42. నలువది రెండవ అధ్యాయము

భగవద్గీత - (18) మోక్ష సంన్యాసయోగము.

అర్జున ఉవాచ
సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ॥ 1
అర్జునుడు అడుగుతున్నాడు. "మహాబాహూ! హృషీకేశా! కేశవా! సంన్యాస తత్త్వాన్ని, త్యాగతత్త్వాన్నీ వేరు వేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను." (1)
శ్రీభగవానువాచ
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ 2
శ్రీభగవానుడు చెపుతున్నాడు. "కామ్య కర్మలను విడవటమే సంన్యాసమని కవులు అంటారు. జ్ఞానులు సర్వ కర్మల ఫలాన్నీ విడవటమే త్యాగమంటారు. (2)
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ॥ 3
కర్మమే బంధకారణం, కనుక అన్ని కర్మలను త్యజించాలి అని పండితులు (సాంఖ్యులు) అంటారు. కాని యజ్ఞ, దాన, తపః కర్మలు త్యజింపకూడదని కొందరు (మీమాంసకులు) అంటారు. (3)
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ॥ 4
ఈ త్యాగ విషయంలో నా నిశ్చయం విను. త్యాగమే మూడు విధాలుగా చెప్పబడింది. (4)
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ॥ 5
యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. ఆచరింపదగినవి. ఈ యజ్ఞ, దాన, తపస్సులే బుద్ధిమంతులను పావనం చేస్తాయి. (5)
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ॥ 6
అందుచేత అర్జునా! కర్తృత్వాభిమానాన్ని, ఫలాసక్తిని విడిచి, ఈ కర్మలు చేయవచ్చునని నా అభిప్రాయం. ఇదే ఉత్తమం. (6)
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః ॥ 7
కాని నియతమైన కర్మలను విడవటం మంచిది కాదు. మోహంతో దాన్ని విడవడటం 'తామస త్యాగం' అనిపించు కొంటుంది. (7)
దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ॥ 8
నిత్యమయిన కర్మలు శరీరానికి క్లేశమూ, దుఃఖమూ కలిగిస్తాయని త్యజిస్తే ఆ త్యాగం రాజసత్యాగం అవుతుంది. ఆతడు త్యాగఫలం పొందడు. (8)
కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేఽర్జున ।
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ॥ 9
శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యంగా భావించి ఫలాపేక్ష, ఆసక్తి లేకుండా చేయడమే సాత్త్వికత్యాగం అనబడుతుంది. (9)
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టః మేధావీ ఛిన్నసంశయః ॥ 10
కుశలం కాని కర్మలను ద్వేషించకుండా, ఆసక్తి లేకుండా సత్త్వగుణం కలిగి, సంశయరహితుడై మేధావి అయిన వాడు నిజమయిన త్యాగి. (10)
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ॥ 11
శరీరధారులకు కర్మలను పూర్తిగా త్యజించటం శక్యం కాదు. అందుచేత (కర్మలను కాదు) కర్మఫలాలను త్యజించినవాడే త్యాగి అని చెప్పబడతాడు. (11)
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ॥ 12
చనిపోయిన తరువాత కర్మలఫలం 1) అనిష్టం 2) ఇష్టం 3) మిశ్రం అని మూడు విధాలుగా అజ్ఞులకు (కర్మ ఫల త్యాగం చేయనివారికి) కలుగుతుంది. కాని జ్ఞానులకు ఎన్నడూ కలుగదు. (12)
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ॥ 13
సర్వకర్మల సిద్ధికి అయిదు కారణాలున్నాయని కర్మకాండకు శేషమయిన వేదాంత (సాంఖ్య) శాస్త్రంలో చెప్పబడింది. వాటిని చెపుతాను విను. (13)
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ॥ 14
అధిష్ఠానం, కర్త, సాధనాలు, నానావిధ చేష్టలు, దైవం - అనే అయిదూ కర్మ సిద్ధికి కారణాలు. (14)
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ॥ 15
మనస్సుతో, వాక్కుతో, శరీరంతో మానవుడు చేసే శాస్త్ర సమ్మత కార్యానికీ, విపరీత కార్యానికీ కూడా ఈ అయిదూ కారణాలు. (15)
తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ॥ 16
కర్మలన్నిటికీ ఈ అయిదే కారణం అయినా, విపరీత బుద్ధి వలన శుద్ధస్వరూపుడయిన ఆత్మను కర్మలకు కర్తగా భావించే అజ్ఞాని యథార్థం గ్రహింపలేడు. (16)
యస్య నాహంకృతోభావః బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే ॥ 17
అంతఃకరణంలో కర్తృత్వ భావం లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థాలకు, కర్మలకు అంటుకోదు. వాడు లోకాలను చంపినా వాడికి కర్తృత్వం లేదు. పాపాలు అంటవు. (17)
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ॥ 18
జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అని కర్మప్రేరణలు మూడు విధాలు. కర్త, కరణం, క్రియ అని కర్మ సంగ్రహాలు మూడు రకాలు. (18)
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గునభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ॥ 19
గుణబేధాలు సాంఖ్యశాస్త్రంలో జ్ఞానం, కర్మ, కర్త అని మూడు విధాలుగా చెప్పబడ్డాయి. వాటిని చెపుతాను విను. (19)
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ॥ 20
ప్రాణులన్నిటిలోనూ వేర్వేరుగా కనిపించే పరమాత్మ విభాగరహితుడై సమభావంతో నిలిచినట్లు జ్ఞాని చూస్తాడు. అతని జ్ఞానం సాత్త్వికజ్ఞానం అని తెలుసుకో! (20)
పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ॥ 21
ప్రాణులన్నిటిలోని వివిధ భావాలనూ వేర్వేరుగా భావించేవారి జ్ఞానం రాజసజ్ఞానం అని తెలుసుకో! (21)
యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ ।
అతత్త్వార్థవదల్పం చ తత్ తామసముదాహృతమ్ ॥ 22
శరీరమే సమస్తమూ అని భావించే, హేతురహితమై, అర్థరహితమై, తుచ్ఛమైన విపరీత జ్ఞానం తామసజ్ఞానం అంటారు. ( ఈ మూడూ జ్ఞాన భేదాలు) (22)
నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ॥ 23
(ఇక కర్మ భేదాలు మూడు)
కర్తృత్వాభిమానం కాని, ఫలాసక్తి కాని లేనివాడు రాగద్వేషాలు లేకుండా చేసే శాస్త్రవిహిత కర్మను సాత్త్విక కర్మ అంటారు. (23)
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।
క్రియతే బహులాయాసం తద్ రాజసముదాహృతమ్ ॥ 24
అహంకారి భోగలాలసతతో చేసే ఆయాస పూర్వక కర్మ రాజసకర్మ. (24)
అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే ॥ 25
పరిణామం, హాని, హింస, పురుషశక్తి చూడకుండా కేవలం అజ్ఞానంతో ఆరంభించే కర్మ తామసకర్మ. (25)
ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ॥ 26
(ఇవి కర్తృభేదాలు) ఆసక్తి, అహంకారం లేకుండా ధృతి, ఉత్సాహాలతో కూడి, లాభనష్టాలకు హర్షవిషాదాలు పొందని కర్త సాత్త్విక కర్త. (26)
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ॥ 27
ఆసక్తి కలిగి కర్మఫలాలు ఆశించేవాడు, లోభి, ఇతరులను హింసించేవాడు, అపవిత్రుడు, హర్ష శోకాలకు లోనయ్యే కర్త రాజసకర్త. (27)
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ॥ 28
ఏకాగ్రత లేకుండా, బాలునివలె అవివేకి, మూర్ఖుడు, ధూర్తుడు, ఇతరుల పనులు పాడుచేసేవాడు, అలసుడు, విషాది, ధీర్ఘసూత్రుడు అయిన కర్త తామసకర్త. (28)
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ॥ 29
ఈ గుణాలను బట్టి బుద్ధి, ధృతి కూడ మూడు విధాలుగా ఉంటుంది. వీటిని గూర్చి సంపూర్ణంగా విడివిడిగా చెపుతాను విను. (29)
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥ 30
ప్రవృత్తి, నివృత్తి మార్గాలను, కర్తవ్యాకర్తవ్యాలను, భయాభయాలను, బంధ మోక్షాలను తెలుసుకొనేవాని బుద్ధి సాత్త్విక బుద్ధి. (30)
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ॥ 31
ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు - వీని యథార్థ తత్త్వాన్ని తెలుసుకోలేని బుద్ధిని రాజసబుద్ధి అంటారు. (31)
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా ।
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥ 32
తమోగుణం ఆవరించి, అధర్మాన్ని ధర్మంగాను, ఇతర విషయాలను కూడ విపరీతంగాను భావించే బుద్ధిని 'తామసబుద్ధి' అంటారు. (32)
ధృత్వా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః ।
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ॥ 33
(ఇక ధృతి భేధాలు) ఏకాగ్రచిత్తంతో మనః ప్రాణాల, ఇంద్రియాల క్రియలను శాస్త్రీయ మార్గంలో నియమించే ధృతి 'సాత్త్వికధృతి'. (33)
యయా తు ధర్మకామార్థాన్ ధృత్వా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ॥ 34
ధర్మ, కామ, అర్థాలను (మాత్రమే మోక్షింవిడిచి) ధరించే ధృతి, కర్తృత్వాభినివేశంతో, ఫలాకాంక్షతో ఉండే ధృతి రాజసధృతి అవుతుంది. (34)
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ ।
న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ ॥ 354
స్వప్నాన్ని, భయాన్ని, శోకాన్ని విషాదాన్ని, గర్వాన్ని విడువలేని ధృతి 'తామసధృతి' అవుతుంది. (35)
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ ।
అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ॥ 36
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మ బుద్ధిప్రసాదజమ్ ॥ 37
సుఖం కూడా అలాగే మూడు విధాలు - అది విను. ఏ సుఖంలో సాధకుడు అభ్యాసంతో ఆనందిస్తాడో. దుఃఖాన్ని అతిక్రమిస్తాడో, ముందు విషంగా అనిపించినా చివరికి అమృతోపమానంగా ఉంటుందో ఆ సుఖం బుద్ధికి ప్రసన్నతను ఇచ్చే సాత్త్వికసుఖం అనబడుతుంది. (36,37)
విషయేంద్రియసంయోగాద్ యత్తదగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతమ్ ॥ 38
విషయాలూ, ఇంద్రియాలూ కలవడం వల్ల సుఖం మొదట అమృత తుల్యంగా అనిపించినా, చివరికి అది విషతుల్యమవుతుంది. ఆ సుఖాన్ని రాజససుఖం అంటారు. (38)
యద్రగే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః ।
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ॥ 39
నిద్ర, సోమరితనం, ప్రమాదం - వీటి వల్ల కలిగే సుఖం తామససుఖం అంటారు. ఈ సుఖం భోగ సమయంలోనూ, పరిణామంలోనూ ఆత్మను మోహింపజేస్తుంది. (39)
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ॥ 40
భూమిమీద కాని, ఆకాశంలో కాని, దేవతలలో కాని ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడుగుణాలూ లేని ప్రాణి లేదు. (40)
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ॥ 41
చతుర్వర్ణాల వారి కర్మలూ వారి వారి స్వభావాల నుండి పుట్టిన గుణాలను బట్టి విభజింపబడ్డాయి. (41)
శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ॥ 42
అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియనిగ్రహం, తపస్సు, శుచిత్వం, క్షమ, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, - ఇవి బ్రాహ్మణులకు స్వభావసిద్ధమయిన ధర్మాలు. (42)
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ॥ 43
పరాక్రమం, తేజస్సు, ధైర్యం, దక్షత, యుద్ధంలో పారిపోకుండా నిలవడం, దానం, శాసించే శక్తి - ఇవి క్షత్రియ స్వభావ ధర్మాలు. (43)
కృషిగోరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ॥ 44
కృషి, గోరక్షణం, వాణిజ్యం - ఇవి వైశ్య స్వభావధర్మాలు. సేవా రూప కర్మ శూద్రులకు స్వభావ ధర్మం. (44)
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛ్రృణు ॥ 45
తమ తమ స్వాభావిక ధర్మ కర్మతత్పరులు సిద్ధి పొందుతారు. స్వకర్మనిరతులయిన వారు ఎలా సిద్ధిని పొందుతారో విను. (45)
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥ 46
ఈ ప్రాణులన్నీ ఎవని నుండి జన్మించాయో, ఎవనితో ఈ విశ్వమంతా వ్యాపించి ఉందో ఆ పరమేశ్వరుని తన ధర్మ కర్మలతో అర్చించిన మానవుడు సిద్ధి పొందుతాడు. (46)
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషమ్ ॥ 47
చక్కగా ఆచరించిన పరధర్మం కంటె గుణ రహితమైన స్వధర్మమే శ్రేయస్సునిస్తుంది. స్వభావ ధర్మకర్మను ఆచరిస్తే పాపం అంటదు. (47)
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ॥ 48
దోషయుక్త మయినా స్వభావ ధర్మకర్మను విడువరాదు. అగ్ని కూడా పొగతో ఆవరింపబడి ఉంటుంది. అలాగే కర్మలన్నిటిలోనూ ఏదో ఒక దోషం ఉంటుంది. (48)
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి ॥ 49
ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేనివాడు, మనస్సును జయించినవాడు, కోరికలు (భోగకాంక్ష) లేనివాడు, (సాత్త్విక త్యాగం కలవాడు) సంన్యాసంతో నైష్కర్శ్యసిద్ధిని (బ్రహ్మజ్ఞానాన్ని) పొందుతాడు. (49)
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాఽఽప్నోతి నిబోధ మే ।
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ॥ 50
ఇలా సిద్ధిపొందినవాడు ఏ జ్ఞాన నిష్ఠను అనుసరించి పరబ్రహ్మను చేరుతున్నాడో, ఆ జ్ఞానానికి పరమనిష్ఠను పొందటానికి క్రమ పద్ధతిని సంగ్రహంగా చెపుతున్నాను విను. (50)
బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాఽఽత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ॥ 51
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥ 52
నిస్సంశయమైన బుద్ధితో, ధైర్యంతో శరీరేంద్రియాలను వశపరచుకొని, శబ్దాది విషయాలను పరిత్యజించి, రాగద్వేషాలు విడిచి, నిర్జన ప్రదేశంలో ఉంటూ , మితంగా భుజిస్తూ, త్రికరణాలనూ నియమించి, నిత్యమూ ధ్యానాన్నీ యోగాన్నీ అభ్యసిస్తూ, వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. (51,52)
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే ॥ 53
అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, మమకారం విడిచి, శాంతుడయినవాడు పరబ్రహ్మ రూపాన్ని పొందటానికి అర్హుడు. (53)
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥ 54
అలా పరబ్రహ్మ భూతుడయినవాడు ప్రసన్న మనస్సుతో ఉంటాడు. దేనికీ శోకించడు. దేనినీ కోరడు. సర్వప్రాణుల మీద సమభావం కలిగి నా పరాభక్తిని పొందుతాడు. (54)
భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ॥ 55
భక్తితో నా స్వరూపతత్త్వాన్ని గ్రహించి, నా యథార్థరూపాన్ని ఆత్మరూపంలో సాక్షాత్కరించుకొని, నాలో ప్రవేశిస్తాడు. (55)
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ॥ 56
సర్వకర్మలూ సదా చేస్తూనే నన్ను ఆశ్రయించినవాడు నా అనుగ్రహంతో శాశ్వతమూ, అక్షయమూ అయిన మోక్షం పొందుతాడు. (56)
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ॥ 57
నిండు మనసుతో సర్వకర్మలను నాకే అర్పించి, సమబుద్ధియోగాన్ని ఆశ్రయించి, నా యందు ఆసక్తితో నాయందే మనసు నిలుపు. (57)
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి ।
అథ చేత్ త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి ॥ 58
నా మీద మనసు నిల్పితే నా అనుగ్రహంతో అన్ని కష్టాలను తరిస్తావు. అహంకారంతో ఈ మాటలను వినకపోతే నష్టపోతావు. (58)
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ॥ 59
అహంకారంతో "నేనీయుద్ధం చెయ్యను" అని అనుకోవటం వృథా. నీ స్వభావమే నిన్ను యుద్ధానికి పురికొల్పుతుంది. (59)
స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ॥ 60
అర్జునా! మోహ ప్రభావంతో నీవు ఇష్టపడని కర్మను కూడా పురాకృత కర్మ (స్వభావంతో) సంస్కారంతో బంధింపబడి (నీకు ఇష్టంలేకపోయినా) చేస్తావు. (60)
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాణి మాయయా ॥ 61
అంతర్యామి అయిన ఈశ్వరుడు ప్రాణులన్నిటి హృదయాల్లోనూ ఉన్నాడు. అతడే తన మాయతో వారి వారి కర్మలననుసరించి శరీర యంత్రాలను త్రిప్పుతున్నాడు. (61)
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥ 62
అందుచేత అన్నివిధాల ఆ పరమేశ్వరుని శరణువేడు. అతని అనుగ్రహంతోనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందుతావు. (62)
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ॥ 63
చాలా రహస్య మయిన జ్ఞానం నీకు చెప్పాను. పరమ రహస్యమైన దీన్ని పూర్తిగా విమర్శించి నీ ఇష్టానుసారం చెయ్యి. (63)
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ॥ 64
నేను చెప్పినది పరమగోప్య మయినది. మళ్లీ చెపుతున్నా విను. నీవు నాకు మిక్కిలి ఇష్టుడవని నీకీ హితం చెపుతున్నాను. (64)
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ॥ 65
నా యందే మనసు పెట్టు. నా భక్తుడవై నన్నే సేవించు. నాకే నమస్కరించు. నన్నే పొందుతావు. నాకు బాగా ఇష్టుడవు కాబట్టి ప్రతిజ్ఞా పూర్వకంగా చెపుతున్నాను. (65)
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః ॥ 66
అన్ని ధర్మాలూ విడిచి నన్నే శరణు పొందు. నేను సర్వపాపాల నుండి విముక్తుని చేసి, మోక్ష మిస్తాను. విచారింపకు. (66)
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ॥ 67
తపస్సు చేయనివానికి, భక్తుడుకానివానికి, వినాలని కుతూహలం లేనివానికి, ఇది ఎన్నడూ చెప్పకు. నన్ను చూసి అసూయ పడేవానికి ఎన్నడూ చెప్పకు. (67)
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ 68
నా మీద పరమ భక్తి కలిగి, పరమ గుహ్య మయిన ఈ విషయాన్ని నా భక్తుల హృదయాల్లో నిలిపినవాడు నన్నే పొందుతాడు. సందేహం లేదు. (68)
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి ॥ 69
అతనిని మించి మానవులలో ఎవరూ నాకు ప్రియతముడు ఉండడు. ఉండబోడు. (69)
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమ్ ఇష్టః స్యామితి మే మతిః ॥ 70
ధర్మయుక్త మయిన మన సంవాదరూపమైన దీన్ని పఠించేవాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించే వాడని నా అభిప్రాయం. (70)
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ॥ 71
శ్రద్ధతో అసూయలేకుండా ఈ గీతను విన్నవాడు పాపవిముక్తుడై, పుణ్యాత్ములు పొందే ఉత్తమలోకాలు పొందుతాడు. (71)
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ ॥ 72
ధనంజయా! నీవు దీన్ని ఏకాగ్రచిత్తంతో విన్నావా? అజ్ఞానం వల్ల కలిగిన నీమోహం నశించిందా?" (72)
అర్జున ఉవాచ
నష్టో మహోః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥ 73
అర్జునుడు చెపుతున్నాడు.
"అచ్యుతా! నీ అనుగ్రహంతో నామోహం నశించిపోయింది. పరమాత్మ విషయక స్మృతి లభించింది. సందేహం పోయి నిలిచాను. నీ మాట పాటిస్తాను." (73)
సంజయ ఉవాచ
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ॥ 74
సంజయుడు చెప్పాడు.
ఈ విధంగా వాసుదేవునకు, అర్జునునకు మధ్య జరిగిన సంవాదం విన్నాను. ఇది అద్భుత మయినది. తనువు పులకించింది. (74)
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ॥ 75
వ్యాసుని అనుగ్రహంతో పరమ గుహ్యమయిన ఈ గీతను యోగేశ్వరుడయిన కృష్ణుడు అర్జునునికి చెపుతుండగా విన్నాను. (75)
రాజన్ సంస్కృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ॥ 76
రాజా! అద్భుతమూ, పుణ్యప్రదమూ అయిన కృష్ణార్జున సంవాదం మళ్లీ మళ్లీ స్మరించుకొంటూ సంతోషిస్తున్నాను. (76)
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః ॥ 77
శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని మళ్లీ మళ్లీ స్మరిస్తూ విస్మయం పొందుతున్నాను. అంతేకాదు మళ్లీ మళ్లీ ఎంతో సంతోషం పొందుతున్నాను. (77)
యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 78
ఎక్కడ యోగేశ్వరుడయిన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడూ ఉంటారో అక్కడ స్థిరమయిన రాజ్యలక్ష్మీ, విజయం, అభ్యుదయం, న్యాయమూ ఉంటాయని నా నిశ్చితాభిప్రాయం. (78)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసంన్యాసయోగో నామాష్టాదశోఽధ్యాయః ॥ 18 ॥ భీష్మపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః ॥ 42 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతాపర్వమను ఉపపర్వమున మోక్షసన్న్యాస యోగమను నలువది రెండవ అధ్యాయము. (42) భగవద్గీతలో పదునెనిమిదవ అధ్యాయము. (18)