46. నలువది యారవ అధ్యాయము

కౌరవ పాండవ భీకర సంగ్రామము.

సంజయ ఉవాచ
రాజన్ శతసహస్రాణి తత్ర తత్ర పదాతినామ్ ।
నిర్మర్యాదం ప్రయుద్ధాని తత్ తే వక్ష్యామి భారత ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు - రాజా! భారతా! అక్కడున్న పదాతిదళాలలో వందలు వేలమంది నియమాల నతిక్రమించి, యుద్ధం చేస్తున్నారు. అది నీకు చెప్పబోతున్నాను. (1)
మ పుత్రః పితరం జజ్ఞే పితా వా పుత్రమౌరసమ్ ।
న భ్రాతా భ్రాతరం తత్ర స్వస్రీయం న చ మాతులః ॥ 2
కొడుకు తండ్రిని గుర్తించటం లేదు. తండ్రి సొంత కొడుకును కూడా గుర్తించటం లేదు. సోదరుడు సోదరుని కానీ, మేనమామ మేనల్లుని కానీ గుర్తించటం లేదు. (2)
న మాతులం చ స్వస్రీయః న సఖాయం సఖా తథా ।
ఆవిష్టా ఇవ యుధ్యంతే పాండవాః కురుభిః సహ ॥ 3
మేనల్లుడు మేనమామను తెలిసికోవటం లేదు. మిత్రుడు మిత్రుని తెలిసికోవటం లేదు. ఏదో ఆవేశించినట్లు పాండవులు కౌరవులతో యుద్ధం చేస్తున్నారు. (3)
రథానీకం నరవ్యాఘ్రాః కేచిదభ్యపతన్ రథైః ।
అభజ్యంత యుగైరేవ యుగాని భరతర్షభ ॥ 4
భరతశ్రేష్ఠా! కొందరు నరోత్తములు రథాల నెక్కి శత్రురథాలపై పడుతున్నారు. ఎన్నోరథాల యుగాలు (కాడి) శత్రురథాల యుగాలు తగిలి విరిగిపోయాయి. (4)
రథేషాశ్చ రథేషాభిః కూబరా రథకూబరైః ।
సంగతైః సహితాః కేచిత్ పరస్పరజిఘాంసవః ॥ 5
న శేకుశ్చలితుం కేచిత్ సన్నిపత్య రథా రథైః ।
రథాల నొగళ్ళు, సారథి కూర్చునే ఆసనాలు పరస్పరం ఢీ కొని ముక్కలయినాయి. ఒకరినొకరు చంపాలన్న కోరికతో రథికులు నడిపించగా ఎన్నో రథాలు మూకుమ్మడిగా ఎదురెదురై, అసలు కదలలేకపోయాయి. (5 1/2)
ప్రభిన్నాస్తు మహాకాయాః సన్నిపత్య గజా గజైః ॥ 6
బహుధాదారయన్ క్రుద్ధాః విషాణైరితరేతరమ్ ।
మహాశరీరాలు గల ఏనుగులు మదధారలను స్రవిస్తూ, కోపంతో ఇతర గజాల మీద పడుతూ పరస్పరం వివిధ రీతులతో దంతాలతో చీల్చుకొనసాగాయి. (6 1/2)
సతోరణపతాకైశ్చ వారణా వరవారణైః ॥ 7
అభిసృత్య మహారాజ వేగవద్భిర్మహాగజైః ।
దంతైరభిహతాస్తత్ర చుక్రుశుః పరమాతురాః ॥ 8
రాజా! ఎన్నో ఏనుగులు తోరణాలతో, పతాకలతో కూడి వేగంగా కదులుతున్న మహాగజాలను ఎదిరించి, వాటి దంతాల దెబ్బలు తిని, పరమాపన్నభావంతో ఆక్రోశిస్తున్నాయి. (7,8)
అభినీతాశ్చ శిక్షాభిః తోత్రాంకుశసమాహతాః ।
అప్రభిన్నాః ప్రభిన్నానాం సమ్ముఖాభిముఖా యయుః ॥ 9
వివిధ శిక్షణలను పొంది, ఇంకా మదజలం స్రవించటం ప్రారంభం కాని ఏనుగులు కొరడాలు, అంకుశాల దెబ్బలు తిని, ఎదురుగా ఉన్న మదపుటేనుగుల ముందుకు యుద్ధానికి కదిలాయి. (9)
ప్రభిన్నైరపి సంసక్తాః కేచిత్ తత్ర మహాగజాః ।
క్రౌంచవన్నినదం కృత్వా దుద్రుపుః సర్వతో దిశమ్ ॥ 10
ఆ మహాగజాలలో కొన్ని మదపుటేనుగులను ఢీకొని, వాటి దెబ్బలకు క్రౌంచ పక్షుల వలె అరుస్తూ అన్ని దిక్కులకు పరుగెత్తసాగాయి. (10)
సమ్యక్ ప్రణీతా నాగాశ్చ ప్రభిన్నకరటాముఖాః ।
ఋష్టితోమరనారాచైః నిర్విద్ధా వరవారణాః ॥ 11
ప్రణేదుర్భిన్నమర్మాణః నిపేతుశ్చ గతాసవః ।
ప్రాద్రవంత దిశః కేచిత్ నదంతో భైరవాన్ రవాన్ ॥ 12
చక్కగా రణశిక్షణ పొందిన ఏనుగులు, గండస్థలం నుండి మదజలం స్రవిస్తున్న శ్రేష్ఠ గజాలు ఎన్నో ఋష్టి, తోమర, నారాచాల వలన గాయపడి, మర్మస్థానాలు బ్రద్ధలయి నేలగూలి ప్రాణాలు విడుస్తున్నాయి. కొన్ని ఏనుగులు భీకరంగా ఘీంకారాలు చేస్తూ నలుదిక్కులకూ పారిపోయాయి. (11,12)
ఋష్టిభిశ్చ ధనుర్భిశ్చ విమలైశ్చ పరశ్వధైః ।
గజానాం పాదరక్షాస్తు వ్యూఢోరస్కాః ప్రహారిణః ॥ 13
గదాభిర్ముసలైశ్చైవ భిందిపాలైః సతోమరైః ।
అయసైః పరిఘైశ్చైవ నిస్త్రింశైర్విమలైః శితైః ॥ 14
ప్రగృహీతైః సుసంరబ్ధాః ద్రవమాణాస్తతస్తతః ।
వ్యదృశ్యంత మహారాజ పరస్పరజిఘాంసవః ॥ 15
మహారాజా! విశాల వక్షః స్థలం కలిగి, పాదరక్షకులయిన యోధులు కూడా మహాక్రోధంతో రణరంగంలో అటు, ఇటూ పరుగెత్తుతూ ఋష్టులు, ధనుస్సులు మెరుస్తున్న గొడ్డళ్ళు, గదలు, ముసలాలు, భిందిపాలాలు, తోమరాలు, లోహపరిఘలు, నిర్మలంగా వాడిలా ఉన్న కత్తులు చేతబట్టి ఒకరినొకరు, చంపుకోవాలని దెబ్బ తీస్తూ కనిపిస్తున్నారు. (13-15)
రాజమానాశ్చ నిస్త్రింశాః సంసిక్తా నరశోణితైః ।
ప్రత్యదృశ్యంత శూరాణామ్ అన్యోన్యమభిధావతామ్ ॥ 16
పరస్పరం దాడిచేసికొంటున్న శూరుల చేతులలో మెరుస్తున్న కత్తులు మానవరక్తంతో తడిసి చూపట్టుతున్నాయి. (16)
అవక్షిప్తావధూతానామ్ అసీనాం వీరబాహుభిః ।
సంజజ్ఞే తుములః శబ్దః పతతాం పరమర్మసు ॥ 17
వీరులు కత్తులను త్రిప్పి విసిరినప్పుడు అవి శత్రువుల శరీరంలోని మర్మ స్థానాలపై పడుతుంటే, అప్పుడు భీకరధ్వని వినిపిస్తోంది. (17)
గదాముసలరుగ్ణానాం భిన్నానాం చ వరాసిభిః ।
దంతిదంతావభిన్నానాం మృదితానాం చ దంతిభిః ॥ 18
తత్ర తత్ర నరౌఘాణాం క్రోశతామితరేతరమ్ ।
శుశ్రువుర్దారుణా వాచః ప్రేతానామివ భారత ॥ 19
భారతా! గదాముసలాల దెబ్బలతో కొందరు గాయపడ్డారు. గొప్పకత్తుల దెబ్బలతో కొందరు ఛిన్న భిన్న మయ్యారు. ఏనుగుల దంతాలతో కొందరు చీలిపోయారు. ఏనుగులు త్రొక్కి కొందరు నుజ్జు అయ్యారు. ఆ నరశ్రేష్ఠులంతా ఒకరినొకరు పిలుచుకొంటున్నారు. ఆ మాటలు ప్రేతధ్వనుల వలె దారుణంగా వినిపిస్తున్నాయి. (18,19)
హయైరపి హయారోహాః చామరాపీడధారిభిః ।
హంసైరివ మహావేగైః అన్యోన్యమభివిద్రుతాః ॥ 20
వింజామరలు, తురాయిలు ధరించి హంసల వలె ప్రకాశిస్తూ, మహావేగంగా కదులుతున్న గుర్రాల నెక్కి ఆశ్వికులు ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. (20)
తైర్విముక్తా మహాప్రాసాః జాంబూనదవిభూషణాః ।
ఆశుగా విమలాస్తీక్ ష్ణాః సంపేతుర్భుజగోపమాః ॥ 21
వారు విసురుకొంటున్న మహాప్రాసాలు(బల్లెం) బంగారుతో అలంకరింపబడినవి. నిర్మల మయినవి. తీక్ష్ణమైనవి. అవి పాముల వలె పడుతున్నాయి. (21)
అశ్వైరగ్య్రజవైః కేచిద్ ఆప్లుత్య మహతో రథాన్ ।
శిరాంస్యాదదిరే వీరాః రథినామశ్వసాదినః ॥ 22
వీరులయిన ఆశ్వికులు మహావేగం గల అశ్వాలతో దాడిచేసి గొప్పగొప్ప రథాలపై నున్న రథికుల తలలను నరికివేస్తున్నారు. (22)
బహూనపి హయారోహాన్ భల్లైః సన్నతపర్వభిః ।
రథీ జఘాన సంప్రాప్య బాణగోచరమాగతాన్ ॥ 23
రథికుడు కూడా వంగిన కణుపులు గల బాణాలతో (బల్లెం) బాణానికి అందిన ఆశ్వికులను ఎందరినో చంపివేస్తున్నాడు. (23)
నవమేఘప్రతీకాశాః చాక్షిప్య తురగాన్ గజాః ।
పాదైరేవ విమృద్నంతి మత్తాః కనకభూషణాః ॥ 24
బంగారునగలు అలంకరించి యున్న మదపుటేనుగులు తొలకరి మేఘాలవలె ప్రకాశిస్తూ గుర్రాలను తొండాలతో లాగి, కాళ్ళతో పడవేసి, త్రొక్కుతున్నాయి. (24)
పాట్యమానేషు కుంభేషు పార్శ్వేష్వసి చ వారణాః ।
ప్రాసైర్వినిహతాః కేచిద్ వినేదుః పరమాతురాః ॥ 25
ప్రాసాల (బల్లెం) దెబ్బలకు కుంభస్థలాలు ప్రక్కలు చీలుతుంటే కొన్ని ఏనుగులు కలతపడి పెద్దగా అరుస్తున్నాయి. (25)
పాశ్వారోహాన్ హయాన్ కాంచిద్ ఉన్మథ్య వరవారణాః ।
సహసా చిక్షిపుస్తత్ర సంకులే భైరవే సతి ॥ 26
కొన్ని మదపుటేనుగులు రౌతులతో పాటు గుర్రాలను కొన్నింటిని కాళ్లతో మథించి, ఆ భీకర సంగ్రామంలో విసిరివేస్తున్నాయి. (26)
సాశ్వారోహాన్ విషాణాగ్రైః ఉత్ క్షిప్య తురగాన్ గజాః ।
రథౌఘానభిమృద్నంతః సధ్వజానభిచక్రముః ॥ 27
తమ దంతాల కొనలతో రౌతులతో సహా గుర్రాలను పైకి విసిరి ఏనుగులు ధ్వజాలతో పాటు రథసముదాయాలను కాలరాస్తూ రణభుమిలో తిరుగుతున్నాయి. (27)
పుంస్త్వాదతిమదత్వాచ్చ కేచిత్ తత్ర మహాగజాః ।
సాశ్వారోహాన్ హయాన్ జఘ్నుః కరైః సచరణైస్తథా ॥ 28
మగవై, మదించినవై ఉన్న ఎన్నో గొప్ప గొప్ప ఏనుగులు తొండాలతో, పాదాలతో గుర్రాల నెన్నింటినో రౌతులతో కలిపి చంపి వేస్తున్నాయి. (28)
అశ్వారోహైశ్చ సమరే హస్తిసాదిభిరేవ చ ।
ప్రతిమానేషు గాత్రేషు పార్శ్వేష్వభి చ వారణాన్ ।
ఆశుగా విమలాస్తీక్ష్ణాః సంపేతుర్భుజగోపమాః ॥ 29
యుద్ధంలో గుర్రపురౌతులు, ఏనుగులనెక్కి యుద్ధం చేస్తున్న వీరులు ప్రయోగిస్తున్న విమలతీక్ష్ణ బాణాలు సర్పాలవలె దూసుకువచ్చి, ఏనుగుల లలాటాలను, శరీరాలను, ప్రక్కటెముకలను గాయపరుస్తున్నాయి. (29)
నరాశ్వకాయాన్ నిర్భిద్య లౌహాని కవచాని చ ।
నిపేతుర్విమలాః శక్త్యః వీరబాహుభిరర్బితాః ॥ 30
మహోల్కాప్రతిమా ఘోరాః తత్ర తత్ర విశాంపతే ।
రాజా! వీరుల బాహువులు ప్రయోగించిన నిర్మలశక్త్యా యుధాలు మనుష్యుల, గుర్రాల లోహకవచాలను, శరీరాలను భేదించి నేల బడుతున్నాయి. అవి ఉల్కాపాతం వలె భీకరంగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. (30 1/2)
ద్వీపిచర్మావనద్ధైశ్చ వ్యాఘ్రచర్మచ్ఛదైరపి ॥ 31
వికోశైర్విమలైః ఖడ్ గైః అభిజగ్ముః పరాన్ రణే ।
చిరుతపులి చర్మాలతో, పులి చర్మాలతో చేసిన ఒరల నుండి వెలువడిన నిర్మల ఖడ్గాలతో వీరులు రణభూమిలో శత్రువులను ఎదిరిస్తున్నారు. (31 1/2)
అభిప్లుతమభిక్రుద్ధమ్ ఏకపార్శ్వావదారితమ్ ॥ 32
విదర్శయంతః సంపేతుః ఖడ్గచర్మపరశ్వధైః ।
కొందరు వీరులు కత్తులు, డాళ్ళు, గొడ్డళ్ళు ధరించి శత్రువుల ముందుకు దూకటం కోపాన్ని ప్రదర్శించటం, ప్రక్కల్ని గాయపరచి చీల్చటం - మొదలయిన విన్యాసాలు చేస్తూ, శత్రువుల నాక్రమిస్తున్నారు. (32 1/2)
కేచిదాక్షిప్య కరిణః సాశ్వానపి రథాన్ కరైః ॥ 33
వికర్షతో దిశః సర్వాః సంపేతుః సర్వశబ్దగాః ।
అన్ని శబ్దాలనూ అనుసరించి నడిచే ఏనుగులు కొన్ని, గుర్రాలతో పాటు రథాలను తొండాలతో లాగి, వాటిని ఈడ్చుకొంటూ అన్ని వైపులా పరుగెత్తుతున్నాయి. (33 1/2)
శంకుభిర్దారితాః కేచిత్ సంభిన్నాశ్చ పరశ్వధైః ॥ 34
హస్తిభిర్మృదితాః కేచిత్ క్షుణ్ణాశ్చాన్యే తురంగమైః ।
రథనేమినికృత్తాశ్చ నికృతాశ్చ పరశ్వధైః ॥ 35
కొందరు సైనికులు బాణాలతో చీల్చబడి పడి ఉన్నారు. కొందరు గొడ్డళ్ళతో నరకబడ్డారు. కొందరిని ఏనుగులు త్రొక్కివేశాయి. కొందరిని గుర్రాలు త్రొక్కివేశాయి. రథాల ఇరుసుల వలన కొందరి శరీరాలు తెగిపోయాయి గండ్రగొడ్డళ్లు కొందరిని చీల్చాయి. (34,35)
వ్యాక్రోశంత నరా రాజన్ తత్ర తత్ర స్మ బాంధవాన్ ।
పుత్రానన్యే పితౄనన్యే భ్రాతౄంశ్చ సహ బంధుభిః ॥ 36
మాతులాన్ భాగినేయాంశ్చ పరానపి చ సంయుగే ।
రాజా! ఆ యుద్ధంళో పడిపోయిన వీరులు బాంధవులను తలచుకొంటూ ఆక్రోశిస్తున్నారు. కొందరు కొడుకులను కొందరు తండ్రులను, సోదరులను, బంధువులను మేనమామలను; కొందరు మేనల్లుళ్ళను, ఇంకా ఎవరెవరినో ఉద్దేశించి విలపిస్తున్నారు. (36 1/2)
వికీర్ణాంత్రాః సుబహవః భగ్నసక్థాశ్చ భారత ॥ 37
బాహుభిశ్చాపరే ఛిన్నైః పార్శేషు చ విదారితాః ।
క్రందంతః సమదృశ్యంత తృషితా జీవితేప్సవః ॥ 38
భారతా! చాలా మంది ప్రేవులు బయటకు తన్నుకొచ్చాయి. చాలామంది తొడలు విరిగిపోయాయి. కొందరి చేతులు, కొందరి ప్రక్కటెముకలు విరిగిపోయాయి. ఆ స్థితిలో వారు దప్పికతో, జీవితాశతో ఆక్రోశిస్తూ కనిపించారు. (37,38)
తృషా పరిగతాః కేచిద్ అల్పసత్త్వా విశాంపతే ।
భూమౌ నిపతితాః సంఖ్యే మృగయాంచక్రిరే జలమ్ ॥ 39
రాజా! మరీ బలహీనులయిన కొందరు దప్పికతో వేలగూలిన దశలోనే రణభూమిలో నీటిని వెతుక్కొంటూ కనిపించారు. (39)
రుధిరౌఘపరిక్లిన్నాః క్లిశ్యమానాశ్చ భారత ।
వ్యనిందన్ భృశమాత్మానం తవ పుత్రాంశ్చ సంగతాన్ ॥ 40
భారతా! నెత్తుటి ప్రవాహాలతో తడిసిపోతూ, బాధపడుతున్న చాలమంది తమను తమ కుమారులను కూడా తీవ్రంగా నిందిస్తున్నారు. (40)
అపరే క్షత్రియాః శూరాః కృతవైరాః పరస్పరమ్ ।
నైవ శస్త్రం విముంచంతి నైవ క్రందంతి మారిష ॥ 41
రాజా! కొందరు క్షత్రియశూరులు, గాయపడి కూడా పరస్పర వైరంతో కత్తులు విడవటం లేదు. ఆక్రోశించటమూ లేదు. (41)
తర్జయంతి చ సంహృష్టాః తత్ర తత్ర పరస్పరమ్ ।
ఆదశ్య దశనైశ్చాపి క్రోధాత్ సరదనచ్ఛదమ్ ॥ 42
భ్రుకుటకుటిలైర్వక్రైః ప్రేక్షంతిచ పరస్పరమ్ ।
వారు మాటిమాటికి ఉత్సాహంగా ఒకరినొకరు బెదిరిస్తున్నారు. క్రోధంతో పళ్ళతో పెదవులు కొరుకుతూ కనుబొమలు ముడివేసి, వక్రదృష్టితో పరస్పరం చూసుకొంటున్నారు. (42 1/2)
అపరే క్లిశ్యమానాస్తు శరార్తా వ్రణపీడితాః ॥ 43
నిఘ్కాజాః సమపద్యంత దృడసత్త్వా మహాబలాః ।
గట్టిధైర్యం గల కొందరు మహాబలులు బాణాల దెబ్బలు తిని, గాయాలపాలై, బాధపడుతూ కూడా మౌనంగా దాన్ని భరిస్తున్నారు. (43 1/2)
అన్యే చ విరథాః శూరాః రథమన్యస్య సంయుగే ॥ 44
ప్రార్థయానా నిపతితాః సంక్షుణ్ణా వరవారణైః ।
అశోభంత మహారాజ నపుష్పా ఇవ కింశుకాః ॥ 45
మహారాజా! మరికొందరు వీరులు తమ రథాలు రణంలో విరిగిపోగా, నేలపై బడి ఇతరులను రథాలకై ప్రార్థిస్తున్నారు. ఇంతలో మదపుటేనుగులు వారిని త్రొక్కాయి. వారు పుష్పించిన కింశుకాలవలె ప్రకాశిస్తున్నారు. (44,45)
సంబభూవురనీకేషు బహవో భైరవస్వనాః ।
వర్తమానే మహాభీమే తస్మిన్ వీరవరక్షయే ॥ 46
నిజఘాన పితా పుత్రం పుత్రశ్చ పితరం రణే ।
స్వస్రీయో మాతులం చాపి స్వస్రీయం చాపి మాతులః ॥ 47
సఖా సఖాయం చ తథా సంబంధీ బాంధవం తథా ।
సేనలలో వివిధ ధ్వనులు భీకరంగా వినిపిస్తున్నాయి. మేటివీరులెందరో నశించిపోయే ఆ భీకర సంగ్రామంలో తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని, మేనల్లుడు మేనమామను, మేనమామ మేనల్లుని, మిత్రుడు మిత్రుని, వియ్యంకులు వియ్యంకులను చంపుకొన్నారు. (46 - 47 1/2)
ఏవం యుయుధిరే తత్ర కురవః పాండవైః సహ ॥ 48
వర్తమానే తథా తస్మిన్ నిర్మర్యాదే భయానకే ।
భీష్మమాసాద్య పార్థానాం వాహినీ సమకంపత ॥ 49
ఈ రీతిగా అక్కడ కౌరవులు పాండవులతో యుద్ధం చేశారు. నియమరహితంగా, భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో భీష్ముని సమీపించిన ఆ పాండవసేన వణికిపోయింది. (48,49)
కేతునా పంచతారేణ తాలేన భరతర్షభ ।
రాజతేన మహాబాహుః ఉచ్ఛ్రితేన మహారథే ।
బభౌ భీష్మస్తదా రాజన్ చంద్రమా ఇవ మేరుణా ॥ 50
భరతర్షభా! భీష్ముడు తన విశాలరథంపై నిలిచి, వెండితో చేసిన అయిదు నక్షత్రాలు తాటిచెట్టు గుర్తుగా గల ధ్వజంతో మేరుపర్వతంపై నున్న చంద్రునివలె ప్రకాశించాడు. (50)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సంకులయుద్ధే షట్ చత్వారింశోఽధ్యాయః ॥ 46॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున సంకులయుద్ధ మను నలువది యారవ అధ్యాయము. (46)