41. నలువది ఒకటవ అధ్యాయము

భగవద్గీత - (17) శ్రద్ధాత్రయ విభాగ యోగము.

అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ॥ 1
అర్జునుడు ప్రశ్నించాడు.
"కృష్ణా! శాస్త్రంలో చెప్పబడిన తీరును విడిచి, శ్రద్ధగా యజ్ఞాలు, దైవపూజలు చేస్తూ ఉంటారు కొందరు. వారి పద్ధతి సాత్త్వికమా? రాజసికమా? తామసమా?" (1)
శ్రీభగవానువాచ
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ 2
శ్రీభగవానుడు చెపుతున్నాడు.
"శాస్త్రోక్తం కాకుండా స్వభావానుసారంగా ఏర్పడే శ్రద్ధ సాత్త్వికం, రాజసం, తామసం అని మూడు విధాలుగా ఉంటుంది - వాటిని గురించి చెపుతా విను. (2)
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ।
శ్రద్ధామయోఽయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ చ ॥ 3
మానవుల శ్రద్ధ వారి అంతఃకరణ సంస్కారాన్ని బట్టి వస్తుంది. మనుష్యుడు శ్రద్ధామయుడు. పూర్వజన్మలో ఉన్న శ్రద్ధనే ఈ జన్మలో గ్రహిస్తాడు. (3)
యజంతే సాత్త్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ॥ 4
సాత్త్వికులు దేవతలను, రాజసికులు యక్ష రాక్షసులను, తామసికులు ప్రేతభూత గణాలను పూజిస్తారు. (4)
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః ।
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ॥ 5
దంభం, అహంకారం కల్గి కామ రాగాలతో నిండినవారు శాస్త్రం చెప్పని విధానాలతో ఘోరతపస్సు చేస్తారు. (5)
కర్శయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః ।
మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ॥ 6
అలా శరీరంలోని ఇంద్రియాలను, నన్నూ కృశింపజేస్తారు. వారు అజ్ఞానులైన ఆసుర స్వభావం కలవారని తెలుసుకో. (6)
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ॥ 7
వారి స్వభావాల ననుసరించి ఆహారాలు కూడా మూడు విధాలుగా ఉంటాయి. వాళ్లు చేసే యజ్ఞాలు, తపస్సులు, దానాలు కూడా మూడేసి విధాలుగా ఉంటాయి. వాటిని విను. (7)
ఆయుః సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ॥ 8
ఆయువు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి; వీటిని వృద్ధి పరిచే ఆహారం సాత్త్వికులకు ఇష్టం. అలాగే పాలు మొదలయిన రసపదార్థాలు, వెన్న, నెయ్యి మొదలయిన స్నిగ్ధ పదార్థాలు, ఓజస్సును వృద్ధిపరిచే స్థిరపదార్థాలు, పుష్టికరాలు మనోహరాలు అయిన పదార్థాలు సాత్త్వికులు ఇష్టపడతారు. (8)
కట్వామ్లలవణాత్యుష్ణ తీక్ ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ॥ 9
చేదు, పులుపు, ఉప్పు, కారం, కలవి, వేడిగా ఉండేవి, మాడిపోయినవి, దాహం కలిగించేవి; దుఃఖం, శోకం, రోగం కలిగించేవి రాజసికులకు ఇష్టంగా ఉంటాయి. (9)
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ॥ 10
పక్వంకానివి, పక్వమయి చల్లబడినవి, రసహీనాలు, చెడువాసన వచ్చినవి, ఎంగిలి పదార్థాలు, అశుచి పదార్థాలు కల భోజనం తామసులకు ఇష్టంగా ఉంటుంది. (10)
అఫలాకాంక్షిభిర్వజ్ఞః విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ॥ 11
శాస్త్రోక్త మయి, కర్తవ్యంగా నిశ్చయించుకొని, ప్రతిఫలం లేకుండా చేసే యజ్ఞమే సాత్త్వికయజ్ఞం అనబడుతుంది. (11)
అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ॥ 12
నిష్ఠలేకుండా, ఆడంబరం కోసం ప్రతిఫలం కోరి చేసే యజ్ఞం రాజసయజ్ఞం అని తెలుసుకో. (12)
విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥ 13
శాస్త్ర విధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్ధ లేని యజ్ఞం తామసయజ్ఞం. (13)
దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్ ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥ 14
(ఇక తపస్సులో భేదాలు) దేవ, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించటం, శుచిత్వం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సు అంటారు. (14)
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ 15
ప్రాణులకు దుఃఖం కలిగింపనిది, సత్యమూ, ప్రియమూ, హితమూ అయిన మాటను, స్వాధ్యాయపఠనాన్ని వాచిక తపస్సు అంటారు. (15)
మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ॥ 16
మనః ప్రసన్నత, శాంతత, మౌనం, మనోనిగ్రహం, (అంతః కరణ) భావశుద్ధి - ఇదే మానసిక తపస్సు అంటారు. (16)
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ॥ 17
ఈ తపస్సులను ఎంతో శ్రద్ధతో, ఫలం మీద ఆసక్తి లేకుండా చేస్తే దాన్ని సాత్త్విక తపస్సు అంటారు. (17)
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ॥ 18
సత్కారాలు, గౌరవాలు, పూజలు పొందటానికి, దంభంతో చేసే తపస్సు రాజసం. అది చంచలం, అస్థిరం . (18)
మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్ తామసముదాహృతమ్ ॥ 19
మొండిపట్టుదలతో, దేహేంద్రియాలను కష్టపెడుతూ, ఇతరులను నశింపజేసే తపస్సులను తామసతపస్సు అంటారు. (19)
దాతవ్యమితి యద్ దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్ దానం సాత్త్వికం స్మృతమ్ ॥ 20
దానం చెయ్యాలి అని కర్తవ్యభావంతో, ప్రత్యుపకారం ఆశించకుండా దేశ, కాల, పాత్రాలు తెలిసికొని చేసేదానం సాత్త్విక దానం అనబడుతుంది. (20)
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్ధిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్ దానం రాజసం స్మృతమ్ ॥ 21
ప్రత్యుపకారం ఆశించి కాని, ప్రతిఫలం ఆశించికాని ఇష్టంలేకుండానే చేసే దానం రాజసదానం అనబడుతుంది. (21)
అదేశకాలే యద్ దానమ్ అపాత్రేభ్యశ్చ దీయతే ।
అసత్కృతమవజ్ఞాతం తత్ తామసముదాహృతమ్ ॥ 22
అపవిత్ర ప్రదేశంలో చేసినదీ, అపాత్రులకు చేసినదీ, ప్రియవచనం లేకుండా తిరస్కారంతో చేసినదీ తామసదానం అనబడుతుంది. (22)
ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః ॥ 23
ఓమ్, తత్, సత్ అనేవి మూడూ బ్రహ్మను చెపుతాయి. వాని నుండియే సృష్ట్యాదిలో బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పడ్డాయి. (23)
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ॥ 24
అందుకే బ్రహ్మవాదులు ఓంకారంతో శాస్త్రవిహితాలయిన యజ్ఞదానతపశ్చర్యలను ప్రారంభిస్తారు. (24)
తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ॥ 25
తత్ అనే పరబ్రహ్మవాచకాన్ని ఉచ్చరించి, ముముక్షువులు నిష్కామంగా యజ్ఞదాన తపః క్రియలు చేస్తారు. (25)
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ॥ 26
సత్ అనే పరమాత్మ వాచకం అస్తిత్వాన్ని శ్రేష్ఠత్వాన్ని, ప్రశస్త కర్మలను సూచిస్తుంది. (26)
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ॥ 27
యజ్ఞదాన తపస్సుల మీద నిష్ఠను కూడా సత్ అనే శబ్దంతో చెపుతారు. ఈశ్వర ప్రీతికోసం చేసే కర్మ అంతా సత్ అనే శబ్దంతోనే చెప్పబడుతోంది. (అందుచేత 'ఓంతత్సత్' అనేది మహిమాన్వితం) (27)
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్య నో ఇహ ॥ 28
శ్రద్ధలేకుండా చేసిన హోమం, ఇచ్చిన దానం, చేసిన తపస్సు, ఇంకా ఇతర శుభకర్మలూ కూడా 'అసత్' అని చెప్పబడుతుంది. దాని వల్ల ఇహమందు కాని మరణించాక కాని ప్రయోజనం లేదు." (28)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదేశ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥ భీష్మపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః ॥ 41 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున శ్రద్ధాత్రయ విభాగయోగమను నలువది ఒకటవ అధ్యాయము. (41) శ్రీమద్భగవద్గీత పదునేడవ అధ్యాయము. (17)