33. ముప్పది మూడవ అధ్యాయము
భగవద్గీత - (9) రాజవిద్యారాజగుహ్య యోగము.
శ్రీభగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు. "అర్జునా! అసూయలేని నీకు పరమ రహస్య మయిన విజ్ఞాన సహిత జ్ఞానాన్ని మళ్లీ చెపుతున్నాను. దీన్ని గ్రహిస్తే దుఃఖరూప మయిన సంసారబంధం నుండి విముక్తి పొందుతావు. (1)
రాజ్యవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ ।
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ॥ 2
ఈ విజ్ఞాన సహిత జ్ఞానం రాజవిద్య (ఉత్తమ విద్య) మిక్కిలి రహస్యమైనది. మిక్కిలి పవిత్రం. ఉత్తమం, ప్రత్యక్షఫలదాయకం. ధర్మయుక్తం. సాధన చేయటానికి తేలికయినది. శాశ్వతమయినది. (2)
అశ్రద్దధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప ।
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ॥ 3
అర్జునా! ఈ బ్రహ్మజ్ఞాన మనే ధర్మమార్గం మీద శ్రద్ధలేని పురుషులు నన్ను పొందలేరు. మృత్యువు - సంసారం అనే మార్గంలో పడి, తిరుగుతూ ఉంటారు. (3)
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్ స్థాని సర్వభూతాని న చాహం త్వేషవస్థితః ॥ 4
(ఇంద్రియాలకు) తెలియని రూపం కల నా చేత ఈ జగత్తు అంతా నిండి (వ్యాపించి) ఉంది. నాలోనే (పరమాత్మలోనే) భూతాలన్నీ ఉన్నాయి. - అంతేకాని నేను (పరమాత్మ) వాటిల్లో లేను. (4)
న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః ॥ 5
నాలో ఆ భూతాలు (ప్రాణులు) లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు. ఈ భూతాలన్నిటినీ సృష్టిస్తూ పోషించేది నేనే. అయినా నిజానికి నా ఆత్మ వాటిలో ఉండదు. (5)
యథాఽఽకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ ।
తథా సర్వాణి భూతాని మత్ స్థానీత్యుపధారయ ॥ 6
అంతటా తిరిగే వాయువు సదా ఆకాశంలో ఉన్నట్లే భూతాలన్నీ నాయందే ఉన్నాయని గ్రహించు. (6)
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాన్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥ 7
అర్జునా! కల్పాంతంలో భూతాలన్నీ నా ప్రకృతిలో చేరిపోతాయి. మళ్లీ కల్పాదిలో నేను సృష్టిస్తాను. (7)
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః ।
భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ॥ 8
తమస్వభావం వల్ల పరతంత్ర మయిన భూత సముదాయాన్ని నా ప్రకృతి నవలంబించి, వాటి కర్మల ననుసరించి, సృష్టిస్తాను. (8)
న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।
ఉదాసీనవదాసీనమ్ అసక్తం తేషు కర్మషు ॥ 9
అర్జునా! ఆ సృష్టి మొదలయిన కర్మలలో ఆసక్తి లేకుండా ఉదాసీనంగా నేనుండటం చేత నన్ను ఆ కర్మలు బంధింపవు. (9)
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ ।
హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే ॥ 10
అధిష్ఠాతనైన నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తోంది. (ఆ ప్రకృతికి పరమాత్మనియంత). ఈ జగత్తు (పరిభ్రమిస్తూ) ఏర్పడుతూ ఉంటుంది. (10)
అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానంతః మమ భూతమహేశ్వరమ్ ॥ 11
నా పరమభావం తెలియని మూఢులు సర్వప్రాణులకు మహేశ్వరుడనైన నన్ను మనుష్యదేహం ధరించడం వలన అవమానిస్తారు కూడ. (11)
మోఘాశా మోఘకర్మాణః మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥ 12
వ్యర్థాలయిన ఆశలు, కర్మలు, విపరీత జ్ఞానం - వీనితో మనసులు చెదిరి అజ్ఞానులు వ్యామోహం కలిగించే రాక్షస, ఆసుర ప్రకృతుల నవలంబించి, క్రూరకర్మలు చేస్తారు. (12)
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ॥ 13
అర్జునా! దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు, అవ్యయునిగా భావించి, నిశ్చలమనస్సుతో నన్ను భజిస్తారు. (13)
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥ 14
దృఢవ్రతులు నన్ను కీర్తిస్తూ, ప్రయత్నశీలురై భక్తితో నమస్కరిస్తూ, సర్వదా సమాహిత చిత్తులై ఉపాసిస్తారు. (14)
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ॥ 15
కొందరు జ్ఞానయజ్ఞంతో అభేద భావంతో ఉపాసిస్తారు. మరికొందరు పృథగ్భావంతో విశ్వతోముఖుడ నైన నన్ను ఆరాధిస్తారు. (15)
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మంత్రోఽహమహమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ ॥ 16
నేనే క్రతువును. నేనే యజ్ఞాన్ని, స్వధకూడ నేనే. ఔషధం, మంత్రం, ఘృతం, హోమాగ్ని, హోమం, అన్నీ నేనే. (16)
పితామహస్య జగతః మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకారః బుక్ సామ యజురేవ చ ॥ 17
ఈ జగత్తుకు ధాతను నేనే. నేనే తల్లిని, తండ్రిని, తాతను తెలిసికొనదగినవాడను నేనే. పవిత్రడను, ఓంకారం, బుక్, సామ, యజుర్వేదాలు నేనే. (17)
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18
పరమగతిని నేనే. జగత్తును భరించి, పోషించేవాడను నేనే. అందరి ప్రభువును సాక్షిని నేనే! అందరినీ నివాసం నేనే! శరణుపొందదగినవాడను నేనే. మిత్రుడిని, అందరి ఉత్పత్తి ప్రళయాలకు హేతువును, వారిస్థితికి ఆధారం, నిధానం, శాశ్వతకారణం నేనే! (18)
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ॥ 19
అర్జునా! సూర్యరూపంలో నేనే తపింపజేస్తాను. సముద్రాలలోని నీటిని గ్రహించి, వర్ష రూపంలో విడుస్తాను. అమృతమూ, మృత్యువూ నేనే, సత్తు, అసత్తు నేనే. (19)
త్రైవిద్యాం మాం సోమపాః పూతపాపాః
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ।
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమ్
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ॥ 20
వేదత్రయ మెరిగి, సోమపానం చేసి, పాపరహితులైన వారు యజ్ఞాల ద్వారా నన్ను సేవించి, స్వర్గలోకం కోరుకొంటారు. వారు పుణ్యం పొంది స్వర్గలోకంలో దేవభోగాలు అనుభవిస్తారు. (20)
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ।
ఏవం త్రయీధర్మమనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే ॥ 21
వారు విశాలమయిన ఆ స్వర్గలోకం అనుభవించి, పుణ్యం నశించి, మళ్లీ మర్త్యలోకంలో ప్రవేశిస్తారు. ఇలా వేద ధర్మం ఆశ్రయించిన వారు భోగేచ్ఛతో స్వర్గ మర్త్యలోకాల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. (21)
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ 22
నన్నే నిరంతరమూ అనన్యభక్తితో చింతిస్తూ నిష్కామభావంతో సేవించే వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. (22)
వి॥ అప్పటిదాకా లేనిది రావడం యోగం. ఉన్నది రక్షింపబడటం క్షేమం.
యేఽప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ॥ 23
అర్జునా! శ్రద్ధ కల సకామభక్తులు ఇతర దేవతలను పూజించినా వారు నన్ను పూజించినట్లే. వారి పూజలు అవిధి పూర్వాలు, అజ్ఞాన కృతాలు. (23)
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ॥ 24
సకల యజ్ఞాలకు భోక్తను, ప్రభువును నేనే కదా! వారు నా తత్త్వం ఎరగరు. అందుచేత పతనం చెందుతారు. పునర్జన్మ పొందుతారు. (24)
యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోఽపి మామ్ ॥ 25
దేవతలను పూజించేవారు దేవలోకం చేరుతారు. పితృదేవతలను పూజించేవారు పితృలోకాలు పొందుతారు. భూతాలను సేవించేవారు భూతాలను పొందుతారు. నన్ను సేవించేవారు నన్ను పొందుతారు. (25)
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ॥ 26
నిర్మల బుద్ధితో, నిష్కామంగా, శ్రద్ధతో, భక్తితో, సమర్పించిన పత్రం కాని, పుష్పం కాని ఫలం కాని, జలం కాని నేను ప్రీతితో స్వీకరిస్తాను. (26)
యత్ కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణమ్ ॥ 27
అర్జునా! నీవు దేనిని చేసినా, దేనిని తిన్నా, దేనిని హోమం చేసినా, దేన్ని ఇచ్చినా, ఏ తపస్సు చేసినా దాన్ని నాకు అర్పించు. (27)
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ॥ 28
ఇలా సంన్యాస యోగంలో స్థిరచిత్తుడవై సర్వకర్మలను నాకే సమర్పిస్తే శుభాశుభ ఫలాల నిచ్చే కర్మబంధనాల నుండి విముక్తి పొందుతావు. తరువాత నన్ను చేరుతావు. (28)
సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ॥ 29
నేను సర్వభూతాల (ప్రాణుల) లోను సమభావంతో ఉంటాను. నాకు ప్రియుడూ లేడు. ద్వేష్యుడూ లేడు. నన్ను భక్తితో సేవించేవారు నాలో ఉంటారు. వారి హృదయాల్లో నేను ఉంటాను. (29)
అపి చేత్ సుదురాచరః భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ॥ 30
మిక్కిలి దురాచారుడయినా నన్ను అనన్య భక్తితో సేవిస్తే అతనిని సత్పురుషుడనే భావించాలి. అతడు భగవత్సేవతో కృతార్థుడనవుతాననే నిశ్చయం కలవాడు కనుక. (30)
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 31
అతడు త్వరగా ధర్మాత్ముడవుతాడు. వెంటనే నిత్యశాంతిని పొందుతాడు. అర్జునా! నా భక్తుడు ఎన్నడూ నష్టపోడు అని తెలుసుకో! (31)
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేఽపి యాంతి పరాం గతిమ్ ॥ 32
నన్ను చక్కగా ఆశ్రయించిన పాప జన్ములు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులూ కూడా పరమగతిని - ముక్తిని పొందుతున్నారు. (32)
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా ।
అనిత్యమసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ ॥ 33
అటువంటప్పుడు పవిత్రులైన బ్రాహ్మణులూ, భక్తులయిన రాజర్షులూ మోక్షం పొందుతారని వేరుగా చెప్పాలా? అర్జునా? అనిత్యమూ, సుఖరహితమూ అయిన ఈ లోకం పొంది నన్ను భజించు. (33)
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్వైవమ్ ఆత్మానం మత్పరాయణః ॥ 34
నాయందే నీమనస్సు లగ్నం చెయ్యి. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజించు, నాకు నమస్కరించు. ఇలా ఆత్మను నామీదే నిలిపి మత్పరాయణుడవయితే నన్నే పొందుతావు." (34)
ఇతి శ్రీమహాభారతే భీషర్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్ట్రే శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నవమోఽధ్యాయః ॥ 9 ॥ భీష్మపర్వణి నవమోఽధ్యాయః ॥ 33 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భగవద్గీతాపర్వమను ఉపపర్వమున రాజవిద్యా రాజగుహ్య యోగమను ముప్పది మూడవ అధ్యాయము. (33) భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము. (9)