35. ముప్పది అయిదవ అధ్యాయము
భగవద్గీత - (11) విశ్వరూప దర్శన యోగము.
అర్జున ఉవాచ
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ ।
యత్ త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ॥ 1
అర్జునుడు అడుగుతున్నాడు. "కృష్ణా! నన్ను అనుగ్రహించటానికి పరమరహస్య మయిన ఆధ్యాత్మిక విషయాలు చెప్పావు. దాని వల్ల నా అజ్ఞానం తొలగిపోయింది. (1)
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ॥ 2
కృష్ణా! ప్రాణులన్నిటి యొక్క ఉత్పత్తి ప్రళయాల గురించి విస్తారంగా విన్నాను. అలాగే శాశ్వతమైన నీ మహిమలూ విన్నాను. (2)
ఏవమేతద్ యథాఽఽత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ ॥ 3
పరమేశ్వరా! నీవు చెప్పిన ఆత్మ తత్త్వమంతా సత్యమే. సందేహం లేదు. కాని పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకొంటున్నాను. (3)
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో ।
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ॥ 4
ప్రభూ! యోగేశ్వరా! నీ దివ్యరూపం చూడటానికి నేను అర్హుడనయితే శాశ్వత మయిన నీ దివ్యరూపం నాకు చూపించు." (4)
శ్రీభగవానువాచ
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥ 5
శ్రీ భగవానుడు చెపుతున్నాడు.
"పార్థా! అసంఖ్యాకాలై, బహువర్ణాకృతులూ కల నా అలౌకిక రూపాలను చూడు. (5)
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ॥ 6
అర్జునా! ద్వాదశాదిత్యులనూ, అష్టవసువులనూ, ఏకాదశ రుద్రులనూ, అశ్వినీ దేవతలనూ, మరుద్గణాలనూ చూడు. ఇంకా పూర్వం నీవు చూడని ఆశ్చర్యకర రూపాలు కూడా చూడు. (6)
ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ ।
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి ॥ 7
అర్జునా! నా రూపంలో ఒకేచోట ఉన్న చరాచర జగత్తునంతటినీ చూడు. ఇంకా నీవు చూడాలనుకొనే వాటినన్నిటినీ నా శరీరంలో చూడు. (7)
న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ॥ 8
కాని చర్మ చక్షువులతో నా నిజరూపాన్ని చూడలేవు. అందుచేత నీకు అలౌకిక దృష్టిని ఇస్తున్నాను. ఈ దివ్య దృష్టితో నాయోగశక్తిని చూడు." (8)
సంజయ ఉవాచ
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ॥ 9
సంజయుడు చెపుతున్నాడు. "ధృతరాష్ట్రా! మహాయోగేశ్వరుడయిన హరి ఇలా చెప్పి, వెంటనే ష్గడ్గుణైశ్వర్య సంపన్నమయిన తన పరమ స్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. (9)
అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ॥ 10
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ ॥ 11
ఆ పరమేశ్వరుని ముఖాలు, నేత్రాలు, అసంఖ్యాకాలు. ఆ దృశ్యాలు అద్భుతాలు. ఆ రూపం ఎన్నో దివ్యాభరణాలతో శోభిల్లుతోంది. అనేక దివ్యాయుధాలతో ఉంది. దివ్య మయిన దండలు, వస్త్రాలు ధరించి ఉంది. దివ్య సుగంధాలు పూసుకొని ఉంది. ఆ రూపం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. అనంతమయిన ఆ రూపం అన్ని వైపులా ముఖాలతో నిండి ఉంది. (10,11)
దివి సూర్యసహస్రస్య భవేద్ యుగపదుత్థితా ।
యది భాః సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః ॥ 12
ఆకాశంలో వేలకొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే వచ్చే కాంతిపుంజాలు ఆ విరాట్ స్వరూప తేజస్సులకు సరిపోతాయేమో! (12)
తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా ।
అపశ్యద్ దేవదేవస్య శరీరే పాండవస్తదా ॥ 13
ఎన్నో విధాలుగా విభజింపబడిన జగత్తు నంతటినీ అపుడు అర్జునుడు ఆ దేవదేవుని శరీరంలో ఒక్కచోట చూశాడు. (13)
తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ॥ 14
అర్జునునికి ఆశ్చర్యంతో ఒళ్లు పులకరించింది. ఆ దేవునికి పాదాభివందనం చేసి అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. (14)
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥ 15
అర్జునుడు అంటున్నాడు.
'దేవదేవా! నీ విరాట్ రూపంలో సర్వదేవతలనూ, ప్రాణికోటులనూ, నాభికమలం మీద ఉన్న బ్రహ్మదేవునీ, శంకరునీ, సకల ఋషులనూ, దివ్య సర్పాలను చూస్తున్నాను. (15)
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోఽనంతరూపమ్ ।
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 16
విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ అనంతరూపం ఎన్నో బాహువులతో, ఉదరాలతో, ముఖాలతో, కనులతో సర్వతోముఖంగా ఉన్నట్లు చూస్తున్నాను. దానికి ఆదిమధ్యాంతాలు కనపడటం లేదు. (16)
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ॥ 17
కిరీటం, గద, చక్రం దాల్చిన తేజోరాశియై, అంతటా కాంతులు విరజిమ్ముతున్నట్లు చూస్తున్నాను. జ్వలించే అగ్నిలా, జ్యోతిర్మయుడైన సూర్యునిలా వెలుగొందుతున్న నీ అప్రమేయరూపం చూడ శక్యంకాకుండా ఉంది. (17)
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ ।
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ॥ 18
అక్షర స్వరూపడ నయిన పరబ్రహ్మవు నీవే. అందరికీ తెలుసుకొనదగినవాడవు. ఈ జగత్తుకు నీవే పరమాశ్రయుడవు సనాతన ధర్మానికి రక్షకుడవు. నిత్యుడవు. సనాతన పురుషుడవు నా అభిప్రాయంలో నీవే. (18)
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ ।
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ॥ 19
ఆదిమధ్యాంతాలు లేనివాడవు. అపరిమిత శక్తి శాలివి. అనేక బాహువులు కలవాడవు. చంద్రుడూ, సూర్యుడూ నీ నేత్రాలు. అగ్నివలె నీ ముఖం ప్రజ్వలిస్తున్నది. నీ తేజస్సుతో ఈ విశ్వాన్ని తపింపజేస్తున్నావు. అటువంటి నిన్ను నేను చూస్తున్నాను. (19)
ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ॥ 20
మహాత్మా! భూమి - ఆకాశాల మధ్య అంతటను అన్ని దిక్కులా నీవే నిండి ఉన్నావు. అద్భుతమూ, భయంకరమూ అయిన నీ రూపం చూసి, ముల్లోకాలూ వ్యథ చెందుతున్నాయి. (20)
అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి ।
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥ 21
ఈ దేవతల సముదాయాలన్నీ నీలో ప్రవేశిస్తున్నాయి. కొందరు భయపడి చేతులు జోడించి, నీ గుణ నామాలను కీర్తిస్తున్నారు. మహర్షులూ, సిద్ధ సంఘాలూ 'స్వస్తి' పలుకుతూ పుష్కలమైన స్తుతులు చేస్తున్నారు. (21)
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ ।
గంధర్వయక్షా సురసిద్ధసంఘాః
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ॥ 22
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వనీదేవతలు, మరుద్గణాలు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధసముదాయాలు - అందరూ నిన్ను విస్మయంతో చూస్తున్నారు. (22)
రూపం మహత్ తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ ।
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ॥ 23
మహాబాహూ! అనేక ముఖాలూ, నేత్రాలూ; చేతులూ, కాళ్లూ, ఊరువులూ; అనేక ఉదరాలు, కోరలతో భయంకరమైన రూపాన్ని చూసి, లోకాలన్నీ వ్యథ చెందుతున్నాయి. నేనూ అలాగే ఉన్నాను. (23)
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ॥ 24
సర్వవ్యాపీ! నీ రూపం ఆకాశం అంటుంతోంది. అనేక వర్ణాలతో ప్రకాశిస్తోంది. విప్పారిన వదనంతో విశాలనేత్రాలతో అద్భుతంగా ఉన్న నీ రూపం చూసి, నా మనస్సు వ్యథ చెందుతోంది. ధైర్యమూ, శాంతి పొందలేకపోతున్నాను. (24)
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసంనిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 25
జగన్నివాసా! కోరలతో భయంకర మయిన నీ ముఖాలు ప్రళయాగ్ని తుల్యాలై ఉన్నవి. వాటిని చూస్తే నాకు దిక్కులు తెలియటం లేదు. సుఖం లేకపోతోంది. నా మీద ప్రసన్నుడవుకమ్ము. (25)
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః ।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ॥ 26
వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాలాని భయానకాని ।
కేచిద్ విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ॥
ఈ దుర్యోధనాదులు ఇతర రాజులతో సహా నీలో ప్రవేశిస్తున్నారు. భీష్మద్రోణులు, కర్ణుడూ, మన యోధముఖ్యులూ కూడా కోరలతో భయంకరాలయిన నీ ముఖాల్లో వేగంగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గు నుగ్గయి దంతాలకు వేళ్ళాడుతున్నాయి. (26,27)
యథా నదీనాం బహవోఽంబువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి ।
తథా తవామీ నరలోకవీరాః
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ॥ 28
చాలా నదులు వేగవంతమైన ప్రవాహంతో సముద్రంలో కలిసినట్లు ఈ మానవ వీరులందరూ నీ ముఖాల్లో ప్రవేశిస్తున్నారు. (28)
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః
విశంతి నాశాయ సమృద్ధవేగాః ।
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ॥ 29
మిడుతలు వేగంగా వచ్చి, మండే అగ్నిలో పడినట్లు ఈ లోకులంతా అతివేగంగా వచ్చి, నీ నోళ్ళలో పడి మరణిస్తున్నారు. (29)
లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్యలద్భిః ।
తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ॥ 30
ప్రజ్వలించే నీ నోళ్లతో లోకాలన్నిటిని, అన్నివైపుల మ్రింగుతూ, మాటి మాటికీ చప్పరిస్తున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటా నిండి జగత్తును తపింపజేస్తున్నాయి. (30)
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః
నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ॥ 31
దేవోత్తమా! ఉగ్రమూర్తిగా ఉన్న నీవెవరవో చెప్పు. నీకు నమస్కారం. ఆదిపురుషుడవైన నిన్ను తెలుసుకోవాలనుకొంటున్నాను. నీ ప్రవృత్తి ఏమిటో తెలియటం లేదు." (31)
శ్రీభగవానువాచ
కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధః
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ 32
శ్రీభగవానుడు చెపుతున్నాడు. "నేను లోకాలను సంహరించటం కోసం విజృంభించిన కాల రూపుడను. ఇపుడు ప్రాణులను సంహరిస్తాను. నీవు సంహరింపకపోయినా నీ శత్రు పక్షంలో వీరులు బ్రతుకరు. (32)
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ ।
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ॥ 33
అందుచేత నీవు లేచి, యుద్ధం చేసి, కీర్తి పొందు. శత్రువులను జయించి, నిష్కంటక మయిన రాజ్యం అనుభవించు. వీరంతా నా చేత పూర్వమే చంపబడ్డారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. (33)
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠాః
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥ 34
పూర్వమే నా చే చంపబడిన భీష్మ, ద్రోణ, సైంధవ, కర్ణాదులయిన వీరులందరినీ నీవు జయించు. విచారింపకు. శత్రువులను జయిస్తావు. యుద్ధం చెయ్యి!" (34)
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ॥ 35
సంజయుడు చెపుతున్నాడు. "శ్రీకృష్ణుని మాట విని, అర్జునుడు వణుకుతూ చేతులు జోడించాడు. గద్గదస్వరంతో భయం భయంగా మళ్లీ ప్రణమిల్లి, కృష్ణునితో ఇలా అన్నాడు. (35)
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ ।
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః ॥ 36
అర్జునుడు ఇలా అంటున్నాడు.
"హృషీకేశా! నిన్ను కీర్తిస్తూ లోకం అంతా ప్రీతితో ఆనందిస్తోంది. రాక్షసులు భయపడి నలుదిక్కులా పరుగిడుతున్నారు. సిద్ధ సముదాయాలు అన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. ఇదంతా నీకు తగినదే!(36)
కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్
గీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37
మహాత్మా! అనంతా! దేవేశా! జగన్నివాసా! బ్రహ్మకు కూడా నీవు గురుడవు. ఆదికర్తవు, అక్షరుడవు. సత్, ఆసత్, ఈ రెంటికిని అతీతుడవు. దేవతలు నీకు నమస్కరింపకుండా ఎలా ఉంటారు? (37)
త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ ।
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప ॥ 38
అనంతరూపా! నీవు ఆదిదేవుడవు. పురాణపురుషుడవు. ఈ విశ్వానికి పరమగతివి. నీవే జ్ఞాతవు, జ్ఞేయమూ. పరంధాముడవు. ఈ విశ్వమంతా నీచే నిండి ఉంది. (38)
వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39
నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకు తండ్రివి. నీకు వేయిసారులు నమస్కరిస్తున్నాను. మళ్లీ మళ్లీ అలాగే నమస్సులు. (39)
నః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ॥ 40
సర్వాత్మా! నీకు ఎదుటినుండీ, వెనుక నుండీ, అన్ని వైపుల నుండీ నమస్కారాలు. అనంత పరాక్రమశాలివై నీవు అంతటా వ్యాపించి ఉన్నావు. అందుకే నీవు సర్వస్వరూపుడవు. (40)
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి ।
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ॥ 41
యచ్చవహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు ।
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ॥ 42
నీ ఈ మహిమను తెలియక నిన్ను నా స్నేహితునిగా భావించి, చనువుతో కాని, పొరపాటున కాని 'కృష్ణా! యాదవా! సఖా!' అని తొందరపడి పిలిచి ఉంటాను. అచ్యుతా! విహార, శయ్యా, ఆసన, భోజన సమయాల్లోకాని పరిహాసం కోసం నిన్ను అగౌరవ పరచి ఉండవచ్చు. అప్రమేయ మహిమ కల నీవే అన్నిటిని క్షమించాలి. (41,42)
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సయోఽస్త్వభ్యధికః కుతోఽన్యః
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43
నిరుపమ ప్రభావా! ఈ చరాచరాత్మక జగత్తుకు నీవు తండ్రివి. పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. మూడులోకాలలోను నీతో సమానుడే లేడు. ఇక అధికుడు ఎలా ఉంటాడు? (43)
తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ ।
పితేన పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ॥ 44
అందువలన నేను నీకు సాష్ఠాంగ నమస్కారం చేస్తున్నాను. నమస్కరింపదగిన సర్వేశ్వరుడవయిన నిన్ను ప్రసన్నుని చేసుకొంటున్నాను. తండ్రి కొడుకును, స్నేహితుడు స్నేహితుని, ప్రియుడు ప్రియురాలిని సహించినట్లు దేవా! నా అపరాధాలను క్షమించు.
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్టా
భయేన చ ప్రవ్యధితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 45
మునుపు ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపం చూసి, సంతోషించాను. కాని భయంతో కూడా నా మనస్సు వ్యథ చెందింది. కావున పూర్వరూపాన్నే చూపించు. జగన్నివాసా! దేవేశా! ప్రసన్నుడవు కమ్ము. (45)
కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ।
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥ 46
కిరీటం, గద, శంఖచక్రాలు దాల్చిన నీ రూపం చూడాలనుకొంటున్నాను. సహస్రబాహూ! విశ్వమూర్తీ! నీ చతుర్భుజ రూపాన్నే నాకు చూపించు. (46)
శ్రీభగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ ।
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ॥ 47
శ్రీ భగవానుడు చెపుతున్నాడు. "అర్జునా! నేను నీకు ప్రసన్నుడనయి నా యోగశక్తితో తేజోమయమూ, అనంతమూ, ఆద్యమూ అయిన విశ్వరూపం చూపించాను. ఇది నీవు తప్ప ఇతరులెవ్వరూ పూర్వం చూడలేదు. (47)
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్మ తపోభిరుగ్రైః ।
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ॥ 48
అర్జునా! వేదాధ్యయనంతో కాని, యజ్ఞాలతో కాని, దానాలతో కాని, ఉగ్రతపస్సులతో కాని, ఇతర పుణ్యకార్యాలతో కాని మర్త్యలోకంలో నా విశ్వం రూపం చూడ శక్యం కాదు. నీకు తప్ప. (48)
మా తే వ్యథా మా చ విమూఢభావః
దృష్ట్వా రూపం ఘోరమీదృశం మమేదమ్ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ॥ 49
ఈ నా భయంకర రూపం చూసి, నీవు ఎట్టి వ్యథ, మోహమూ పొందకు. ప్రసన్న చిత్తంతో మళ్లీ నా యీ చతుర్భుజరూపం నిర్భయంగా చూడు." (49)
సంజయ ఉవాచ
ఇత్యుర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః ।
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ॥ 50
సంజయుడు చెప్పాడు. ఇలా చెప్పి కృష్ణుడు అర్జునునకు తన రూపం మళ్లీ చూపించాడు. మళ్లీ సౌమ్యరూపం దాల్చిన మహాత్ముడు భయపడే అర్జునునకు ధైర్యం చెప్పాడు. (50)
అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ।
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ॥ 51
అపుడు అర్జునుడు ఇలా అన్నాడు.
"జనార్దనా! సౌమ్యమైన మీ రూపం చూసి, ఇపుడు నా మనస్సు కుదుటపడింది. నేను సహజస్థితి పొందాను." (51)
శ్రీభగవానువాచ
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥ 52
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"నీవు చూసిన ఈ చతుర్భుజ రూపం ఇతరులకు దుర్లభం. దేవతలు కూడ ఈ రూపం చూడటానికి ఉవ్విళ్లూరుతారు. (52)
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ।
శక్యం ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ 53
వేదాలు, తపస్సు, దానమూ, యజ్ఞాలూ - వీనిలో వేనిచేతనూ నీవు చూసిన నా చతుర్భుజ రూపం చూడటం శక్యం కాదు. (53)
భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవంవిధోఽర్జున ।
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ॥ 54
అర్జునా! నన్ను ప్రత్యక్షంగా చూడటమూ, తత్త్వజ్ఞానం పొందటమూ, తాదాత్మ్య మయిన మోక్షం పొందటమూ కేవలమూ అన్యన్య భక్తిద్వారా మాత్రమే సాధ్యం. (54)
మత్కర్మకృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః ।
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ ॥ 55
అర్జునా! నా కోసమే కర్మలు ఆచరిస్తూ, నన్నే పరమ పురుషార్థంగా తలచే నిస్సంగుడయిన నా భక్తుడు, సకల ప్రాణుల పట్ల వైరభావం లేనివాడు మాత్రమే నన్ను చేరుతాడు. (55)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపదర్శనయోగో నామైకాదశోఽధ్యాయః ॥ 11 ॥ భీష్మపర్వణి పంచత్రింశోఽధ్యాయః ॥ 35 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున విశ్వరూప దర్శన యోగమను ముప్పది అయిదవ అధ్యాయము. (35) భగవద్గీత పదునొకండవ అధ్యాయము. (11)