34. ముప్పది నాల్గవ అధ్యాయము
భగవద్గీత - (10) విభూతి యోగము.
శ్రీభగవానువాచ
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! నీవు నా మాటలు ప్రీతితో వింటున్నావు. కనుక నీమేలు కోరి చెప్పే శ్రేష్ఠవచనాలు విను. (1)
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥ 2
దేవగణాలు కాని మహర్షులు కాని నా పుట్టుకను గురించి ఎరుగరు. ఆ దేవతలకూ, మహర్షులకూ కూడా అన్నివిధాలా నేనే మూలకారణం. (2)
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రమ్యుచతే ॥ 3
నన్ను కారణ, జన్మ రహితునిగా, సర్వలోక మహేశ్వరునిగా తెలిసికొన్న వాడు మానవులలో జ్ఞాని. వాడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు. (3)
బుద్ధిర్ జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవోఽభావః భయం చాభయమేవ చ ॥ 4
అహింసా సమతా తుష్టిః తపో దానం యశోఽయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిగ్విధాః ॥ 5
నిశ్చయ జ్ఞానం, యథార్థజ్ఞానం, మోహ రాహిత్యం, క్షమ, సత్యం, దమం, శమం, సుఖదుఃఖాలు, ఉత్పత్తి వినాశాలు, భయాభయాలు, అహింస, సమత, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి అనే వివిధ భావాలు అన్నీ నావల్లనే కలుగుతాయి. (4,5)
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 6
సప్తమహర్షులు, వారికి పూర్వులయిన సనకాది మునులు నలుగురూ, స్వాయంభువుడు మొదలయిన చతుర్దశమనువులూ, నా సంకల్పం వల్లనే పుట్టారు. అందరూ నా భక్తులే. నా పట్ల సద్భావం కలవారే. జగత్తులోని ప్రాణులన్నీ వీరి సంతానమే. (6)
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥ 7
ఈ నా విభూతిని, యోగాన్ని తాత్త్వికంగా తెలిసినవాడు నిశ్చలభక్తి యోగం పొందుతాడు. ఇది నిస్సందేహం. (7)
అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ॥ 8
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూలకారణం. నా వల్లనే ఈ జగత్తు అంతా నడుస్తోంది. ఈ విషయం తెలిసిన జ్ఞానులయిన భక్తులు భక్తిశ్రద్ధలతో నన్నే సేవిస్తారు. (8)
మచ్చిత్తా మద్గతప్రాణాః బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ 9
నా భక్తులు నాయందే చిత్తం నిలిపి తమ ప్రాణాలను సయితం నాకే అంకితం చేస్తారు. పరస్పరమూ నన్ను గురించి ఇతరులకు బోధిస్తూ, చెపుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉంటారు. (9)
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥ 10
అలా నిరంతరధ్యానంతో, భక్తి శ్రద్ధలతో నన్నే సేవించే వారికి నేను తత్త్వ జ్ఞానరూపమైన యోగాన్ని ఇస్తాను. దాని ద్వారా వారు నన్ను పొందుతారు. (10)
తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః ।
నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా ॥ 11
వారి అంతఃకరణంలో ఉండి నేను వారిని అనుగ్రహించటానికి తత్త్వజ్ఞానరూపమయిన దీపాన్ని వెలిగించి వారి అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తాను." (11)
అర్జున ఉవాచ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ ॥ 12
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ 13
అపుడు అర్జునుడు ఇలా అన్నాడు.
"నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పావనుడవు. నిన్ను మహర్షులు సనాతనుడవనీ, దివ్య పురుషుడవనీ, దేవదేవుడవనీ జన్మరహితుడవనీ, సర్వవ్యాపివనీ ప్రశంసిస్తారు. దేవర్షినారదుడూ, అసితుడూ, దేవలుడూ, వ్యాసమహర్షీ, నిన్ను ఇలాగే ప్రశంసిస్తారు. నీవూ నాకు అలాగే చెపుతున్నావు. (12,13)
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ॥ 14
కేశవా! నీవు చెప్పేదంతా నిజమే అనుకొంటున్నాను - భగవన్! నీ పుట్టుకను దేవతలు కాని, దానవులు కాని తెలుసుకోలేరు. (14
స్వయమేవాత్మవాఽఽత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥ 15
పురుషోత్తమా! జగదుత్పత్తి కారకా! భూతేశా! దేవదేవా! జగత్పతీ! నిన్ను నీవే స్వయంగా తెలుసుకోగలవు. (15)
వక్తుమర్హస్యశేషేణ దివ్యాః హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ॥ 16
లోకాలన్నిటిలో నీ దివ్య విభూతులు వ్యాపించి ఉన్నాయి. ఆ విభూతులను సంపూర్ణంగా తెలియజేయటానికి నీవే తగినవాడవు. (16)
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్ మయా ॥ 17
యోగీశ్వరా! నిన్ను నిరంతరమూ ఎలా చింతిస్తే నేను తెలుసుకోగలను? ఏ భావాలతో నేను చింతన చెయ్యాలి? (17)
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ॥ 18
నీ యోగాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి విస్తృతంగా చెప్పు. నీ అమృతవాక్కులు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు." (18)
శ్రీభగవానువాచ
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రధానతః కురుశ్రేష్ఠ వాస్త్యంతో విస్తరస్య మే ॥ 19
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"ఓహో! అలాగే చెపుతా. నా విభూతులకు అంతమే లేదు. అందులో ప్రధానమయినవి మాత్రమే చెపుతాను. (19)
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మద్యం చ భూతానామంత ఏవ చ ॥ 20
అర్జునా సర్వప్రాణుల హృదయాల్లోనూ ఉన్న ఆత్మను నేనే. ప్రాణుల ఆది, మధ్యమూ, అంతమూ - అన్నీ నేనే.
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21
ఆదిత్యులలో (అదితి పుత్రులలో) విష్ణువును నేను - వెలుగులలో సూర్యుడను నేను. సప్తమరుద్గణాల్లో మరీచిని (ఆవహుడను) నేను. నక్షత్రాల్లో చంద్రుడిని నేనే. (21)
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతనామస్మి చేతనా ॥ 22
వేదాలలో సామవేదం నేను. దేవతల్లో ఇంద్రుడిని నేను. ఇంద్రియాల్లో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యం (ప్రాణశక్తిని) నేను. (22)
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ॥ 23
ఏకాదశ రుద్రులలో శంకరుణ్ణి నేను. యక్ష రాక్షసులలో కుబేరుడను నేను. అష్టవసువులలో పావకుడను నేను. పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను. (23)
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కందః పరసామస్మి సాగరః ॥ 24
అర్జునా! పురోహితులలో ముఖ్యమయిన బృహస్పతిని నేను. సేనానులలో దేవసేనా నాయకుడయిన స్కందుణ్ణి నేను. సరస్సులలో సముద్రాన్ని నేను. (24)
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాయలః ॥ 25
మహర్షులలో భృగుమహర్షిని నేను. శబ్దాలలో ఏకాక్షరమయిన ఓంకారం నేను. యజ్ఞాల్లో జపయజ్ఞం నేను. స్థావరాల్లో హిమాలయం నేను. (25)
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 26
వృక్షాలన్నిటిలో అశ్వత్థవృక్షాన్ని నేను. దేవర్షులలో నారదుణ్ణి నేను. గంధర్వులలో చిత్రరథుడిని. సిద్ధులలో నేను కపిల మునిని. (26)
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ॥ 27
అశ్వాలలో అమృతంతో పుట్టిన ఉచ్ఛైఃశ్రవాన్ని నేనని తెలుసుకో. గజేంద్రులలో ఐరావతాన్ని, నరులలో నరాధిపుణ్ణి నేను. (27)
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28
ఆయుధాల్లో నేను వజ్రాయుధాన్ని. ధేనువులలో నేను కామధేనువును. సంతానోత్పాదకు డయిన మన్మథుడను నేనే. సర్పాలలో వాసుకిని నేనే. (28)
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ॥ 29
నాగులలో అనంతుడను. జలచరాలకు అధిపతి అయిన వరుణడను నేను. పితృదేవతలలో అర్యముడను. శాసకులలో యమధర్మరాజును నేను. (29)
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ 30
దైత్యులలో ప్రహ్లాదుడను. గణకులలో కాలుడను నేను. మృగాల్లో సింహం, పక్షులలో గరుత్మంతుడిని నేనే. (30)
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31
పవిత్ర మొనర్చే వాటిలో వాయువును నేను. శస్త్రధారులలో శ్రీరాముడను నేను. చేపలలో మొసలిని, నదులలో గంగానదిని నేనే. (31)
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ॥ 32
అర్జునా! సృష్టికి ఆది మధ్యాంతాలు నేనే. విద్యలలో అధ్యాత్మ విద్యను (బ్రహ్మవిద్య) నేను. శాస్త్రార్థవాదంలో తత్త్వ నిర్ణయం చేసే 'వాదం' నేనే. (32)
అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ ।
అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతోముఖః ॥ 33
అక్షరాల్లో అకారం నేను. సమాసాల్లో ద్వంద్వ సమాసం నేను. అక్షయమైన కాలం నేనే. విశ్వతోముఖుడయిన విరాట్పురుషుడను నేను. అందరినీ ధరించేవాడను, పోషించేవాడను నేనే. (33)
మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్ చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ॥ 34
అన్ని ప్రాణులనూ హరించే మృత్యువును నేనే. ప్రాణుల ఉత్పత్తి హేతువును నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అనే వారంతా నేనే. (34)
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ॥ 35
సామలలో బృహత్సామం నేను. ఛందస్సులలో గాయత్రీ ఛంధస్సును నేను. మాసాలలో మార్గశీర్షమాసం నేను. ఋతువులలో వసంత ఋతువును నేను. (35)
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ॥ 36
అర్జునా! కపటులలో జూదం నేను. తేజస్వులలో తేజస్సును నేను. జయించే వారిలో జయాన్ని, వ్యయసాయాన్ని నేనే. సాత్త్వికులలో సత్త్వభావం నేనే. (36)
వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ॥ 37
వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. మునుల్లో నేను వ్యాసుడను. కవులలో శుక్రాచార్యుడను నేను. (37)
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38
శిక్షించేవారిలో దండం నేనే. జయేచ్ఛ కలవారిలో నీతిని నేను. గోప్య విషయంలో మౌనం నేను. జ్ఞానుల తత్త్వజ్ఞానం నేనే. (38)
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున ।
న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ ॥ 39
అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి బీజం నేను. ఎందుకంటే నేనులేని చరాచర ప్రాణి లేనే లేదు. (39)
నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా ॥ 40
అర్జునా! నా దివ్య విభూతులకు అంతమే లేదు. విభూతుల విస్తృతిని గూర్చి సంక్షిప్తంగా నీకు చెప్పాను. (40)
యద్ యద్ విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్ తదేవావగచ్ఛ త్వం మమ తేజోంఽశసంభవమ్ ॥ 41
ఐశ్వర్యయుక్తం, కాంతి యుక్తం, శక్తి యుక్తం అయిన వస్తువు ఏదయినా నా తేజస్సులోని అంశం నుండియే కలిగినదని తెలుసుకో. (41)
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ ॥ 42
అర్జునా! ఇంతకు మించి ఎక్కువగా తెలిసికొని ప్రయోజనం లేదు. ఈ జగత్తు నంతటిని కేవలం నాయోగ శక్తియొక్క ఒక్క అంశతో మాత్రమే ధరిస్తున్నాను." (42)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోఽధ్యాయః ॥ 10 ॥ భీష్మపర్వణీ చతుస్త్రింశోఽధ్యాయః ॥ 34 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున విభూతి యోగమను ముప్పది నాల్గవ అధ్యాయము (34). భగవద్గీత పదవ అధ్యాయము. (10)