36. ముప్పది ఆరవ అధ్యాయము
భగవద్గీత - (12) భక్తి యోగము.
అర్జున ఉవాచ
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ॥ 1
అర్జునుడు ప్రశ్నించాడు. "ఇలా సర్వ కర్మలను నీకు అర్పిస్తూ, నిరంతరమూ సగుణ బ్రహ్మోపాసన చేసేవారూ; అక్షరమూ, అవ్యక్తమూ అయిన నిర్గుణ బ్రహ్మోపాసన చేసేవారు - వీరిద్దరిలో ఉత్తమ యోగి ఎవరు?" (1)
శ్రీభగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ॥ 2
శ్రీభగవానుడు చెప్పాడు.
ఏకాగ్రతతో, శ్రద్ధతో నా మీద మనసు నిలిపి, నన్ను ఉపాసించేవారు యోగిశ్రేష్ఠులని నా అభిప్రాయం. (ఇది సగుణోపాసన) (2)
యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే ।
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ॥ 3
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ॥ 4
కాని అర్జునా! ఇంద్రియాలను వశపరచుకొని, సకల ప్రాణిహితం చేస్తూ, సమభావంతో ఉండే యోగులు అక్షరమూ, అనిర్దేశ్యమూ, అవ్యక్తమూ, సర్వవ్యాపి, అనిర్వచనీయమూ, కూటస్థమూ, నిశ్చలమూ, స్థిరమూ అయిన సచ్చిదానం పరబ్రహ్మను ధ్యానిస్తారు - వారు కూడా నన్నే పొందుతారు. (3,4)
క్లేశోఽధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ ।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ॥ 5
కాని నిర్గుణ పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులు చేసే సాధన మిక్కిలి శ్రమతో కూడినది. దేహాభిమానులకు నిర్గుణ పరబ్రహ్మప్రాప్తి కష్టసాధ్యం. (5)
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః ।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ॥ 6
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ ।
భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ ॥ 7
నా యందే ఆసక్తి కలిగి, కర్మలన్నిటిని నాకే అర్పించి, నా రూపాన్నే అనన్యభక్తియోగంతో చింతన చేసే భక్తులను నేను శీఘ్రంగానే మృత్యురూప మయిన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను. (6,7)
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ॥ 8
అర్జునా! నాయందే మనస్సును లగ్నం చెయ్యి. నా యందే బుద్ధిని నిలుపుం. అపుడు నాలోనే నివసిస్తావు. ఇకపై సంశయం లేదు. (8)
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ ।
అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ ॥ 9
అర్జునా! మనస్సును స్థిరంగా నా మీదనే నిల్పలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి. (9)
అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ ।
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ॥ 10
ఒకవేళ అభ్యాసం కూడా చేయలేకపోతే కేవలం నాకోసమే, కర్మలు చెయ్యి. దాని వల్ల కూడా నన్నే పొందుతావు. (10)
అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః ।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ॥ 11
నాయోగాన్ని ఆశ్రయించి కూడ కర్మలు చేయలేకపోతే మనోబుద్ధీంద్రియాలను వశంలో ఉంచుకొని, కర్మఫలాలను త్యాగం చెయ్యి. (11)
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ।
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ॥ 12
అభ్యాసం కంటె జ్ఞానం శ్రేయస్కరం. అనుభవం లేని జ్ఞానం కంటె ధ్యానం శ్రేష్ఠం. ధ్యానం కంటె కర్మఫల త్యాగం శ్రేష్ఠం. త్యాగం వల్ల శాంతి కలుగుతుంది కదా! (12)
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ॥ 13
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః ॥ 14
ఏ ప్రాణినీ ద్వేషించకుండా, మైత్రి, దయ కలవాడు, మమకారం కాని, అహంకారం కాని లేకుండా సుఖదుఃఖాలను సమంగా చూడగలవాడు, క్షమ కలవాడు, సంతుష్టి కలిగి సతతమూ ఇంద్రియజయం కల యోగం వహిస్తూ, దృఢ నిశ్చయంతో నాయందే మనోబుద్ధులను అర్పించే నా భక్తుడే నాకు ఇష్టుడు. (13,14)
యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః ।
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః ॥ 15
ఎవరికీ ఉద్వేగం కలిగింపనివాడు, ఎవరి వల్లనూ ఉద్వేగం(క్షోభ) పొందనివాడు, హర్షం, కోపం, భయం, సంక్షోభం - లేనివాడు నాకు ఇష్టుడు. (15)
అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః ।
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ॥ 16
దేన్నీ అపేక్షించనివాడు, శుచి, దక్షుడు, పక్షపాత రహితుడు, దుఃఖవిముక్తుడు, సర్వప్రయత్నాలను త్యజించిన నా భక్తుడు నాకు ఇష్టుడు. (16)
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి ।
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియః ॥ 17
దేనికీ పొంగిపోనివాడు, దేనినీ ద్వేషింపనివాడు, దేనికీ శోకింపనివాడు, దేనినీ కోరనివాడు, శుభాశుభకర్మలన్నిటినీ పరిత్యజించిన భక్తుడు నాకు ఇష్టుడు. (17)
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।
శోతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ॥ 18
శత్రుల పట్ల, మిత్రుల పట్ల సమంగా ప్రవర్తించేవాడు, అలాగే గౌరవా గౌరవాలలోను, శీతోష్ణాలలోను, సుఖదుఃఖాలనోను ఆసక్తి లేని భక్తుడు నాకు ఇష్టుడు. (18)
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్ణో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ॥ 19
నిందించినా, స్తుతించినా సమంగా ఉండేవాడు, మౌని, దొరికిన దానితోనే తృప్తి పడేవాడు, ఒకేచోట నివసింపనివాడు, స్థిరబుద్ధికలవాడు అయిన భక్తుడు నాకు ఇష్టుడు. (19)
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ।
శ్రద్దధానా మత్పరమోః భక్తాస్తేఽతీవ మే ప్రియాః ॥20
ఈ ధర్మ్యామృతాన్ని చెప్పినట్లు ఆచరించే శ్రద్ధావంతులు, నాకు పరమభక్తులు. నాకు బాగా ఇష్టులు." (20)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణీ శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగో నామ ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥ బీష్మపర్వణి షట్త్రింశోఽధ్యాయః ॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున భక్తియోగమను ముప్పది ఆరవ అధ్యాయము (36). భగవద్గీత పండ్రెండవ అధ్యాయము. (12)