37. ముప్పది ఏడవ అధ్యాయము
భగవద్గీత - (13) క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము.
శ్రీభగవానువాచ
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్ యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"అర్జునా! ఈ శరీరాన్ని 'క్షేత్రం' అంటారు. దీనిని తెలిసిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్త్వజ్ఞానులు చెపుతారు. (1)
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత ।
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తద్ జ్ఞానం మతం మమ ॥ 2
అర్జునా! శరీరాలన్నిటిలోను ఉన్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ కూడా నేనే అని తెలుసుకో. క్షేత్ర - క్షేత్రజ్ఞులను (ప్రకృతి పురుషులను) గూర్చి తాత్త్వికంగా తెలుసుకోవటమే జ్ఞానం అని నా అభిప్రాయం. (2)
తత్ క్షేత్రం యచ్చ యాదృక్ చ యద్వికారి యతశ్చ యత్ ।
స చ యో యత్ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు ॥ 3
ఆ క్షేత్రం ఏది? అది ఎలా ఉంటుంది? ఏ ఏ వికారాలు ఉంటాయి దానికి? దేని నుండి ఎలా పుట్టింది? ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? దాని మహిమ ఎటువంటిది? ఇదంతా సంగ్రహంగా చెపుతాను విను. (3)
ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ॥ 4
ఈ క్షేత్ర - క్షేత్రజ్ఞుల తత్త్వం గురించి చాలామంది ఋషులు ఎన్నో విధాల వివరించారు. వివిధ వేదమంత్రాలు కూడా వేర్వేరుగా చెప్పాయి. అలాగే బ్రహ్మ సూత్రపదాలు కూడా నిశ్చయాత్మకంగా, సహేతుకంగా చెప్పాయి. (4)
మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ।
ఇంద్రియాణిదశైకం చ పంచ చేంద్రియగోచరాః ॥ 5
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ॥ 6
పంచ సూక్ష్మభూతాలు, అహంకారం, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియ విషయాలయిన స్థూలభూతాలు (శబ్దాదులు), ఇచ్ఛా ద్వేషాలు, సుఖ దుఃఖాలు, సంఘాతం (శరీరం) చేతన, ధృతి - వికార సహితమైన క్షేత్రం సంగ్రహంగా ఇలా చెప్పబడింది. (5,6)
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ ।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ॥ 7
ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ ।
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ॥ 8
(తత్త్వజ్ఞాన సాధనాలు ఇవి) అమానిత్వం, డాంబికం లేకుండుట, అహింస, క్షమ, సరళత, గురుజన శుశ్రూష, శుచిత్వం స్థిరత్వం, మనశ్శరీరేంద్రియాల నిగ్రహం, ఇంద్రియసుఖాల మీద వైరాగ్యం, అహంకార రాహిత్యం, జననం, మరణం, ముసలితనం, రోగం అనే దోషాలను పదేపదే దర్శించటం - ఇవి తత్త్వజ్ఞాన సాధనాలు. (7,8)
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు ।
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ॥ 9
భార్యాపుత్రులు, ఇల్లు, సంపదలు మొదలగు వానిపై ఆసక్తి లేకపోవటం, ఇష్టానిష్టాలు కలిగినా సమచిత్తంతో ఉండటం. (9)
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ ।
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ॥ 10
నా యందు అనన్య యోగంతో ఏకాంతభక్తి కలిగి ఉండటం, ఏకాంత స్థలంలో నివసించడం, జనసమూహంలో ఉండటానికి ఇష్టపడకపోవటం.... (10)
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ణానార్థదర్శనమ్ ।
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ॥ 11
సదా అధ్యాత్మజ్ఞానంలో నిలిచి ఉండటం, తత్త్వజ్ఞానానికి అర్థమైన భగవంతుని దర్శించటం - ఇదంతా జ్ఞానం అంటారు. దీనికి వ్యతిరేక మయినది అజ్ఞానం. (11)
జ్ఞేయం యత్ యత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే ।
అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ తన్నాసదుచ్యతే ॥ 12
అనాది అయిన పరబ్రహ్మమే తెలిసికొనదగినది. తెలిస్తే పరమానందం కలుగుతుంది. పరబ్రహ్మ సత్ - అసత్తులకు అతీతం. ఆ పరమాత్మను గూర్చి చెపుతున్నాను. (12)
సర్వతఃపాణిపాదం తత్ సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతఃశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥ 13
ఆ పరమాత్ముని చేతులు కాళ్లు, కళ్లు, చెవులు, శిరస్సులు (నోరు) ముఖాలు విశ్వమంతటా ఉన్నాయి. ఆయన లోకాలన్నిటినీ, అంతటా ఆవరించి ఉంటాడు. (13)
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ ।
అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృ చ ॥ 14
ఇంద్రియ విషయాలన్నీ ఆయనకు తెలుసును. కాని ఇంద్రియాలు లేవు. ఆయనకు ఆసక్తి లేదు. కాని జగత్తునంతటినీ భరిస్తాడు. అలాగే ఆయన నిర్గుణుడు. అయినా గుణాలను అనుభవిస్తాడు. (14)
బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ ।
సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ॥ 15
భూతాలన్నిటికి వెలుపల, లోపల ఉంటాడు. అతడు చరాచర రూపుడు. సూక్ష్మరూపుడనటం వల్ల తెలిసికొన శక్యం కానివాడు. దూరంగాను, దగ్గరగాను కూడా ఉంటాడు. (15)
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥ 16
విభజించటానికి వీలుకాని పరిపూర్ణుడయినా పరబ్రహ్మ ప్రాణులన్నిటిలో వేర్వేరుగా కనిపిస్తాడు. అతడే పోషించేవాడుగా, సంహరించేవాడుగా, సృష్టించేవాడుగా (త్రిమూర్తులుగా) కనిపిస్తాడు. (16)
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 17
ఆ పరబ్రహ్మ జ్యోతులన్నిటికీ పరంజ్యోతి. మాయాతీతుడు. జ్ఞానస్వరూపుడు. జ్ఞేయస్వరూపుడు. జ్ఞానగమ్యుడు. అందరి హృదయాల్లో ఉన్నవాడు. (17)
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ॥ 18
ఈ విధంగా క్షేత్రం, జ్ఞానం - జ్ఞేయం (పరమాత్మ) అనేవి సంగ్రహంగా చెప్పాను. నా భక్తుడు దీన్ని తెలిసికొని నా భావాన్ని పొందుతాడు. (18)
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి ।
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ॥ 19
ప్రకృతి, పురుషుడు ఇద్దరూ కూడా సనాతనులే అని తెలుసుకో. రాగద్వేషాది వికారాలు, త్రిగుణాత్మకాలయిన, సమస్త పదార్థాలు కూడా ప్రకృతి నుండియే పుట్టినవని తెలుసుకో. (19)
కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ॥ 20
కార్యకారణాలను కలిగించటంలో ప్రకృతియే హేతువనీ, సుఖదుఃఖానుభవంలో జీవాత్మయే హేతువనీ చెప్పబడుతోంది. (20)
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ॥ 21
పురుషుడు ప్రకృతిలో నిలిచి, ప్రకృతి నుండి పుట్టిన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవిస్తాడు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మయొక్క ఉత్తమాధమ జన్మలకు కారణం. (21)
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తః దేహేఽస్మిన్ పురుషః పరః ॥ 22
శరీరంలో ఉన్న ఆత్మ నిజానికి పరమాత్మయే. అతడు సాక్షిభూతుడవటం చేత "ఉపద్రష్ట' అవుతున్నాడు. యథార్థం ఒప్పుకొంటాడు కనుక అనుమంత అవుతాడు. ధరించి పోషిస్తాడు కనుక భర్త; జీవుడు కనుక 'భోక్త'. స్వామి కాబట్టి మహేశ్వరుడు', సచ్చిదానంద ఘనస్వరూపుడు కావున 'పరమాత్మ' అనీ పిలువబడుతున్నాడు. (22)
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ।
సర్వథా వర్తమానోఽపి న స భుయోఽభిజాయతే ॥ 23
ఇలా పురుషుని తత్త్వాన్నీ, గుణసహిత మయిన ప్రకృతి తత్త్వాన్ని తెలిసినవాడు, ఎన్నో రీతులలో కర్మాచరణం చేస్తున్నా కూడా అతడు మళ్లీ పుట్టడు. (23)
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ॥ 24
కొందరు పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగంతో తనలో చూస్తారు. మరికొందరు సాంఖ్య(జ్ఞాన) యోగంతో చూస్తారు. ఇంకా కొందరు కర్మయోగంతో ఆ పరమాత్మను చూస్తారు. (24)
అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే ।
తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ॥ 25
ఈ మార్గాలేవీ తెలియని వారు కూడా ఇతర జ్ఞానుల నుండి విని, ఉపాసిస్తారు. వారు కూడా మృత్యువును దాటుతున్నారు. (25)
యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ ।
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్ విద్ధి భరతర్షభ ॥ 26
అర్జునా! స్థావర జంగమ ప్రాణులన్నీ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే పుట్టిన వన్ తెలుసుకో! (26)
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి న పశ్యతి ॥ 27
నశించిపోయే ప్రాణులన్నిటిలోను సమంగా ఉన్న పరమేశ్వరుడు నశించడని పరమేశ్వరుని దర్శించినవాడే ద్రష్ట. (27)
సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ ।
న హినస్త్వాత్మనాఽఽత్మానం తతో యాతి పరాం గతిమ్ ॥ 28
ప్రాణులన్నిటిలోను సమంగా ఉన్న పరమేశ్వరుని చూసేవాడు తనను తాను చంపుకొనడు. దానితో అతడు మోక్షం పొందుతాడు. (28)
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాఽఽత్మానమ్ అకర్తారం స పశ్యతి ॥ 29
సకల కర్మలూ అన్నివిధాలా ప్రకృతి వల్లనే జరుగుతున్నాయని, ఆత్మ అకర్త అనీ తెలిసినవాడు నిజమైన ద్రష్ట. (29)
యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ॥ 30
వేర్వేరుగా కనపబడే ప్రాణులన్నీ ఒకే పరమాత్మునిలో ఉన్నాయనీ, ఆ ఆత్మనుండియే ప్రాణులు పుడుతున్నాయనీ గ్రహించేవాడు, అపుడే బ్రహ్మరూపుడవుతాడు. (30)
అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ॥ 31
అర్జునా! నాశరహితుడయిన పరమాత్మ ప్రాణుల శరీరాల్లో ఉన్నా అతడు సనాతనుడు, నిర్గుణుడు అవటం వల్ల ఎట్టి కర్మలకూ అతడు కర్త కాడు. కర్మలతనికి అంటవు. (31)
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ।
సర్వత్రావస్థితో దేహే తథాఽఽత్మా నోపలిప్యతే ॥ 32
అంతటా వ్యాపించి ఉన్నా ఆకాశం సూక్ష్మం అవటం వల్ల దేనికీ అంటదు - అలాగే అన్ని ప్రాణుల శరీరాల్లో ఉన్నా ఆత్మ నిర్గుణమవటం వల్ల వాటి గుణదోషాలు ఆత్మకు అంటవు. (అలా పరమాత్మ శరీరాల్లో జీవభావం పొందుతాడు) (32)
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ 33
ఒకే సూర్యుడు ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణులలోనూ ఉండి వాటినన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. చైతన్యం కలిగిస్తోంది. (33)
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా ।
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ॥ 34
ఇలా క్షేత్రానికీ - క్షేత్రజ్ఞునికీ మధ్యగల తేడాను, ప్రకృతి నుండి విముక్తులయ్యే ఉపాయాన్నీ, జ్ఞానంతో తెలిసిన మహాత్ములు పరమగతిని పొందుతారు." (34)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥ భీష్మపర్వణి సప్తత్రింశోఽధ్యాయః ॥ 37 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమను ముప్పది ఏడవ అధ్యాయము. (37) భగవద్గీత పదుమూడవ అధ్యాయము. (13)