47. నలువది యేడవ అధ్యాయము

భీష్మాభిమన్యుల యుద్ధము - శల్యుడు ఉత్తరుని చంపుట - శ్వేతుని పరాక్రమము.

సంజయ ఉవాచ
గతపూర్వాహ్ణభూయిష్ఠే తస్మిన్నహని దారుణే ।
వర్తమానే తథా రౌద్రే మహావీరవరక్షయే ॥ 1
దుర్ముఖః కృతవర్మా చ కృపః శల్యో వివింశతిః ।
భీష్మం జుగుపురాసాద్య తవ పుత్రేణ చోదితాః ॥ 2
సంజయుడు చెప్తున్నాడు - ఆ భయంకరదినంలో పూర్వభాగం దాదాపు గడచిపోగా, మహావీర వినాశాత్మకమైన ఘోరయుద్ధం జరుగుతోంది. అపుడు నీ కుమారుని ఆదేశం మేరకు దుర్ముఖుడు, కృతవర్మ, కృపుడు, శల్యుడు, వివింశతి వచ్చి భీష్మునికి రక్షగా నిలిచారు. (1,2)
ఏతైరతిరథైర్గుప్తః పంచభిర్భరతర్షభః ।
పాండవానామనీకాని విజగాహే మహారథః ॥ 3
ఈ అయిదుగురు అతిరథుల రక్షణలో నిలిచిన భరతశ్రేష్ఠుడు, మహారథుడు అయిన భీష్ముడు పాండవుల సేనలలో ప్రవేశించాడు. (3)
చేదికాశికరూపేషు పంచాలేషు చ భారత ।
భీష్మస్య బహుధా తాలః చలత్కేతురదృశ్యత ॥ 4
భారతా! చేది, కాశి, కరూష, పాంచాలదేశాల సేనలలో సంచరిస్తున్న భీష్ముని తాలధ్వజం వివిధ గతులలో రెపరెపలాడుతూ కనిపించింది. (4)
స శిరాంసి రణేఽరీణాం రథాంశ్చ సయుగధ్వజాన్ ।
నిచకర్త మహవేగైః భల్లైః సన్నతపర్వభిః ॥ 5
వంగిన కణుపులు గలిగి, మహావేగంగా పయనించగల బాణాలతో భీష్ముడు శత్రువుల తలలను, రథాలను, యుగాలను (కాడి) ధ్వజాలను ఖండించాడు. (5)
నృత్యతో రథమార్గేషు భీష్మస్య భరతర్షభ ।
భృశమార్తస్వరం చక్రుః నాగా మర్మణి తాడితాః ॥ 6
భరతర్షభా! రథమార్గాలతో భీష్ముని సంచారం నృత్యంలా కనిపిస్తోంది. ఆయన బాణపు దెబ్బలు మర్మస్థానాలలో తగిలి, ఏనుగులు దయనీయంగా ఆర్తనాదం చేశాయి. (6)
అభిమన్యుః సుసంక్రుద్ధః పిశంగైస్తురగోత్తమైః ।
సంయుక్తం రథమాస్థాయ ప్రాయాద్ భీష్మరథం ప్రతి ॥ 7
జాంబూనదవిచిత్రేణ కర్ణికారేణ కేతునా ।
అభ్యవర్తతభీష్మం చ తాంశ్చైవ రథసత్తమాన్ ॥ 8
అభిమన్యుడు తీవ్రకోపంతో పింగళ వర్ణం గల గుర్రాలను పూన్చిన రథమెక్కి, భీష్ముని రథానికి ఎదురు నిలిచాడు. ఆ రథం స్వర్ణ నిర్మితమైన ధ్వజం - దానిలో కర్ణికారచిహ్నం కలిగి విరాజిల్లుతోంది. అబిమన్యుడు భీష్ముని మీదకూ, రక్షగా నిలిచిన దుర్ముఖాది రథికుల మీదకూ దూకాడు. (7,8)
స తాలకేతోస్తీక్ష్ణేన కేతుమాహత్య ప్రతిణా ।
భీష్మేణ యుయుధే వీరః తస్య చానురథైః సహ ॥ 9
అభిమన్యుడు తీక్ష్ణబాణంతో తాటి చెట్టు గుర్తుగల భీష్ముని కేతువును కొట్టి, భీష్మునితోనూ, ఆయన సహచరులతోనూ యుద్ధం చేశాడు. (9)
కృతవర్మాణమేకేన శల్యం పంచభిరాశుగైః ।
విద్ ధ్వా నవభిరానర్చ్ఛత్ శితాగ్రైః ప్రపితామహమ్ ॥ 10
కృతవర్మను ఒక బాణంతో, శల్యుని అయిదు బాణాలతో దెబ్బతీసి, తొమ్మిది వాడి బాణాలతో ప్రపితామహుని గాయపరిచాడు. (10)
పూర్ణాయతవిసృష్టేన సమ్యక్ ప్రణిహితేన చ ।
ధ్వజమేకేన వివ్యాధ జాంబూనదపరిష్కృతమ్ ॥ 11
ఆ తరువాత పూర్తి ఏకాగ్రతతో, బాగా లాగి విడిచిన బాణంతో స్వర్ణాలంకరణ గల భీష్మధ్వజాన్ని పడగొట్టాడు. (11)
దుర్ముఖస్య తు భల్లేన సర్వావరణభేదినా ।
జహార సారథేః కాయాత్ శిరః సన్నతపర్వణా ॥ 12
వంగిన కణుపులు గలిగి అన్ని ఆవరణలను భేదించగల భల్లంతో దుర్ముఖుని సారథి యొక్క శరీరం నుండి తలను వేరు చేశాడు. (12)
ధనుశ్చిచ్ఛేద భల్లేన కార్తస్వరవిభూషితమ్ ।
కృపస్య నిశితాగ్రేణ తాంశ్చ తీక్ష్ణముఖైః శరైః ॥ 13
జఘాన పరమక్రుద్ధః నృత్యన్నివ మహారథః ।
బంగారు అలంకరణలు గల కృపాచార్య ధనుస్సును కూడా మంచి పదును గల భల్లంతో ముక్కలు చేశాడు అభిమన్యుడు. ఆ మహారథుడు నృత్యం చేస్తున్నట్లుగా వాడి మొనలు గల బాణాలతో భీష్మరక్షకులను కూడా గాయపరిచాడు. (13 1/2)
తస్య లాఘవముద్వీక్ష్య తుతుషుర్దేవతా అపి ॥ 14
లబ్ధలక్షతయా కార్ ష్ణేః సర్వే భీష్మముఖా రథాః ।
సత్త్వవంతమమన్యంత సాక్షాదివ ధనంజయమ్ ॥ 15
ఆ అభిమన్యుని లాఘవాన్ని చూసి దేవతలు కూడా ఆనందించారు. అభిమన్యుని లక్ష్య ఛేదనసాఫల్యాన్ని గమనించి భీష్ముడు మొదలయిన ఆ మహారథులు అర్జునునివలె శక్తి సంపన్నునిగా అభిమన్యుని భావించారు. (14-15)
తస్య లాఘవమార్గస్థమ్ అలాతసదృశప్రభమ్ ।
దిశః పర్యపతచ్చాపం గాండీవమివ ఘోషవత్ ॥ 16
అభిమన్యుని ధనుస్సు గాండీవం వలె ఘోషిస్తోంది. హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తూ ఆ ధనుస్సును బాగా వెనక్కు లాగినపుడు అది అలాతచక్రంలా గుండ్రంగా అన్ని దిక్కులలో సంచరిస్తోంది. (16)
తమాసాద్య మహావేగైః భీష్మో నవభిరాశుగైః ।
వివ్యాధ సమరే తూర్ణమ్ ఆర్జునిం పరవీరహా ॥ 17
పరవీర సంహారకుడైన భీష్ముడు అభిమన్యుని సమీపించి, మహావేగం గల తొమ్మిది బాణాలతో యుద్ధంలో అతనిని గాయపరిచాడు. (17)
ధ్వజం చాస్య త్రిభిర్భల్లైః చిచ్ఛేద పరమౌజసః ।
సారథిం చ త్రిభిర్బాణైః ఆజఘాన యతవ్రతః ॥ 18
పరమతేజస్వి అయిన ఆ అభిమన్యుని ధ్వజాన్ని కూడా మూడు బాణాలతో పడగొట్టాడు. నియతవ్రతుడైన ఆ భీష్ముడు అభిమన్యుని రథసారథిని కూడా మూడు బాణాలతో హింసించాడు. (18)
తథైవ కృతవర్మా చ కృపః శల్యశ్చ మారిష ।
విద్ ధ్వా నాకంపయత్ కార్ ష్ణిం మైనాకమివ పర్వతమ్ ॥ 19
రాజా! అలాగే కృతవర్మ, కృపుడు, శల్యుడు కూడా అభిమన్యుని గాయపరిచారే కానీ మైనాక పర్వతం వలె స్థిరంగా ఉన్న అతనిని చలింపజేయలేకపోయారు. (19)
స తైః పరివృతః శూరః ధార్తరాష్ట్రైర్మహారథైః ।
వవర్ష శరవర్షాణి కార్ ష్ణిః పంచరథాన్ ప్రతి ॥ 20
దుర్యోధనుని సేనలోని ఆ మహారథులు అయిదుగురు చుట్టుముట్టినా కూడా, శూరుడైన అభిమన్యుడు అయిదుగురి రథాల మీదా శరవర్షాన్ని కురిపించాడు. (20)
తతస్తేషాం మహాస్త్రాణి సంవార్య శరవృష్టిభిః ।
ననాద బలవాన్ కార్ ష్ణిః భీష్మాయ విసృజన్ శరాన్ ॥ 21
బలసంపన్నుడైన అభిమన్యుడు బాణవృష్టితో ఆ మహారథుల అస్త్రాలను నివారించి, భీష్మునిపైకి బాణాలను విడుస్తూ సింహనాదం చేశాడు. (21)
తత్రాస్య సుమహద్ రాజన్ బాహ్వోర్బలమదృశ్యత ।
యతమానస్య సమరే భీష్మమర్దయతః శరైః ॥ 22
రాజా! ఆ సమయంలో ప్రయత్న పూర్వకంగా బాణాలతో భీష్ముని పీడిస్తున్న అభిమన్యుని బాహుబలం చాలా గొప్పగా కనిపించింది. (22)
పరాక్రాంతస్య తస్యైవ భీష్మోఽపి ప్రాహిణోచ్ఛరాన్ ।
స తాంశ్చిచ్ఛేద సమరే భీష్మచాపచ్యుతాన్ శరాన్ ॥ 23
పరాక్రమిస్తున్న అభిమన్యునిపై భీష్ముడు కూడా బాణాలను సంధించాడు. అయితే భీష్ముని ధనుస్సు నుండి వెలువడిన ఆ శరాలను యుద్ధంలో అభిమన్యుడు ఖండించాడు. (23)
తతో ధ్వజమమోఘేషుః భీష్మస్య నవభిః శరైః ।
చిచ్ఛేద సమరే వీరః తత ఉచ్చుక్రుశుర్జనాః ॥ 24
వీరుడై, మొక్కవోని విల్లుగల అభిమన్యుడు యుద్ధంలో తొమ్మిది బాణాలతో భీష్ముని ధ్వజాన్ని నరికివేశాడు. దానిని చూసి, జనులు పెద్దగా అరిచారు. (24)
స రాజతో మహాస్కంధః తాలో హేమవిభూషితః ।
సౌభద్రవిశిఖైశ్ఛిన్నః పపాత భువి భారత ॥ 25
భారతా! వెండితో తయారుచేయబడి, స్వర్ణాభరణాలచే అలంకరింపబడి, పెద్ద మ్రానుగల ఆ తాళధ్వజం (ధ్వజచిహ్నం) అభిమన్యుని బాణాల వలన విరిగి, నేలపై పడింది. (25)
తం తు సౌభద్రవిశిఖైః పాతితం భరతర్షభ ।
దృష్ట్వా భీమో ననాదోచ్చైః సౌభద్రమభిహర్షయన్ ॥ 26
భరతర్షభా! అభిమన్యుని బాణాలచే పడగొట్టబడిన ఆ తాళవృక్షాన్ని చూసి, భీముడు అభిమన్యుని అభినందిస్తూ, పెద్దగా సింహనాదం చేశాడు. (26)
అథ భీష్మో మహాస్త్రాణి దివ్యాని సుబహూని చ ।
ప్రాదుశ్చక్రే మహారౌద్రీ రణే తస్మిన్ మహాబలః ॥ 27
అటు తరువాత మహాబలుడైన భీష్ముడు పరమరౌద్రంగా కనిపిస్తున్న ఆ యుద్ధంలో దివ్యాస్త్రాల నెన్నింటినో ప్రకటించాడు. (27)
తతః శరసహస్రేణ సౌభద్రం ప్రపితామహః ।
అవాకిరదమేయాత్మా తదుద్భుతమివాభవత్ ॥ 28
ఆ తరువాత అమేయబలుడైన భీష్ముడు అభిమన్యునిపై వేల బాణాలను కురిపించాడు. అది అద్బుత మనిపించింది. (28)
తతో దశ మహేష్వాసాః పాండవానాం మహారథాః ।
రక్షార్థమభ్యధావంత సౌభద్రం త్వరితా రథైః ॥ 29
విరాటః సహ పుత్రేణ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ।
భీమశ్చ కేకయాశ్చైవ సాత్యకిశ్చ విశాంపతే ॥ 30
రాజా! అప్పుడు మేటివిలుకాండ్రయిన పాండవ పక్ష మహారథులు పదిమంది - విరాటుడు, ఆయన కొడుకు ఉత్తరుడు, ధృష్టద్యుమ్నుడు, భీమసేనుడు, కేకయరాజులు అయిదుగురు, సాత్యకి అభిమన్యుని రక్షణకై వేగంగా రథాలతో పరుగులు తీశారు. (29,30)
తేషాం జవేనాపతతాం బీష్మః శాంతనవో రణే ।
పాంచాల్యం త్రిభిరానర్చ్ఛత్ సాత్యకిం నవభిః శరైః ॥ 31
వాళ్లు వేగంగా దూసుకొని వస్తుండగా శంతనుసుతుడైన భీష్ముడు యుద్ధంలో ధృష్టద్యుమ్నుని మూడు బాణాలతోనూ, సాత్యకిని తొమ్మిది బాణాలతోనూ గాయపరిచాడు. (31)
పూర్ణాయతవిసృష్టేన క్షురేణ నిశితేన చ ।
ధ్వజమేకేన చిచ్ఛేద భీమసేనస్య పత్రిణా ॥ 32
రెక్కలు కల ఒక వాడి బాణాన్ని బాగాలాగి, విడిచి, భీమసేనుని ధ్వజాన్ని విరగ గొట్టాడు. (32)
జాంబూనదమయః శ్రీమాన్ కేసరీ స నరోత్తమ ।
పపాత భీమసేనస్య భీష్మేణ మథితో రథాత్ ॥ 33
నరోత్తమా! స్వర్ణమయమై సింహ చిహ్నంతో శోభిస్తున్న ఆ భీమసేనుని ధ్వజం భీష్ముడు ఖండించగానే రథం మీద నుండి నేల గూలింది. (33)
తతో భీమస్త్రిభిర్విద్ ధ్వా భీష్మం శాంతనవం రణే ।
కృపమేకేన వివ్యాధ కృతవర్మాణమష్టభిః ॥ 34
అప్పుడు భీముడు యుద్ధంలో శంతనుసుతుడైన భీష్ముని మూడు బాణాలతో గాయపరిచి, ఒక బాణంతో కృపుని, ఎనిమిది బాణాలతో కృతవర్మను దెబ్బతీశాడు. (34)
ప్రగృహీతాగ్రహస్తేన వైరాటిరపి దంతినా ।
అభ్యద్రవత రాజానం మద్రాధిపతిముత్తరః ॥ 35
అప్పుడు తొండాన్ని మడిచి, ముఖం మీదకు చేర్చుకొన్న ఏనుగునెక్కి విరాట రాజకుమారుడు - ఉత్తరుడు మద్రరా జయిన శల్యుని మీద దాడి చేశాడు. (35)
తస్య వారణరాజస్య జవేనాపతతో రథే ।
శల్యో నివారయామాస వేగమప్రతిమం శరైః ॥ 36
వేగంగా తన రథం మీద పడబోతున్న ఆ ఏనుగు యొక్క అసాధారణవేగాన్ని శల్యుడు బాణాలతో నిరోధించాడు. (36)
తస్య క్రుద్ధః నాగేంద్రః బృహతః సాధువాహినః ।
పదా యుగమధిష్ఠాయ జఘాన చతురో హయాన్ ॥ 37
దానితో ఆ ఏనుగు కోపించి, రథం కాడిపై ఒక కాలు నెత్తిపెట్టి, రథాన్ని చక్కగా లాగుతున్న ఆ నాలుగు గుర్రాలను చంపివేసింది. (37)
స హతాశ్వే రథే తిష్ఠన్ మద్రాధిపతిరాయసీమ్ ।
ఉత్తరాంతకరీం శక్తిం చిక్షేప భుజగోపమామ్ ॥ 38
గుర్రాలు మరణించినా అదే రథం మీద నిలిచి శల్యుడు ఉత్తరుని అంతం చేయటానికి లోహమయమైన శక్తిని వదిలాడు. అది పాములా దూసుకొని వచ్చింది. (37,38)
తయా భిన్నతనుత్రాణః ప్రవిశ్య విపులం తమః ।
స పపాతే గజస్కంధాత్ ప్రముక్తాంకుశతోమరః ॥ 39
దానితో కవచం బ్రద్దలు కాగా ఉత్తరుని తీవ్ర మోహం ఆవహించింది. చేతి నుండి అంకుశం, తోమరం జారిపోయాయి. ఏనుగుమీద నుండి ఉత్తరుడు పడిపోయాడు. (39)
అసిమాదాయ శల్యోఽపి అవప్లుత్య రతోత్తమాత్ ।
తస్య వారణరాజస్య చిఛేదాథ మహాకరమ్ ॥ 40
అప్పుడు శల్యుడు రథం నుండి క్రిందకు దూకి, కత్తితీసికొని, ఆ ఏనుగుతొండాన్ని నరికివేశాడు. (40)
భిన్నమర్మా శరశతైః ఛిన్నహస్తః స వారణః ।
భీమమార్తస్వరం కృత్వా పపాత చ మమార చ ॥ 41
వందల బాణాల వలన మర్మస్థానాలు భిన్నమై, తొండం తెగిపోయిన ఆ ఏనుగు భీకరంగా ఆర్తనాదం చేసి, పడిపోయి, మరణించింది. (41)
ఏతదీదృశకం కృత్వా మద్రరాజో నరాధిప ।
ఆరురోహ రథం తూర్ణం భాస్వరం కృతవర్మణః ॥ 42
రాజా! శల్యుడు ఈ రీతిగా ఇంతపని చేసి, వెంటనే ప్రకాశమానమైన కృతవర్మ రథాన్ని ఎక్కాడు. (42)
ఉత్తరం వై హతం దృష్ట్వా వైరాటిర్ర్భాతరం తదా ।
కృతవర్మణా చ సహితం దృష్ట్వా శల్యమవస్థితమ్ ॥ 43
శ్వేతః క్రోధాత్ ప్రజజ్వాల హవిషా హవ్యవాడివ ।
తన సోదరుడు - ఉత్తరుడు మరణించటం, అప్పుడు శల్యుడు కృతవర్మతో కలిసి అతని రథం మీద ఉండటం చూసి, శ్వేతుడు హవిస్సుతో మండుతున్న అగ్నివలె కోపంతో మండిపడ్డాడు. (43 1/2)
స విస్ఫార్య మహచ్చాపం శక్రచాపోపమం బలీ ॥ 44
అభ్యధావజ్జిఘాంసన్ వై శల్యం మద్రాధిపం బలీ ।
బలిష్ఠుడైన ఆ శ్వేతుడు ఇంద్రచాపం వలె ఉన్న గొప్ప ధనుస్సును చెవి దాకా లాగి, మద్రాధిపుడైన శల్యుని చంపగోరి, అతనిపై దాడిచేశాడు. (44 1/2)
మహతా రథవంశేన సమంతాత్ పరివారితః ॥ 45
ముంచన్ బాణమయం వర్షం ప్రాయాచ్ఛల్యరథం ప్రతి ।
గొప్ప రథసేనతో చుట్టుముట్టి, బాణవర్షాన్ని కురిపిస్తూ, శ్వేతుడు శల్యుని రథం వైపు దూసుకొనిపోయాడు. (45 1/2)
తమాపతంతం సంప్రేక్ష్య మత్తవారణ విక్రమమ్ ॥ 46
తావకానాం రథాః సప్త సమంతాత్ పర్యవారయన్ ।
మద్రరాజమభీప్సంతః మృత్యోర్దంష్ట్రాంతరం గతమ్ ॥ 47
మదపుటేనుగువలె పరాక్రమిస్తూ, మీదకు వస్తున్న శ్వేతుని చూసి, మద్రరాజు మృత్యువు కోరలలో చిక్కుకొన్నాడని భావించి ఆయనను రక్షించటానికై నీ వారు ఏడుగురు రథికులు ఆయన చుట్టూ నిలిచారు. (46,47)
బృహద్బలశ్చ కౌసల్యః జయత్సేనశ్చ మాగధః ।
తథా రుక్మరథో రాజన్ శల్యపుత్రః ప్రతాపవాన్ ॥ 48
విందానువిందావావంత్యౌ కాంబోజశ్చ సుదక్షిణః ।
బౄహత్ క్షత్రస్య దాయాదః సైంధవశ్చ జయద్రథః ॥ 49
రాజా! ఆ ఏడుగురు - కోసల రాజు బృహద్బలుడు, మగధాధీశుడు జయత్సేనుడు; శల్యుని కొడుకు, ప్రతాపవంతుడు అయిన రుక్మరథుడు; అవంతి ప్రభువులు విందాను విందులు, కాంబోజ రాజు సుదక్షిణుడు; బృహత్ క్షత్రుని కొడుకు, సింధురాజు అయిన జయద్రథుడు. (48,49)
నానావర్ణవిచిత్రాణి ధనూంషి చ మహాత్మనామ్ ।
విస్ఫారితాని దృశ్యంతే తోయదేష్వివ విద్యుతః ॥ 50
ఆ మహాత్ముడు ఎక్కుపెట్టిన ధనుస్సులు వివిధ వర్ణాలతో విచిత్రంగా మేఘాలలోని మెరుపుల వలె కనిపిస్తున్నాయి. (50)
తే తు బాణమయం వర్షం శ్వేతమూర్ధన్యపాతయన్ ।
నిదాఘాంతేఽనిలోద్ధూతాః మేఘా ఇవ నగే జలమ్ ॥ 51
గ్రీష్మకాలపు చివరలో గాలికి పైకెగసిన మేఘాలు కొండపై కురిసినట్లు ఆ ఏడుగురు శ్వేతుని తలపై బాణవృష్టిని కురిపించారు. (51)
తతః క్రుద్ధో మహేష్వాసః సప్తభల్లైః సుతేజనైః ।
ధనూంషి తేషామాచ్ఛిద్య మమర్ద పృతనాపతిః ॥ 52
దానితో కోపించి మేటివిలుకాడు, సేనాపతి అయిన శ్వేతుడు బాగా పదునుగా ఉన్న ఏడు బాణాలతో వారి ధనుస్సులను ఖండించి, వాటిని ముక్కలు చేశాడు. (52)
నికృత్తాన్యేవ తాని స్మ సమదృశ్యంత భారత ।
తతస్తే తు నిమేషార్ధాత్ ప్రత్యపద్యన్ ధనూంషి చ ॥ 53
సప్త చైవ పృషత్కాంశ్చ శ్వేతస్యోపర్యపాతయన్ ।
తతః పునరమేయాత్మా భల్లైః సప్తభిరాశుగైః ।
నిచకర్త మహాబాహుః తేషాం చాపాని ధన్వినామ్ ॥ 54
భారతా! ఆ ధనుస్సులు విరిగిపోయిన తర్వాతనే వారి కది తెలిసింది. వెంటనే వారు అరనిముషంలో వేరే ధనుస్సులు చేపట్టారు. అందరూ ఒక్కుమ్మడిగా ఏడు బాణాలను శ్వేతునిపై పడవేశారు. వెంటనే అమేయబలుడు, మహాబాహువు అయిన శ్వేతుడు వేగవంత మయిన బాణసప్తకంతో మరల ఆ విలు కాండ్ర ధనుస్సులను ఖండించాడు. (53,54)
తే నికృత్తమహాచాపాః త్వరమాణా మహారథాః ।
రథశక్తీః పరామృశ్య వినేదుర్భైరవాన్ రవాన్ ॥ 55
ధనుస్సులు విరిగిపోతే ఆ మహారథులు తొందర పడుతూ రథంలోనున్న శక్తులను చేతబట్టి పెద్దగా, భీకరంగా గర్జించారు. (55)
అన్వయుర్భరతశ్రేష్ఠ సప్త శ్వేతరథం ప్రతి ।
తతస్తా జ్వలితాః సప్త మహేంద్రాశనినిఃస్వనాః ॥ 56
భరతశ్రేష్ఠా! అప్పుడు ఆ ఏడు శక్తులూ దేవేంద్రుని వజ్రం వలె ధ్వనిస్తూ, ప్రజ్వలిస్తూ శ్వేతుని రథంపైకి దూసుకొని వచ్చాయి. (56)
అప్రాప్తాః సప్తభిర్భల్లైః చిచ్ఛేద పరమాస్త్రవిత్ ।
తతః సమాదాయ శరం సర్వకాయవిదారణమ్ ॥ 57
ప్రాహిణోద్ భరతశ్రేష్ఠ శ్వేతో రుక్మరథం ప్రతి ।
కానీ పరమాస్త్రవేత్త అయిన శ్వేతుడు ఏడు భల్లాలతో ఆ శక్తులు తనను చేరకముందే ఛిన్నాభిన్నం చేశాడు. భరతశ్రేష్ఠా! ఆ పై శ్వేతుడు అందరి శరీరాలను చీల్చివేయగల ఒక బాణాన్ని తీసికొని, దానిని రుక్మరథుని మీదకు విసిరాడు. (57 1/2)
తస్య దేహే నిపతితః బాణో వజ్రాతిగో మహాన్ ॥ 58
తతో రుక్మరథో రాజన్ సాయకేన దృఢాహతః ।
నిషసాద రథోపస్థే కశ్మలం చావిశన్మహత్ ॥ 59
వజ్రాన్ని మించిన ఆ మహాశరం రుక్మరథుని శరీరాన్ని తాకింది. రాజా! అప్పుడు ఆ బాణం దెబ్బ గట్టిగా తగిలి, రుక్మరథుడు రథంలో వెనుకవైపు కూర్చుని స్పృహ తప్పిపోయాడు. (58,59)
తం విసంజ్ఞం విమనసం త్వరమాణస్తు సారథిః ।
అపోవాహ న సంభ్రాంతః సర్వలోకస్య పశ్యతః ॥ 60
అచేతనుడై, అమనస్కుడై ఉన్న రుక్మరథుని చూసి, సారథి కంగారు పడకుండా, వెంటనే, అందరూ చూస్తుండగానే అక్కడ నుండి ఆయనను తప్పించి తీసికొనిపోయాడు. (60)
తతోఽన్యాన్ షట్ సమాదాయ శ్వేతో హేమవిభూషితాన్ ।
తేషాం షణ్ణాం మహాబాహుః ధ్వజశీర్షాణ్యపాతయత్ ॥ 61
ఆ పై మహాబాహు వయిన శ్వేతుడు బంగారు అలంకరణలు గల ఆరు బాణాలను తీసికొని, మిగిలిన ఆరుగురి ధ్వజాల పైభాగాలను పడవేశాడు. (61)
హయాంశ్చ తేషాం నిర్భిద్య సారథీంశ్చ పరంతప ।
శరైశ్చైతాన్ సమాకీర్య ప్రాయాచ్ఛల్యరథం ప్రతి ॥ 62
పరంతపా! అలాగే వారి గుర్రాలను, సారథులను చీల్చి చెండాడి, బాణాలతో వారిని గ్రుచ్చి, శల్యుని రథం వైపు ఉరికాడు. (62)
తతో హలహలాశబ్దః తవ సైన్యేషు భారత ।
దృష్ట్వా సేనాపతిం తూర్ణం యాంతం శల్యరథం ప్రతి ॥ 63
భారతా! శత్రుసేనాపతి వేగంగా శల్యుని రథం వైపు దూసుకొని పోవటాన్ని చూసిన నీ సేనలలో, అప్పుడు కోలాహల ధ్వని వినిపించింది. (63)
తతో భీష్మం పురస్కృత్య తవ పుత్రో మహాబలః ।
వృతస్తు సర్వసైన్యేన ప్రాయాత్ శ్వేతరథం ప్రతి ॥ 64
మృత్యోరాస్యమనుప్రాప్తం మద్రరాజమమోచయత్ ।
అప్పుడు మహాబలుడైన నీ కొడుకు - సుయోధనుడు భీష్ముని ముందుంచుకొని సర్వసైన్యాన్నీ చుట్టూ నిలుపుకొని, శ్వేతుని రథంపై దాడిచేసి, మృత్యుముఖంలో ఉన్న మద్రరాజును విడిపించాడు. (64 1/2)
తతో యుద్ధం సమభవత్ తుములం లోమహర్షణమ్ ॥ 65
తావకానాం పరేషాం చ వ్యతిషక్తరథద్విపమ్ ।
అప్పుడు నీవారికీ, శత్రువులకు మధ్య ఘోరయుద్ధం జరిగింది. చూపరులకు రోమాంచం కలుగుతోంది. రథాలతో రథాలు, ఏనుగులతో ఏనుగులు కలిసిపోయాయి. (65 1/2)
సౌభ్రదే భీమసేనే చ సాత్యకౌ చ మహారథే ॥ 66
కైకేయే చ విరాటే చ ధృష్టద్యుమ్నే చ పార్షతే ।
ఏతేషు నరసింహేషు చేదిమత్స్యేషు చైవ హ ।
వవర్ష శరవర్షాణి కురువృద్ధః పితామహః ॥ 67
అభిమన్యుడు, భీమసేనుడు, మహారథి అయిన సాత్యకి, కేకయ రాజకుమారులు, విరాటరాజు, ద్రుపదసుతుడు ధృష్టద్యుమ్నుడు - ఈ నరసింహులు, చేది మత్స్యదేశస్థులు పాండవ పక్షాన యుద్ధం చేస్తుంటే కురువృద్ధుడు, పితామహుడు అయిన భీష్ముడు శరవృష్టిని కురిపించాడు. (66, 67)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి శ్వేతయుద్ధే సప్తచత్వారింశోఽధ్యాయః ॥ 47 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున శ్వేతయుద్ధ మను నలువది యేడవ అధ్యాయము. (47)