45. నలువది అయిదవ అధ్యాయము
ఉభయ సేనల ద్వంద్వ యుద్ధము.
సంజయ ఉవాచ
పూర్వాహ్ణే తస్య రౌద్రస్య యుద్ధమహ్నో విశాంపతే ।
ప్రావర్తత మహాఘోరం రాజ్ఞాం దేహావకర్తనమ్ ॥ 1
సంజయుడు చెప్తున్నాడు.
రాజా! భయంకరమైన ఆనాటి ప్రథమభాగంలో రాజులకుత్తుకలు ఉత్తరింపబడే ఘోరయుద్ధం జరిగింది. (1)
కురూణాం సృంజయానాం చ జిగీఘాణాం పరస్పరమ్ ।
సింహానామివ సంహ్రాదః దివముర్వీం చ నాదయన్ ॥ 2
కౌరవులు, సృంజయ వంశస్థులు ఒకరినొకరు గెలవాలని చేస్తున్న సింహనాదం భూమ్యాకాశాలను ప్రతి ధ్వనింపజేస్తోంది. (2)
ఆసీత్ కిలకిలాశబ్దః తలశంఖరవైః సహ ।
జజ్ఞిరే సింహనాదాశ్చ శూరాణాం ప్రతిగర్జతామ్ ॥ 3
అరచేతి చప్పుళ్ళు, శంఖధ్వనులతో పాటు సైనికుల కిలాకిలారావాలు వ్యాపించాయి. గర్జనలు, ప్రతిగర్జనలతో శూరులు సింహనాదాలు చేస్తున్నారు. (3)
తలత్రాభిహతాశ్చైవ జ్యాశబ్దా భరతర్షభ ।
పత్తీనాం పాదశబ్దశ్చ వాజినాం చ మహాస్వనః ॥ 4
తోత్రాంకుశనిపాతశ్చ ఆయుధానాం చ నిఃస్వనః ।
ఘంటాశబ్దశ్చ నాగానామ్ అన్యోన్యమభిధావతామ్ ॥ 5
తస్మిన్ సముదితే శబ్దే తుములే లోమహర్షణే ।
బభూవ రథనిర్ఘోషః పర్జన్యనినదోపమః ॥ 6
భరతశ్రేష్ఠా! తలత్రాల తాకిడితో నినదించే అల్లెత్రాళ్ళచప్పుళ్ళు, పదాతిదళాల అడుగుల సవ్వడులు, గుర్రాల సకిలింతలు; కొరడాలు, అంకుశాలు, ఆయుధాల దెబ్బలు, పరస్పరం దాడి చేసికొంటున్న ఏనుగుల ఘంటల శబ్దాలు అన్నీ కలిసి రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు.
భీకరంగా ధ్వనిస్తున్నాయి. రథఘోష మేఘగర్జనలా వినిపిస్తోంది. (4-6)
వి॥ తలత్రం = చేతికి దెబ్బ తగలకుండా ధరించే చర్మపుతొడుగు.
తే మనః క్రూరమాధాయ సమభిత్యక్తజీవితాః ।
పాండవానభ్యవర్తంత సర్వ ఏవోచ్ఛ్రితధ్వజాః ॥ 7
కౌరవులందరూ మనస్సులలో క్రౌర్యాన్ని వహించి, ప్రాణాలపై ఆశలను వీడి, పతాకలను ఎగురవేస్తూ పాండవులపై దాడిచేశారు. (7)
అథ శాంతనవో రాజన్ అభ్యధావద్ ధనంజయమ్ ।
ప్రగృహ్య కార్ముకం ఘోరం కాలదండోపమం రణే ॥ 8
అప్పుడు కాలదండం వంటి భీకర ధనుస్సును చేతబట్టి, భీష్ముడు యుద్ధంలో అర్జునునివైపు సాగాడు. (8)
అర్జునోఽపి ధనుర్గృహ్య గాండీవం లోకవిశ్రుతమ్ ।
అభ్యధావత తేజస్వీ గాంగేయం రణమూర్ధని ॥ 9
తేజస్వి అయిన అర్జునుడు కూడా లోకప్రసిద్ధివహించిన తన ధనుస్సును - గాండీవాన్ని తీసికొని రణశిరస్సున భీష్మునివైపు ఉరికాడు. (9)
తావుభౌ కురుశార్దూలౌ పరస్పరవధైషిణౌ ।
గాంగేయస్తు రణే పార్థం విద్ధ్వా నాకంపయత్ బలీ ॥ 10
ఆ కురుసింహాలు ఇరువురూ ఒకరినొకరు చంపాలనుకొంటున్నారు. భీష్ముడు బలిష్ఠుడై కూడా అర్జునుని గాయపరచగలిగాడే కానీ చలింపజేయలేకపోయాడు. (10)
తథైవ పాండవో రాజన్ భీష్మం నాకంపయద్ యుధి ।
సాత్యకిస్తు మహేష్వాసః కృతవర్మాణమభ్యయాత్ ॥ 11
రాజా! అలాగే అర్జునుడు కూడా యుద్ధంలో భీష్ముని చలింపజేయలేకపోయాడు. అటు మేటివిలుకాడైన సాత్యకి కృతవర్మను ఎదిరించాడు. (11)
తయోః సమభవద్ యుద్ధం తుములం లోమహర్షణమ్ ।
సాత్యకిః కృతవర్మాణం కృతవర్మా చ సాత్యకిమ్ ॥ 12
ఆనర్చ్ఛతుః శరైర్ఘోరైః తక్షమాణౌ పరస్పరమ్ ।
వారిద్దరికీ రోమాంచాన్ని కల్గించేటట్లు భీకరయుద్ధం జరిగింది. సాత్యకి కృతవర్మనూ, కృతవర్మ సాత్యకిని వాడి బాణాలతో తీవ్రంగా గాయపరుస్తూ, ఒకరినొకరు బాధించుకొన్నారు. (12 1/2)
తౌ శరార్చితసర్వాంగౌ శుశుభాతే మహాబలౌ ।
వసంతే పుష్పశబలౌ పుష్పితావివ కింశుకౌ ।
శరీరమంతా బాణాలతో తూట్లుపడి ఆ మహాబలులు ఇద్దరూ వసంతంలో పుష్పించి, పూలతో నిండిన కింశుకవృక్షాలవలె ప్రకాశించారు. (13 1/2)
అభిమన్యుర్మహేష్వాసం బృహద్ బలమయోధయత్ ॥ 14
తతః కోసలరాజాసౌ అభిమన్యోర్విశాంపతే ।
ధ్వజం చిచ్ఛేద సమరే సారథిం చ న్యపాతయత్ ॥ 15
అభిమన్యుడు మేటివిలుకాడైన బృహద్బలునితో యుద్ధం చేశాడు. రాజా! అప్పుడు ఆ కోసలరాజు యుద్ధంలో అభిమన్యుని ధ్వజాన్ని ముక్కలు చేసి, సారథిని పడగొట్టాడు. (14,15)
సౌభద్రస్తు తతః క్రుద్ధః పాతితే రథసారథౌ ।
బృహద్బలం మహారాజ వివ్యాధ నవభిః శరైః ॥ 16
మహారాజా! అప్పుడు సారథిని పడగొట్టగానే కోపించిన అభిమన్యుడు తొమ్మిది బాణాలతో బృహద్బలుని గాయపరిచాడు. (16)
అథాపరాభ్యాం భల్లాభ్యాం శితాభ్యామరిమర్దనః ।
ధ్వజమేకేన చిచ్ఛేద పార్ ష్ణిమేకేన సారథిమ్ ॥ 17
అన్యోన్యం చ శరైః క్రుద్ధౌ తతక్షాతే పరస్పరమ్ ।
ఆ తరువాత శత్రుమర్దనుడైన అభిమన్యుడు రెండు వాడి బాణాలతో బృహద్బలుని ధ్వజాన్ని పడగొట్టాడు. ఒక బాణంతో ధ్వజరక్షకుని, మరొక బాణంతో సారథిని చంపివేశాడు. కోపంతో వారిద్దరూ ఒకరినొకరు గాయపరచుకొన్నారు. (17 1/2)
మానినం సమరే దృప్తం కృతవైరం మహారథమ్ ॥ 18
భీమసేనస్తవ సుతం దుర్యోధనమయోధయత్ ।
రణాభిమాని, గర్విష్ఠి, చిరకాలశత్రువు, మహారథుడు అయిన నీ కొడుకు - దుర్యోధనునితో భీమసేనుడు తలపడ్డాడు. (18 1/2)
తావుభౌ నరశార్దూలౌ కురుముఖ్యౌ మహాబలౌ ॥ 19
అన్యోన్యం శరవర్షాభ్యాం వవృషాతే రణాజిరే ।
కురుముఖ్యులు, నరశార్దూలులు, మహాబలులు అయిన ఆ ఇద్దరూ రణప్రాంగణంలో బాణవృష్టి కురిపించారు. (19 1/2)
తౌ వీక్ష్య తు మహాత్మానౌ కృతునౌ చిత్రయోధినౌ ॥ 20
విస్మయః సర్వభూతానాం సమపద్యత భారత ।
భారతా! మహాత్ములు, అస్త్రవిద్యా పండితులు, చిత్రంగా యుద్ధం చేయటంలో నేర్పరులు అయిన ఆ ఇద్దరినీ చూసి, సమస్త ప్రాణులు ఆశ్చర్యానికి లోనయ్యాయి. (20 1/2)
దుఃశాసనస్తు నకులం ప్రత్యుద్యాయ మహాబలమ్ ॥ 21
అవిధ్యన్నిశితైర్బాణైః బహుభిర్మర్మభేదిభిః ।
దుఃశ్శాసనుడు ముందుకుపోయి, మర్మచ్ఛేదకాలయిన నిశితశరాలను ఎన్నింటినో ప్రయోగించి, మహాబలుడైన నకులుని గాయపరిచాడు. (21 1/2)
తస్య మాద్రీసుతః కేతుం సశరం చ శరాసనమ్ ॥ 22
చిచ్ఛేద నిశితైర్బాణైః ప్రహసన్నివ భారత ।
అథైవం పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్ ॥ 23
నకులుడు అవహేళన చేస్తున్నట్లుగా వాడిబాణాలతో ఆ దుశ్శాసనుని ధ్వజాన్ని, బాణాన్ని, ఎక్కుపెట్టిన వింటిని ముక్కలు చేశాడు. ఆ పై ఇరవైఅయిదు బాణాలతో దుశ్శాసనుని గాయపరిచాడు. (22,23)
పుత్రస్తు తవ దుర్ధర్షః నకులస్య మహాహవే ।
తురంగాంశ్చిచ్ఛిదే బాణైః ధ్వజం చైవాభ్యపాతయత్ ॥ 24
ఆ మహాయుద్ధంలో ఎదురులేని నీ కొడుకు (దుశ్శాసనుడు) నకులుని గుర్రాలను, ధ్వజాన్ని బాణాలతో పడగొట్టాడు. (24)
దుర్ముఖః సహదేవం చ ప్రత్యుద్యాయ మహాబలమ్ ।
వివ్యాధ శరవర్షేణ యతమానం మహాహవే ॥ 25
మహారణంలో విజయానికై ప్రయత్నిస్తున్న మహాబలుడైన సహదేవుని ఎదిరించి, నీ కొడుకు దుర్ముఖుడు బాణవృష్టితో వ్యథపెట్టాడు. (25)
సహదేవస్తతో వీరః దుర్ముఖస్య మహారణే ।
శరేణ భృశతీక్ష్ణేన పాతయామాస సారథిమ్ ॥ 26
ఆ మహారణంలో వీరుడైన సహదేవుడు బాగా వాడి అయిన బాణంతో దుర్ముఖుని సారథిని పడగొట్టాడు. (26)
తావన్యోన్యం సమాసాద్య సమరే యుద్ధదుర్మదౌ ।
త్రాసయేతాం శరైర్ఘోరైః కృతప్రతికృతైషిణౌ ॥ 27
యుద్ధదుర్మదులయిన ఆ ఇద్దరూ కలబడి, ఒకరిచర్యకు మరొకరు ప్రతిచర్య చేయగోరుతూ, భీకరబాణాలతో పరస్పరం బెదురు పుట్టించారు. (27)
యుధిష్ఠిరః స్వయం రాజా మద్రజానమభ్యయాత్ ।
తస్య మద్రాధిపశ్చాపం ద్విధా చిచ్ఛేద మారిష ॥ 28
యుధిష్ఠిరుడు స్వయంగా మద్రరాజు (శల్యుని) మీదకు వచ్చాడు. రాజా! మద్రరాజు యుధిష్ఠిరుని వింటిని రెండు ముక్కలుగా ఖండించాడు. (28)
తదపాస్య ధనుశ్ఛిన్నం కుంతీపుత్రో యుధిష్ఠిర ।
అన్యత్ కార్ముకమాదాయ వేగవద్ బలవత్తరమ్ ॥ 29
తతో మద్రేశ్వరం రాజా శరైః సన్నతపర్వభిః ।
ఛాదయామాస సంక్రుద్ధః తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ॥ 30
విరిగిన ఆ వింటిని ప్రక్కకు నెట్టి, కుంతీసుతుడైన యుధిష్ఠిరుడు ఎక్కువవేగం, ఎక్కువ శక్తి గల మరొక వింటిని తీసికొని, వెంటనే వంగిన కణుపులు గల బాణాలతో శల్యుని కప్పివేశాడు. కోపంగా 'నిలు నిలు' అని అరిచాడు కూడా. (29,30)
ధృష్టద్యుమ్నస్తతో ద్రోణమ్ అభ్యద్రవత భారత ।
తస్య ద్రోణః సుసంక్రుద్ధః పరాసుకరణం దృఢమ్ ॥ 31
త్రిధా చిచ్ఛేద సమరే పాంచాల్యస్య తు కార్ముకమ్ ।
అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదకు వచ్చాడు. దానితో తీవ్రంగా కోపించిన ద్రోణుడు రణరంగంలో శత్రువులను సంహరించటానికి సాధనమైన ఆ ధృష్టద్యుమ్నుని దృఢమైన వింటిని మూడు ముక్కలు చేశాడు. (31 1/2)
శరం చైవ మహాఘోరం కాలదండమివాపరమ్ ॥ 32
ప్రేషయామాస సమరే సోఽస్య కాయే న్యమజ్జత ।
కాలదండంలా ఉన్న మరొక మహాఘోరశరాన్ని ధృష్టద్యుమ్నునిపై వేశాడు. అది ధృష్టద్యుమ్నుని శరీరంలో గ్రుచ్చుకొన్నది. (32 1/2)
అధాన్యద్ ధనురాదాయ సాయకాంశ్చ చతుర్దశ ॥ 33
ద్రోణం ద్రుపదపుత్రస్తు ప్రతివివ్యాధ సంయుగే ।
తావన్యోన్యం సుసంక్రుద్ధౌ చ చక్రతుః సుభృశం రణమ్ ॥ 34
ద్రుపదసుతుడు - ధృష్టద్యుమ్నుడు మరొక ధనుస్సును, పదునాలుగు బాణాలను తీసికొని, యుద్ధంలో తిరిగి దెబ్బతీశాడు. ఒకరిపై ఒకరు కోపిస్తూ, ఆ ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. (33,34)
సౌమదత్తిం రణే శంఖః రభసం రభసో యుధి ।
ప్రత్యుద్యయౌ మహారాజ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ॥ 35
మహారాజా! వేగం గల శంఖుడు వేగగామి, వీరుడైన భూరిశ్రవునిపై దాడిచేసి "నిలు, నిలు" అంటూ నిలువరించాడు. (35)
తస్య వై దక్షిణం వీరః నిర్బిభేద రనే భుజమ్ ।
సౌమదత్తిస్తథా శంఖం జత్రుదేశే సమాహనత్ ॥ 36
వీరుడైన శంఖుడు యుద్ధంలో భూరిశ్రవుని దక్షిణభుజాన్ని చీల్చివేశాడు. భూరిశ్రవుడు కూడా శంఖుని మెడ మీద బాణంతో కొట్టాడు. (36)
తయోస్తదభవద్యుద్ధం ఘోరరూపం విశాంపతే ।
దృప్తయోః సమరే పూర్వం వృత్రవాసవయోరివ ॥ 37
రాజా! గర్వించిన ఆ ఇద్దరి యుద్ధం గతంలో వృత్రాసుర దేవేంద్రుల యుద్ధం వలె ఘోరంగా జరిగింది. (37)
బాహ్లీకం తు రణే క్రుద్ధం క్రుద్ధరూపో విశాంపతే ।
అభ్యద్రవదమేయాత్మా ధృష్టకేతుర్మహారథః ॥ 38
రాజా! రణరంగంలో కోపంగా ఉన్న బాహ్లీకుని, అమేయబల సంపన్నుడూ, మహారథుడూ అయిన ధృష్టకేతువు ఆక్రమించాడు. (38)
బాహ్లీకస్తు రణే రాజన్ ధృష్టకేతు మమర్షణః ।
శరైర్బహుభిరానర్చ్ఛత్ సింహనాదమథానదత్ ॥ 39
రాజా! అమర్షస్వభావం గల బాహ్లీకుడు రణంలో అనేక బాణాలతో ధృష్టకేతువును బాధించి, ఆ పై సింహనాదం చేశాడు. (39)
చేదిరాజస్తు సంక్రుద్ధః బాహ్లీకం నవభిః శరైః ।
వివ్యాధ సమరే తూర్ణం మత్తో మత్తమివ ద్విపమ్ ॥ 40
కోపించిన చేదిరాజు - ధృష్టకేతువు మదపుటేనుగు మదపుటేనుగును గాయపరచినట్లు వెంటనే రణభూమిలో తొమ్మిది బాణాలతో బాహ్లీకుని గాయపరిచాడు. (40)
తౌ తత్ర సమరే క్రుద్ధౌ నర్దంతౌ చ పునఃపునః ।
సమీయతుః సుసంక్రుద్ధౌ అంగారకబుధావివ ॥ 41
రణభూమిలో కోపించిన ఆ బాహ్లీక ధృష్టకేతువులు కోపించిన కుజ-బుధులవలె మాటిమాటికి పెద్దగా అరుస్తూ యుద్ధం చేయసాగారు. (41)
రాక్షసం రౌద్రకర్మాణం క్రూరకర్మా ఘటోత్కచః ।
అలంబుషం ప్రత్యుదియాద్ బలం శక్ర ఇవాహవే ॥ 42
ఇంద్రుడు బలాసురునిపై దాడి చేసినట్లు క్రూరకర్మలు చేసే ఘటోత్కచుడు రౌద్రకర్మలు చేసే అలంబుష రాక్షసుని ఆక్రమించాడు. (42)
ఘటోత్కచస్తతః క్రుద్ధః రాక్షసం తం మహాబలమ్ ।
నవత్యా సాయకైస్తీక్ష్ణైః దారయామాస భారత ॥ 43
భారతా! క్రోధంతో నిండి ఉన్న ఘటోత్కచుడు మహాబలుడైన ఆ అలంబుషరాక్షసుణ్ణి తొంబది వాడి బాణాలు ప్రయోగించి, చీల్చివేశాడు. (43)
అలంబుషస్తు సమరే భైమసేనిం మహాబలమ్ ।
బహుధా దారయామాస శరైః సన్నతపర్వభిః ॥ 44
అలంబుషుడు కూడా రణభూమిలో మహాబలుడైన ఘటోత్కచుని వంగినకణుపులు గల బాణాలతో అనేక విధాల చీల్చిచెండాడాడు. (44)
వ్యభ్రాజేతాం తతస్తౌ తు సంయుగే శరవిక్షతౌ ।
యథా దేవాసురే యుద్ధే బలశక్రౌ మహాబలౌ ॥ 45
దేవాసుర సంగ్రామంలో మహాబలుడైన బలాసుర దేవేంద్రుల వలె రణభూమిలో బాణాల దెబ్బలు తిన్న ఆ ఇద్దరూ - అలంబుష ఘటోత్కచులు - ప్రకాశించారు. (45)
శిఖండీ సమరే రాజన్ ద్రౌణిమభ్యుద్యయౌ బలీ ।
అశ్వత్థామా తతః క్రుద్ధః శిఖండినముపస్థితమ్ ॥ 46
నారాచేన సుతీక్ష్ణేన భృశం విద్ ధ్వా హ్యకంపయత్ ।
శిఖండ్యపి తతో రాజన్ ద్రోణపుత్రమతాడయత్ ॥ 47
సాయకేన సుపీతేన తీక్ష్ణేన నిశితేన చ ।
తౌ జఘ్నతుస్తదాన్యోన్యం శరైర్బహువిధైర్మృధే ॥ 48
రాజా! బలవంతుడైన శిఖండి యుద్ధంలో అశ్వత్థామకు ఎదురుపోయాడు. దానితో కోపించిన అశ్వత్థామ ఎదుట నిలిచిన శిఖండిని తీక్ష్ణమైన బాణంతో గట్టిగా కొట్టి, వణికించాడు. ఆ పై శిఖండి కూడా పచ్చగా, వాడిగా, పదునుగా ఉన్న బాణంతో అశ్వత్థామను కొట్టాడు. ఆ యుద్ధంలో వివిధ బాణాలతో వారు ఒకరినొకరు కొట్టుకొన్నారు. (46-48)
భగదత్తం రణే శూరం విరాటో వాహినీపతిః ।
అభ్యయాత్ త్వరితః రాజన్ తతో యుద్ధమవర్తత ॥ 49
రాజా! సేనాపతి అయిన విరాటుడు రణంలో శూరుడైన భగదత్తుని సరభసంగా ఎదిరించాడు. అప్పుడు వారిద్దరూ పోరాడారు. (49)
విరాటో భగదత్తం తు శరవర్షేణ భారత ।
అభ్యవర్షత్ సుసంక్రుద్ధః మేఘా వృష్ట్యా ఇవాచలమ్ ॥ 50
భారతా! విరాటుడు మహాకోపంతో భగదత్తునిపై శరవృష్టిని కురిపించాడు. అది కొండపై మేఘం కురిసినట్టుంది. (50)
భగదత్తస్తతస్తూర్ణం విరాటం పృథివీపతిమ్ ।
ఛాదయామాస సమరే మేఘః సూర్యమివోదితమ్ ॥ 51
ఆ వెంటనే భగదత్తుడు ఉదయిస్తున్న సూర్యుని మేఘం కప్పివేసినట్లు విరాటరాజుపై బాణవృష్టిని కురిపిస్తూ యుద్ధం చేశాడు. (51)
బృహత్ క్షత్రం తు కైకేయం కృపః శారద్వతో యయౌ ।
తం కృపః శరవర్షేణ ఛాదయామాస భారత ॥ 52
గౌతమం కైకయః క్రుద్ధః శరవృష్ట్యాభ్యపూరయత్ ।
భారతా! కృపుడు కేకయరాజయిన బృహత్ క్షత్రుని ఆక్రమించాడు. కృపుడు ఆయనను బాణ వృష్టితో కప్పివేశాడు. కేకయరాజు కూడా కోపంతో కృపుని అమ్ములవానతో కమ్మివేశాడు. (52 1/2)
తావన్యోన్యం హయాన్ హత్వా ధనుశ్ఛిత్త్వా చ భారత ॥ 53
విరథావసియుద్ధాయ సమీయతురమర్షణౌ ।
తయోస్తదభవద్ యుద్ధం ఘోరరూపం సుదారుణమ్ ॥ 54
భారతా! ఆ ఇద్దరూ ఒకరి గుర్రాలను మరొకరు చంపి, ఒకరి వింటిని మరొకరు విరిచి, రథాలు లేకుండా కత్తులతో యుద్ధం చేయటానికి కోపంతో దగ్గరయ్యారు. వారి ఆ యుద్ధం దారుణంగా, ఘోరంగా జరిగింది. (53,54)
ద్రుపదస్తు తతో రాజన్ సైంధవం వై జయద్రథమ్ ।
అభ్యుద్యయౌ హృష్టరూపః హృష్టరూపం పరంతపః ॥ 55
రాజా! ఆ తరువాత శత్రువులకు సంతాపాన్ని కలిగించగల ద్రుపదుడు సింధురాజైన జయద్రథుని ఎదిరించాడు. ఇద్దరూ ఎంతో ప్రసన్నంగా కనిపిస్తున్నారు. (55)
తతః సైంధవకో రాజా ద్రుపదం విశిఖైస్త్రిభిః ।
తాడయామాస సమరే స చ తం ప్రత్యవిధ్యత ॥ 56
అపుడు సింధురాజు (జయద్రథుడు) యుద్ధంలో మూడు బాణాలతో ద్రుపదుని కొట్టాడు. ద్రుపదుడు కూడా తిరిగి సింధురాజును కుళ్ళబొడిచాడు. (56)
తయోస్తదభవద్ యుద్ధం ఘోరరూపం సుదారుణమ్ ।
ఈక్షణప్రీతిజననం శుక్రాంగారకయోరివ ॥ 57
వారిద్దరి మధ్యా ఘోరంగా, భీకరంగా యుద్ధం జరిగింది. అది శుక్రునకూ, కుజునకూ మధ్య జరుగుతున్న యుద్ధం వలె కన్నుల పండువుగా ఉంది. (57)
వికర్ణస్తు సుతస్తుభ్యం సుతసోమం మహాబలమ్ ।
అభ్యయాజ్జవనైరశ్వైః తతో యుద్ధమవర్తత ॥ 58
నీ కొడుకు - వికర్ణుడు జవనాశ్వాలతో మహాబలుడైన సుతసోమునిపై దాడిచేశాడు. వారిద్దరూ అప్పుడు పోరాడారు. (58)
వికర్ణః సుతసోమం తు విద్ ధ్వా నాకంపయచ్ఛరైః ।
సుతసోమో వికర్ణం చ తదుద్భుతమివాభవత్ ॥ 59
వికర్ణుడు సుతసోముని గాయపరిచాడు కానీ చలింపజేయలేకపోయాడు. సుతసోముడు కూడా అంతే. వారిద్దరి యుద్ధం అద్భుత మనిపించింది. (59)
సుశర్మాణం నరవ్యాఘ్రః చేకితానో మహారథః ।
అభ్యద్రవత్ సుసంక్రుద్ధః పాండవార్థే పరాక్రమీ ॥ 60
పాండవుల వైపు నిలిచి పరాక్రమిస్తున్న మహారథుడూ, నరోత్తముడూ అయిన చేకితానుడు తీవ్రకోపంతో సుశర్మపై దాడిచేశాడు. (60)
సుశర్మా తు మహారాజ చేకితానం మహారథమ్ ।
మహతా శరవర్షేణ వారయామాస సంయుగే ॥ 61
మహారాజా! మహారథుడైన చేకితానుని సుశర్మ తీవ్ర శరవర్షంతో యుద్ధంలో నిలువరించాడు. (61)
చేకితానోఽపి సంరబ్ధః సుశర్మాణం మహాహవే ।
ప్రాచ్ఛాదయత్ తమిషుభిః మహామేఘ ఇవాచలమ్ ॥ 62
చేకితానుడు కూడా రోషంతో మహాయుద్ధంలో సుశర్మను బాణాలతో కప్పివేశాడు. అది మహామేఘం కొండను కప్పివేసినట్లుంది. (62)
శకునిః ప్రతివింధ్యం తు పరాక్రాంతం పరాక్రమీ ।
అభ్యద్రవత రాజేంద్ర మత్తః సింహ ఇవ ద్విపమ్ ॥ 63
రాజేంద్రా! పరాక్రమశాలి అయిన శకుని పరులను ఆక్రమిస్తున్న ప్రతివింధ్యుని మీది కురికాడు. అది మదించిన సింహం ఏనుగును ఆక్రమించినట్టుంది. (63)
యౌధిష్ఠిరస్తు సంక్రుద్ధః సౌబలం నిశితైః శరైః ।
వ్యదారయత సంగ్రామే మఘవానివ దానవమ్ ॥ 64
యుధిష్ఠిరపుత్రుడైన ప్రతివింధ్యుడు కోపించి, నిశితశరాలతో సుబలసుతుని - శకునిని రణభూమిలో ఇంద్రుడు రాక్షసుని చీల్చి వేసినట్లు వేధించాడు. (64)
శకునిః ప్రతివింధ్యం తు ప్రతివిధ్యంతమాహవే ।
వ్యదారయన్మహాప్రాజ్ఞః శరైః సన్నతపర్వభిః ॥ 65
యుద్ధంలో తనను వేధిస్తున్న ప్రతివింధ్యుని మహామేధావి అయిన శకుని వంగిన కణుపులు గల బాణాలతో వేధించాడు. (65)
సుదక్షిణం తు రాజేంద్ర కాంబోజానాం మహారథమ్ ।
శ్రుతకర్మా పరాక్రాంతమ్ అభ్యద్రవత సంయుగే ॥ 66
రాజేంద్రా! కాంబోజరా జయిన సుదక్షిణుని యుద్ధంలో పరాక్రమిస్తున్న శ్రుతకర్మ ఎదిరించాడు. (66)
సుదక్షిణస్తు సమరే సాహదేవిం మహారథమ్ ।
విద్ ధ్వా నాకంపయత వై మైనాకమివ పర్వతమ్ ॥ 67
సుదక్షిణుడు యుద్ధంలో సహదేవసుతుడు, మహారథుడూ అయిన శ్రుతకర్మను గాయపరిచాడు. కానీ చలింపజేయలేకపోయాడు. శ్రుతకర్మ మైనాక పర్వతంలా నిశ్చలంగా నిలిచాడు. (67)
శ్రుతకర్మా తతః క్రుద్ధః కాంబోజానాం మహారథమ్ ।
శరైర్బహుభిరానర్చ్ఛద్ దారయన్నివ సర్వశః ॥ 68
అప్పుడు శ్రుతకర్మ కోపించి, మహారథుడైన కాంబోజరాజు - సుదక్షిణుని అనేక బాణాలతో అన్ని వైపుల నుండి చీల్చి వేస్తున్నట్లు బాధించాడు. (68)
ఇరావానథ సంక్రుద్ధః శ్రుతాయుషమరిందమమ్ ।
ప్రత్యుద్యయౌ రణే యత్తః యత్తరూపం పరంతపః ॥ 69
ఆ తరువాత పరంతపుడైన ఇరావంతుడు కోపంతో అరిందముడైన శ్రుతాయువును ఎదిరించాడు. వారిద్దరూ యుద్ధానికి పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. (69)
అర్జునిస్తస్య సమరే హయాన్ హత్వా మహారథః ।
వవాద బలవన్నాదం తత్ సైన్యం ప్రత్యపూరయత్ ॥ 70
అర్జున కుమారుడూ, మహారథుడూ అయిన ఇరావంతుడు రణంలో శ్రుతాయుస్సు గుర్రాలను చంపి పెద్దగా గర్జించాడు. శ్రుతాయుస్సు సేనను బాణాలతో నింపాడు. (70)
శ్రుతాయుస్తు తతః క్రుద్ధః ఫాల్గునేః సమరే హయాన్ ।
నిజఘాన గదాగ్రేణ తతో యుద్ధమవర్తత ॥ 71
అప్పుడు శ్రుతాయుస్సు క్రుద్ధుడై యుద్ధంలో ఇరావంతుని గుర్రాలను గదతో చంపివేశాడు. వారిద్దరూ పోరాడసాగారు. (71)
విందానువిందావావంత్యౌ కుంతిభోజం మహారథమ్ ।
ససేనం ససుతం వీరం సంససజ్జతురాహవే ॥ 72
అవంతి దేశరాజులు విందాను విందులు మహారథుడూ, వీరుడూ అయిన కుంతిభోజునితో పోరు ప్రారంభించారు. కుంతిభోజుని కుమారుడు, సేనలు కూడా పోరులో నిలిచాయి. (72)
తత్రాద్బుతమపశ్యామ తయోర్ఘోరం పరాక్రమమ్ ।
ఆయుధ్యేతాం స్థిరౌ భూత్వా మహత్యా సేనయా సహ ॥ 73
గొప్ప సేనతో సహా స్థిరంగా నిలిచి ఆ ఇద్దరూ పోరాడారు. వారి భీకర పరాక్రమం అద్భుతంగా కనిపించింది. (73)
అనువిందస్తు గదయా కుంతిభోజమతాడయత్ ।
కుంతిభోజశ్చ తం తూర్ణం శరవ్రాతైరవాకిరత్ ॥ 74
అనువిందుడు కుంతి భోజుని కొట్టాడు. కుంతిభోజుడు కూడా వెంటనే బాణసమూహాన్ని కురిపించి, అనువిందుని ఆక్రమించాడు. (74)
కుంతిభోజసుతశ్చాపి విందం వివ్యాధ సాయకైః ।
స చ తం ప్రతివివ్యాధ తదుద్భుతమివాభవత్ ॥ 75
కుంతిభోజుని కుమారుడు బాణాలతో విందుని గాయపరిచాడు. విందుడు ఎదురుదాడి చేశాడు. అది అద్భుతమనిపించింది. (75)
కేకయా భ్రాతరః పంచ గాంధారాన్ పంచ మారిష ।
ససైన్యాస్తే ససైన్యాంశ్చ యోధయామాసురాహవే ॥ 76
రాజా! కేకయరాజ కుమారులు అయిదుగురు సేనతో సహావచ్చి, సేనలతో కూడి ఉన్న గాంధార రాజకుమారులయిదుగురితో యుద్ధ మారంభించారు. (76)
వీరబాహుశ్చ తే పుత్రః వైరాటిం రథసత్తమమ్ ।
ఉత్తరం యోధయామాస వివ్యాధ నిశితైః శరైః ॥ 77
ఉత్తరశ్చాపి తం వీరం వివ్యాధ నిశితైః శరైః ।
నీ కొడుకు వీరబాహువు విరాటరాజకుమారుడు, గొప్ప రథికుడు అయిన ఉత్తరునితో యుద్ధ మారంభించి, వాడి బాణాలతో అతనిని గాయపరిచాడు. ఉత్తరుడు కూడా వీరబాహువును నిశితశరాలతో గాయపరిచాడు. (77 1/2)
చేదిరాట్ సమరే రాజన్ ఉలూకం సమభిద్రవత్ ॥ 78
తథైవ శరవర్షేణ ఉలూకం సమవిద్ధ్యత ।
ఉలూకశ్చాపి తం బాణైః నిశితైర్లోమవాహిభిః ॥ 79
రాజా! చేదిరాజు యుద్ధంలో ఉలూకునిపై దాడిచేసి, శరవర్షంతో ఉలూకుని వేధించాడు. ఉలూకుడు కూడా రెక్కలు గల వాడి బాణాలతో చేదిరాజును కుళ్ళబొడిచాడు. (78,79)
తయోర్యుద్ధం సమభవద్ ఘోరరూపం విశాంపతే ।
దారయేతాం సుసంక్రుద్ధౌ అన్యోన్యమపరాజితౌ ॥ 80
రాజా! వారికి ఘోరయుద్ధం జరిగింది. ఓటమి నెరుగని ఆ వీరులు కోపంతో ఒకరినొకరు చీల్చిచెండాడారు. (80)
ఏవం ద్వంద్వసహస్రాణి రథవారణవాజినామ్ ।
పదాతీనాం చ సమరే తవ తేషాం చ సంకులే ॥ 81
ఈ రీతిగా జరుగుతున్న సంకుల సమరంలో నీ సేనలు, వారిసేనల మధ్య రథాలను, ఏనుగులను, గుర్రాలను ఎక్కినవారిలో, పదాతిదళాలలో వేలకొలదిగ జంటలు పోరాడసాగాయి. (81)
మూహూర్తమివ తద్ యుద్ధమ్ అసీన్మధురదర్శనమ్ ।
తత ఉన్మత్తవద్ రాజన్ న ప్రాజ్ఞాయత కించన ॥ 82
కొద్దిసేపు ఆ యుద్ధం చూడముచ్చటగా కనిపించింది. రాజా! ఆ తరువాత ఉన్మాదంగా మారింది. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. (82)
గజో గజేన సమరే రథినం చ రథీ యయౌ ।
అశ్వోఽశ్వం సమభిప్రాయాత్ పదాతిశ్చ పదాతినమ్ ॥ 83
ఆ యుద్ధంలో ఏనుగుపై నున్నవాడు ఏనుగునెక్కిన వానితో, రథి రథికునితో, ఆశ్వికుడు ఆశ్వికునితో, కాల్బలం కాల్బలంతో పోరాడుతోంది. (83)
తతో యుద్ధం సుదుర్ధర్షం వ్యాకులం సమపద్యత ।
శూరాణాం సమరే తత్ర సమాసాద్యేతరేతరమ్ ॥ 84
ఆ తరువాత ఆ శూరులు ఒకరినొకరు సమీపించి, పోరాడుతుంటే వ్యాకులంగా, భరింపలేనిదిగా ఆ యుద్ధం జరుగుతోంది. (84)
తత్ర దేవర్షయః సిద్ధాః చారణాశ్చ సమాగతాః ।
ప్రైక్షంత తద్ రణం ఘోరం దేవాసురసమం భువి ॥ 85
భువిలో జరిగే దేవదానవ సంగ్రామంలా కనిపిస్తున్న ఆ ఘోరయుద్ధాన్ని దేవర్షులు, సిద్ధులు, చారణులు వచ్చి చూశారు. (85)
తతో దంతిసహస్రాణి రథానాం చాపి మారిష ।
అశ్వౌఘాః పురుషౌఘాశ్చ విపరీతం సమాయయుః ॥ 86
రాజా! ఆ పై వేలకొలది ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతులు ముందు చెప్పిన ద్వంద్వమార్గాన్ని వీడి, ఇష్టం వచ్చినట్లు పోరాడసాగారు. (86)
తత్ర తత్ర ప్రదృశ్యంతే రథవారణపత్తయః ।
సాదినశ్చ నరవ్యాఘ్ర యుధ్యమానా ముహూర్ముహుః ॥ 87
నరోత్తమా! ఎక్కడ చూస్తే అక్కడ రథాలు ఏనుగులు, గుర్రాలు, పదాతిదళాలు అదేపనిగా యుద్ధం చేస్తూ కనిపిస్తున్నాయి. (87)
ఇది శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వంద్వయుద్ధే పంచచత్వారింశోఽధ్యాయః ॥ 45 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున ద్వంద్వయుద్ఢ మను నలువది అయిదవ అధ్యాయము. (45)