26. ఇరువది ఆరవ అధ్యాయము

భగవద్గీత - (2) సాంఖ్య యోగము.

సంజయ ఉవాచ
తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదనః ॥ 1
మనసు కరుణతో నిండి, కనులు కన్నీటితో నిండి దుఃఖించే అర్జునునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.
శ్రీభగవాన్ ఉవాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ ।
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ॥ 2
శ్రీకృష్ణుడు చెపుతున్నాడు. "అర్జునా! కానిసమయంలో నీకు ఈ మోహం ఎలా కలిగింది? ఇది ఉత్తములకు కలగదు. దీనివల్ల స్వర్గం రాదు - పైగా అపకీర్తి వస్తుంది. (2)
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥ 3
అర్జునా! పిరికితనం పొందకు. ఇది నీకు తగదు. పరంతపా! తుచ్ఛమైన హృదయ దౌర్బల్యం విడిచి, (యుద్ధానికి) లెమ్ము." (3)
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ॥ 4
అర్జునుడు చెపుతున్నాడు.
"మధుసూదనా! భీష్ముడు, ద్రోణుడు పూజింపదగినవారు. వారిని యుద్ధంలో నేను బాణాలతో ఎలా ఎదిరించి, యుద్ధం చేస్తాను? (4)
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే ।
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ॥ 5
మహానుభావులయిన గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్షాన్న మయినా తినటం మంచిది. వారిని చంపితే వారి నెత్తుటితో తడిసిన అర్థకామాలను (సంపదలను భోగాలను) ఇక్కడే అనుభవించవలసి ఉంటుంది. (5)
న చైతద్ విద్మః కతరన్నో గరీయః
యద్ వా జయేమ యది వా నో జయేయుః ।
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥ 6
మనం వారిని జయించటం శ్రేయమా? వారే మనలను జయించటం శ్రేయమా? అనేది తెలికొనలేకపోతున్నాం. ఎవరిని వధించి మనం జీవింపకూడదని అనుకొంటున్నామో ఆ కౌరవులే మనముం దున్నారు? (6)
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః ।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ॥ 7
దైన్యం అనే దోషం చేత నా స్వభావం (శౌర్యస్వభావం) దెబ్బతిన్నది. ధర్మం తెలుసుకోలేకపోతున్నాను. నాకేది శ్రేయస్కరమో నిశ్చయించి చెప్పు. నీకు నేను శిష్యుడను. శరణాగతుడను. నాకు ఉపదేశించు. (7)
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ॥ 8
ఈ శోకం నా ఇంద్రియాలను దహిస్తోంది. శత్రురహితమై, సమృద్ధమయిన రాజ్యం ఇక్కడ లభించినా, చివరకు దేవేంద్ర పదవి లభించినా ఈ శోకం తొలగిపోయే మార్గం కనపడటం లేదు." (8)
సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప ।
న యోత్స్య ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ ॥ 9
సంజయుడు చెపుతున్నాడు.
పరంతపా! అర్జునుడు కృష్ణునితో ఇలా చెప్పి, చివరకు "నేను యుద్ధం చెయ్యను" అని ఊరుకొన్నాడు. (9)
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ।
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ॥ 10
భారతా! రెండు సేనల మధ్యలో విషాదం పొందుతున్న అర్జునుని చూసి, నవ్వుతున్నట్లు కృష్ణుడు ఇలా అన్నాడు. (10)
శ్రీభగవాన్ ఉవాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ 11
భగవానుడు చెపుతున్నాడు.
"శోకింపదగని వారికోసం నీవు శోకిస్తున్నావు - పైగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, పోని వారి గురించికానీ పండితులు శోకించరు. (11)
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ॥ 12
'నేను లేను' అనేది ఎప్పుడూ లేదు. నీవూను. ఈ రాజులూ అంతే. అలాగే ఈ తరువాత - భవిష్యత్తులో ఉండకపోము అనగా ఉంటాం (అంటే మనమంతా నిత్యులం). (12)
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥ 13
ఆత్మకు ఈ శరీరంలో బాల్యం, యౌవనం, వృద్ధత్వం కలుగుతున్నట్లే మరో దేహం కూడా కలుగుతుంది. ఈ విషయం తెలిసిన ధీరుడు (జ్ఞాని) మోహం చెందడు. (13)
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శోతోష్ణసుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ॥ 14
అర్జునా! ఇంద్రియాలతో విషయాలు కలిస్తే శోతోష్ణాలు, సుఖ దుఖాలు కలుగుతాయి. ఇవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కాబట్టి అనిత్యాలు. ఉత్పత్తి వినాశాలు పొందుతాయి. వీటిని సహించు. (14)
వి॥ మాత్రలు = ఇంద్రియాలు అవి 1. చర్మం. 2. నేత్రాలు 3. చెవులు 4. నాలుక 5. ముక్కు.
స్పర్శలు = 1. శబ్దం 2. స్పర్శ 3. రూపం 4. రసం 5. గంధం.
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ॥ 15
నరోత్తమా! సుఖ దుఖాలు అనిత్యాలనే భావంతో వాటిని సహించి, అవి అంటవి ధీరునికి అమృతత్వం (మోక్షం) లభిస్తుంది కదా! (15)
నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽంతః త్వనయోస్తత్త్వదర్శిభిః ॥ 16
అసత్యమైన వస్తువుకు ఉనికి నిలువదు. సత్యమైన వస్తువుకు అభావమే ఉండదు. ఈ రెండింటి తత్త్వాన్ని తత్త్వజ్ఞులు ఇలా దర్శించారు. (16)
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ ।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత కర్తుమర్హతి ॥ 17
ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ నాశనం లేనిదని తెలుసుకో. దీన్ని నశింపజేయటం ఎవరికీ శక్యం కాదు. (17)
వి॥సం॥ సర్వకాలాల్లోనూ ఉండనిది, మార్పు, నాశం లేనిది సత్తు. అనగా అభావంలేనిది సత్తు.
అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥ 18
నాశంలేనిదీ, ప్రమాణాలకు అందనిదీ, నిత్యమూ అయిన జీవాత్మ యొక్క ఈ శరీరాలు నాశం కలిగినవి - అందుచేత నీవు యుద్ధం చెయ్యి అర్జునా! (18)
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ ।
ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే ॥ 19
'ఈ ఆత్మను చంపుతున్నాను అని' అనుకొనే వాడూ, 'ఈ ఆత్మ చచ్చింది' అనుకొనే వాడూ ఇద్దరూ ఏమీ తెలియని వాళ్లే. నిజానికి ఈ ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేతనూ చంపబడదు. (19)
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణః
న హన్యతే హన్యమానే శరీరే ॥ 20
ఈ ఆత్మ ఎన్నడూ పుట్టదు. చావదు. దీనికి పుట్టుక చావు అనేవి లేవు. ఈ ఆత్మ నిత్యం, శాశ్వతం, పురా తనమూ. శరీరం చనిపోయినా ఆత్మ చనిపోదు. (20)
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ॥ 21
ఈ ఆత్మకు నాశనం లేదనీ, నిత్యమనీ, జన్మలేదనీ, తరుగు లేదని (అవ్యయ మని) తెలిసినవాడు ఎవనిని అయినా ఎలా చంపిస్తాడు? ఎలా చంపుతాడు? (21)
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥ 22
చినిగిన బట్టలు విడిచి మానవుడు కొత్త బట్టలను ధరించినట్లు జీవాత్మ పాత శరీరాలను విడిచి, కొత్త శరీరాలను పొందుతాడు. (22)
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః ॥ 23
ఈ ఆత్మను శస్త్రాలు నరుకలేవు. అగ్ని దహింపలేదు. నీరు తడుపలేదు. గాలి ఎండింపలేదు. (23)
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థాణుః అచలోఽయం సనాతనః ॥ 24
ఎందుకంటే ఈ ఆత్మ ఛేదింపరానిది. దహింపరానిది. తడుపరానిది. ఎండింపరానిది. ఇది నిత్యం. అంతటా వ్యాపించి ఉంది. చలింపదు. స్థిరమైనది. సనాతనం. (ఎప్పటి నుండియో ఉన్నది) (24)
అవ్యక్తోఽయమచింత్యోఽయమ్ అవికార్యోఽయముచ్యతే ।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥ 25
ఈ ఆత్మ కనపడదు. ఊహింప శక్యంకానిది. వికారం లేనిది. ఈ విషయం తెలిసికొని నీవు శోకింపకు. (25)
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ ।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ॥ 26
మహాబాహూ! ఈ ఆత్మ జనన మరణాలు కలిగినదని నీవు భావించినా నీవు ఇలా శోకింపదగదు. (26)
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహర్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ॥ 27
ఎందుకంటే పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. తప్పించుకోలేని ఈ విషయాలను గురించి నీవు శోకింపదగదు. (27)
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేన తత్ర కా పరిదేవనా ॥ 28
భారతా! ఈ ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తంగానే ఉన్నాయి. చనిపోయాక కూడ అవ్యక్తంగానే (మన ఇంద్రియాలకు కనపడకుండానే) ఉన్నాయి - మధ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో శోకించడ మెందుకు? (28)
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥ 29
ఒకానొకడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యరూపంగా చూస్తాడు. అలాగే మరొకడు అద్భుత రూపంగా చెపుతాడు. ఇంకొకడు ఆశ్చర్యరూపంగానే వింటాడు - మరొకడు విన్నా కూడా వానికి ఏమీ తెలియదు. (29)
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత ।
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ॥ 30
అర్జునా! ప్రతీ దేహంలోనూ ఉండే ఆత్మ వధింప శక్యం కానిది అందుచేత ఏ ప్రాణిని గురించి కూడా నీవు శోకింపదగదు. (30)
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ॥ 31
నీ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే క్షత్రియ ధర్మానికి తగినది యుద్ధం. దాన్నిమించిన శ్రేయస్సు మరొకటి క్షత్రియునకు లేదు. (31)
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ॥ 32
పార్థా! అనుకోకుండా వచ్చిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులయిన క్షత్రియులకే లభిస్తుంది. ఇది స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. (32)
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతస్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ॥ 33
ఈ ధర్మయుద్ధం నీవు చెయ్యకపోతే స్వధర్మాన్ని, కీర్తినీ పోగొట్టుకొని, పాపం కూడా పొందుతావు. (33)
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ ।
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ॥ 34
అందరూ చాలాకాలం తరగని నీ అపకీర్తిని గూర్చి చెప్పుకొంటారు. గౌరవం కలవానికి అపకీర్తి మరణం కంటె ఎక్కువ. (34)
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।
యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవమ్ ॥ 35
ఈ మహారథులంతా నిన్ను ఇంతవరకు మాన్యునిగా భావిస్తున్నారు. ఇపుడు యుద్ధం మానేస్తే వీరికి చాలా చులకన అవుతావు. భయంతో యుద్ధం విరమించుకొన్నావనుకొంటారు. (35)
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః ।
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ॥ 36
శత్రువులు నీ సామార్థ్యాన్ని నిందిస్తూ నిన్ను అనరాని మాటలంటారు. అంతకంటే దుఖం ఏముంటుంది? (36)
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ 37
అర్జునా! చనిపోతే స్వర్గం పొందుతావు. జయించావో రాజ్యం అనుభవిస్తావు. అందుచేత యుద్ధానికి నిశ్చయించుకొని లే! (37)
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ॥ 38
సుఖ దుఖాల్నీ, లాభా నష్టాల్నీ, జయాపజయాలను సమంగా భావించు. యుద్ధానికి సిద్ధం కమ్ము. ఇలా అయితే నీకు పాపం కలగదు. (38)
ఏషా తేభిఽహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ॥ 39
అర్జునా! ఈ సమబుద్ధిని నీకింతవరకూ జ్ఞానయోగ దృష్టితో చెప్పాను. ఇక కర్మయోగ దృష్టితో చెపుతాను. దానితో నీవు కర్మబంధం నుండి విముక్తి పొందుతావు. (39)
నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే ।
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥ 40
ఈ (నిష్కామ) కర్మ యోగంలో బీజనాశం లేదు. ప్రయత్నం విఫలం కాదు. విపరీత ఫలితాలు కలగవు. ఏ మాత్రం సాధన చేసినా అది జన్మమరణ రూప మయిన మహాభయం నుండి రక్షిస్తుంది. (40)
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన ।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ॥ 41
అర్జునా! (నిష్కామ) కర్మయోగంలో నిశ్చయ బుద్ధి ఒకటే ఉంటుంది. కాని స్థిర చిత్తం లేని, సకాములయిన వారి బుద్ధులు అనేక విధాలుగా ఉంటాయి - అనంతంగా ఉంటాయి. (41)
యామిమాం పుష్పితాం వాచంప్రవదంత్య విపశ్చితః ।
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ॥ 42
కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥ 43
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ 44
కొందరు సుఖ భోగాల్లో చిక్కుకొని ఉంటారు - వారు కర్మల ఫలాన్ని చెప్పే వేద వాక్యాల బాహ్యార్థాలతోనే తృప్తి పడి, అంతర్రాథాలు గమనించరు. స్వర్గమొక్కటే పొందదగినదని వారు భావిస్తారు. క్షణికమైన భోగాసక్తితో ఎన్నో సకామకర్మలను ప్రోత్సహిస్తారు. వారి ఇచ్చకపు మాటలలోపడిన భోగాసక్తుల బుద్ధులు పరమాత్ముని యందు నిశ్చలంగా నిలవవు. (42-44)
త్రైగుణ్యవిషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ ॥ 45
అర్జునా! వేదాలు త్రిగుణాలకు విషయాలయిన భొగాలను గూర్చి చెపుతాయి. వాటిని పొందే సాధనాలు చెపుతాయి. వాటి యందు నీవు ఆసక్తి చూపకు. ద్వందాలకు అతీతుడవై ఉండు. నిత్యమైన పరమాత్మ మీదనే నిలు. యోగక్షేమాలు పదలు. అంతకరణం వశంలో ఉంచుకో! (45)
వి॥ ద్వంద్వాలు : ప్రియం, అప్రియం = ప్రియాప్రియాలు; శీతం, ఉష్ణం = శీతోష్ణాలు. ఇట్టివి ద్వంద్వాలు - వీనిని మానవుడు సమానంగా చూడాలి - విడవాలి.
యవానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥ 46
నీటితో అన్ని వైపులా పొర్లిపోయే పెద్ద జలాశయం లభించాక చిన్న చిన్న నీటి గుంటల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే పరమానందంలో తేలియాడే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. (ఏ ప్రయోజనమూ ఉండదు) (46)
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ॥ 47
నీకు కర్మను ఆచరించడంలోనే అధికారం ఉంది కాని ఫలితం మీద అధికారం ఎన్నడూ లేదు. కర్మల ఫలితాలకు నీవు కారణం కారాదు. కర్మమానడం మీదనూ నీకు ఆసక్తి ఉండరాదు. (47)
వి॥ అనగా ఫలాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో కర్మలనాచరించాలి.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 48
అర్జునా! యోగంలో నిలిచి, ఆసక్తిని విడిచి, సిద్ధించినా సిద్ధింపకపోయినా సమబుద్ధితో ఉండు. కర్తవ్య కర్మలను ఆచరించు. ఈ సమ భావాన్నే యోగ మంటారు. (48)
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥ 49
అర్జునా! ఈ బుద్ధి యోగం కంటె సకామ కర్మ చాలా తక్కువ శ్రేణికి చెందినది. కావున నీవు సమత్వబుద్ధి యోగాన్నే ఆశ్రయించు. ఫలాపేక్షతో చేసే కర్మలు హీనాలు. (49)
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ॥ 50
సమబుద్ధి కలవాడు పుణ్య పాపాలు రెంటినీ ఈ లోకంలోనే విడిచి పెడతాడు. అనగా వాటి నుండి విముక్తుడవుతాడు. అందుచేత సమబుద్ధియోగాన్ని ఆశ్రయించు. ఇదే కర్మలయందు కౌశలం. అనగా కర్మబంధనం నుండి విముక్తి పొందే మార్గం. (50)
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ॥
ఎందుకంటే సమబుద్ధికల జ్ఞానులు కర్మఫలం విడిచి, జన్మ బంధం నుండి విముక్తులై, సర్వోపద్రవ రహితమైన బ్రహ్మపదం పొందుతారు. (51)
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 52
నీ బుద్ధి మోహకాలుష్యాన్ని దాటినపుడు అనుభవించిన, అనుభవించబోయే వానియందు నిర్వేదం పొందుతావు. అదే వైరాగ్యం. (52)
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి ॥ 53
ఎన్నో వినడం చేత చాంచల్యం కలిగిన నీ బుద్ధి సమాధిలో నిశ్చల మయినపుడు, స్థిర మయినపుడు నీవు యోగాన్ని పొందుతావు. పరమాత్మతో సంయోగం - తత్త్వజ్ఞానాన్ని పొందుతావు." (53)
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ॥ 54
అర్జునుడు అడిగాడు.
"కేశవా! సమాధి స్థితుడై పరమాత్మను పొందిన స్థిత ప్రజ్ఞుని లక్షణం ఏమిటి? ఎలా మాట్లాడుతాడు? ఎలా ఉంటాడు? ఎలా వ్యవహరిస్తాడు?" (54)
శ్రీభగవాన్ ఉవాచ
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥ 55
కృష్ణుడు చెప్పాడు.
"అర్జునా! పురుషుడు తన మనసులోని కోరికలన్నీ విడిచినపుడు, ఆత్మ వలన ఆత్మ యందే సంతుష్టుడయినపుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. (55)
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ 56
దుఃఖాల్లో ఉద్వేగం చెందని మనసు కల్గి, సుఖాల మీద కోరికలేనివాడై, రాగం కాని భయం కాని, క్రోధం కాని లేని మునిని స్థిత ప్రజ్ఞుడని అంటారు. (56)
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 57
దేని మీదా ఆసక్తి లేనివాడు, అనుకూల పరిస్థితిలో సంతోషమూ, ప్రతికూల పరిస్థితిలో ద్వేషమూ లేనివాడు స్థిత ప్రజ్ఞుడు. (57)
యదా సంహరతే చాయం కూర్మోఽంగానీవ సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 58
తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోనికి ముడుచు కొన్నట్లు ఇంద్రియాలను విషయాల నుండి ఉపసంహరించుకొన్న వానిని స్థితప్రజ్ఞుడంటారు. (58)
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ॥ 59
ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహింపని కఠోర తపస్వి నుండి విషయాలు వెనుదిరుగుతాయి. కాని అతని విషయాసక్తి మాత్రం పోదు. కాని బ్రహ్మమును దర్శించిన వానికి విషయాసక్తి కూడా పోతుంది. (59)
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ॥ 60
అర్జునా! ఇంద్రియాలు మనస్సును మథిస్తాయి. ప్రయత్నపరుడు, మేధావి అయిన పురుషుని మనస్సును కూడ ఇంద్రియార్థాల వైపు బలవంతంగా లాగుకొని పోతాయి. (60)
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 61
సాధకుడు (యోగి) ఇంద్రియాల నన్నిటిని వశపరచుకొని, సమాహితుడై, ఆత్మస్థుడై ఉండాలి. ఇంద్రియాలు వశమయితే వాని బుద్ధి స్థిరంగా ఉంటుంది. (61)
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేఘాపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ॥ 62
విషయాలను గురించి ఆలోచించేవానికి విషయాసక్తి కలుగుతుంది. ఆసక్తి నుండి కామం, కామం నుండి క్రోధమూ పుడతాయి. (62)
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్భుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి ॥ 63
క్రోధం నుండి అవివేకం కలుగుతుంది. అవివేకం నుండి స్మృతి భ్రమిస్తుంది. స్మృతి పోతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశం వల్ల మనుష్యుడు నశిస్తాడు. పతనమవుతాడు. (63)
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ॥ 64
అర్జునా! అంతఃకరణాన్ని తన వశంలో ఉంచుకొన్నవాడు రాగ ద్వేషాలు విడిచి, ఇంద్రియాలతో విషయాలను గ్రహిస్తున్నా కూడా ప్రసన్నతను ఆనందాన్ని పొందుతాడు. (64)
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ॥ 65
అంతఃకరణం ప్రసన్న మయితే అతని దుఃఖాలన్నీ నశిస్తాయి. ప్రసన్న చిత్తుడయిన వాని బుద్ధి పరమాత్మ మీదనే పూర్తిగా స్థిరంగా నిలుస్తుంది. (65)
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ॥ 66
ఇంద్రియ జయంలేనివానికి నిశ్చయాత్మక మయిన బుద్ధి ఉండదు. అట్టి వాని అంతఃకరణంలో భావన కూడ ఉండదు. భావనలేని వానికి (పరమార్థ చింతన లేనివానికి) శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖ మెక్కడిది? (సుఖం కలుగదు). (66)
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ॥ 67
నీటి మీద వెళ్లే నావను వాయువు లాగుకొని పోతుంది. అలాగే మనస్సు ఇంద్రియాల్లో తిరుగుతుంటే (ఏ ఒక్క ఇంద్రియంతో కలిసి ఉన్నా) ఆ ఇంద్రియమే ఆ పురుషుని బుద్ధిని హరించి తన వైపుకు లాగుకొని పోతుంది. (67)
తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 68
కనుక ఆజానుబాహుడా! ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి పూర్తిగా నిగ్రహించిన వాని బుద్ధి స్థిరంగా ఉంటుంది. అనగా అతడు స్థితప్రజ్ఞుడు. (68)
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 69
జీవులందరికి రాత్రి అయినది స్థిత ప్రజ్ఞునికి పగలు. అతడు బ్రహ్మ దర్శనంతో మేల్కొని ఉంటాడు. జీవులందరూ మేల్కొని ఉండే పగలు స్థిత ప్రజ్ఞునికి రాత్రి. (69)
ఆపూర్వమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ॥ 70
ఎన్ని నదులు పొంగి, ప్రవహించి, వచ్చి చేరినా సముద్రంలో లీనమయిపోతాయి కాని సముద్రాన్ని పొంగిపొర్లేటట్లు చేయలేవు. అలాగే భోగాలన్నీ స్థిత ప్రజ్ఞునిలో లీనమవుతాయి తప్ప వికారం కలిగించవు. అట్టి వాడు పరమశాంతిని పొందుతాడు. భోగా సక్తుడు మాత్రం శాంతిని పొందలేడు. (70)
విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ॥ 71
కోరికలన్నిటినీ విడిచి - మమత, అహంకారం, స్పృహ లేనివాడు పరమశాంతిని పొందుతాడు. (71)
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాఽస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ 72
అర్జునా! ఇదే బ్రాహ్మీస్థితి. (బ్రహ్మమును పొందినవాని స్థితి) ఈ స్థితిని పొందినవాడు (యోగి) ఎన్నడూ మోహపడడు. చివరి సమయంలో కూడ ఈ స్థితిలో స్థిరంగా ఉన్నవాడు మోక్షం పొందుతాడు." (72)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణీ శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥ భీష్మపర్వణి షడ్వింశోఽధ్యాయః ॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున సాంఖ్య యోగమను ఇరువది ఆరవ అధ్యాయము (26). భగవద్గీత రెండవ అధ్యాయము. (2)