28. ఇరువది ఎనిమిదవ అధ్యాయము

భగవద్గీత - (4) జ్ఞాన యోగము.

శ్రీభగవాన్ ఉవాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"నిత్యమయిన ఈ యోగాన్ని నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు తన కొడుకయిన మనువుకు చెప్పాడు. ఆ మనువు తన కొడుకయిన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. (1)
ఏవం పరంపరాప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ॥ 2
అర్జునా! ఇలా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని రాజర్షులు చాలా మంది గ్రహించారు. కాని చాలా కాలం గడిచిపోయి ఇపుడీ యోగం నశించి పోయింది. (2)
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ॥ 3
అదే యోగం ఇపుడు నేను నీకు చెప్పాను. నీవు నా భక్తుడవు. సఖుడవు. కనుక రహస్యమూ, ఉత్తమమూ అయిన ఈ పురాతన యోగం చెప్పాను." (3)
అర్జున ఉవాచ
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ॥ 4
అర్జునుడు ప్రశ్నించాడు.
"కృష్ణా! నీ జన్మ ఇప్పటిది. సూర్యుని జన్మ ఎపుడో కల్పాదిలోనిది. ప్రాచీన మయినది. నీవు సూర్యునకు ఉపదేశించడం ఎలా పొసగుతుంది?" (4)
శ్రీభగవాన్ ఉవాచ
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ॥ 5
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! నీకూ, నాకూ కూడా చాలా జన్మలు గతించాయి. అవి అన్నీ నాకు తెలుసును. నీకు తెలియవు. (5)
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥ 6
నేను పుట్టుక లేనివాడను. నిత్యుడను. ప్రాణులన్నిటికీ ఈశ్వరుడను. అయినా నా ప్రకృతిని వశంలో ఉంచుకొని నా మాయతో నేను శరీరం పొందుతాను. (6)
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ 7
అర్జునా! ధర్మానికి హాని కల్గినపుడు, అధర్మం పెచ్చుపెరిగినపుడూ నేను నన్ను సృష్టించుకొంటాను. సాకారంగా ఈ లోకంలో అవతరిస్తాను. (7)
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 8
సజ్జనులను రక్షించటానికీ, దుర్జనులను రూపుమాపటానికీ, ధర్మం చక్కగా నిలపటానికీ ప్రతీ యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. (8)
జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ॥ 9
అర్జునా! నా జన్మలూ, కర్మలూ, దివ్యాలు. ఈ తత్త్వాన్ని తెలిసినవాడు శరీరం విడిచి మళ్లీ జన్మించడు. పైగా నన్ను చేరుతాడు.
వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ 10
పూర్వం కూడా రాగ, భయ, క్రోధాలు లేకుండా, నన్నే భావిస్తూ, స్థిర బుద్ధితో నన్ను ఆశ్రయించిన భక్తులు చాలా మంది జ్ణాన తపస్సంపన్నులై, పవిత్రులై నా స్వరూపం పొందారు. (10)
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 11
అర్జునా! ఎవరు ఏ రీతిగా నన్ను సేవిస్తే వారిని అదే రీతిలో నేను అనుగ్రహిస్తాను. మానవులంతా నా మార్గాన్నే ఎన్నో విధాల అనుసరిస్తారు. (11)
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥ 12
కర్మలకు ఫలాన్ని ఆశించేవారు ఈ లోకంలో ఇతర దేవతలను పూజిస్తారు. అలా చేస్తే కర్మల వల్ల కలిగే సిద్ధి త్వరగా కలుగుతుంది. (12)
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ॥ 13
వారి గుణ కర్మలను అనుసరించి చతుర్వర్ణాలను నేనే సృష్టించాను. ఈ సృష్టి నేనే చేసినా (కర్తను నేనే అయినా) నిత్యుడనైన నేను కర్తను కానని తెలుసుకో! (13)
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥ 14
'నన్ను కర్మలు అంటవు - నాకు కర్మఫలం మీద ఆసక్తిలేదు' అని నన్ను ఆత్మరూపంగా తెలుసుకొన్నవాడు కర్మల చేత కట్టుపడడు. (14)
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ॥ 15
మోక్షం కోరిన ప్రాచీనులు ఇలా తెలుసుకొని కర్మలనాచరించారు. అందుచేత నీవు కూడ పూర్వుల వలె నిష్కామభావంతో కర్మలను ఆచరించు. (15)
కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥ 16
కర్మ - అకర్మలను నిశ్చయించడంలో పండితులు కూడ భ్రాంతి పడుతున్నారు. అందుచేత నీకు కర్మతత్త్వాన్ని చెపుతాను. దానిని తెలుసుకొంటే కర్మ బంధాల నుండి విముక్తి పొందుతావు. (16)
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥ 17
కర్మ - అకర్మ - వికర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. కర్మ తత్త్వం తెలుసుకోవడం చాలా కష్టమయినది. (17)
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥ 18
కర్మలో తన కర్తృత్వం లేదనీ, నైష్కర్మ్యంలో బ్రహ్మమును తెలిసికొన్నవాడు మానవులలో బుద్ధిమంతుడు, జ్ఞాని. అతడే సర్వకర్మల కర్త అయి కృతకృత్యుడవుతాడు. (18)
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ 19
ఎవని కర్మలన్నీ ఫలాసక్తి రహితాలో, ఎవని కర్మలు జ్ఞానమనే అగ్ని చేత దహింపబడతాయో వానిని జ్ఞానులు పండితుడని అంటారు. (19)
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ॥ 20
కర్మ ఫలం మీద ఆసక్తిని విడచి, నిత్య సంతృప్తి కలిగి, సంసారాశ్రయం విడిచినవాడు, కర్మలను చేస్తున్నా కించిత్తు కూడా చేసినట్లు కాదు. (అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానమనే అగ్ని చేత దగ్ధమైపోయింది).(20)
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషమ్ ॥ 21
నిష్కాముడై, ఎవరి నుండీ ఏమీ గ్రహింపక, శరీరాన్నీ, ఇంద్రియాలనూ, మనస్సునూ వశపరచుకొని, శరీరధారణం కోసం కర్మలు ఆచరించినా పాపం అంటదు. (21)
యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥ 22
అప్రయత్నంగా లభించిన దానితో సంతోషించేవాడు, శీతోష్ణాది ద్వంద్వాలను అతిక్రమించినవాడు, అసూయలేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా ఉండే కర్మయోగి కర్మలు ఆచరించినా వాటి బంధాలలో చిక్కుకొనడు. (22)
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః ।
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥ 23
దేని మీదా ఆసక్తిలేకుండా, విముక్తుడై, జ్ఞాన నిష్ఠమైన మనసు కలవాడు యజ్ఞం కోసమే కర్మలు ఆచరిస్తే వాని కర్మలు పూర్తిగా నశించిపోతాయి. కర్మ సంస్కారం కూడ ఉండదు. (23)
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24
యజ్ఞాలలో ఉపయోగించే సాధనాలు బ్రహ్మము. హోమం చేయబడే ద్రవ్యం బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. చేసేవాడు బ్రహ్మము. హోమం బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మలో స్థిరంగా ఉండి పొందే ఫలం కూడ బ్రహ్మమే - (సర్వం బ్రహ్మమయం) (24)
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ॥ 25
కొందరు యోగులు దైవపూజా రూపమయిన యజ్ఞాన్ని అనుష్ఠిస్తారు. కొందరు పరబ్రహ్మ పరమాత్మ రూపమయిన అగ్నిలో అభేద దర్శన రూపమయిన యజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞం ఆచరిస్తారు. (25)
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్ విషయానన్యః ఇంద్రియాగ్నిషు జుహ్వతి ॥ 26
కొందరు యోగులు, శ్రోత్రం మొ॥ ఇంద్రియాలను సంయమన మనే అగ్నిలో హోమం చేస్తారు. కొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాగ్నులలో హోమం చేస్తారు. అనగా మనో నిగ్రహంతో ఇంద్రియాలను వశపరచుకొంటారు. దానితో శబ్దాది విషయాల ప్రభావం ఇంద్రియాల మీద ఉండదు. (26)
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥ 27
కొందరు యోగులు ఇంద్రియ కర్మలను, ప్రాణ కర్మలను అన్నింటినీ ఆత్మసంయమ యోగం అనే అగ్నిలో హోమం చేస్తారు. వారు పరమాత్మయందే ఉంటారు. అపుడు ఇంద్రియ ప్రాణాల క్రియల ప్రభావం వారి మీద ఉండదు. (27)
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ॥ 28
కొందరు ద్రవ్యదాన యజ్ఞాలను, మరికొందరు తపోయజ్ఞాలను, ఇంకొందరు యోగరూప యజ్ఞాలను చేస్తారు. - మరికొందరు వేదాధ్యాయన యజ్ఞాన్ని, వేదార్థ జ్ఞాన యజ్ఞాన్ని అనుష్ఠిస్తారు. (28)
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ॥ 29
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః ॥ 30
కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును 1) కొందరు ప్రాణమందు అపానాన్ని హోమం చేస్తారు. 2) మరికొందరు ప్రాణాపానాలను నిరోధించి ప్రాణాయామం చేస్తారు. 3) మరికొంతమంది ఆహార నియమంతో ఒక వాయువును ఇతర వాయువులలో హోమం చేస్తారు. ఈ యజ్ఞ వేత్తలు, అనుష్ఠించేవారూ అంతా పాప విముక్తులవుతున్నారు. (29,30)
వి॥ 1. పూరకం 2. రేచకం 3. కుంభకం.
యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనమ్ ।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ॥ 31
యజ్ఞ శిష్టమైన అమృతాన్ని తినేవారు నిత్యమయిన బ్రహ్మమును పొందుతారు. యజ్ఞం చెయ్యని వానికి ఈ లోకమే లేదు - ఇక పరలోకం ఎక్కడిది? (31)
ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ॥ 32
ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాల్లో విస్తృతంగా చెప్పారు - అవి అన్నీ కర్మల నుండి పుట్టినవి. ఈ విషయం తెలిసి (జ్ఞానం పొంది) మోక్షం పొందుతావు. (32)
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వం కర్మాఖీలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ॥ 33
అర్జునా! ద్రవ్యయజ్ఞాల కంటె జ్ఞాన యజ్ఞం శ్రేష్ఠమయినది. కర్మలన్నీ జ్ఞానంలోనే సమాప్తమవుతాయి. (33)
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ॥ 34
పాదాభివందనం చేసి, పరిచర్యచేసి, శ్రద్ధతో ప్రశ్నించి బ్రహ్మ జ్ఞానం అర్థించు. తత్త్వ దర్శనం చేసిన జ్ఞానులు నీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తారు. (34)
యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ॥ 35
అర్జునా! బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత నీకు ఇటువంటి మోహం కలుగదు. ఈ జ్ఞానం వల్ల పూర్తిగా ప్రాణులన్నిటినీ నీలోనూ, తరువాత నాలోనూ చూడగలవు.
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ॥ 36
ఒక వేళ నీవు పాపులలో మహాపాపివి అయినా జ్ఞాన మనే నౌకతో పాపసముద్రాన్ని దాటగలవు. (36)
యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥ 37
అర్జునా! మండే అగ్ని సమిధలను భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలన్నిటినీ భస్మం చేస్తుంది. (37)
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥ 38
ఈ విశ్వంలో జ్ఞానంతో సమానమైనదీ, పవిత్రమయినదీ లేదు. కర్మయోగ సిద్ధుడయిన మముక్షువు కాలక్రమంగా బ్రహ్మజ్ఞానం పొందుతాడు. (38)
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమ్ అచిరేణాధిగచ్ఛతి ॥ 39
శ్రద్ధాళువు, నిత్యసాధకుడు, జితేంద్రియుడు అయిన ముముక్షువు బ్రహ్మజ్ణానాన్ని పొందుతాడు. అలా జ్ణానం పొంది త్వరలో పరమ శాంతిని (మోక్షాన్ని) పొందుతాడు. (39)
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరః న సుఖం సంశయాత్మనః ॥ 40
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు పరమార్థం పొందకుండానే నశిస్తాడు. సంశయాత్మునికి ఇహలోకమూ లేదు. పరలోకమూ లేదు. సుఖం కూడా లేదు. (40)
యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ॥ 41
అర్జునా! నిష్కామ కర్మ యోగంతో కర్మ ఫలితాలను భగవదర్పితం చేసి, జ్ఞానంతో సంశయాలన్నీ తొలగించుకొని, అంతఃకరణం వశమందుంచుకొన్న వానిని కర్మలు బంధించలేవు. (41)
తస్మాదజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసినాఽఽత్మనః ।
ఛిత్వైనం సంశయం యోగమ్ ఆతిష్ఠోత్తిష్ఠ భారత ॥ 42
అందుచేత అర్జునా! అజ్ఞాన వశాత్తు పుట్టి, నీ మనస్సులో ఉన్న సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో నరికి, (నిష్కామ కర్మ) యోగం అవలంబించు. (యుద్ధానికి) లెమ్ము." (42)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానకర్మసన్న్యాసయోగో నామ చతుర్ధోఽధ్యాయః ॥ 4 ॥ భీష్మపర్వణి అష్టావింశోఽధ్యాయః ॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున జ్ఞానయోగమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము (28). భగవద్గీత నాల్గవ అధ్యాయము. (4)