40. నలువదవ అధ్యాయము
భగవద్గీత - (16) దైవాసురసంపద్విభాగ యోగము.
శ్రీభగవానువాచ
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ॥ 1
శ్రీ భగవానుడు చెపుతున్నాడు. "నిర్భయత్వం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ నిష్ఠ, దానం, దమం, యజ్ఞం, స్వాధ్యాయం తపస్సు, ఆర్జవం... (ఇవి దైవస్వభావుల లక్షణాలు) (1)
అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ॥ 2
అహింస, సత్యం, క్రోధం లేకపోవటం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలు బయటపెట్టకపోవటం, సర్వభూతదయ, అనాసక్తి, మృదుత్వం, సిగ్గుపడటం, వ్యర్థమైన పనులు చేయకపోవటం... (2)
తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత ॥ 3
తేజస్సు, క్షమ, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవటం, తాను పూజ్యుడననే అహంకారం లేకపోవటం... ఇవి దైవ సంపద కలిగినవాని లక్షణాలు. (3)
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ॥
పార్థా! కాపట్యం, గర్వం, అహంకారం, కోపం, నిష్ఠురత్వం అజ్ఞానం - ఇవి ఆసురీ సంపద కలవాని లక్షణాలు. (4)
దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మతా ।
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతోఽసి పాండవ ॥ 5
అర్జునా! దైవీసంపద ముక్తినిస్తుంది. ఆసురీ సంపద బంధం కలిగిస్తుంది. నీవు దైవీ సంపదతో పుట్టావు. శోకించకు. (5)
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ॥ 6
ఈ లోకంలో కొందరు దైవ లక్షణాలు కలవారు. కొందరు ఆసుర లక్షణాలు కలవారు. దైవలక్షణాలు చాలా చెప్పాను. ఇక ఆసుర లక్షణాలు విను. (6)
ప్రవృత్తి చ నివృత్తిం చ జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే ॥ 7
ఆసుర లక్షణాలు కలవారు ప్రవృత్తినీ నివృత్తినీ కూడా ఎరగరు. వారికి శుచిత్వం కాని, సదాచారం కాని, సత్యం కాని ఉండవు. (7)
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ॥ 8
ఈ జగత్తుకు వేద ప్రమాణాదులు లేవనీ, ధర్మాధర్మ వ్యవస్థయే లేదనీ, దీనికి కర్త అయిన ఈశ్వరుడే లేడనీ అంటారు. (8)
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ॥ 9
వారు ఇటువంటి దృష్టితో ఆత్మయొక్క అస్తిత్వాన్ని నమ్మరు. మందబుద్ధులు, ఉగ్రకర్ములు. జగత్తుకు శత్రువులై, వారు లోక వినాశానికే పుడతారు. (9)
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్ గృహీత్వాసంగ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః ॥ 10
దంభం, దురభిమానం, మదం - వీనితో కూడిన ఆసుర లక్షణాలు కలవారు అజ్ఞానంతో అశుచివ్రతులై శాస్త్ర, విరుద్ధంగా ప్రవర్తిస్తారు. (10)
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ॥ 11
చనిపోయే దాకా విషయ చింతలతో మునిగిపోయి, కామోపభోగానుభవాలతో అదే నిజమయిన సుఖం అనుకొంటారు. (11)
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థ సంచయాన్ ॥ 12
వారు అంతులేని ఆశాపాశాలకు లోనై, కామక్రోధ పరాయణులై ప్రవర్తిస్తారు. విషయభోగాలకోసం, అన్యాయ మార్గాల్లో ధనం కూడబెట్టాలనుకొంటారు. (12)
ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ॥ 13
ఇపుడిది నాకు లభించింది. ఈ కోరిక ఇక తీరుతుంది. ఇప్పటికి ఇంత ఉంది. రేపు ఇంకా ధనం వస్తుంది... అనుకొంటారు. (13)
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ॥ 14
ఇపుడీ శత్రువును చంపాను. ఇతరులను కూడా చంపుతాను. నేనే ఈశ్వరుడను. నేనే బోగిని, సిద్ధుడను, బలవంతుడను. సుఖిని అనుకొంటాడు. (14)
ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః ॥ 15
అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ॥ 16
'నేనే ధనవంతుడను. సద్వంశంలో పుట్టాను. నాతో సమానుడు ఎవడున్నాడు? యజ్ఞాలు చేయగలను. దానాలు ఇవ్వగలను. వినోదిస్తాను' అని అజ్ఞానంతో చిత్త విభ్రాంతికి లోనై, మోహజాలంలో చిక్కుకొని, అసురస్వభావులు విషయభోగాసక్తులై, అపవిత్రమైన నరకంలో పడుతున్నారు. (15,16)
ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః ।
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ॥ 17
తామే గొప్పవారమని భావిస్తూ, ధనగర్వంతో ప్రమత్తులై శాస్త్రవిరుద్ధంగా ఆడంబరంతో మేరుకు మాత్రమే వారు యజ్ఞాలు చేస్తారు. (17)
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ॥ 18
అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం వీటికి వశులై ఇతరులను నిందిస్తూ, తమ దేహంలోను, ఇతరుల దేహాలలోను ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు. (18)
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ ।
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ॥ 19
అలా ద్వేషించే క్రూరులయిన నరాధములను సదా నేను ఆసురీ యోనులలోనే పడవేస్తూ ఉంటాను. (19)
ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని ।
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ॥ 20
అర్జునా! ఆసురీ ప్రకృతి నొందిన మూఢులు ప్రతీ జన్మలోనూ నన్ను పొందకుండానే అధమగతిని పొందుతూ ఉంటారు. (20)
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్ త్రయం త్యజేత్ ॥ 21
కామ, క్రోధ, లోభాలు మూడూ నరకానికి ద్వారాలు. ఆత్మను ఇవి అధోగతి పాలు చేస్తాయి. అందుచేత ఈ మూడింటిని విడిచిపెట్టాలి. (21)
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ॥ 22
వీని నుండి విముక్తి పొందినవాడు తనకు మేలు కలిగించే పని చేస్తాడు. పరమగతిని పొందుతాడు. (22)
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ఢిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥ 23
శాస్త్రవిధిని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు సిద్ధినీ పొందలేడు. సుఖాన్ని పొందలేడు. పరమగతినీ పొందలేడు. (23)
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ॥ 24
అందుచేత కర్తవ్యాకర్తవ్యాలను నిర్ణయించటానికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రంలో చెపిఇన సత్కర్మలు తెలిసికొని వాటిని ఆచరించు." (24)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే దైవాసురసంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః ॥ 16 ॥ భీష్మపర్వణి చత్వారింశోఽధ్యాయః ॥ 40 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున దైవాసుర సంపద్విభాగ యోగమను నలువదవ అధ్యాయము. (40)శ్రీ మద్భగవద్గీత పదునారవ అధ్యాయము. (16)