39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము

భగవద్గీత - (15) పురుషోత్తమ యోగము.

శ్రీభగవానువాచ
ఊర్ధ్వమూలమధఃశాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ 1
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"ఈ సంసార వృక్షానికి మూలం పై భాగంలో ఉంటుంది. కొమ్మలు (హిరణ్య గర్భాదులు) క్రిందికి ఉంటాయి. వేదాలు దీని ఆకులు. ఈ అశ్వత్థ వృక్షానికి నాశం లేదు. దీని తత్ట్వం మూలంతో సహా తెలిసిన వాడే వేదవేత్త. (1)
అధశ్ఛోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చ మూలాన్యమసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ॥ 2
ఈ చెట్టును త్రిగుణాలనే నీళ్లు తడుపుతూ ఉంటాయి. ఆ నీటితో పెరిగే శాఖలే దేవ, మనుష్య, తిర్యక్ యోనులలో జన్మించే ప్రాణులు. చిగుళ్ళు విషయ భోగాలు. ఈ శాఖలూ, చిగుళ్లూ అంతటా వ్యాపించి ఉన్నాయి. మానవుల కర్మానుసారంగా బంధించే అహంకార మమకారాలనే వేళ్లు, ఊడలు అన్ని లోకాల్లోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నాయి. (2)
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ॥ 3
ఈ సంసార వృక్షానికి ఇటువంటి రూపం ఇక్కడ కనపడదు. దానికి ఆది మధ్య అంతాలు లేవు. దీని వేళ్లు, బాగా పాతుకుపోయాయి. అందుచేత దృఢమైన వైరాగ్యం అనే ఖడ్గంతో దీన్ని ఖండించి.... (3)
తతః పదం తత్ పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥ 4
ఆ తరువాత ఆ పరమ పదాన్ని అన్వేషించాలి. అక్కడకు చేరినవారు మళ్లీ తిరిగిరారు. ఆ పరమేశ్వరుని నుండియే పురాతనమయిన ఈ సంసార వృక్షం వ్యాపించింది. అటువంటి ఆ ఆది పురుషుని పొందాలి. (4)
నిర్మానమోహా జితసంగదోషాః
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ॥ 5
అహంకారం, అజ్ఞానం లేనివారూ, ఆసక్తి అనే దోషాన్ని జయించినవారూ, ఆధ్యాత్మ జ్ఞాన నిష్ఠులూ, సుఖదుఃఖాది ద్వంద్వాలను విడిచిన జ్ఞానులూ ఆ పరమపదం పొందుతున్నారు. (5)
న తద్ భాసయతే సూర్యః న శశాంకో న పావకః ।
యద్ గత్వా న నివర్తంతే తద్ ధామ పరమం మమ ॥ 6
ఆ పరమపదాన్ని సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ప్రకాశింపజేయలేరు. అది స్వయంప్రకాశం. అక్కడకు చేరిన వారు మళ్లీ తిరిగి రారు. (6)
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనఃషష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7
ప్రాణిలోకంలో ఈ దేహంలో ఉన్న సనాతనమైన జీవాత్మ నా అంశమే. అది ప్రకృతిలో ఉన్న మనస్సును, ఇంద్రియాలనూ శబ్దాది విషయాలతో తనవైపు ఆకర్షిస్తుంది. (7)
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్యైతాని సంయాతి వాయుర్గంధానివాశయత్ ॥ 8
వాయువు వాసనలను ఒక చోటి నుండి మరొకచోటికి తీసికొనిపోయినట్లు దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరాన్ని విడిచేటప్పుడు మనస్సును, ఇంద్రియాలను గ్రహించి, వాటితో కలిసి, మరో శరీరం పొందుతుంది. (8)
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ॥ 9
జీవాత్మ పంచేంద్రియాలను, మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయాలను అనుభవిస్తుంది. (9)
వి॥ పంచేంద్రియాలు : చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు.
ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ॥ 10
జీవాత్మ శరీరం విడిచిపెట్టేటప్పుడు, శరీరంలో ఉన్నపుడు, విషయభోగాలు అనుభవించేటప్పుడు, త్రిగుణాలతో కూడినపుడూ, అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానులు తమ జ్ఞాన నేత్రాలతో స్వస్వరూపాన్ని తెలుసుకొంటారు. (10)
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ ।
యతంతోఽప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః ॥ 11
ధ్యానాభ్యాసంలో ఉన్న యోగులు తమ హృదయాల్లో సాక్షి రూపంలో ఉన్న ఆత్మను చూడగలరు. కాని శాస్త్రాదులభ్యసించినా అంతఃకరణ శుద్ధిలేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినా ఆత్మను చూడలేరు. (11)
యదాదిత్యగతం తేజః జగద్ భాసయతేఽఖిలమ్ ।
యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్ తేజో విద్ధి మామకమ్ ॥ 12
జగత్తునంతటినీ ప్రకాశింపజేసే సూర్యుని తేజస్సూ, చంద్రుని తేజస్సూ, అగ్ని తేజస్సూ నా తేజస్సే అని తెలుసుకో. (12)
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥ 13
నేను పృథివియందు ప్రవేశించి నా శక్తితో సకల భూతాలనూ ధరించి పోషిస్తున్నాను. రసస్వరూపం పొంది, అమృతమయుడయిన చంద్రుడి నయి, ఓషధులకు (వనస్పతులకు) పుష్టిని చేకూరుస్తున్నాను. (13)
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ 14
నేనే ప్రాణాపాన సంయుక్త మయిన వైశ్వానరాగ్ని రూపంలో ప్రాణుల శరీరాల్లో ఉండి, నాలుగు విధాలయిన ఆహారాలను జీర్ణం చేస్తాను. (14)
సర్వస్య చాహం హృది సంనివిష్టః
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
వేదాంతకృద్ వేదవిదేవ చాహమ్ ॥ 15
ప్రాణులన్నిటి హృదయాల్లోనూ ఉన్న అంతర్యామిని నేనే. నానుండియే స్మృతి, జ్ఞానం, సందేహనివృత్తి కలుగుతున్నాయి. వేదాలన్నిటివలన తెలుసుకోదగినవాడను నేనే. వేదాంతకర్తను నేనే. వేదవేత్తనూ నేనే. (15)
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥ 16
ఈ లోకంలో క్షరుడు, అక్షరుడు అని పురుషులు రెండు విధాలు. ప్రాణుల శరీరాలు నశించేవి (క్షరం). జీవాత్మ నాశంలేని వాడు (అక్షరుడు). (16)
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 17
ఈ ఇద్దరికంటెను ఉత్తముడు పరమాత్మ. ముల్లోకాల్లోను ప్రవేశించి, ఆ ఈశ్వరుడు అందరినీ పోషిస్తున్నాడు. (17)
యస్మాత్ క్షరమతీతోఽహమ్ అక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 18
నశ్వరమైన (నశించే) క్షేత్రం కంటె నేను అతీతుడను. అక్షరమైన జీవాత్మకంటెను ఉత్తముడను. అందుకే లోకంలోను, వేదంలోను కూడా పురుషోత్తముడని ప్రసిద్ధి వహించాను. (18)
యో మామేవసమ్మూఢః జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ॥ 19
ఇలా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకొన్న జ్ఞాని సర్వజ్ఞుడు, అతడు నన్ను సర్వభావంతో సేవిస్తాడు. (19)
ఇతి గుహ్యతమం శాస్త్రమ్ ఇదముక్తం మయానఘ ।
ఏతద్ బుద్ ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ॥ 20
అర్జునా! మిక్కిలి గోప్యమయిన ఈ శాస్త్రం నీకు చెప్పాను. ఇది తెలిసినవాడు బుద్ధిమంతుడై (జ్ఞానియై) కృతార్థుడవుతాడు. (20)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోఽధ్యాయః ॥ 15 ॥ భీష్మపర్వణి ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥ 39 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున పురుషోత్తమయోగమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39) శ్రీమద్భగవద్గీత పదునైదవ అధ్యాయము. (15)