30. ముప్పది అయిదవ అధ్యాయము
భగవద్గీత - (6) ధ్యాన యోగము / ఆత్మ సంయమ యోగము.
శ్రీభగవాన్ ఉవాచ
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"కర్మఫలాసక్తి లేకుండా కర్మాచరణం చేసేవాడే, నిజమైన సంన్యాసి - నిజమైన యోగి. కాని కేవలం అగ్నికార్యం మానినంత మాత్రాన సంన్యాసి కాడు. క్రియలు త్యజించినంత మాత్రాన యోగికాడు. (1)
యం సంన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన ॥ 2
అర్జునా! సంన్యాసమే యోగం అని తెలుసుకో. సంకల్పం విడవని వాడు ఎవడూ యోగి కాలేడు. (2)
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥ 3
యోగిస్థితి పొందాలనుకొనే మునికి (నిష్కామ) కర్మయే కారణమవుతుంది. (అది చిత్తశుద్ధి కలిగిస్తుంది). యోగారూఢుడయిన ధ్యాన నిష్ఠునికి కర్మత్యాగమే జ్ఞాన పరిపాకానికి కారణంగా చెప్పబడింది. (3)
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 4
ఇంద్రియ భోగాల మీద, కర్మల మీద ఆసక్తుడు కాకుండా సంకల్పాలన్నీ విడిచిన వాడే యోగారూఢు డని చెప్పబడుతుంది. (4)
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ॥ 5
ఈ సంసారం నుండి మానవులు తమను తామే ఉద్ధరించుకోవాలి. అంతేకాని అధోగతి పొందరాదు. ఆత్మయే తనకు బంధువు. ఆత్మయే శత్రువు. (5)
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥ 6
మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అలా జయింపనివాడు శత్రువు. జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియాలు, శరీరమూ ముక్తికి సహకరిస్తాయి. కాని వానికి అవి శత్రువులవలె ప్రవర్తించి ఆటంక పరుస్తాయి. (6)
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ॥ 7
జితేంద్రియుడు, ప్రశాంతుడు అయిన సంన్యాసి శీతోష్ణాలను, సుఖ దుఃఖాలను సన్మానావమానాలను పొందేటప్పుడు కూడ పరమాత్మ అతనికి సాక్షాత్కరిస్తాడు. (7)
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ॥ 8
శాస్త్రజ్ఞానంతోను, అనుభవంతోను సంతృప్తి పొందిన అతడు నిర్వికారుడు, జితేంద్రియుడై ఉంటాడు. అతడు మట్టిని, రాతిని, బంగారాన్ని సమానంగా చూస్తాడు. అతడు యోగి. (8)
సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు ।
సాధుష్వసి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥ 9
సుహృదులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింపదగినవారు, బంధువులు, సాధువులు, పాఫులు - వీరందరియందు సమబుద్ధికలవాడు శ్రేష్ఠుడు. (9)
యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ॥ 10
శరీరేంద్రియ మనస్సులను వశపరచుకొని, ఆశారహితుడై, పరిగ్రహశూన్యుడైన యోగి ఏకాంత ప్రదేశంలో కూర్చుండి, ఆత్మను సదా పరమాత్మయందు లగ్నం చెయ్యాలి. (10)
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ॥ 11
శుభ్రమన ప్రదేశంలో దర్భాసనం, జింక చర్మం, వస్త్రం ఒకదానిపై ఒకటి పరిచి, బాగా ఎత్తూ, బాగా పల్లమూ కాకుండా సమమైన ఎత్తుగా, స్థిరమన ఆసనం ఏర్పరచుకోవాలి. (11)
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ॥ 12
ఆ ఆసనం మీద కూర్చొని చిత్త, ఇంద్రియ వ్యాపారాలను వశపరచుకొని, ఏకాగ్ర మనస్సుతో అంతఃకరణ శుద్ధికోసం ధ్యానసాధన చెయ్యాలి. (12)
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥ 13
శరీరం, మెడ, శిరస్సు - వీటిని నిటారుగా, నిశ్చలంగా, స్థిరంగా ఉంచుకొని, దిక్కులు చూడకుండా, తన ముక్కు చివర (కనుబొమల మధ్య) దృష్టి నిలపాలి. (13)
ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః ॥ 14
ధ్యాన యోగి ప్రశాంత మనస్సుతో, నిర్భయంగా బ్రహ్మ చర్యం పాటిస్తూ, మనో నిగ్రహంతో నాయందే ఆసక్తుడై ఉండాలి. (14)
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ॥ 15
యోగి ఇలా నిరంతరంగా సమాహితుడై, మనస్సును వశపరచుకొంటే నా అధీనంలోని నిర్వాణ రూప మయిన శాంతిని పొందుతాడు. (15)
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ॥ 16
అతిగా తినేవానికి ధ్యానం కుదరదు. అలాగే ఏమీ తినని వానికీ కుదరదు. ఎక్కువ నిద్రపోయే వానికీ కుదరదు. నిద్రలేని వానికి ధ్యానం కుదరదు. (16)
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 17
తగిన ఆహార విహారాలు, కర్మాచరణం, జాగ్రత్స్వప్నాలు - యథాయోగ్యంగా వీనిలో ప్రవర్తించే వానికి దుఃఖ నాశకమైన యోగం సిద్ధిస్తుంది. (17)
యదా వినియతం చిత్తమ్ ఆత్మన్నేవావతిష్ఠతే ।
విఃస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 18
చిత్తం వశపరచుకొని, పరమాత్మయందే నిలిపినవాడు ఏ భోగం మీదా కోరికలేకుండా యోగ యుక్తుడవుతాడు. (18)
యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్పృతా ।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 19
గాలి వీచని చోట ఉన్న దీపం వలె యోగివశంలో ఉన్న చిత్తం ధ్యాననిమగ్న మయినపుడు నిశ్చలంగా ఉంటుంది. (19)
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ॥ 20
యోగసాధనచేత నిగ్రహింపబడిన చిత్తం ఎక్కడ ఉపరమం పొందుతుందో, ఏ స్థితిలో ఆత్మచేత ఆత్మను దర్శిస్తూ, ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటుందో... (అది యోగం అని తెలుసుకో) (20)
సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ ।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥ 21
ఏ స్థితిలో (యోగి) బుద్ధిచే గ్రహించే, ఇంద్రియ గోచరం కాని అనంతమైన ఆనందాన్ని పొందుతాడో, ఎక్కడ నుండి బయటకు రావటానికి ఇష్టపడడో ఆ స్థితిలో ఉండటం (యోగం అని తెలుసుకో) (21)
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ 22
ఏ స్థితిని పొందిన తరువాత ఇతర లాభాలను గొప్పగా భావించడో, ఏ స్థితిలో ఉండి మహాదుఃఖాల వలన కూడా చలింపడో ( ఆ స్థితి యోగం అని తెలుసుకో) (22)
తం విద్యాద్దుఃఖసంయోగ వియోగం యోగసంజ్ఞితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యః యోగోఽనిర్విణ్ణచేతసా ॥ 23
దుఖం పూర్తిగా తొలగిపోయే ఆ స్థితిని 'యోగం' అని గ్రహించాలి. విసుగు చెందని చిత్తంతో, పట్టుదలతో ఆ యోగాన్ని అభ్యసించాలి. (23)
సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ॥ 24
శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ॥ 25
సంకల్పంతో పుట్టే కోరికలన్నిటినీ పూర్తిగా విడిచి, మనసుతోనే ఇంద్రియ సముదాయాలను పూర్తిగా నిగ్రహించి, దైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా ఉపరతం చెయ్యాలి. ఆ మనస్సును ఆత్మలో నిలిపి ఇతరమయిన దానిని ఆలోచింపరాదు. (24,25)
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ॥ 26
చంచలమయిన మనసును పరుగులు తీసే చోటుల నుండి మళ్లించాలి. ఆత్మకు వశం చెయ్యాలి. (26)
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్పషమ్ ॥ 27
ప్రశాంత చిత్తుడై, మోహాదులు లేకుండా, పాపరహితుడై, బ్రహ్మభావం పొందిన యోగి బ్రహ్మానందం పొందుతాడు. (27)
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే ॥ 28
ఇలా మనసును సదా యోగంలో నిలిపినవాడు పాపరహితుడై, అనాయాసంగా (తేలికగా) బ్రహ్మానుభూతిని, మోక్షాన్ని పొందుతాడు. (28)
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ 29
ఇటువంటి యోగంతో కూడినవాడు తనను సర్వభూతాలలోను, సర్వభూతాలను తనలోను చూడగలడు. అపుడు అన్నిటా అతడు సమదర్శనం చేయగలడు. (29)
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30
అంతటా నన్ను చూడగలిగి, సర్వమునూ నాలో చూడగలవానికి నేను కనపడకుండా ఉండను. నాకు అతడు కనపడకుండా ఉండడు. (30)
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥ 31
సర్వప్రాణులలో ఉన్న నన్ను బ్రహ్మభావంతో భజించే యోగి ఏ అవస్థలో ఉన్నా నాలోనే ఉంటాడు (ముక్తి పొందుతాడు) (31)
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ॥ 32
అర్జునా! ప్రాణుల సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలుగా భావించేవాడు పరమ యోగి అని నా అభిప్రాయం." (32)
అర్జున ఉవాచ
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ॥ 33
వెంటనే అర్జునుడు అడిగాడు.
"కృష్ణా! నీవు సమత్వయోగం చెప్పావు. కాని మనస్సు చంచల మవటం వలన ఈ సమత్వయోగం ఎలా స్థిరంగా నిలుస్తుంది? (33)
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ॥ 34
కృష్ణా ఈ మనస్సు చంచలమయినది. దీనికి మథించే లక్షణం ఉంది. బలీయ మయినది. దృఢ మయినది. గాలిని పట్టుకోలేము. అలాగే ఈ మనస్సునూ పట్టుకోలేమని అనుకొంటున్నాను." (34)
శ్రీభగవాన్ ఉవాచ
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహతే ॥ 35
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
'అర్జునా! మనస్సు చంచల మయినదే. పట్టుకోలేము. సంశయం లేదు. కాని అభ్యాసంతోనూ, వైరాగ్యంతోనూ దాన్ని వశపరచుకోగలం. పట్టుబడుతుంది. (35)
అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ॥ 36
మనసు వశపరచుకోలేనివానికి యోగ సిద్ధి కలగడం కష్టమే. కాని ఉపాయంతో వశపరచుకొన్నవానికి యోగం సిద్ధిస్తుంది." (36)
అర్జున ఉవాచ
అయతిః శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్దిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 37
వెంటనే అర్జునుడు ఇలా ప్రశ్నించాడు. "కృష్ణా! శ్రద్ధతో యోగసాధన ప్రారంభించాక మధ్యలో యోగం నుండి మనసు చలిస్తుంది. అలా యోగ సిద్ధిని పొందని (యోగ భ్రష్టుని) వానికి గతి ఏమిటి? (37)
కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 38
మహాబాహూ! బ్రహ్మప్రాప్తి మార్గం నుండి జారి, ఆధారం లేకుండా ఉభయ భ్రష్టుడై, అతడు చెదిరిన మేఘంలా నశించిపోడు కదా! (38)
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 39
కృష్ణా! నా ఈ సందేహాన్ని పూర్తిగా నివారించడానికి నీవే తగిన వాడవు. ఈ సంశయం తీర్చగలవాడు నీకంటె మరొకడు దొరకడు." (39)
శ్రీభగవాన్ ఉవాచ
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।
న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ॥ 40
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! అటువంటి వానికి ఈ లోకంలో కాని, పరలోకంలో కాని వినాశం కలగదు. నాయనా! శుభంకరమయిన పని చేసే వాడెవడూ దుర్గతిని పొందడు.
ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥ 41
యోగ భ్రష్టుడు పుణ్యాత్ముల లోకాలను పొంది, చాలాకాలం అక్కడ ఉండి, తరువాత శుచిత్వమూ, సంపద కలవారియింట పుడతాడు. (41)
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ॥ 42
లేదా జ్ఞానులయిన యోగుల వంశంలో పుడతాడు. ఈ జన్మ లోకంలో కలగడం చాలా కష్టం. (42)
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ॥ 43
పూర్వ జన్మలో ఉన్న బుద్ధిని పొంది, ఈ జన్మలో మళ్లీ సిద్ధి పొందటానికి ప్రయత్నిస్తాడు. (43)
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 44
పూర్వజన్మలో అలవాటు పడటం వలన ఇపుడు ఇష్టంలేక పోయినా యోగసాధన వైపు ఆకర్షితుడవుతాడు. తెలుసుకోవాలనుకొనే వాడు వేదంలో చెప్పిన కర్మలను దాటి, జ్ఞానఫలాన్ని పొందుతాడు. (44)
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।
అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ॥ 45
ప్రయత్నించి యోగసాధనచేసే యోగి పూర్వజన్మ సంస్కారంతో పాపప్రక్షాళనం పొంది, సిద్ధి పొంది, పరమపదం పొందుతాడు. (45)
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ॥ 46
యోగి తపస్వుల కంటె అధికుడు. జ్ఞానుల కంటె అధికుడు. కామ్యకర్మలు చేసేవారి కంటె అధికుడు. అందుచేత అర్జునా! నీవు యోగివి కమ్ము. (46)
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ 47
శ్రద్ధ కలిగి నామీది చిత్తంతో నన్ను భజించేవాడు యోగులందరిలోను శ్రేష్ఠుడని నా అభిప్రాయం." (47)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥ భీష్మపర్వణి త్రింశోఽధ్యాయః ॥ 30 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున ఆత్మసంయమయోగమను ముప్పదియవ అధ్యాయము. (30) భగవద్గీత ఆరవ అధ్యాయము. (6)