44. నలువది నాలుగవ అధ్యాయము
కౌరవ పాండవుల ప్రథమ దిన యుద్ధ ప్రారంభము.
దృతరాష్ట్ర ఉవాచ
ఏవం వ్యూఢేష్వనీకేషు మామ కేష్వితరేషు చ ।
కే పూర్వం ప్రాహరంస్తత్ర కురవః పాండవా ను కిమ్ ॥ 1
ధృతరాష్ట్రుడిలా అడిగాడు - మా సేనలు, శత్రుసేనలు వ్యూహాత్మకంగా నిలిచిన తర్వాత ముందుగా ఎవరు దాడి చేశారు? కౌరవులా? పాండవులా? (1)
సంజయ ఉవాచ
భ్రాతృభిః సహితో రాజన్ పుత్రో దుర్యోధనస్తవ ।
భీష్మం ప్రముఖతః కృత్వా ప్రయయౌ సహ సేనయా ॥ 2
సంజయుడు చెప్తున్నాడు.
రాజా! నీ కొడుకు దుర్యోధనుడు సోదరులతో, సేనతో కలిసి, భీష్ముని ముందుంచుకొని నడిచాడు. (2)
తథైవ పాండవాః సర్వే భీమసేనపురోగమాః ।
భీష్మేణ యుద్ధమిచ్ఛంతః ప్రయయుర్హృష్టమానసాః ॥ 3
అలాగే పాండవులంతా భీమసేనుని ముందుంచుకొని, భీష్మునితో యుద్ధం చేయాలనుకొంటూ ఆనందంగా బయలుదేరారు. (3)
క్ష్వేడాః కిలకిలాశబ్దాః క్రకచా గోవిషాణికాః ।
భేరీమృదంగమురజాః హయకుంజరనిఃస్వనాః ॥ 4
ఉభయోః సేనయోర్హ్యాసన్ తతస్తేఽస్మాన్ సమాద్రవన్ ।
వయం తాన్ ప్రతినర్దంతః తదాసీత్ తుములం మహత్ ॥ 5
రెండు సేనలలో సింహనాదాలు, కిలాకిలారావాలు, రంపాలు, కొమ్ము బూరలు, భేరులు, మృదంగాలు, డోళ్ళు - మొదలయిన వాద్యాల ధ్వనులు, గుర్రాలు, ఏనుగుల గర్జనలు ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు పాండవులు మనపై దూకారు. మనవాళ్లు కూడా వారిపై ఎదురుదాడి చేశారు. భీకరయుద్ధం జరిగింది. (4,5)
మహాంత్యనీకాని మహాసముచ్ఛ్రయే
సమాగమే పాండవధార్తరాష్ట్రయోః ।
చకంపిరే శంఖమృదంగనిఃస్వనైః
ప్రకంపితానీవ వనాని వాయునా ॥ 6
ఆ మహాభీకర సంగ్రామంలో పాండవ కౌరవసేనలు గాలికి కంపిస్తున్న వనాలవలె శంఖ మృదంగ శబ్దాలతో కంపించిపోసాగాయి. (6)
నరేంద్రనాగాశ్వరథాకులానామ్
అభ్యాగతానామశివే ముహూర్తే ।
బభూవ ఘోషస్తుములశ్చమూనాం
వాతోద్ధుతానామివ సాగరాణామ్ ॥ 7
రాజులు, ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన ఉభయపక్ష సేనలూ దుర్ముహూర్తంలో ఒకరినొకరు ఎదురుబడినప్పుడు, పెనుగాలితో క్షోభించిన సముద్రాల వలె భీకరఘోష వెలువడింది. (7)
తస్మిన్ సముత్థితే శబ్దే తుములే లోమహర్షణే ।
భీమసేనో మహాబాహుః ప్రాణదద్ గోవృషో యథా ॥ 8
ఒళ్ళు గగుర్పొడిచే ఆ భీకరధ్వని వెలువడినప్పుడు మహాబాహువయిన భీమసేనుడు ఆంబోతువలె రంకె వేశాడు. (8)
శంఖదుందుభీనిర్ఘోషం వారణానాం చ బృంహితమ్ ।
సింహనాదం చ సైన్యానాం భీమసేనారవోఽభ్యభూత్ ॥ 9
భీమసేనుని ఆ అరుపు శంఖదుందుభుల ఘోషను, ఏనుగుల ఘీంకారాన్ని, సేనల సింహనాదాన్ని అతిక్రమించింది. (9)
హయానాం హ్రేషమాణానామ్ అనీకేషు సహస్రశః ।
సర్వానభ్యభవచ్ఛబ్దాన్ భీమస్య నదతః స్వనః ॥ 10
సేనలలో వేలకొలది గుర్రాలు సకిలిస్తున్నాయి. అయినా భీమసేనుని సింహనాద ధ్వని ఆ శబ్దాలనన్నింటినీ మించిపోయింది. (10)
తం శ్రుత్వా నినదం తస్య సైన్యాస్తవ వితత్రసుః ।
జీమూతస్యేవ నదతః శక్రాశనిసమస్వనమ్ ॥ 11
ఆ భీమసేనుని అరుపు మేఘగర్జనలా ఉంది. ఇంద్రుని వజ్రాయుధం చేసే గడగడ ధ్వనిలా ఉంది. అది విని నీ సేనలు బెదరిపోయాయి. (11)
వాహనాని చ సర్వాణి శకృన్మూత్రం ప్రసుస్రువుః ।
శబ్దేన తస్య వీరస్య సింహస్యేవేతరే మృగాః ॥ 12
సింహగర్జన విని, ఇతర మృగాలు భయపడినట్లు ఆ భీమసేనుని అరుపు విని, కౌరవసేనలోని వాహనాలు మల మూత్రవిసర్జన చేశాయి. (12)
దర్శయన్ ఘోరమాత్మానం మహాభ్రమివ నాదయన్ ।
విభీషయంస్తవ సుతాన్ భీమసేనః సమభ్యయాత్ ॥ 13
భీమసేనుడు మహామేఘం వలె గర్జిస్తూ, తన భీకర రూపాన్ని ప్రదర్శిస్తూ, నీ కుమారులను భయపెడుతూ మీదికి ఉరికాడు. (13)
తమాయాంతం మహేష్వాసం సోదర్యాః పర్యవారయన్ ।
ఛాదయంతః శరవ్రాతైః మేఘా ఇవ దివాకరమ్ ॥ 14
మేటివిలుకాడైన భీమసేనుని రాకను చూసి, దుర్యోధనుని సోదరులు మేఘాలు సూర్యుని కప్పివేసినట్లు, బాణసమూహంతో ఆయనను కప్పివేస్తూ చుట్టుముట్టారు. (14)
దుర్యోధనశ్చ పుత్రస్తే దుర్ముఖో దుఃశలః శలః ।
దుఃశాసనశ్చాతిరథః తథా దుర్మర్షణో నృప ॥ 15
వివింశతిశ్చిత్రసేనః వికర్ణశ్చ మహారథః ।
పురుమిత్రో జయో భోజః సౌమదత్తిశ్చ వీర్యవాన్ ॥ 16
మహాచాపాని ధున్వంతః మేఘా ఇవ సవిద్యుతః ।
ఆదదానాశ్చ నారాచాన్ నిర్ముక్తాశీవిషోపమాన్ ॥ 17
(అగ్రతః పాండుసేనాయాః హ్యతిష్ఠన్ పృథివీక్షితః ॥)
రాజా! నీ కొడుకు దుర్యోధనుడు, దుర్ముఖుడు, దుశ్శలుడు, శలుడు, అతిరథుడైన దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, చిత్రసేనుడు, జయుడు, మహారథుడైన వికర్ణుడు, పురుమిత్రుడు, జయుడు, భోజుడు, పరాక్రమశాలి అయిన సౌమదత్తి, ఇతరరాజులు మెరుపులతో కూడిన మేఘాల వలె తమ ధనుస్సులను కదుపుతూ, విడిస్తే చాలు పాముల్లా దూసుకొనిపోయే బాణాలను చేత ధరించి, పాండుసేనను నిలవరిస్తూ, ఎదురు నిలిచారు. (15-17)
అథ తే ద్రౌపదీపుత్రాః సౌభద్రశ్చ మహారథః ।
నకులః సహదేవశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 18
ధార్తరాష్ట్రాన్ ప్రతియయుః అర్దయంతః శితైః శరైః ।
వజ్రైరివ మహావేగైః శిఖరాణి ధరాభృతామ్ ॥ 19
అటు ద్రౌపది కొడుకులు, మహారథుడైన అభిమన్యుడు, నకులుడు, సహదేవుడు, ద్రుపదసుతుడు, ధృష్టద్యుమ్నుడు వీరంతా వజ్రం కొండల శిఖరాలను పీడించినట్లు, వేగమూ, వాడీ కల తమబాణాలతో ధార్తరాష్ట్రులను పీడిస్తూ, వారిపై కురికారు. (18,19)
తస్మిన్ ప్రథమసంగ్రామే భీమజ్యాతలనిఃస్వనే ।
తావకానాం పరేషాం చ నాసీత్ కశ్చిత్ పరాఙ్ ముఖః ॥ 20
ధనుష్టంకారాలు, జబ్బచరుపుల చప్పుళ్ళు గల ఆ తొలి సంగ్రామంలో నీ వారు కానీ, పెరవారు కానీ ఎవ్వరూ యుద్ధ విముఖులు కాలేదు. (20)
లాఘవం ద్రోణశిష్యాణామ్ అపశ్యం భరతర్షభ ।
నిమిత్తవేధినాం చైవ శరానుత్సృజతాం భృశమ్ ॥ 21
భరతర్షభా! ద్రోణశిష్యుల నేర్పరితనం అక్కడ కనిపిస్తోంది. వారు బాణాలను బాగా వదులుతున్నారు. లక్ష్యాలను చక్కగా కొడుతున్నారు. (21)
నోపశామ్యతి నిర్ఘోషః ధనుషాం కూజతాం తథా ।
వినిశ్చేరుః శరా దీప్తాః జ్యోతీంషీవ నభస్తలాత్ ॥ 22
ఆ రీతిగా నినదిస్తున్న ధనుష్టంకారాల ఘోష ఆగటం లేదు. మండుతున్న బాణాలు నక్షత్రాల వలె గగనతలం నుండి నేలకు దిగుతున్నాయి. (22)
సర్వే త్వన్యే మహీపాలాః ప్రేక్షకా ఇవ భారత ।
దదృశుర్దర్శనీయం తం బీమం జ్ఞాతిసమాగమమ్ ॥ 23
భారతా! విచిత్రంగా కనిపిస్తున్న ఆ దాయాదులపోరును ఇతర నరపాలురు ప్రేక్షకుల వలె చూస్తున్నారు. (23)
తతస్తే జాతసంరంభాః పరస్పరకృతాగసః ।
అన్యోన్యస్పర్ధయా రాజన్ వ్యాయచ్ఛంత మహారథాః ॥ 24
రాజా! ఆ తరువాత బాల్యావస్థలో ఒకరిపట్ల మరొకరు అపరాధం చేసిన ఆ మహారథులందరూ కోపంతో, పరస్పర స్పర్ధతో ఘర్షణకు దిగారు. (24)
కురుపాండవసేనే తే హస్త్యశ్వరథసంకులే ।
శుశుభాతే రణేఽతీవ పటే చిత్రార్పితే ఇవ ॥ 25
ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నిండి ఉన్న కౌరవ పాండవ సేనలు గుడ్డపై చిత్రించినట్లు ఆ రణభూమిలో స్థిరంగా ప్రకాశిస్తున్నాయి. (25)
తతస్తే పార్థివాః సర్వే ప్రగృహీతశరాసనాః ।
సహసైన్యాః సమాపేతుః పుత్రస్య తవ శాసనాత్ ॥ 26
ఆ తరువాత ఆ రాజులందరూ నీ కుమారుని ఆదేశంతో ధనుస్సులు చేతపట్టి, సైన్యాలతో సహా అక్కడకు చేరారు. (26)
యుధిష్ఠిరేణ చాదిష్టాః పార్థివాస్తే సహస్రశః ।
వినదంతః సమాపేతుః పుత్రస్య తవ వాహినీమ్ ॥ 27
యుధిష్ఠిరుని ఆదేశాన్ని అనుసరించి, వేలకొలది రాజులు గర్జుస్తూ, నీ కుమారుని సేనను ముట్టడించారు. (27)
ఉభయోః సేనయోస్తీవ్రః సైన్యానాం స సమాగమః ।
అంతర్ధీయత చాదిత్యః సైన్యేన రజసాఽఽవృతః ॥ 28
ఉభయపక్షబలాలలోని ఆ సేనాసమాగమం తీవ్ర మయినది. ఆ సేనల దుమ్ము కప్పి, సూర్యుడు కూడా కనిపించకుండా పోయాడు. (28)
ప్రయుద్ధానాం ప్రభగ్నానాం పునరావర్తినామపి ।
నాత్ర స్వేషాం పరేషాం వా విశేషః సమదృశ్యత ॥ 29
కొందరు యుద్ధం చేస్తున్నారు. కొందరు భంగపడ్డారు. మరికొందరు పారిపోయిమరలా వస్తున్నారు. ఈ విషయంలో నీ సేనలకూ, శత్రుసేనలకూ మధ్య తేడా ఏమీ లేదు. (29)
తస్మింస్తు తుములే యుద్ధే వర్తమానే మహాభయే ।
అతిసర్వాణ్యనీకాని పితా తేఽభివ్యరోచత ॥ 30
మహాభీకరంగా ఆ ఘోరయుద్ధం జరుగుతుంటే, నీ తండ్రి (భీష్ముడు) సేనల నన్నింటినీ అతిక్రమించి, విరాజిల్లుతున్నాడు. (30)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి భీష్మాదిసమ్మాననే త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 44 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున యద్ధారంభమను నలువది నాలుగవ అధ్యాయము. (44)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 30 1/2 శ్లోకాలు)