38. ముప్పది ఎనిమిదవ అధ్యాయము

భగవద్గీత - (14) గుణత్రయ విభాగ యోగము.

శ్రీభగవానువాచ
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ణానముత్తమమ్ ।
యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"జ్ఞానాల్లో ఉత్తమమయిన జ్ఞానం నీకు మళ్లీ చెపుతున్నాను - ఈ జ్ఞానం పొందిన మునులు ఈ శరీరబంధం నుండి విడివడి, మోక్షం పొందారు. (1)
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ।
సర్గేఽఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ॥ 2
ఈ జ్ఞానాన్ని పొంది, మునులు నా స్వరూపాన్ని పొందారు. వారు సృష్టికాలంలో పుట్టరు. ప్రళయకాలంలో వ్యథ చెందరు. (2)
మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ ।
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ॥ 3
అర్జునా! నా మహద్బ్రహ్మరూప మయిన మూలప్రకృతి ప్రాణులన్నిటికి గర్భస్థానం. దాని యందు నేను సృష్టి బీజం ఉంచుతాను. ఆ జడ - చేతన సంయోగంతో సర్వభూతాలూ ఉత్పత్తి అవుతాయి. (3)
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ॥ 4
అలా వివిధ యోనులలో పుట్టే రూపాలన్నిటికీ - ప్రాణులకు - మూలప్రకృతి తల్లి. ఆ తల్లి గర్భధారణం చేస్తుంది. నేను బీజ స్థాపనం చేసే తండ్రిని. (4)
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ॥ 5
ప్రకృతి నుండి పుట్టే సత్త్వ - రజస్ - తమో గుణాలు నాశనం లేని జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. (5)
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥ 6
అర్జునా! అందులో సత్త్వగుణం నిర్మల మయినది. ప్రకాశమిస్తుంది. మార్పులేనిది. కాని సుఖసాంగత్యం వల్లను, జ్ఞానాభిమానం వల్లనూ మానవుని బంధిస్తుంది. (6)
రాజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ॥ 7
అర్జునా! రజోగుణం రాగాత్మకం. అది కామం, ఆసక్తి అనే వాటి నుండి పుడుతుంది. అది కర్మఫలాల సాంగత్యంతో జీవుని బంధిస్తుంది. (7)
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ॥ 8
అర్జునా! తమో గుణం జీవులన్నిటినీ మోహింపజేస్తుంది. అది జీవులను ప్రమాద (ఏమరుపాటు) - ఆలస్య నిద్రలతో బంధిస్తుంది. (8)
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ॥ 9
అర్జునా! సత్త్వగుణం జీవుని సుఖంతో కలుపుతుంది. రజోగుణం కామ్య కర్మలలో కలుపుతుంది. కాని తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి, ప్రమాదంలో తగుల్కొనేటట్లు చేస్తుంది. (9)
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ॥ 10
అర్జునా! రజస్తమోగుణాలను అణచివేసి సత్త్వ గుణం వృద్ధి చెందుతుంది. అలాగే సత్త్వతమో గుణాలను అణచి రజోగుణమూ, సత్త్వరజోగుణాలను అణచి తమోగుణమూ వృద్ధి చెందుతాయి. (10)
సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్త్వమిత్యుత ॥ 11
శరీరంలోను, ఇంద్రియాల్లోనూ, అంతఃకరణంలోను చైతన్యం, వివేకం కలిగినపుడు అతనిలో సత్త్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోవాలి. (11)
లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ॥ 12
అర్జునా! అలాగే రజోగుణం వృద్ధి అయినపుడు లోభం, ప్రవృత్తి, స్వార్ధం, సకామ కర్మాచరణం, అశాంతి, విషయాసక్తి కలుగుతాయి. (12)
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ॥ 13
అర్జునా! తమో గుణం ప్రబలినపుడు, అంతఃకరణంలోను, ఇంద్రియాల్లోను, వివేకం నశిస్తుంది. చేయవలసిన కర్మలపై విముఖత, ప్రమాదం, నిద్ర మొదలయినవి వృద్ధి చెందుతాయి. (13)
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ॥ 14
మానవుడు సత్త్వగుణం వృద్ధి చెందినపుడు మరణిస్తే ఉత్తమ కర్మాచరణం చేసేవారుపొందే నిర్మలమైన ప్రకాశమయ లోకాలను పొందుతాడు. (14)
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ॥ 15
రజోగుణం వృద్ధిచెందినపుడు మరణించినవాడు కర్మాసక్తులలో పుడతాడు. తమో గుణం వృద్ధి చెందినపుడు మరణిస్తే (పశుపక్షి కీటకాది) నీచ జన్మలు ఎత్తుతాడు. (15)
కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ॥ 16
శ్రేష్ఠకర్మలకు సాత్త్విక ఫలం (సుఖం, జ్ఞానం, వైరాగ్యాదులు) కలుగుతుంది. రాజస కర్మలకు ఫలం దుఃఖం. తామస కర్మలకు ఫలం అజ్ణానం. (16)
సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమోదమోహౌ తమసః భవతోఽజ్ఞానమేవ చ ॥ 17
సత్త్వగుణం వలన జ్ఞానమూ, రజోగుణం వలన లోభమూ, తమోగుణం వలన ప్రమాద మోహాలూ, అజ్ఞానమూ కలుగుతాయి. (17)
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః ॥ 18
సాత్త్వికులు (మనుష్య గంధర్వలోకం నుండి బ్రహ్మలోకం దాకా ఉన్న) ఊర్ధ్వ లోకాలకు వెళతారు - రాజసికులు మర్త్యలోకంలోనే ఉంటారు. తామసికులు నిద్రాప్రమాదాల - స్యాదులతో, అధోగతిని (కీట పశుపక్ష్యాది జన్మలను) నరకాన్ని పొందుతారు. (18)
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ॥ 19
ఈ గుణాలే కర్మలకు మూలకారణం అని తెలిసికొని, ఈ గుణాలకు అతీతుడయి, సాక్షిగా ఉన్న ఆత్మను దర్శించినపుడు అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. (19)
గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తోఽమృతమశ్నుతే ॥ 20
దేహం పుట్టడానికి కారణాలయిన ఈ మూడు గుణాలను అతిక్రమించిన పురుషుడు జన్మ. మృత్యు, జరాది దుఃఖాల నుండి విడివడి బ్రహ్మానందాన్ని పొందుతాడు." (20)
అర్జున ఉవాచ
కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ॥ 21
అర్జునుడు ఇలా అడిగాడు.
"ప్రభూ! ఈ త్రిగుణాలకు అతీతుడయిన వాని లక్షణాలేవి? అతని ఆచరణం ఎలా ఉంటుంది? ఈ మూడు గుణాలను అతిక్రమించటానికి ఉపాయం ఏమిటి?" (21)
శ్రీభగవానువాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ॥ 22
శ్రీభగవానుడు చెప్పాడు.
"అర్జునా! సత్త్వ, రజః తమః కార్యాలయిన ప్రకాశ, ప్రవృత్తి, మోహాలు వానియంతట అవే పుట్టినా గుణాతీతుడు ద్వేషింపడు. అవి నివారింపబడినా కాంక్షింపడు. (22)
ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేన యోఽవతిష్ఠతి నేంగతే ॥ 23
ఉదాసీనంగా సాక్షీభూతుడై, గుణకార్యాలయిన సుఖదుఃఖాల వల్ల చలింపక, స్వస్వరూపం నుండి జారిపోక, గుణాలు వాటంతట అవి ప్రవర్తిస్తున్నాయి అనుకొని ఉండేవాడు త్రిగుణాతీతుడు. (23)
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాఽఽత్మసంస్తుతిః ॥ 24
త్రిగుణాతీతుడు సదా ఆత్మభావంలో ఉండి సుఖదుఃఖాలను సమంగా భావిస్తాడు. మట్టి, రాయి, బంగారం మూడింటినీ సమంగా చూస్తాడు. ప్రియాప్రియాలను, నిందాస్తుతులను సమానంగా భావిస్తాడు. (24)
మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ 25
మానావమానాల్లో సమానంగా ఉంటాడు. మిత్రులపట్ల, శత్రువుల పట్ల సమంగా ఉంటాడు. సర్వకర్మల మీద ఆసక్తిని విడిచినవాడు గుణాతీతుడు. (25)
మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥ 26
ఏకాంత భక్తితో నన్ను భక్తియోగంతో సేవించేవాడు గుణాతీతుడై బ్రహ్మభావం పొందుతాడు.. (26)
బ్రహ్మణో హి ప్రతిష్టాహమ్ అమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ॥ 27
ఆ పరబ్రహ్మకు, అమృతత్వానికి, సనాతన ధర్మానికీ శాశ్వతానందానికీ, నేనే ఆధారం."(27)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోఽధ్యాయః ॥ 14 ॥ భీష్మపర్వణి అష్టాత్రింశోఽధ్యాయః ॥ 38 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున గుణత్రయ విభాగయోగమను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38) భగవద్గీత పదునాల్గవ అధ్యాయము. (14)