32. ముప్పది రెండవ అధ్యాయము
భగవద్గీత - (8) అక్షర బ్రహ్మయోగము.
అర్జున ఉవాచ
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ।
అధిభూతం చ కిం ప్రోక్తమ్ అధిదైవం కిముచ్యతే ॥ 1
అర్జునుడు ప్రశ్నించాడు."
పురుషోత్తమా! బ్రహ్మ మంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతం అంటే ఏమిటి? అధిదైవం అంటే ఏమిటి?
అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్ మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ॥ 2
అధియజ్ఞం అంటే ఏమిటి? ఇది శరీరంలో ఎక్కడ ఎలా ఉంటుంది? అంతిమ సమయంలో యోగులు నిన్ను ఎలా తెలుసుకొంటారు?" (2)
శ్రీభగవానువాచ
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరః విసర్గః కర్మసంజ్ఞితః ॥ 3
శ్రీ భగవానుడు చెపుతున్నాడు.
"బ్రహ్మమంటే అవినాశి అయి శ్రేష్ఠమయిన పరబ్రహ్మము. అధ్యాత్మమంటే పరబ్రహ్మ యొక్క అంశరూపంలో ప్రాణుల శరీరంలో ఉండే జీవాత్మ (ప్రత్యగాత్మ). కర్మ అంటే జీవుల సృష్టి స్థితులకు కారణ మయిన విసర్గం. (తనలో లీనమయిన వానిని విసర్జించుట) అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అంటారు. (3)
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ ।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ॥ 4
వినాశం కలది అధిభూతం - పురుషుడు విరాట్పురుషుడు అధిదైవతం. ఈ శరీరాల్లో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞం. (4)
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥ 5
చివరి సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహం విడిచినవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. సందేహం లేదు. (5)
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్ ।
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ॥ 6
మానవుడు అంత్యకాలంలో ఏఏ భావాలను స్మరిస్తూ శరీరం విడుస్తాడో తరువాతి జన్మలో అతడు ఆయా రూపాలనే పొందుతాడు. సదా ఆ భావాలతో ప్రభావితుడవడం వల్ల. (6)
తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ॥ 7
అందుచేత సర్వకాలాల్లోనూ నన్ను స్మరిస్తూ ఉండు. అలాగే యుద్ధం చెయ్యి. నాయందే మనోబుద్ధులను లగ్నం చేశావు గనుక నిస్సందేహంగా నన్నే పొందుతావు. (7)
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ॥ 8
మరొకదాన్ని గురించిఆలోచించకుండా అర్జునా! నిరంతరధ్యాన యోగంతో కూడిన మనస్సుతో స్మరించినవాడు పరమపురుషుని పొందుతాడు. (8)
కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్ యః ।
సర్వస్య ధాతారమచింత్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥ 9
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ ।
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ ॥ 10
ఆ పరమపురుషుడు సర్వజ్ఞుడు. సనాతనుడు. అందరినీ శాసిస్తాడు. అణువుకన్నా సూక్ష్ముడు. ప్రాణులన్నిటినీ పోషిస్తాడు. బుద్ధికి గోచరంకాని రూపం కలిగినవాడు. అజ్ఞానాంధకారానికి (ప్రకృతికి) ఆవల ఉంటాడు మరణ సమయంలో భక్తితో ఏకాగ్రతతో, భ్రూమధ్యంలో ప్రాణాన్ని నిరోధించి, నిశ్చలమైన మనస్సుతో ఆ పరమేశ్వరుని ధ్యానించినవాడు ఆ పరమ పురుషుని పొందుతాడు.
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ॥ 11
వేదవేత్తలు ఏ పరమాత్మను శాశ్వతునిగా చెపుతారో, నిష్కాములయిన సంన్యాసులు ఏ పరమపదంలో ప్రవేశిస్తున్నారో; బ్రహ్మచారులు ఏ వ్రతం ఆచరిస్తారో ఆ పరమపదాన్ని గూర్చి సంగ్రహంగా చెపుతాను విను. (11)
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ ।
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితిలో యోగధారణామ్ ॥ 12
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ॥ 13
ఇంద్రియాల ద్వారాలన్నీ మూసివేసి, మనస్సును హృదయంలో నిరోధించాలి. అలా వశమయిన మనసుతో ప్రాణాలను మూర్థస్థానంలో (సహస్రారంలో) స్థిరంగా నిలపాలి. పరమాత్మధ్యానంలో నిమగ్నుడు కావాలి. అక్షర పరబ్రహ్మ స్వరూపమయిన ఓంకారం ఉచ్చరిస్తూ, నన్ను స్మరిస్తూ, దేహత్యాగం చేసినవాడు పరమగతిని (మోక్షాన్ని) పొందుతాడు.(12,13)
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః ।
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ॥ 14
పార్థా! నిత్యమూ, నిరంతరంగా, అనన్య భావంతో చిత్తం నామీదే నిలిపి, నన్ను స్మరిస్తూ ఉన్నయోగికి నేను సులభంగా అందుతాను. అతనికి సహజంగానే నేను లభిస్తాను. (14)
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ ।
వాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥ 15
పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన తరువాత దుఃఖనిలయమూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మను పొందరు. (15)
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తివోఽర్జున ।
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ॥ 16
అర్జునా! బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలూ పునర్జన్మ కలవే. కాని నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు. (లోకాలన్నీ కాలాధీనాలు - నేను కాలాతీతుడను కనుక) (16)
సహస్రయుగపర్యంతమ్ అహర్యద్ బ్రహ్మణో విదుః ।
రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ॥ 17
వేయి చతుర్యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు అనీ, అంతేకాలం రాత్రి అనీ - తెలిసిన యోగులే కాలతత్త్వం తెలిసిన వారు. (17)
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।
రాత్య్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ॥ 18
ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే అవ్యక్తం నుండి (బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం) పుడతాయి. మళ్లీ రాత్రి కాలం ప్రారంభంలో ఆ అవ్యక్తంలోనే లీనమవుతాయి. (18)
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్య్రాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ॥ 19
ఈ భూతసముదాయం పుట్టి, పుట్టి, చివరకు రాత్రి రాగానే లీనమవుతుంది. మళ్లీ పగలు రాగానే పుడుతూ ఉంటుంది. (19)
పరస్తస్మాత్తు భావోఽన్వః వ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ॥ 20
ఆ అవ్యక్తం కంటే పరమైన, విలక్షణమైన, శాశ్వతమైన మరొక అవ్యక్తభావమే పరమపదం. ప్రాణులన్నీ నశించినా ఆ పరమపురుషుడు నశింపడు. (20)
అవ్యక్తోఽక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ 21
వినాశంలేనివాడు, ఇంద్రియాలకు కనపడనివాడు అక్షర బ్రహ్మము అని శాస్త్రం చెప్పుచున్నది. అదే జీవునికి ఉత్తమగతి. దానిని పొందితే మళ్ళీ ఈ సంసారానికి తిరిగిరాడు. అదే నా పరమమైన పదం. (21)
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ॥ 22
అర్జునా! జీవులన్నీ అతని లోపలనే ఉన్నాయి. అతనితోనే జగత్తు అంతా వ్యాప్త మయి ఉంది. ఆ పరమపురుషుని ఏకాంతభక్తితో పొందవచ్చును. (22)
యత్ర కాలే త్వనావృతిమ్ ఆవృత్తిం చైవ యోగినః ।
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ॥ 23
ఏ కాలంలో శరీరం విడిచిన యోగులు తిరిగిరాని పరమపదం పొందుతారో, ఏ కాలంలో తిరిగివచ్చే గతిని పొందుతారో ఆ రెండు మార్గాలూ చెపుతాను. (23)
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ ।
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ॥ 24
బ్రహ్మవేత్తలు జ్యోతిర్మయ మార్గంలో వెళ్లి బ్రహ్మపదం పొందుతారు. ఈ మార్గానికి అధిదేవత అగ్ని. దేహత్యాగం చేసిన ఆ యోగులను క్రమంగా దివా, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు పరమపదం చేరుస్తారు. (24)
ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ ।
తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే ॥ 25
అలాగే సకామకర్మయోగులు ధూమ్రమార్గంలో స్వర్గాదిలోకాలు చేరుతారు. వీరిని క్రమంగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన, అభిమాన దేవతలు తీసికొని పోతారు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది, తమతమ పుణ్యకర్మఫలాలను అనుభవించి, మళ్లీ ఇక్కడకు వస్తారు. (25)
శుక్లకృష్ణే గతీ హ్యేతీ జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయాఽఽవర్తతే పునః ॥ 26
ఈ రెండు మార్గాలను శుక్ల కృష్ణ మార్గాలనీ, దేవ, పితృమార్గాలనీ అంటారు. ఇవి సనాతన మార్గాలు - దేవయానంలో వెళ్లినవారు పరమగతిని పొంది, తిరిగిరారు. పితృయానంలో వెళ్లినవారు మళ్లీ వచ్చి, ఇక్కడ జనన మరణ చక్రంలో పడతారు. (26)
నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన ।
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ॥ 27
ఈ మార్గాల తత్త్వం తెలిసిన యోగి మోహపడడు. అందుచేత అన్ని కాలాల్లోనూ సమబుద్ధి అనే యోగం పొందు. సమాహిత చిత్తుడవు కమ్ము. (27)
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టమ్ ।
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ॥ 28
ఈ తత్త్వం తెలిసిన యోగి వేద పఠనం వల్లను, యజ్ఞ, దాన, తపస్సుల వల్లను కలిగే పుణ్యఫలాలను అతిక్రమించి, అంతకంటె శ్రేష్ఠమయిన సనాతన పరమపదాన్ని పొందుతాడు. (28)
ఇతి శ్రీమహాభారతే భీషర్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరబ్రహ్మయోగో నామాష్టమోఽధ్యాయః ॥ 8 ॥ భీష్మ పర్వణి దాత్రింశోఽధ్యాయః ॥ 32 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భగవద్గీతాపర్వమను ఉపపర్వమున అక్షర బ్రహ్మయోగమను ముప్పది రెండవ అధ్యాయము (32). భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము. (8)