29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భగవద్గీత - (5) కర్మ సంన్యాస యోగము.

అర్జున ఉవాచ
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।
యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ॥ 1
అర్జునుడు అడుగుతున్నాడు.
"కృష్ణా! నీవు కర్మ త్యాగాన్ని, మళ్లీ కర్మ యోగాన్ని రెంటినీ చెపుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు నిశ్చయించి చెప్పు." (1)
శ్రీభగవాన్ ఉవాచ
సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ॥ 2
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"కర్మత్యాగమూ, కర్మయోగమూ రెండూ ముక్తి దాయకాలే. కాని వానిలో కర్మ సన్యాసం కంటె నిష్కామ కర్మానుష్ఠానం గొప్పది. శ్రేష్ఠం (2)
జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే ॥ 3
ఎవరినీ ద్వేషింపకుండా, దేనినీ కోరకుండా (కర్మము లాచరిస్తూ ఉన్నా) ఉండే వానిని నిత్య సన్యాసిగా తెలుసుకోవాలి. రాగద్వేషాది ద్వంద్వాలను దాటినవాడు తేలికగా బంధవిముక్తుడవుతాడు. (3)
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।
ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్ ॥ 4
తెలియని వాళ్లు కర్మ సన్యాసాన్ని, నిష్కామ కర్మయోగాన్ని వేరుగా చెపుతారు. పండితులు అలా చెప్పరు. ఇందులో ఏ ఒకటి చక్కగా అనుష్ఠించినా రెండింటి ఫలితమూ దక్కుతుంది. (4)
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥ 5
జ్ఞానయోగులు పొందే పరంధామాన్నే నిష్కామ కర్మయోగులూ పొందుతారు. జ్ఞాన యోగఫలాన్ని కర్మయోగ ఫలాన్ని ఒకటిగా చూసేవాడే యథార్థదర్శి. (5)
సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ॥ 6
నిష్కామ కర్మయోగం అనుష్ఠించకుండా కర్మ సన్న్యాసం కష్టం. నిష్కామ కర్మయోగం ఆచరించే ముని సన్యాసియై త్వరగా బ్రహ్మమును పొందుతాడు (చిత్తశుద్ధి లభింపనంత కాలం సన్యాసం కంటె కర్మయోగమే మంచిది) (6)
వి॥ కర్మ సన్యాసం కర్మలన్నిటిలోను కర్తృత్వం విడిచిపెట్టడం.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ॥ 7
మనస్సునూ, ఇంద్రియాలనూ వశపరచుకొని, శుద్ధమయిన అంతఃకరణంతో ప్రాణులన్నిటిలోను ఉన్న పరమాత్ముని ఆత్మలో దర్శించేవాడు కర్మలు చేస్తున్నా వాటిలో తాను బంధింపబడడు. (7)
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ ।
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ॥ 8
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ।
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ॥ 9
ఈ తత్త్వం తెలిసిన వాడు చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియలు చేస్తున్నా, మాట్లాడుతున్నా, విడిచిపెడుతున్నా, తీసికొంటున్నా, కళ్లు తెరుస్తున్నా, మూస్తున్నా - ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకొంటున్నాయి కాని నేనేమీ చేయటం లేదు అనుకొంటాడు. (8,9)
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ॥ 10
ఇలా కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి, ఆసక్తి లేకుండా కర్మలు చేసేవాడికి తామరాకు మీది నీటిలా పాపాలు అంటవు. (10)
కాయేన మనసా బుద్ధ్వా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ॥ 11
ఇలా కర్మ యోగులు ఆసక్తి లేకుండా కేవలం ఇంద్రియాలతో, శరీరంతో, మనసుతో, బుద్ధితో కర్మలను అంతఃకరణ శుద్ఢి కోసం చేస్తారు. (11)
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ॥ 12
నిష్కామ కర్మయోగి కర్మఫలం త్యజించి, శాంతిని (ముక్తిని) పొందుతాడు. కర్మఫలం మీద ఆసక్తి కలవాడు (ఫలం మీది కోరికతో) బంధింపబడతాడు. (12)
సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్ ॥ 13
అంతఃకరణాన్ని తన వశంలో ఉంచుకొని యోగుయుక్తుడయినవాడు దేహంలో ఉంటూనే కర్మలను మానసికంగా త్యజించి, (చేయక, చేయించక) ఆనందిస్తాడు. (13)
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥ 14
ఆ ప్రభువు లోకానికి కర్తృత్వ బుద్ధిని సృష్టించడు. కామ్య వస్తువులను సృష్టించడు. కర్మఫలాసక్తిని సృష్టించడు. కాని స్వభావమే (ప్రకృతియే మాయయే) అలా ప్రవర్తిస్తోంది. (14)
నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥ 15
సర్వవ్యాపి అయిన భగవానుడు పాప పుణ్యాలను గ్రహించడు. అజ్ఞానంతో ఆవరింపబడటం వలన (ప్రకృతి వలన) జీవులు మోహం చెందుతున్నారు. (15)
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ॥ 16
ఆత్మ జ్ఞానంతో ఎవరి అజ్ఞానం నశింపజేయబడిందో ఆ ఆత్మ జ్ఞానం వారిలో సూర్యునివలె పరబ్రహ్మమును ప్రకాశింపజేస్తోంది. (16)
తద్బుద్దయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః ।
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ॥ 17
బ్రహ్మ నిష్ఠులు బ్రహ్మాత్మభావులు, బ్రహ్మ స్థితులు, బ్రహ్మ పరాయణులు, జ్ఞానంతో కల్మషం తొలగించుకొని పునరావృత్తి లేని పరమగతిని పొందుతారు. (17)
విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥ 18
విద్యా వినయ సంపన్నుడయిన బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క, చండాలుడు - వీరందరి పట్ల జ్ఞానులు సమదృష్టినే కలిగి ఉంటారు. (18)
ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥ 19
అంతటా సమభావం కలవారు ఇక్కడే జగత్తు నంతటినీ జయిస్తారు. బ్రహ్మము గుణ దోషాలు లేని సమస్వరూపం. సమదృష్టి కల జ్ఞానులు బ్రహ్మమున నిలిచి జీవన్ముక్తి పొందుతారు. (19)
న ప్రహృష్యేత్ ప్రియం నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ ।
స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ॥ 20
బ్రహ్మ జ్ఞాని బ్రాహ్మీస్థితిని పొంది,స్థిర ప్రజ్ఞుడై, మోహరహితుడవుతాడు. అప్రియం కలిగితే విచారింపడు - ప్రియం కలిగితే పొంగిపోడు. (20)
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ॥ 21
బాహ్యాలయిన శబ్దాదులయందు ఆసక్తిలేనివాడు ఆత్మానందం పొందుతాడు. అతడే పరమాత్మయోగం పొంది అక్షయమైన సుఖం పొందుతాడు. (21)
యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ॥ 22
అర్జునా! స్పర్శ మొదలయిన విషయాల వల్ల కలిగే భోగాలు దుఖం కలిగిస్తాయి. అవి ఆద్యంతాలు కలవి. అనగా అనిత్యాలు. పండితుడు వాని పట్ల ఆసక్తి చూపడు. (22)
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥ 23
ఇక్కడ జీవించి ఉండగానే కామ క్రోధాల వేగాన్ని సహింపగలవాడు సుఖపడతాడు. అతడే యోగి. (23)
యోఽంతఃసుఖోఽంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ॥ 24
అంతరాత్మయందే సుఖిస్తూ, ఆత్మయందే రమిస్తూ, అంతర్జ్యోతియై యుండే యోగి బ్రహ్మమే తానై బ్రహ్మానందం పొందుతాడు. (24)
లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైధా యతాత్మానఃసర్వభూతహితే రతాః ॥ 25
పాపరహితులై, సంశయాలన్నీ నశించి, నియతాత్ములై సర్వప్రాణులకూ హితం కోరేవారు బ్రహ్మనిర్వాణం పొందుతారు. (25)
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥ 26
కామక్రోధాలు విడిచి, చిత్తవృత్తులను జయించిన జ్ఞానులకు అంతటా పరబ్రహ్మమే కనిపిస్తుంది. (26)
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ॥ 27
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః ॥ 28
బాహ్య విషయాల అనుభవాన్ని తలపకుండా, దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి, ప్రాణ అపానాలను సమంగా నడుపుతూ, మనస్సు బుద్ధి ఇంద్రియాలు వశపరచుకొని, కామక్రోధాలు భయమూ విడిచి, సాధన చేసే మోక్షపరాయణుడైన ముని సదా ముక్తుడే అవుతాడు. (27,28)
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ॥ 29
యజ్ఞాలకు, తపస్సులకు భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణులకు మిత్రుడుగా నన్ను గ్రహించినవాడు శాంతిని పొందుతాడు." (29)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసంన్యాసయోగో నామ పంచమోఽధ్యాయః ॥ 5 ॥ భీష్మపర్వణి ఏకోనత్రింశోఽధ్యాయః ॥ 29 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున కర్మసంన్యాస యోగమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము (29). భగవద్గీత అయిదవ అధ్యాయము. (5)