యుద్ధమునకు ముందు ధర్మరాజు భీష్మాదుల అనుమతి పొందుట.
వైశంపాయన ఉవాచ
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రసంగ్రహైః ।
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిఃసృతా ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
సాక్షాత్తు శ్రీకృష్ణుని ముఖపద్మం నుండి వెలువడిన ఈ గీతను చక్కగా కీర్తించాలి. అపుడిక ఇతర శాస్త్రాలతో పనేలేదు. (1)
సర్వశాస్త్రమయీ గీతా సర్వదేవమయో హరిః ।
సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మనుః ॥ 2
సర్వశాస్త్రాలూ గీతలో ఉన్నాయి. సర్వదేవతలూ శ్రీహరిలో ఉన్నారు. అన్ని తీర్థాలూ గీతలో ఉన్నాయి. సర్వవేదాలూ మనుస్మృతిలో ఉన్నాయి. (2)
గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృది స్థితే ।
చతుర్గకారసంయుక్తే పునర్జన్మ న విద్యతే ॥ 3
గీత, గంగ, గాయత్రి, గోవింద అనే నాల్గు గకారాలు హృదయంలో నిలిస్తే వానికి పునర్జన్మ ఉండదు. (3)
షట్ శతాని సవింశాని శ్లోకానాం ప్రాహ కేశవః ।
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టిం తు సంజయః ॥ 4
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే ।
ఈ గీతలోని ఆరువందల ఇరవైశ్లోకాలు కేశవుడు చెప్పాడు.
అర్జునుడు ఏబది ఏడు శ్లోకాలు చెప్పాడు. అరవై ఏడు శ్లోకాలు సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పాడు. ఇది గీతాశ్లోక సంఖ్య. (4)
భారతామృతసర్వస్వ గీతాయా మథితస్య చ ।
సారముద్ ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతమ్ ॥ 5
భారత మనే సముద్రం మథించి, గీత అనే అమృతం తీసి, కృష్ణుడు అర్జునుని ముఖంలో హోమం చేశాడు. (5)
సంజయ ఉవాచ
తతో ధనంజయం ధృష్ట్వా బాణగాండీవధారిణమ్ ।
పునరేవ మహానాదం వ్యసృజంత మహారథాః ॥ 6
సంజయుడు చెపుతున్నాడు. తరువాత బాణ గాండీవాలు ధరించిన అర్జునుని చూసి, మహారథులయిన పాండవ వీరులంతా మరలా మహానాదం చేశారు. (6)
పాండవాః సోమకాశ్చైవ యే చైషామనుయాయినః ।
దధ్ముశ్చ ముదితాః శంఖాన్ వీరాః సాగరసంభవాన్ ॥ 7
వీరులైన పాండవులూ, వారి అనుయాయు లయిన సోమకులూ సంతోషంతో కడలిలో పుట్టిన ఉత్తమశంఖాలను పూరించారు. (7)
తతో భేరశ్చ పేశ్యశ్చ క్రకచా గోవిషాణికాః ।
సహసైవాభ్యహన్యంత తతః శబ్దో మహానభూత్ ॥ 8
తరువాత భేరులు, పేశులు, క్రకచాలు, గోవిషాణికలు అనే వాద్యాలు మోగించారు. దానితో పెద్ద శబ్దం వచ్చింది. (8)
తథా దేవాః సగంధర్వాః పితరశ్చ జనాధిప ।
సిద్ధచారణసంఘాశ్చ సమీయుస్తే దిదృక్షయా ॥ 9
ఋషయశ్చ మహాభాగాః పురస్కృత్య శతక్రతుమ్ ।
సమీయుస్తత్ర సహితాః ద్రష్టుం తద్ వైశసం మహత్ ॥ 10
రాజా! అలాగే దేవతలు, గంధర్వులు, పితరులు, సిద్ధ చారణ సముదాయాలు చూడటానికి వచ్చారు. ఇంద్రుని ముందుంచుకొని మహాభాగులైన మహర్షులు ఆ మహాయుద్ధాన్ని చూడటానికి వచ్చి చేరారు. (9,10)
తతో యుధిష్ఠిరో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితే ।
తే సేనే సాగరప్రఖ్యే ముహుః ప్రచలితే నృప ॥ 11
విముచ్య కవచం వీరః నిక్షిప్య చ వరాయుధమ్ ।
అవరుహ్య రథాత్ క్షిప్రం పద్భ్యామేవ కృతాంజలిః ॥ 12
పితామహమభిప్రేక్ష్య ధర్మరాజో యుధిష్ఠిరః ।
వాగ్యతః ప్రయయౌ యేన ప్రాఙ్ముఖో రిపువాహినీమ్ ॥ 13
రాజా! యుద్ధానికి సిద్ధమైన రెండు సైన్యాలూ సముద్రంలా ముందు కురుకుతున్నాయి. ధర్మరాజు చూశాడు. ఆ వీరుడు వేగంగా కవచం విప్పి, ఆయుధాలు రథం మీద పడేశాడు. రథం నుండి వేగంగా దిగాడు. కాలి నడకతో అంజలిఘటించి, భీష్ముని చూసి, మౌనంగా తూర్పుదిక్కుగా శత్రుసైన్యం దగ్గరకు బయలుదేరాడు. (11-13)
తం ప్రయాంతమభిప్రేక్ష్య కుంతీపుత్రో ధనంజయః ।
అవతీర్య రథాత్ తూర్ణం భ్రాతృభిః సహితోఽన్వయాత్ ॥ 14
వాసుదేవశ్చ భగవాన్ పృష్ఠతోఽనుజగామ తమ్ ।
తథా ముఖ్యాశ్చ రాజానః తచ్చిత్తా జగ్మురుత్సుకాః ॥ 15
ఈ దృశ్యం చూసి, అర్జునుడు వెంటనే రథం దిగి, సోదరులతో సహా ధర్మరాజు వెంట వెళ్లాసు. ఆ వెనుక భగవానుడైన వాసుదేవుడూ వెళ్లాడు.
ఆ తరువాత రాజముఖ్యులు అంతా ఉత్సుకులై బయలుదేరారు. (14,15)
అర్జున ఉవాచ
కిం తే వ్యవసితం రాజన్ యదస్మానపహాయ వై ।
పద్భ్యామేవ ప్రయాతోఽసి ప్రాఙ్ముఖో రిపువాహినీమ్ ॥ 16
అపుడు అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు. "రాజా! మమ్ము అందరినీ విడిచి పాదచారివై తూర్పుదిక్కుగా ఎందుకు శత్రుసేనవైపు వెడుతున్నావు? నీవేమనుకొంటున్నావు?" (16)
భీమసేన ఉవాచ
క్వ గమిష్యసి రాజేంద్ర నిక్షిప్తకవచాయుధః ।
దంశితేస్వరిసైన్యేషు భ్రాతౄనుత్సృజ్య పార్థివ ॥ 17
భీముడు ఇలా అన్నాడు.
"మహారాజా! కవచమూ, ఆయుధాలూ వదలి, కవచాలు దాల్చిన శత్రుసేనవైపు తమ్ముళ్లను వదలి, ఎక్కడకు వెళుతున్నావు?" (17)
నకుల ఉవాచ
ఏవం గతే త్వయి జ్యేష్ఠే మమ భ్రాతరి భారత ।
భీర్మే దునోతి హృదయం బ్రూహి గంతా భవాన్ క్వ ను ॥ 18
నకులుడు అడిగాడు.
"పెద్ద అన్నగారివైన నీవిలా వెళ్లుతుంటే నా మనసుకు చాలా భయం కలుగుతోంది. నీవు ఎక్కడకు వెడుతున్నావో చెప్పు." (18)
సహదేవ ఉవాచ
అస్మిన్ రణసమూహే వై వర్తమానే మహాభయే ।
ఉత్సృజ్య క్వ ను గంతాసి శత్రూనభిముఖో నృప ॥ 19
సహదేవుడు అడిగాడు.
"రాజా! మహాభయంకరమైన యుద్ధం జరగబోతూ ఉంటే మమ్ము విడిచి శత్రువుల ముందుకు బయలుదేరావు. ఎక్కడికి వెడతావు?" (19)
సంజయ ఉవాచ
ఏవమాభాష్యమాణోఽపి భ్రాతృభిః కురునందనః ।
నోవాచ వాగ్యతః కించిద్ గచ్ఛత్యేవ యుధిష్ఠిరః ॥ 20
సంజయుడు చెపుతున్నాడు. ఇలా సోదరులంతా ప్రశ్నిస్తున్నా ధర్మరాజు మౌనంగా వెడుతూనే ఉన్నాడు. (20)
తానువాచ మహాప్రాజ్ఞః వాసుదేవో మహామనాః ।
అభిప్రాయోఽస్య విజ్ఞాతః మయేతి ప్రహసన్నివ ॥ 21
అపుడు మహామేధావి, మహామనస్వి అయిన వాసుదేవుడు "వీని అభిప్రాయం నాకు తెలిసింది." అని నవ్వుతూ ఇలా అన్నాడు. (21)
ఏష భీష్మం తథా ద్రోణం గౌతమం శల్యమేవ చ ।
అనుమాన్య గురూన్ సర్వాన్ యోత్స్యతే పార్థివోఽరిభిః ॥ 22
"ఈ ధర్మరాజు భీష్మద్రోణుల, కృప శల్యుల అనుమతిని తీసుకొని అపుడు శత్రువులతో యుద్ధం చేయాలనుకొంటున్నాడు. (22)
శ్రూయతే హి పురాకల్పే గురూనననుమాన్య యః ।
యుధ్యతే స భవేద్ వ్యక్తమ్ అపధ్యాతో మహత్తరైః ॥ 23
పూర్వకాలం నుండి గురువుల అనుమతి తీసుకోకుండా యుద్ధం చేసేవాడు ఆ గురుజనుల మనసు నుండి వీడిపోతాడు అని వింటున్నాం. (23)
అనుమాన్య యథాశాస్త్రం యస్తు యుధ్యేన్మహత్తరైః ।
ధ్రువస్తస్య జయో యుద్ధే భవేదితి మతిర్మమ ॥ 24
శాస్త్రీయంగా మాననీయుల అనుజ్ఞ తీసుకొని, యుద్ధం చేసేవానికి జయం నిశ్చయం అని నా అభిప్రాయం." (24)
ఏవం బ్రువతి కృష్ణేఽత్ర ధార్తరాష్ట్రచమూం ప్రతి ।
(నేత్రైరనిమిషైః సర్వైః ప్రేక్షంతే స్మ యుధిష్ఠిరమ్ ॥)
హాహాకారో మహానాసీత్ నిశ్శబ్దాస్త్వపరేఽభవన్ ॥ 25
ఇలా కృష్ణుడు అనగానే కౌరవసేన నుండి హాహాకారాలు వినిపించాయి. ఇతరులు నిశ్శబ్దంగా ఉన్నారు. రెప్ప వాల్చకుండా అందరూ ధర్మరాజును చూస్తున్నారు. (25)
దృష్ట్వా యుధిష్ఠిరం దూరాద్ ధార్తరాష్ట్రస్య సైనికాః ।
మిథః సంకథయాంచక్రుః ఏషో హి కులపాంసనః ॥ 26
దూరం నుండి దుర్యోధనుని సైనికులు ధర్మరాజును చూసి, వారిలో వారు "వీడే కులానికి కళంకం తెస్తున్నాడు" అనుకొంటున్నారు. (26)
వ్యక్తం భీత ఇవాభ్యేతి రాజాసౌ భీష్మమంతికమ్ ।
యుధిష్ఠిరః ససోదర్యః శరణార్థం ప్రయాచకః ॥ 27
ఈ ధర్మరాజు నిజంగా భయపడి, సోదరులతో సహా శరణువేడటానికి భీష్ముని దగ్గరకు వెడుతున్నాడు. (27)
ధనంజయే కథం నాథే పాండవే చ వృకోదరే ।
నకులే సహదేవే చ భీతిరభ్యేతి పాండవమ్ ॥ 28
భీమార్జునుల, నకులసహదేవుల సహాయం ఉండగా ఈ ధర్మరాజుకు ఎలా భయం కలుగుతోంది? (28)
న నూనం క్షత్రియకులే జాతః సంప్రథితే భువి ।
యథాస్య హృదయం భీతమ్ అల్పసత్త్వస్య సంయుగే ॥ 29
వీడు నిజంగా ప్రసిద్ధ క్షత్రియ వంశంలో పుట్టలేదు. వీనికి ధైర్యం లేదు. అందుకే యుద్ధంలో ఇంత భయపడుతున్నాడు. (29)
తతస్తే సైనికాః సర్వే ప్రశంసంతి స్మ కౌరవాన్ ।
హృష్టాః సుమనసో భూత్వా చైలాని దుధువుశ్చ హ ॥ 30
తరువాత ఆ సైనికులంతా సంతోషంతో కౌరవులను ప్రశంసిస్తూ, ఉత్తరీయాలు గిరగిరా ఊపారు. (30)
వ్యనిందశ్చ తథా సర్వే యోధాస్తవ విశాంపతే ।
యుధిష్ఠిరం ససోదర్యం సహితం కేశవేన హి ॥ 31
రాజా! నీయోధులంతా సోదరులతో, కృష్ణునితో కూడిన ధర్మరాజును నిందించారు. (31)
తతస్తత్ కౌరవం సైన్యం ధిక్కృత్వా తు యుధిష్ఠిరమ్ ।
నిఃశబ్దమభవత్ తూర్ణం పునరేవ విశాంపతే ॥ 32
రాజా! కౌరవసైన్యం అంతా ధర్మరాజును అలా ఈసడించుకొని ఊరుకొన్నది. (32)
కిం ను వక్ష్యతి రాజాసౌ కిం భీష్మః ప్రతివక్ష్యతి ।
కిం భీమః సమరశ్లాఘీ కిం ను కృష్ణార్జునావితి ॥ 33
మళ్లీ వెంటనే 'అసలీ ధర్మరాజు భీష్మునితో ఏమి మాట్లాడతాడు? భీష్ముడేమి సమాధానం చెపుతాడు? భీముడేం చెపుతాడు? కృష్ణార్జునులేం చెపుతారు?" అనుకొన్నారు. (33)
వివక్షితం కిమస్యేతి సంశయః సుమహానభూత్ ।
ఉభయోః సేనయో రాజన్ యుధిష్ఠిరకృతే తదా ॥ 34
రాజా! అసలత డేమనుకొంటున్నాడో పెద్ద సంశయంగా ఉంది అని ధర్మరాజును గురించి రెండుసేనలూ భావించాయి. (34)
సోఽవగాహ్య చమూం శత్రోః శరశక్తిసమాకులామ్ ।
భీష్మమేవాభ్యయాత్ తూర్ణం భ్రాతృభిః పరివారితః ॥ 35
అంతలో శరాలతో, శక్తులతో నిండిన శత్రుసేనలో ప్రవేశించి, ధర్మరాజు సోదరులతో సహా భీష్ముని చేరాడు. (35)
తమువాచ తతః పాదౌ కరాభ్యాం పీడ్య పాండవః ।
భీష్మం శాంతనవం రాజా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 36
వెంటనే ధర్మరాజు రెండు చేతులతో భీష్ముని రెండు పాదాలూ ఒత్తుతూ, యుద్ధానికై నిలిచిన భీష్మునితో ఇలా అన్నాడు. (36)
యుధిష్ఠిర ఉవాచ
ఆమంత్రయే త్వాం దుర్ధర్ష త్వయా యోత్స్యామహే సహ ।
అనుజానీహి మాం తాత ఆశిషశ్చ ప్రయోజయ ॥ 37
ధర్మరాజు ఇలా అన్నాడు.
'పితామహా! నీ ఆజ్ఞ కోరుతున్నాను. నీతో యుద్ధం చెయ్యాలి. తాతా! నన్ను అనుమతించు. ఆశీర్వదించు." (37)
భీష్మ ఉవాచ
యద్యేవం నాభిగచ్ఛేథాః యుధి మాం పృథివీపతే ।
శపేయం త్వాం మహారాజ పరాభావాయ భారత ॥ 38
"ధర్మజా! యుద్ధసమయంలో నీవిలా నా దగ్గరకు రాకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి. (38)
ప్రీతోఽహం పుత్ర యుధ్యస్వ జయమాప్నుహి పాండవ ।
యత్ తేఽభిలషితం చాన్యత్ తదవాప్నుహి సంయుగే ॥ 39
పుత్రా! ఇపుడు నేను ప్రీతి చెందాను. యుద్ధం చేసి జయించు. ఇంకా నీవు యుద్ధంలో కోరినదేమున్నా అది పొందు. (39)
వ్రియతాం చ వరః పార్థ కిమస్మత్తోఽభికాంక్షసి ।
ఏవం గతే మహారాజ న తవాస్తి పరాజయః ॥ 40
ధర్మజా! నా నుండి ఇంకా నీవు ఏం కావాలో కోరుకో. ఇప్పుడిక నీకు పరాజయం ఉండదు. (40)
అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్ ।
ఇతి సత్యం మహారాజ బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥ 41
ధనానికి పురుషుడు దాసుడు. అంతే కాని ధనం ఎవరికీ దాసత్వం చెయ్యదు. ఇది నిజం మహారాజా! ఆ ధనంతో నేను కౌరవులచేత బంధింపబడ్డాను. (41)
అతస్త్వాం క్లీబవద్ వాక్యం బ్రవీమి కురునందన ।
భృతోఽస్మ్యర్థేన కౌరవ్య యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ॥ 42
అందుకే ధర్మజా! నీతో నేను నపుంసకుని వలె మాట్లాడుతున్నాను. అర్థంతో నన్ను కౌరవులు పోషించారు. నీవైపున యుద్ధం తప్ప నీకేం కావాలో కోరుకో." (42)
యుధిష్ఠిర ఉవాచ
మంత్రయస్వ మహాబాహో హితైషీ మమ నిత్యశః ।
యుధ్యస్వ కౌరవస్యార్థే మమైష సతతం వరః ॥ 43
వెంటనే ధర్మరాజు ఇలా అన్నాడు.
"మహాబాహూ! నాకు నీవు నిత్యమూ హితం కోరుతూ ఆలోచించు. కౌరవ పక్షంలోనే యుద్ధం చెయ్యి. ఇది నాకు సదా వరం." (43)
భీష్మ ఉవాచ
రాజన్ కిమత్ర సాహ్యం తే కరోమి కురునందన ।
కామం యోత్స్యే పరస్యార్థే బ్రూహి యత్ తే వివక్షితమ్ ॥ 44
భీష్ముడు అన్నాడు. "రాజా! నీకిపుడు నేను ఏ సహాయం చెయ్యాలి? నేను నీ శత్రుపక్షంలోనే యుద్ధం చేస్తున్నా కదా? అసలు నీవు చెప్పదలచింది ఏమిటి?" (44)
యుధిష్ఠిర ఉవాచ
కథం జయేయం సంగ్రామే భవంతమపరాజితమ్ ।
ఏతన్మే మంత్రయ హితం యది శ్రేయః ప్రపశ్యసి ॥ 45
ధర్మరాజు ఇలా అన్నాడు.
"ఓటమి ఎరుగని నిన్ను యుద్ధంలో ఎలా జయించగలను? నా మేలు కోరితే నాకు హితమయిన ఆలోచన చెప్పు." (45)
భీష్మ ఉవాచ
నైనం పశ్యామి కౌంతేయ యో మాం యుధ్యంతమాహమే ।
విజయేత పుమాన్ కశ్చిత్ సాక్షాదపి శతక్రతుః ॥ 46
భీష్ముడు అన్నాడు. "ధర్మజా! నేను యుద్ధం చేస్తుంటే నన్ను ఎవరూ ఓడింపలేడు. చివరకు ఇంద్రుడే సాక్షాత్తుగా వచ్చినా సరే!" (46)
యుధిష్ఠిర ఉవాచ
హంత పృచ్ఛామి తస్మాత్ త్వాం పితామహ నమోఽస్తు తే ।
వధోపాయం బ్రవీహి త్వమ్ ఆత్మనః సమరే పరైః ॥ 47
ధర్మరాజు వెంటనే ఇలా అన్నాడు.
"పితామహా! నీకు నమస్కారం. అందుకే అడుగుతున్నాను. నీవు పరులతో యుద్ధం చేస్తున్నపుడు నిన్ను చంపే ఉపాయం ఏమిటో చెప్పు." (47)
భీష్మ ఉవాచ
న స్మ తం తాత పశ్యామి సమరే యో జయేత మామ్ ।
న తావన్మృత్యుకాలోఽపి పునరాగమనం కురు ॥ 48
భీష్ముడు అన్నాడు.
"నాయనా! యుద్ధంలో నన్ను జయించే వాడిని ఇంతవరకూ నేను చూడలేదు. ఇంకా నాకు మరణసమయం రాలేదు. మళ్లీ రా!" (48)
సంజయ ఉవాచ
తతో యుధిష్ఠిరో వాక్యం భీష్మస్య కురునందన ।
శిరసా ప్రతిజగ్రాహ భూయస్తమభివాద్య చ ॥ 49
ప్రాయాత్ పునర్మహాబాహుః ఆచార్యస్య రథం ప్రతి ।
పశ్యతాం సర్వసైన్యానాం మధ్యేన భ్రాతృభిః సహ ॥ 50
స ద్రోణమభివాద్యాథ కృత్వా చాభిప్రదక్షిణమ్ ।
ఉవాచ రాజా దుర్ధర్షమ్ ఆత్మనిఃశ్రేయసం వచః ॥ 51
సంజయుడు చెప్పాడు.
కురునందనా! తరువాత ధర్మరాజు భీష్ముని మాటను శిరసావహించి, మళ్లీ ఆయనకు నమస్కరించి, సైన్యమంతా చూస్తూ ఉండగా తమ్ములతో సహా ఆ మహాబాహువు ద్రోణుని రథం వైపు వెళ్లాడు. ఎదిరింపరాని ద్రోణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తనకు మేలు కలిగే మాటలిలా అన్నాడు. (49-51)
ఆ మంత్రయే త్వాం భగవన్ యోత్స్యే విగతకల్మషః ।
కథం జయే రిపూన్ సర్వాన్ అనుజ్ణాతస్త్వయా ద్విజ ॥ 52
"గురుదేవా! నీ సలహా కోరుతున్నాను. కల్మష రహితుడనై నీతో యుద్ధం చేస్తున్నాను. నీ అనుజ్ఞ పొంది, శత్రువులందరినీ ఎలా జయించగలను?" (52)
ద్రోణ ఉవాచ
యది మాం నాభిగచ్ఛేధాః యుద్ధాయ కృతనిశ్చయః ।
శపేయం త్వాం మహారాజ పరాభావాయ సర్వశః ॥ 53
ద్రోణుడన్నాడు. "యుద్ధం నిశ్చయించాక నీవు నా దగ్గరకు రాకపోతే... ధర్మరాజా! నీకు అన్నివిధాలా అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి. (53)
తద్ యుధిష్ఠిర తుష్టోఽస్మి పూజితశ్చ త్వయానఘ ।
అనుజానామి యుధ్యస్వ విజయం సమావాప్నుహి ॥ 54
ధర్మజా! ఇపుడు నీచేత పూజితుడనై నేను దానికి సంతోషించాను. అనుమతిస్తున్నాను. యుద్ధం చెయ్యి. విజయం పొందు. (54)
కరవాణి చ తే కామం బ్రూహి త్వమభికాంక్షితమ్ ।
ఏవంగతే మహారాజ యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ॥ 55
మహారాజా! నీ పక్షంలో యుద్ధం తప్ప నీవేం కోరుకొంటావో చెప్పు. తప్పక చేస్తాను. (55)
అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్ ।
ఇతి సత్యం మహారాజ బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥ 56
ధనానికి పురుషుడు దాసుడవుతాడు. కాని ధనం పురుషునికి ఎవనికీ దాస్యం చెయ్యదు. మహారాజా! ఇది నిజం. ఆ అర్థంతో కౌరవుల చేత బంధింపబడ్డాను. (56)
బ్రవీమ్యేతత్ క్లీబవత్ త్వాం యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ।
యోత్స్యేఽహం కౌరవస్యార్థే తవాశాస్యో జయో మయా ॥ 57
అందుకే ఈ విషయం నీకు నపుంసకునిలా చెప్పాను. యుద్ధం తప్ప ఏమి కోరుకొంటావు? కౌరవుల కోసం మీతో పోరాడతాను. కాని నీ విజయం కోరుతూ ఉంటాను." (57)
యుధిష్ఠిర ఉవాచ
జయమాశాస్వ మే బ్రహ్మన్ మంత్రయస్వ చ మద్ధితమ్ ।
యుద్ధ్యస్వ కౌరవస్యార్థే వర ఏష వృతో మయా ॥ 58
ధర్మరాజు ఇలా అన్నాడు.
"గురుదేవా! నా విజయాన్ని కాంక్షించు. నాకు హితం గురించి ఆలోచించు. కౌరవుల పక్షాన యుద్ధం చెయ్యి. ఈ వరం నేను కోరుతున్నాను." (58)
ద్రోణ ఉవాచ
ధ్రువస్తే విజయో రాజన్ యస్య మంత్రీ హరిస్తవ ।
అహం త్వామభిజానామి రణే శత్రూన్ విమోక్ష్యసే ॥ 59
ద్రోణుడు అన్నాడు.
"రాజా! నీకు మంత్రి కృష్ణుడు. అందుచేత నీ విజయం నిశ్చితమే. నేను నిన్ను ఎరుగుదును. యుద్ధంలో శత్రువుల ప్రాణాలకు విముక్తినిస్తావు. (59)
యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః ।
యుద్ధ్యస్వ గచ్ఛ కౌంతేయ పృచ్ఛ మాం కిం బ్రవీమి తే ॥ 60
ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ధర్మజా! యుద్ధం చెయ్యి. వెళ్లు. ఇంకా నీకేంకావాలో చెప్పు." (60)
యుధిష్ఠిర ఉవాచ
పృచ్ఛామి త్వాం ద్విజశ్రేష్ఠ శృణు యన్మేఽభికాంక్షితమ్ ।
కథం జయేయం సంగ్రామే భవంతమపరాజితమ్ ॥ 61
ధర్మరాజు అన్నాడు. "విప్రోత్తమా! నా కోరిక ఏమిటో చెపుతున్నాను. విను. ఓటమి ఎరుగని మిమ్మల్ని యుద్ధంలో ఎలా జయించగలను?" (61)
ద్రోణ ఉవాచ
న తేఽస్తి విజయస్తావద్ యావద్ యుద్ధ్యామ్యహం రణే ।
మమాశు నిధనే రాజన్ యతస్వ సహ సోదరైః ॥ 62
ద్రోణుడు చెప్పాడు. "నేను యుద్ధం చేస్తున్నంతసేపూ నీకు విజయం కలగదు. నాకు త్వరగా మరణం కలిగేటట్లు నీ తమ్ములతో కలిసి ప్రయత్నించు." (62)
యుధిష్ఠిర ఉవాచ
హంత తస్మాన్మహాబాహో వధోపాయం వదాత్మనః ।
ఆచార్య ప్రణిపత్యైష పృచ్ఛామి త్వాం నమోఽస్తు తే ॥ 63
ధర్మరాజు అన్నాడు.
"ఆచార్యా! అందుకే మీ వధోపాయం చెప్పండి. మీ పాదాలపై పడి నమస్కరించి మిమ్ము అడుగుతున్నాను." (63)
ద్రోణ ఉవాచ
న శత్రుం తాత పశ్యామి యో మాం హన్యాద్ రథే స్థితమ్ ।
యుధ్యమానం సుసంరబ్ధం శరవర్షౌఘవర్షిణమ్ ॥ 64
ద్రోణుడు చెప్పాడు. "నాయనా! నేను రథం మీద నిలిచి, కోపంతో బాణవర్షం కురిపిస్తూ యుద్ధం చేస్తున్నంత సేపు నన్ను ఏ శత్రువూ చంపలేడు. (64)
ఋతే ప్రాయగతం రాజన్ న్యస్తశస్త్రమచేతనమ్ ।
హన్యాన్మాం యుధి యోధానాం సత్యమేతద్ బ్రవీమి తే ॥ 65
రాజా! నేను శస్త్రసంన్యాసం చేసి, అచేతనంగా ప్రాయోపవేశం చేస్తే తప్ప ఎవరూ నన్ను యుద్ధంలో చంపలేరు. నీకు నిజం చెపుతున్నాను. (65)
శస్త్రం చాహం రణే జహ్యాం శ్రుత్వా తు మహదప్రియమ్ ।
శ్రద్ధేయవాక్యాత్ పురుషాత్ ఏతత్ సత్యం బ్రవీమి తే ॥ 66
నేను నమ్మదగిన మహాత్ముల నుండి అప్రియమైన విషయం వింటే యుద్ధంలో శస్త్రం విడిచిపెడతాను. ఇది సత్యం. నీకు చెపుతున్నా." (66)
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా మహారాజ భారద్వాజస్య ధీమతః ।
అనుమాన్య తమాచార్యం ప్రాయాచ్ఛారద్వతం ప్రతి ॥ 67
సంజయుడు చెప్ఫాడు.
మహారాజా! ద్రోణుని ఈ మాట విని, ధర్మరాజు ఆచార్యుని అనుజ్ఞ గ్రహించి, కృపాచార్యుని దగ్గరకు వెళ్లాడు. (67)
సోఽభివాద్య కృపం రాజా కృత్వా చాపి ప్రదక్షిణమ్ ।
ఉవాచ దుర్ధర్షతమం వాక్యం వాక్యవిదాం వరః ॥ 68
కృపునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, మాటనేర్పరి అయిన ధర్మరాజు ఎదిరింప శక్యంకాని కృపాచార్యునితో ఇలా అన్నాడు. (68)
అనుమానయే త్వాం యోత్స్యేఽహం గురో విగతకల్మషః ।
జయేయం చ రిపూన్ సర్వాన్ అనుజ్ఞాతస్త్వయానఘ ॥ 69
"గురూత్తమా! కల్మషరహితుడనై నీతో యుద్ధం చేస్తాను. నీ అనుమతి పొంది శత్రువులందరినీ జయిస్తాను." (69)
కృప ఉవాచ
యది మాం నాభిగచ్ఛేథాః యుద్ధాయ కృతనిశ్చయః ।
శపేయం త్వాం మహారాజ పరాభావాయ సర్వశః ॥ 70
కృపాచార్యుడు అన్నాడు.
యుద్ధంకోసం నిశ్చయించుకొన్నాక నా దగ్గరకు రాకపోతే నీకు అన్ని విధాలా పరాజయం కలగాలని శపించేవాడిని. (70)
అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్ ।
ఇతి సత్యం మహారాజ బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥ 71
అర్థానికి పురుషుడే దాసుడు కాని అర్థం ఎవనికీ దాస్యం చేయదు. మహారాజా! ఇది నిత్యసత్యం. నేను అర్థంతో కౌరవుల చేత బంధింపబడ్డాను. (71)
తేషామర్థే మహారాజ యోద్ధవ్యమితి మే మతిః ।
అతస్త్వాం క్లీబవద్ బ్రూయాం యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ॥ 72
వారికోసం యుద్ధం చెయ్యాలని నా అభిప్రాయం. అందుకే నీతో నపుంసకునివలె మాట్లాడవలసి వస్తోంది. యుద్ధం (నీపక్షాన) తప్ప నీకేం కావాలో కోరుకో." (72)
యుధిష్ఠిర ఉవాచ
హంత పృచ్ఛామి తే తస్మాద్ ఆచార్య శృణు మే వచః ।
ఇత్యుక్త్వా వ్యథితో రాజా నోవాచ గతచేతనః ॥ 73
ధర్మరాజు చెప్పాడు.
'ఆచార్యా! అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. నా మాట విను...' అని చెప్పి బాధతో అచేతనుడయినట్లు ఏమీ మాట్లాడలేకపోయాడు. (73)
సంజయ ఉవాచ
తం గౌతమః ప్రత్యువాచ విజ్ఞాయాస్య వివక్షితమ్ ।
అవధ్యోఽహం మహీపాల యుద్ధ్యస్వ జయమాప్నుహి ॥ 74
సంజయుడు చెప్పాడు. ధర్మరాజు చెప్పదలచినది కృపుడు కనిపెట్టి, ఇలా అన్నాడు. "రాజా! నేను ఎవరిచేతనూ చంపబడను. యుద్ధం చెయ్యి. జయం పొందు. (74)
ప్రీతస్తేఽభిగమేనాహం జయం తవ నరాధిప ।
ఆశాసిష్యే సదోత్థాయ సత్యమేతద్ బ్రవీమి తే ॥ 75
నీవు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు జయం కలగాలని సదా కాంక్షిస్తున్నాను. ఇది సత్యం." (75)
ఏతచ్ఛ్రుత్వా మహారాజ గౌతమస్య విశాంపతే ।
అనుమాన్య కృపం రాజా ప్రయయౌ యేన మద్రరాట్ ॥ 76
మహారాజా! కృపుని ఈ మాట విని, ధర్మరాజు కృపుని అనుమతి తీసుకొని, శల్యుని దగ్గరకు వెళ్లాడు. (76)
స శల్యమభివాద్యాథ కృత్వా చాభిప్రదక్షిణమ్ ।
ఉవాచ రాజా దుర్ధర్షమ్ అత్మనిఃశ్రేయసం వచః ॥ 77
అతడు శల్యునికి ప్రదక్షిణ, నమస్కారాలు చేసి, ఎదిరింపరాని అతనితో తనకు మేలయినమాట ఇలా అన్నాడు. (77)
అనుమానయే త్వాం దుర్ధర్ష యోత్స్యే విగతకల్మషః ।
జయేయం ను పరాన్ రాజన్ అనుజ్ఞాతస్త్వయా రిపూన్ ॥ 78
"రాజా! కల్మషం లేకుండా నీ అనుమతి పొంది నీతో యుద్ధం చెయ్యాలనుకొంటున్నాను. శత్రువులను జయించటానికి అనుమతించు." (78)
శల్య ఉవాచ
యది మాం నాధిగచ్ఛేథాః యుద్ధాయ కృతనిశ్చయః ।
శపేయం త్వాం మహారాజ పరాభావాయ భారత ॥ 79
శల్యుడు ఇలా అన్నాడు. "యుద్ధానికి నిశ్చయం చేశాక నా దగ్గరకు రాకపోతే మహారాజా! నేను నీకు పరాజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి. (79)
తుష్ణోఽస్మి పూజితశ్చాస్మి యత్ కాంక్షసి తదస్తు తే ।
అనుజానామి చైవ త్వాం యుధ్యస్య జయమాప్నుహి ॥ 80
ఇపుడు నీ పూజలందుకొని ప్రీతి చెందాను. నీకోరిక నెరవేరునుగాక. నీకు అనుమతి నిస్తున్నాను. యుద్ధం చెయ్యి. జయం పొందు. (80)
బ్రూహి చైవ పరం వీర కేనార్థః కిం దదామి తే ।
ఏవంగతే మహారాజ యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ॥ 81
మహారాజా! వీరా! ఇంకా ఏమి కావాలి? నేనేమి ఇస్తాను? నీ పక్షంలో యుద్ధం చెయ్యడం తప్ప నీకేం కావాలో అడుగు. (81)
అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్ ।
ఇతి సత్యం మహారాజ బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥ 82
అర్థానికి మానవుడు దాసుడు తప్ప అర్థం ఎవరికీ దాస్యం చెయ్యదు. ఇది నిజం. మహారాజా! ఆ అర్థంతో కౌరవుల చేత బంధింపబడ్డాను. (82)
కరిష్యామి హి తే కామం భాగినేయ యథేప్సితమ్ ।
బ్రవీమ్యతః క్లీబవత్ త్వాం యుద్ధాదన్యత్ కిమిచ్ఛసి ॥ 83
మేనల్లుడా! అందుచేత నేను నపుంసకునివలె మాట్లాడవలసి వస్తోంది. నీపక్షాన యుద్ధం చెయ్యడం తప్ప నీకే హితం కావాలన్నా చేస్తాను. ఏంకావాలో చెప్పు." (83)
యుధిష్ఠిర ఉవాచ
మంత్రయస్వ మహారాజ నిత్యం మద్ధితముత్తమమ్ ।
కామం యుద్ధ్య పరస్యార్థే వరమేతం వృణోమ్యహమ్ ॥ 84
ధర్మరాజు అన్నాడు.
"మహారాజా! నీవు శత్రు పక్షంలోనే యుద్ధం చెయ్యి. కాని నిత్యమూ నాకు మేలు కలిగేటట్లు ఆలోచించు. నేను కోరే వరమిదే!" (84)
శల్య ఉవాచ
కిమత్ర బ్రూహి సాహ్యం తే కరోమి నృపసత్తమ ।
కామం యోత్స్యే పరస్యార్థే బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥ 85
శల్యుడన్నాడు.
"నీకే సహాయం చెయ్యాలో చెప్పు ధర్మరాజా! కౌరవుల అర్థానికి బంధితుడను కావున వారి పక్షంలో తప్పక యుద్ధం చేస్తాను." (85)
యుధిష్ఠిర ఉవాచ
స ఏవ మే వరః శల్య ఉద్యేగే యస్త్వయా కృతః ।
సూతపుత్రస్య సంగ్రామే కార్యస్తేజోవధస్త్వయా ॥ 86
(త్వాం హి యోక్ష్యతి సూతత్వే సూతపుత్రస్య మాతులే ।
దుర్యోధనో రణే శూరమ్ ఇతి మే నైష్ఠికీ మతిః ॥)
వెంటనే ధర్మరాజు ఇలా అన్నాడు.
"మహారాజా! యుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నపుడు నీవిచ్చిన వరమే నాకిపుడూ ఇయ్యి. యుద్ధంలో నీవు కర్ణునికి తేజోవధ చెయ్యాలి. ఆ దుర్యోధనుడు యుద్ధంలో కర్ణునికి సారథిగా నిన్నే ఉంచుతాడని నా నిశ్చితాభిప్రాయం" (86)
శల్య ఉవాచ
సంపత్స్యత్యేష తే కామః కుంతీపుత్ర యథేప్సితమ్ ।
గచ్ఛ యుధ్యస్వ విశ్రబ్ధః ప్రతిజానే వచస్తవ ॥ 87
శల్యుడు ఇలా అన్నాడు.
"కుంతీపుత్రా! నీ కోరిక తీరుతుంది. వెళ్లు. యుద్ధం చెయ్యి. నీ కోరిక తీరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను." (87)
సంజయ ఉవాచ
అనుమాన్యాథ కౌంతేయః మాతులం మద్రకేశ్వరమ్ ।
నిర్జగామ మహాసైన్యాద్ భ్రాతృభిః పరివారితః ॥ 88
సంజయుడు చెప్ఫాడు.
ధర్మరాజు ఇలా మేనమామ అయిన శల్యుని అనుజ్ఞ తీసుకొని, తమ్ములతో సహా ఆ మహాసైన్యంలోంచి బయటకు వచ్చాడు. (88)
వాసుదేవస్తు రాధేయమ్ ఆహవేఽభిజగామ వై ।
తత ఏనమువాచేదం పాండవార్థే గదాగ్రజః ॥ 89
కృష్ణుడు మాత్రం సైన్యంలో ఉన్న కర్ణుని దగ్గరకు వెళ్లి, పాండవుల కోసం అతనితో ఇలా అన్నాడు. (89)
శ్రుతం మే కర్మ భీష్మస్య ద్వేషాత్ కిల న యోత్స్యసే ।
అస్మాన్ వరయ రాధేయ యావద్ భీష్మో న హన్యతే ॥ 90
"కర్ణా నీవు భీష్ముని మీద ద్వేషంతో యుద్ధం చెయ్యటం లేదట కదా! బీష్ముడు పడిపోయేంతవరకూ కర్ణా! పాండవ పక్షం వహించరాదూ! (90)
హతే తు భీష్మే రాధేయ పునరేష్యసి సంయుగమ్ ।
ధార్తరాష్ట్రస్య సాహాయ్యం యది పశ్యసి చేత్ సమమ్ ॥ 91
భీష్ముడు పడిపోయాక నీకు మంచిదనిపిస్తే అపుడు మళ్లీ దుర్యోధనుని పక్షాన యుద్ధం చేద్ధువుగాని." (91)
కర్ణ ఉవాచ
న విప్రియం కరిష్యామి ధార్తరాష్ట్రస్య కేశవ ।
త్యక్తప్రాణం హి మాం విద్ధి దుర్యోధనహితైషిణమ్ ॥ 92
కర్ణుడు అన్నాడు.
"కేశవా! దుర్యోధనునికి ఎన్నడూ అప్రియం చెయ్యను. దుర్యోధనుని మేలుకోసం ప్రాణాలిస్తానని తెలుసుకో!" (92)
సంజయ ఉవాచ
తచ్ఛ్రుత్వా వచనం కృష్ణః సన్న్యవర్తత భారత ।
యుధిష్ఠిరపురోగైశ్చ పాండవైః సహ సంగతః ॥ 93
సంజయుడు అన్నాడు.
ఆ మాట విని, కృష్ణుడు తిరిగి ధర్మజుని ముందు నిలుపుకొని వెళ్తున్న పాండవులను కలిశాడు. (93)
అథ సైన్యస్య మధ్యే తు ప్రాక్రోశత్ పాండవాగ్రజః ।
యోఽస్మాన్ వృణోతి తమహం వరయే సాహ్యకారణాత్ ॥ 94
అపుడు ధర్మరాజు రెండుసేనల మధ్యలో నిలిచి 'నా పక్షాన సహాయం చేయగోరేవారిని నేను కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాను.' అని అరిచాడు. (94)
అథ తాన్ సమభిప్రేక్ష్య యుయుత్సురిదమబ్రవీత్ ।
ప్రీతాత్మా ధర్మరాజానం కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 95
అపుడు యుయుత్సుడు సంతోషించి కుంతీపుత్రుడు, యుధిష్ఠిరుడు అయిన ధర్మరాజుతో ఇలా అన్నాడు. (95)
అహం యోత్స్యామి భవతః సంయుగే ధృతరాష్ట్రజాన్ ।
యుష్మదర్థం మహారాజ యది మం వృణుషేఽనఘ ॥ 96
మహారాజా! 'నన్ను నీవు స్వీకరిస్తే నేను యుద్ధంలో నీకోసం ఈ ధృతరాష్ట్రపుత్రులతో యుద్ధం చేస్తాను.' (96)
యుధిష్ఠిర ఉవాచ
ఏహ్యేహి సర్వే యోత్స్యామః తవ భ్రాతౄనపండితాన్ ।
యుయుత్సో వాసుదేవశ్చ వయం చ బ్రూమ సర్వశః ॥ 97
ధర్మరాజు వెంటనే ఇలా అన్నాడు.
'యుయుత్సూ! రా! రా! మనమంతా మూర్ఖులయిన నీ సోదరులతో యుద్ధం చేద్ధాం. మేమూ, వాసుదేవుడూ కూడా నిక్కచ్చిగా చెపుతున్నాం. (97)
వృణోమి త్వాం మహాబాహో యుద్ధ్యస్వ మమ కారణాత్ ।
త్వయి పిండశ్చ తంతుశ్చ ధృతరాష్ట్రస్య దృశ్యతే ॥ 98
నిన్ను స్వీకరిస్తున్నాను. నా కోసం యుద్ధం చెయ్యి. దృతరాష్ట్రుని వంశపరంపర, పిండోదక క్రియలు చేసే భారం నీమీదే ఉన్నట్లు కనిపిస్తోంది. (98)
భజస్వాస్మాన్ రాజపుత్ర భజమానాన్ మహాద్యుతే ।
న భవిష్యతి దుర్బుద్ధిః ధార్తరాష్ట్రోఽత్యమర్షణః ॥ 99
రాజపుత్రా! నిన్ను ఆదరించే మాతో కలియుము. ఇక దుర్బుద్ధి, అతికోపి అయిన దుర్యోధనుడు మిగలడు.' (99)
సంజయ ఉవాచ
తతో యుయుత్సుః కౌరవ్యాన్ పరిత్యజ్య సుతాంస్తవ ।
(స సత్యమితి మన్వానః యుధిష్ఠిరవచస్తదా ।)
జగామ పాండుపుత్రాణాం సేనాం విశ్రావ్య దుందుభిమ్ ॥ 100
సంజయుడు చెప్పాడు. ధర్మరాజు మాటలు నమ్మి వెంటనే యుయుత్సుడు నీ కొడుకులను విడిచి దుందుభి వాయిస్తూ పాండవ సేనలోకి వెళ్లిపోయాడు. (100)
అవసద్ ధార్తరాష్ట్రస్య కుత్సయన్ కర్మ దుష్కృతమ్ ।
సేనామధ్యే హి తైః సాకం యుద్ధాయ కృతనిశ్చయః ॥)
అతడు దుర్యోధనుని పాపకృత్యం నిందిస్తూ, వారిసేనలోనే యుద్ధం చేయటానికి నిశ్చయించుకొని ఉండిపోయాడు.
తతో యుధిష్ఠిరో రాజా సంప్రహృష్టః సహానుజః ।
జగ్రాహ కవచం భూయః దీప్తిమత్ కనకోజ్జ్వలమ్ ॥ 101
అపుడు ధర్మరాజు తమ్ముళ్లతో సహా సంతోషించి, కాంతిమంతమయిన కనక కవచం మళ్లీ తొడుగుకొన్నాడు. (101)
ప్రత్యపద్యంత తే సర్వే స్వరథాన్ పురుషర్షభాః ।
తతో వ్యూహం యథాపూర్వం ప్రత్యవ్యూహంత తే పునః ॥ 102
వాళ్లంతా తమ తమ రథాలు చేరారు. వ్యూహమూ, ప్రతి వ్యూహమూ మళ్లీ యథాపూర్వంగా నిలిచాయి. (102)
అవాదయన్ దుందుభీంశ్చ శతశశ్చైవ పుష్కరాన్ ।
సింహనాదాంశ్చ వివిధాన్ వినేదుః పురుషర్షభాః ॥ 103
ఉత్తమ పురుషులు శంఖాలూ, దుందుభులూ మ్రోగించి అనేక విధాల సింహనాదాలు చేశారు. (103)
రథస్థాన్ పురుషవ్యాఘ్రాన్ పాండవాన్ ప్రేక్ష్య పార్థివాః ।
ధృష్టద్యుమ్నాదయః సర్వే పునర్జహృషిరే తదా ॥ 104
పురుషశ్రేష్ఠులయిన పాండవులను రథాలపై చూసి, ధృష్టద్యుమ్నాలందరూ మళ్లీ ఎంతో సంతోషించారు. (104)
గౌరవం పాండుపుత్రాణాం మాన్యాన్ మానయతాం చ తాన్ ।
దృష్ట్వా మహీక్షితస్తత్ర పూజయాంచక్రిరే భృశమ్ ॥ 105
మాన్యులను గౌరవించే పాండవుల గౌరవం చూసి, రాజులందరూ ఎంతో ప్రశంసించారు. (105)
సౌహృదం చ కృపాం చైవ ప్రాప్తకాలం మహాత్మనామ్ ।
దయాం చ జ్ఞాతిషు పరాం కథయాంచక్రిరే నృపాః ॥ 106
సమయోచిత మయిన పాండవుల స్నేహం, దయ, జ్ఞాతులపై సామరస్యమూ చూసి రాజులందరూ ఎంతగానో చెప్పుకొన్నారు. (106)
సాధుసాధ్వితి సర్వత్ర విశ్చేరుః స్తుతి సంహితాః ।
వాచః పుణ్యాః కీర్తిమతాం మనోహృదయ హర్షణాః ॥ 107
యశస్వులయిన పాండవుల గురించి అన్ని పక్షాల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. మనస్సుకు ఆహ్లాదం కలిగించే శుభాకాంక్షలు వెలువడ్డాయి. (107)
మ్లేచ్ఛాశ్చార్యాశ్చ యే తత్ర దదృశుః శుశ్రువు స్తదా ।
వృత్తం తత్పాండుపుత్రాణాం రురుదుస్తే సగద్గదాః ॥ 108
మ్లేచ్ఛులూ, ఆర్యులు కూడా పాండవుల ప్రవర్తన చూసి, విని, గద్గద కంఠంతో విలపించారు. (108)
తతో జఘ్నుర్మహా భేరీః శతశశ్చ సహస్రశః ।
శంఖాంశ్చగోక్షీరనిభాన్ దధ్ముర్హృష్టా మనస్వినః ॥ 109
తరువాత ఉత్సాహంతో ఉన్న యోధులందరూ వందలకొద్దీ, వేలకొద్దీ యుద్ధబేరులు మ్రోగించారు. ఆవుపాల వంటి తెల్లని శంఖాలు ఊదారు. (109)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధ పర్వణి భీష్మాది సమ్మాననే త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 43 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున ధర్మరాజు భీష్మాదుల అనుమతి పొందుట అను నలువది మూడవ అధ్యాయము. (43)
(దాక్షిణాత్య అధిక పాఠం 3 శ్లోకాలు కలిపి 112 శ్లోకాలు)