31. ముప్పది ఒకటవ అధ్యాయము

భగవద్గీత - (7) జ్ఞాన విజ్ఞాన యోగము.

శ్రీ భగవాన్ ఉవాచ
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! నాయందే ఆసక్తిమయిన మనసుతో, నన్నే ఆశ్రయించి, యోగంలో నిమగ్నుడవు కమ్ము. సంపూర్ణంగా నిస్సంశయంగా నన్ను ఎలా తెలుసుకొన గలుగుతావో చెపుతాను విను. (1)
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమ్ ఇదం వక్ష్యామ్యశేషతః ।
యద్ జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ॥ 2
విజ్ఞానంతో కూడిన తత్త్వజ్ఞానాన్ని నేను నీకు సంపూర్ణంగా చెపుతాను. దీన్ని తెలుసుకొన్న తరువాత ఈ లోకంలో ఇక తెలియవలసినది ఏమీ మిగలదు. (2)
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 3
వేలకొద్దీ మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలిసికొనటానికి ప్రయత్నిస్తాడు. వాళ్లలో కూడ ఒకడు మాత్రమే నా తత్త్వాన్ని (నిజ స్వరూపాన్ని) తెలుసుకోగలడు. (3)
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ 4
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం - అని నా ప్రకృతి (మాయ) ఎనిమిది విధాలుగా ఉంటుంది. (4)
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥ 5
మహాబాహూ! ఈ చెప్పిన ప్రకృతిని అపర ప్రకృతి, అపరం జడం అని అంటారు. ఇది కాకుండా ఈ జగత్తు నంతటినీ ధరించే ప్రకృతి మరొకటి ఉంది. అది నా జీవరూప మయినది. దాన్ని 'పరప్రకృతి' అంటారు. (5)
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥ 6
ప్రాణులన్నీ ఈ రెండు ప్రకృతుల నుండే పుడుతున్నాయి. ఈ జగత్తు యొక్క పుట్టుక, ప్రళయమూ నావల్లనే జరుగుతున్నాయి - నేనే మూల కారణం. (6)
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 7
అర్జునా! నాకంటె మూలకారణం మరొకటి లేనే లేదు. ఈ లోకంలోని వస్తువులన్నీ దారంలో మణుల వలె నాలోనే కూర్ప(గుచ్చ)బడ్డాయి. (7)
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥ 8
అర్జునా! నీటిలో ఉన్న రస, (తన్మాత్రను) స్వరూపం నేనే - సూర్య చంద్రులలోని కాంతిని నేనే - వేదాలన్నిటిలో ఓంకారం నేనే. ఆకాశంలో శబ్దం నేనే - మానవుల్లోని పురుషకారం నేనే. (8)
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 9
భూమిలోని మంచి గంధం నేనే. అగ్నిలోని తేజస్సు నేను, సర్వప్రాణులలోను జీవశక్తిని నేను. తపస్సులలో తపస్సును నేను. (9)
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్భుద్దిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ॥ 10
అర్జునా! (స్థావర జంగమాలయిన) భూతాలన్నిటికీ బీజం - మూలం నేనే. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సునూ నేనే. (10)
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11
అర్జునా! బలవంతులలో కామ, రాగాలులేని బలం నేను. ప్రాణులలో ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే. (11)
యే చైవ సాత్త్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే ।
మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి ॥ 12
సాత్త్విక, రాజస, తామస భావాలు నానుండే కలుగుతున్నాయని తెలుసుకో, కాని నిజానికి వాటిలో నేను లేను. నాలో అవి లేవు. (నేను త్రిగుణాలకూ అతీతుడను). (12)
త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥ 13
ఈ జగమంతా (ప్రాణులన్న) సాత్త్విక రాజస తామస భావాలతో మోహిత మవుతోంది. అందువల్లనే త్రిగుణాతీతుడను, శాశ్వతడను అయిన నన్ను ఈ జగత్తు తెలుసుకో లేకపోతోంది. (13)
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥ 14
నా యీ మాయ అలౌకిక మయినది. దీన్ని దాట శక్యం కాదు. కాని నన్నే పొందేవారు ఈ మాయను దాటుతున్నారు. దాటగలరు. (14)
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ।
మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః ॥ 15
మాయలోపడి జ్ఞానం నశించినవారూ, ఆసుర ప్రకృతి కలవారూ, నరాధములూ, మూఢులూ, చెడ్డ పనులు చేసేవారూ నన్ను పొందలేరు. (15)
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 16
నాల్గు రకాలయిన పుణ్యవ్యక్తులు నన్ను సేవిస్తారు. 1. ఆపదలలో ఉన్నవాడు 2. తెలుసుకోవాలనే కోరిక కలవాడు 3. ధనంకోరేవాడు 4. జ్ఞానం కలవాడు. (16)
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమ్ అహం స చ మమ ప్రియః ॥ 17
ఈ నలుగురిలో సదా నాయందే భక్తి కలిగిన జ్ఞాని విశిష్టుడు. నేను జ్ఞానులకు మిక్కిలి ఇష్టుడను. నాకూ అతడే ఇష్టుడు.
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ॥ 18
వీరు నలుగురూ గొప్పవారే కాని జ్ఞాని మాత్రం నా స్వరూపమే అని నా అభిప్రాయం. అతడు ఆత్మసమాహితుడై తన బుద్ధిని నాయందే ఉంచుతాడు. నన్ను మాత్రమే పొందాలని భావిస్తాడు. (18)
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 19
అనేక జన్మల తరువాత జ్ఞాని అయిన వాడు సర్వమూ వాసుదేవుడే అని భావిస్తాడు. నన్ను పొందుతాడు. అటువంటి మహాత్ముడు దుర్లభుడు. (19)
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥ 20
వేర్వేరు భోగవాంఛలతో జ్ఞానం నశించినవారు, తమ స్వభావాలకు తగిన నియమాలను ఆచరిస్తూ, ఇతర దేవతలను సేవిస్తారు. (20)
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ॥ 21
ఏఏ దేవతా రూపాలను భక్తుడు శ్రద్ధగా పూజించాలనుకొంటాడో దానికి తగినట్లు ఆయాదేవతల మీద నిశ్చలభక్తిని నేనే కలిగిస్తాను. (21)
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ ॥ 22
అతడు భక్తితో ఆ దేవతను ఆరాధిస్తాడు. ఫలితంగా నా అనుగ్రహంతో ఆ దేవత ద్వారా ఆ భోగాలు పొందుతాడు. (22)
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ ।
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ॥ 23
అల్పబుద్ధులయిన వారు పొందే ఫలాలు కూడా అశాశ్వతాలు. ఇతర దేవతలను పూజించేవారు ఆ దేవతలను పొందుతారు. నా భక్తులు నన్నే పొందుతున్నారు. (23)
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ।
పరం భావమజానంతః మమావ్యయమనుత్తమమ్ ॥ 24
అవివేకులు అక్షయమూ, ఉత్కృష్టమూ, శ్రేష్ఠమూ అయిన నన్ను తెలియలేక మరొక సామాన్య వ్యక్తిగా నన్ను భావిస్తారు. (24)
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ 25
అర్జునా! నా యోగమాయతో కూడిన నేను అందరికీ కనపడను. అజ్ఞానులు నన్ను జన్మలేని శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకోలేరు. (25)
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥ 26
అర్జునా! నేను భూత, భవిష్యత్, వర్తమాన విషయాలన్నిటినీ ఎరుగుదును. కాని నన్ను ఎవరూ తెలుసుకోలేరు. (26)
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ॥ 27
పరంతపా! ప్రాణులన్నీ రాగద్వేషాల వల్ల కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వాల వల్ల మోహంలో పడిపోతున్నాయి. (27)
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః ॥ 28
నిష్కామంగా పుణ్యకర్మలు చేసే వారి పాపం నశించి పోతుంది. వారు ద్వంద్వాల మోహం నుండి విముక్తులవుతారు. దృఢమైన ఆచరణ కలవారు నన్ను భజిస్తారు. (28)
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమ్ అధ్యాత్మం కర్మ చాఖిలమ్ ॥ 29
నన్ను ఆశ్రయించి, జరామరణ విముక్తికై ప్రయత్నించే వారు పరబ్రహ్మను, సమగ్రమైన అధ్యాత్మమును, సమస్త కర్మను తెలుసుకో గలరు. (29)
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ॥ 30
అదిభూత, అధిదైవ, అధియజ్ఞాలతో నన్ను తెలుసుకొన్నవారు, మరణ సమయంలో కూడ యోగయుక్తులై నన్ను తెలుసుకొనే ఉంటారు. (30)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణీ శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగోనామ సప్తమోఽధ్యాయః ॥ 7 భీష్మపర్వణి ఏకత్రింశోఽధ్యాయః ॥ 31 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భగవద్గీతాపర్వమను ఉపపర్వమున జ్ఞాన విజ్ఞానయోగమను ముప్పది ఒకటవ అధ్యాయము. (31) భగవద్గీత ఏడవ అధ్యాయము. (7)