27. ఇరువది ఏడవ అధ్యాయము
భగవద్గీత - (3) కర్మయోగము.
అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 1
అర్జునుడు అడుగుతున్నాడు. "జనర్దనా! కర్మ కంటె జ్ఞానం శ్రేష్ఠమని నీ అభిప్రాయం అయితే కృష్ణా! నన్నీ ఘోరకర్మలో ఎందుకు నియోగిస్తున్నావు? (1)
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ॥ 2
కలగాపులగం వంటి మాటలతో నా బుద్ధిని మోహపరుస్తున్నావు. నాకేది శ్రేయస్కరమో అది ఒకటే నిశ్చయించి చెప్పు." (2)
శ్రీభగవాన్ ఉవాచ
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥ 3
శ్రీ భగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! పూర్వమే నేనీలోకంలో రెండు నిష్ఠలను చెప్పాను. (జ్ఞాన) సాంఖ్య యోగులకు జ్ఞానయోగం ద్వారాను, కర్మ యోగులకు కర్మయోగం ద్వారాను నిష్ఠ సిద్ధిస్తుంది. (3)
న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥ 4
మానవుడు కర్మలను ఆచరింపకుండా నైష్కర్మ్యం పొందలేడు. కర్మలను వదలి (సన్యసించి) నంత మాత్రాన సిద్ధిని (సాంఖ్య నిష్ఠను) పొందలేడు. (4)
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యత్ హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 5
మానవుడు కర్మ చేయకుండా ఒక్కక్షణం కూడా ఉండడు. ప్రకృతి గుణాలకు లోబడి అందరూ కర్మలు చేస్తారు. (5)
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥ 6
బలవంతంగా కర్మేంద్రియాలను బాహ్యంగా నిగ్రహించుకొని, మానసికంగా , ఇంద్రియ విషయాలను ఆలోచించే మూఢుని 'మిథ్యాచారుడు' అంటారు. (6)
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తః స విశిష్యతే ॥ 7
అర్జునా! మనసుతో ఇంద్రియాలను వశపరచుకొని, ఆసక్తి విడిచి, ఇంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఆచరించే వాడు ఉత్తముడు. (7)
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాఽపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ॥ 8
శాస్త్రంలో నీకు చెప్పిన కర్మలను చెయ్యి. కర్మలు చేయకపోవడం కంటె చెయ్యడమే గొప్పది. కర్మలను చేయకపోతే శరీరయాత్ర సాగదు. (8)
యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార ॥ 9
యజ్ఞంకోసంకాని ఇతరకర్మలను ఆచరించే ఈ లోకం కర్మ బంధంలో చిక్కుపడుతుంది. అందుచేత ఆసక్తి లేకుండా యజ్ఞం కోసమే విహిత కర్మలను ఆచరించు. (9)
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష వోఽస్త్విష్టకామధుక్ ॥ 10
కల్పాదిలో బ్రహ్మ యజ్ఞాలతో కలిపి ప్రజలను సృష్టించి "ఈ యజ్ఞాలతో మీరు సమృద్ధిని పొందండి. ఈ యజ్ఞం కోరిన కోరికలిచ్చే కామధేనువవుతుంది" అని చెప్పాడు. (10)
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ॥ 11
"ఈ యజ్ఞంతో దేవతలను తృప్తి పరచండి. ఆ దేవతలు మిమ్మల్ని వర్షాదులతో సంతోష పరుస్తారు. పరస్పరం ఇలా సంతోషపరుచుకొంటూ పరమ శ్రేయస్సును (మోక్షం) పొందుతారు. (11)
ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తానప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః ॥ 12
యజ్ఞాలతో సంతృప్తి చెందిన దేవతలు ఇష్టమయిన భోగాలు ఇస్తారు. అందుచేత వారిచ్చిన వాటిని వారికి నివేదింపకుండా అనుభవించేవాడు పాపియే. (12)
యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః ।
భుంజతే తే త్వఘం పాపాః యే పచంత్యాత్మకారణాత్ ॥ 13
యజ్ణ శేషమయినది తినేవారు పాపాలన్నిటి నుండి విముక్తి పొందుతారు. తమ కోసమే వండుకొనేవారు పాపాన్నే భుజిస్తారు. (13)
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః ॥ 14
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ 15
అన్నం నుండే ప్రాణులు పుడతాయి. అన్నం వర్షాల వల్ల ఏర్పడుతుంది. యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయి. యజ్ఞాలకు మూలం కర్మలు. కర్మలకు మూలం వేదాలు. వేదాలు పరమాత్మ నుండి పుట్టాయి. అందుచేత సర్వవ్యాపి, నిత్యుడు అయిన పరమాత్మ సదా యజ్ఞాలలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు." (14,15)
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామః మోఘం పార్థ స జీవతి ॥ 16
ఇలా ఈశ్వర ప్రవర్తితమయిన సృష్టిచక్రాన్ని అనుసరింపని వాడు ఇంద్రియాసక్తుడయిన పాపి. వాని జీవితం వ్యర్థం. (16)
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ॥ 17
కాని ఆత్మయందే ఆసక్తిని, ఆత్మతో తృప్తిని పొందినవానికి ఎటువంటి కర్తవ్యమూ ఉండదు. (17)
నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన ।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥ 18
అటువంటి జ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడం వల్లగాని, చేయకపోవడం వల్ల గాని, ఏ ప్రయోజనమూ ఉండదు. అతనికి ఏ ప్రాణితోనూ ప్రయోజనా పేక్షితమయిన సంబంధం కూడా ఉండదు. (18)
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ॥ 19
కనుక నీవు సదా ఆసక్తి లేకుండా కర్తవ్యకర్మలను చేయుము. కోరికలేకుండా కర్మలను ఆచరించేవాడు పరమాత్ముని పొందుతాడు. (19)
కర్మణైవ హి సంసిద్ధమ్ ఆస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ॥ 20
జనకమహారాజు మొదలయిన జ్ఞానులు ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించి, సిద్ధిపొందారు. లోకకల్యాణం దృష్టిలో పెట్టుకొని అయినా నీవు కర్మాచరణం చేయదగును. (20)
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 21
శ్రేష్ఠుడయిన వాడు ఆచరించిన దానినే ఇతర జనులు ఆచరిస్తారు. అతడు పాటించి, చేసిన సంప్రదాయాలనే లోకులంతా ఆచరిస్తారు. (21)
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ 22
అర్జునా! ఈ మూడు లోకాల్లోనూ నాకు కర్తవ్యమే లేదు. నేను పొందలేని, పొందని వస్తువూ ఏదీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూ ఉన్నాను. (22)
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 23
పార్థా! నేనే కర్మలను ఎపుడయినా చేయకపోతే ప్రజలు అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తారు. (23)
ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహమ్ ।
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః ॥ 24
నేనే కనుక కర్మలు మానివేస్తే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు. నేను సాంకర్యానికి కారకుణ్ణి అవుతాను. దానితో ప్రజానష్టం కలుగుతుంది. (24)
సక్తాః కర్మణ్యవిద్వాంసః యథా కుర్వంతి భారత ।
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ॥ 25
తెలియని వాళ్లు కోరికలతో కర్మలు చేస్తారు. అలాగే లోకశిక్షణ కోసం తెలిసిన వాళ్లు నిష్కామంగా కర్మలు చెయ్యాలి. (25)
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్ ।
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ॥ 26
ఫలాసక్తితో కర్మలు చేసే అవివేకుల బుద్ధిని చలింపజేయకూడదు. తాను కూడ చక్కగా కర్మలను ఆచరిస్తూ వారిచేత కూడా కర్మాచరణం చేయించాలి. (అలా చేయించక పోతే వారి బుద్ధి చలిస్తుంది. కర్మాచరణం చేయరు. చిత్తశుద్ధి కలగదు. జ్ఞానం కలగదు. ఉభయ భ్రష్టులవుతారు). (26)
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ॥ 27
నిజానికి కర్మలన్నీ ప్రకృతికి సంబంధించిన మూడు గుణాల వల్ల చేయబడతాయి. కాని అహంకారంతో నిండిన అజ్ణాని "నేనే కర్తను" అని భావిస్తాడు. (27)
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ॥ 28
కాని అర్జునా! గుణాల యొక్క, కర్మల యొక్క తత్త్వాన్ని తెలిసికొన్న జ్ఞాని గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయని భావించి, వాటిపై ఆసక్తుడు కాడు. (28)
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు ।
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవి న్న విచాలయేత్ ॥ 29
ప్రకృతి గుణాల చేత మోహితులయిన మానవులు ఆ గుణ కర్మలలోనే ఆసక్తులవుతారు. పూర్తిగా తెలియని అటువంటి మందబుద్ధులను తెలిసిన జ్ఞాని భ్రమింపజేయరాదు. (29)
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ 30
పరమాత్మనయిన నాయందే మనసు నిలిపి, కర్మలన్నీ నాకే అర్పించి, కోరికలు, మమకారం, శోకమూ విడిచి యుద్ధం చెయ్యి. (30)
యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావంతోఽవసూయంతః ముచ్యంతే తేఽపి కర్మభిః ॥ 31
శ్రద్ధతో, అసూయారహితులై ఈ మతాన్ని నిత్యమూ ఆచరించే వారు కర్తృత్వ బుద్ధి అనే బంధం నుండి విముక్తులవుతారు. (31)
యే త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతమ్ ।
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ॥ 32
ఈ నామతాన్ని అసూయతో ఆచరింపని వారు సర్వజ్ఞాన విమూఢులై, భ్రష్టులవుతారని తెలుసుకో! (32)
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 33
సర్వప్రాణులూ, జ్ఞానీ కూడా తమ తమ ప్రకృతులను అనుసరించియే కార్యాలు ఆచరిస్తూ ఉంటారు. ఎవరూ పట్టుపట్టి కర్మలను త్యజింపలేరు. (33)
వి॥ పూర్వజన్మలలో చేసిన ధర్మాధర్మాల సంస్కారమే ఇక్కడ ప్రకృతి.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ॥ 34
ప్రతీ ఇంద్రియం యొక్క విషయంలోనూ రాగ ద్వేషాలు నిలిచి ఉంటాయి. మానవుడు ఈ రెండిటికీ వశం కాకూడదు. ఈ రెండూ మానవుని శ్రేయస్సుకు శత్రువులు, విఘ్నకారకాలు. (34)
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ 35
చక్కగా అనుష్ఠించిన పరధర్మం కంటె గుణ రహిత మయినా స్వధర్మం శ్రేష్ఠ మయినది. స్వధర్మం ఆచరిస్తూ మరణించినా మంచిదే. పరధర్మం భయావహం." (35)
అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ॥ 36
అపుడు అర్జునుడు ఇలా అడిగాడు. "కృష్ణా! మనుష్యుడు తనకిష్టం లేకపోయినా బలవంతం చేసినట్లు పాపం చేస్తుంటాడు కదా! దేని ప్రభావం చేత అలా చేస్తుంటాడు?" (36)
శ్రీభగవాన్ ఉవాచ
కామ ఏష క్రోధ ఏషః రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ॥ 37
శ్రీభగవానుడు చెపుతున్నాడు. "అది కామ ప్రభవం. కామం రజోగుణం నుండి పుడుతుంది. ఇదే క్రోధంగా మారుతుంది. దీన్ని తృప్తి పరచలేము. చాలా భయంకర మయినది. ఈ కామమే శత్రువని గ్రహించు. (37)
ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ ॥ 38
పొగచేత అగ్ని, ధూళిచే అద్ధం, మావిచేత గర్భంలోని పిండమూ కప్పబడినట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. (38)
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్ఫూరేణానలేన చ ॥ 39
అర్జునా! ఈ కామం జ్ఞానికి నిత్యశత్రువు. దీనితో జ్ఞానం కప్పి వేయబడుతుంది. ఈ కామం అగ్నితో సమానమైనది. ఎన్నటికీ చల్లారదు. (39)
ఇంద్రియాణి మనో బుద్ధిః తస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినమ్ ॥ 40
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి నివాసస్థానాలు. ఈ మూడింటి ద్వారా కామం జ్ఞానాన్ని కప్పివేసి జీవుని మోహపెడుతుంది. (40)
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ॥ 41
అందుచేత అర్జునా! ముందుగా నీవు ఇంద్రియాలను నియమించుకో! వశపరచుకో! తరువాత జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే పాపి అయిన కామాన్ని జయించు. త్యజించు. (41)
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ॥ 42
స్థూల శరీరం కంటె ఇంద్రియాలు బలీయాలు అని చెపుతారు. ఇంద్రియాలకంటె మనస్సు, మనస్సు కంటె బుద్ధి శ్రేష్ఠ మయినవి. బుద్ధికంటె శ్రేష్ఠ మయినదీ, సూక్ష్మ మయినది ఆత్మ. (42)
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ॥ 43
అర్జునా! ఇలా బుద్ధికంటె శ్రేష్ఠ మయిన ఆత్మను తెలిసికొని, బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని, దుర్జయ శత్రువైన కామాన్ని జయించు." (43)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మయోగోనామ తృతీయోఽధ్యాయః ॥ 3 ॥ భీష్మపర్వణి సప్తవింశోఽధ్యాయః ॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున కర్మయోగ మను ఇరువది ఏడవ అధ్యాయము (27). భగవద్గీత మూడవ అధ్యాయము. (3)