల్లో ఉన్న మీరందరూ భీష్మునే రక్షించాలి." (11)
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వివద్యోచ్ఛైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥ 12
ప్రతాపశాలి, కురువృద్ధుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి సంతోషం కలిగిస్తూ సింహనాదం చేసి, శంఖం పూరించాడు. (12)
తతః శంఖాశ్చ భేరశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 13
తరువాత శంఖాలు, భేరులు, నగారాలు, డోళ్లు, మద్దెలలు కొమ్ములు మొదలయినవి ఒక్కసారిగా మ్రోగించారు. ఆ ధ్వనులన్నీ కలిసి పెద్దకోలాహల మయింది. (13)
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితే ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥ 14
తరువాత తెల్లని గుర్రాలు పూన్చిన గొప్ప రథం మీద ఉన్న కృష్ణుడూ, అర్జునుడూ తమ తమ దివ్యశంఖాలు పూరించారు. (14)
పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 15
కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవత్తాన్ని పూరించారు. భీమకర్ముడయిన భీముడు పౌండ్ర మనే మహాశంఖం పూరించాడు. (15)
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్టిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 16
కుంతీపుత్రుడయిన ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్ని, నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణి పుష్పకాన్ని పూరించారు. (16)
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥ 18
రాజా! మహాధనుర్ధారి అయిన కాశిరాజు, మహారథుడయిన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, పరాజయ మెరుగని సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు మహాబాహువయిన అభిమన్యుడు, అన్ని చోట్ల నుండి వేర్వేరుగా శంఖాలు పూరించారు. (17,18)
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥ 19
ఆ కోలాహల ధ్వని భూమ్యాకాశాలలో మార్మ్రోగి, కౌరవుల హృదయాలను బ్రద్దలు చేసింది. (19)
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ॥ 20
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమాహ మహీపతే ।
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ 21
రాజా! తరువాత అర్జునుడు వ్యూహంగా నిలిచిన కౌరవులను చూసి, శస్త్ర ప్రయోగం జరిగే సమయంలో తన ధనుస్సు ఎత్తి, కృష్ణునితో ఇలా అన్నాడు. 'కృష్ణా! రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు. (20,21)
యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ॥ 22
యుద్ధానికి రణరంగంలో నిలిచిన శత్రువీరులను చూసి, ఈ రణోద్యమంలో నేనెవరితో యుద్ధం చెయ్యాలో పరీక్షిస్తాను. (22)
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ॥ 23
దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి యుద్ధంలో ప్రియం కలిగించాలని యుద్ధకాంక్షతో వచ్చిన వారందరినీ ఒకసారి చూస్తాను.' (23)
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ॥ 24
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ॥ 25
సంజయుడు చెపుతున్నాడు.
రాజా! అర్జునుడిలా అడగగానే, శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణాది సమస్త రాజుల ఎదుట రథం నిలిపి "పార్థా! ఎదుట కూడిన ఈ కౌరవులందరినీ చూడు" అన్నాడు. (24,25)
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథపితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥ 26
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
అపుడు రెండు సేనలలోను నిలిచిన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, సజ్జనులను చూశాడు అర్జునుడు. (26 1/2)
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ॥ 27
కృపయా పరయాఽవిష్టః విషీదన్నిదమబ్రవీత్ ।
సేనలలో ఉన్న బంధువు లందరినీ చూసి, అర్జునుడు వారి పట్ల పరమ కృపతో దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. (27 1/2)
అర్జున ఉవాచ
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ॥ 28
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥ 29
అర్జునుడు అంటున్నాడు.
'కృష్ణా! యుద్ధానికై నిలిచియున్న నా వారిని చూసి నా శరీరం శిథిలమయిపోతోంది. నోరు ఎండిపోతోంది. నా శరీరం వణికిపోతోంది. గగుర్పాటు కలుగుతోంది. (28,29)
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్ చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥ 30
నా చేతిలోంచి గాండీవం జారిపోతోంది. చర్మం ఉడికిపోతోంది. నిలకడలేకపోతున్నాను. నా మనస్సు గిరగిరా తిరిగి పోతున్నట్లుంది. (30)
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥ 31
కేశవా!దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి. నా వారిని యుద్ధంలో చంపినందువల్ల నాకు ఏ శ్రేయస్సూ కనపడటం లేదు. (31)
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ 32
కృష్ణా! విజయం కాని, భోగాలు, సుఖాలు కాని కోరను. గోవిందా! మాకు రాజ్యం ఎందుకు? భోగాలెందుకు? జీవిత మెందుకు? (ఏ ప్రయోజమూ లేదు). (32)
యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్వక్త్వా ధనాని చ ॥ 33
కృష్ణా! ఎవరికోసం మనం రాజ్యం, భోగాలు, సుఖాలు కోరుతున్నామో వారే ప్రాణాలను కూడా విడిచి, యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. (33)
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ॥ 34
వారంతా తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, వియ్యంకులు మొదలయిన బంధువులు. (34)
ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥ 35
కృష్ణా! నన్ను చంపినా సరే! వారిని నేను చంపను. మూడు లోకాల రాజ్యమూ చేతికివచ్చినా సరే? చంపను. ఇక కేవలం భూమి హేతువుగా చంపుతానా? (35)
నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ॥ 36
జనార్దనా! కౌరవులను చంపడం వల్ల మనకు ఏమి సంతోషం కలుగుతుంది? ఈ ఆతతాయులను చంపితే మనకు పాపమే కలగుతుంది. (36)
వి॥ ఆతతాయులు ఆరుగులు. 1. నిప్పు పెట్టేవాడు. 2. విషం పెట్టేవాడు. 3. ఆయుధం పట్టి చంపటానికి వెళ్లేవాడు. 4. ధనం అపహరించేవాడు. 5. భూమి అపహరించేవాడు. 6. భార్యను అపహరించేవాడు. (ఈ ఆరు లక్షణాలూ కౌరవులలో ఉన్నాయి)
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ 37
అందువల్ల బంధువు లయిన కౌరవులను మనం చంపలేము. తన వారిని చంపి సుఖం ఎలా పొందుతాం? కృష్ణా! (37)
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥ 38
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ ।
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్జన ॥ 39
లోభం మనస్సులను దెబ్బతీయగా ఈ కౌరవులు కులవినాశనంలోని దోషాన్నీ, మిత్రద్రోహంలోని పాపాన్నీ చూడలేకపోవచ్చు. కానీ కుల క్షయ దోషం తెలిసిన మనం ఈ పాపాన్నుండి విరమించాలని ఎందుకు భావించగూడదు? (38,39)
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మోఽభిభవత్యుత ॥ 40
కులం నశిస్తే పూర్వం నుండీ వచ్చే కులధర్మాలు నశించిపోతాయి. ధర్మం నశిస్తే కులమంతా అధర్మంతో నిండిపోతుంది. (40)
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్రీషు దుష్టాసు వార్ ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥ 41
కృష్ణా! అధర్మం వ్యాపిస్తే కులస్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణసంకరం ఏర్పడుతుంది. (41)
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥ 42
వర్ణసంకరం వల్ల సంకరం చేసిన వారికీ, కులానికీ కూడ నరకం కలుగుతుంది. వారి పితృదేవతలు శ్రాద్ధాలు, తర్పణాలు లేక అధోగతి పాలవుతారు. (42)
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥ 43
కులనాశకుల వర్ణ సాంకర్య హేతువు లయిన ఈ దోషాలతో జాతి ధర్మాలూ, కులధర్మాలూ శాశ్వతంగా నశించి పోతాయి. (43)
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ ॥ 44
కులధర్మాలు నశించిన మానవులకు నరకంలో శాశ్వత నివాసం కలుగుతుందని పరంపరగా వింటున్నాం. (44)
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥ 45
రాజ్యసుఖం మీది లోభంతో మనం బంధువులను చంపటానికి ప్రయత్నించి, మహాపాపం చేయాలనుకొంటున్నాం. (45)
యది మామప్రతీకారమ్ అశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రాః రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ॥ 46
ఎదిరించకుండా, నిరాయుధుడనై ఉన్న నన్ను ఆయుధాలు దాల్చిన కౌరవులు యుద్ధంలో చంపితే అది నాకు మరీ క్షేమ మవుతుంది." (46)
సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ 47
ఇలా చెప్పి యుద్ధభూమిలో శోకంతో నిండిన మనసుతో ధనుర్బాణాలు విడిచి, రథమధ్యంలో చతికిలబడ్డాడు. (47)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదేఽర్జునవిషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః ॥ 1 ॥ భీష్మపర్వణి పంచవింశోఽధ్యాయః ॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున అర్జున విషాదయోగమను ఇరువది అయిదవ అధ్యాయము. (25) భగవద్గీత మొదటి అధ్యాయము. (1)