48. నలువది యెనిమిదవ అధ్యాయము

భీష్ముడు శ్వేతుని సంహరించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
ఏవం శ్వేతే మహేష్వాసే ప్రాప్తే శల్యరథం ప్రతి ।
కురవః పాండవేయాశ్చ కిమకుర్వత సంజయ ॥ 1
భీష్మః శాంతనవః కిం వా తన్మమాచక్ష్వ పృచ్ఛతః ।
ధృతరాష్ట్రుడిలా అడిగాడు.
"సంజయా! ఈ రీతిగా మేటివిలుకాడైన శ్వేతుడు శల్యుని రథం మీద పడగా కౌరవులు, పాండవులు ఏం చేశారు? శంతనుసుతుడు భీష్ముడేమి చేశాడు? అడుగుతున్నాను వివరంగా చెప్పు." (1 1/2)
రాజన్ శతసహస్రాణి తతః క్షత్రియపుంగవాః ॥ 2
శ్వేతం సేనాపతిం శూరం పురస్కృత్య మహారథాః ।
రాజ్ఞో బలం దర్శయంతః తవ పుత్రస్య భారత ॥ 3
శిఖండినం పురస్కృత్య త్రాతుమైచ్ఛన్మహారథాః ।
అభ్యవర్తంత భీష్మస్య రథం హేమపరిష్కృతమ్ ॥ 4
జిఘాంసంతం యుధాం శ్రేష్ఠం తదాఽఽసీత్ తుములం మహత్ ।
సంజయుడిలా చెప్తున్నాడు - "రాజా! పాండవపక్షంలోని లక్షలకొలది క్షత్రియ శ్రేష్ఠులు, మహారథులు శూరుడైన శ్వేతుని సేనాపతిగా ముందుంచుకొని, నీ కుమారుడికి తమ బలాన్ని ప్రదర్శిస్తూ, శిఖండిని ముందు నిలుపుకొని, సువర్ణభూషితమైన భీష్ముని రథం పైకి వచ్చారు. వారంతా శ్వేతునికి కాపుగా నిలువదలిచారు. అతనిని చంపగల యోధుడైన భీష్ముని ఆక్రమించారు. అపుడు మహాభీకర యుద్ధం జరిగింది. (2- 4 1/2)
తత్ తేఽహం సంప్రవక్ష్యామి మహావైశసమద్బుతమ్ ॥ 5
తావకానాం పరేషాం చ యథా యుద్ధమవర్తత ।
అప్పుడు నీ వారికీ, శత్రువులకూ మధ్య మహాసంహార రూపమైన అద్భుతయుద్ధం జరిగింది. అది నీకు వివరించి చెపుతాను. (5 1/2)
తత్రాకరోద్ రథోపస్థాన్ శూన్యాన్ శాంతనవో బహూన్ ॥ 6
తత్రాద్భుతం మహచ్చక్రే శరైరార్చ్ఛద్ రథోత్తమాన్ ।
సమావృణోచ్ఛరైరర్కమ్ అర్కతుల్యప్రతాపవాన్ ॥ 7
అపుడు భీష్ముడు చాలా రథాలను రథికరహితంగా చేశాడు. మహాద్భుతాలను ప్రదర్శించాడు. బాణాలతో శ్రేష్ఠరథికులను పీడించాడు. సూర్యతేజస్వి అయిన ఆయన తన బాణాలతో సూర్యుని కూడా కప్పివేశాడు. (6,7)
మదన్ సమంతాత్ సమరే రవిరుద్యన్ యథా తమః ।
తేనాజౌ ప్రేషితా రాజన్ శరాః శతసహస్రశః ॥ 8
క్షత్రియాంతకరాః సంఖ్యే మహావేగా మహాబలాః ।
శిరాంసి పాతయామాసుః వీరాణాం శతశో రణే ॥ 9
రాజా! సూర్యుడు ఉదయిస్తూనే చీకటిని పారద్రోలినట్లు భీష్ముడు రణభూమిలో శత్రుసేనలను పారద్రోలాడు. వందలు, వేల కొలదిగ ఆయన ప్రయోగించిన బాణాలు మహాబలంగా, మహావేగంగా రాజులను అంతం చేయగలవి. అవి యుద్ధంలో వందలకొలదిగ వీరుల శిరస్సులను పడగొట్టాయి. (8,9)
గజాన్ కంటకసన్నాహాన్ వజ్రేణేవ శిలోచ్చయాన్ ।
రథా రథేషు సంసక్తాః వృద్యశ్యంత విశాంపతే ॥ 10
రాజా! వజ్రం దెబ్బలు తిన్న శిలాసముదాయాల వలె కవచాలు ధరించిన ఏనుగులు కూడా నేలగూలాయి. అప్పుడు రథాలు కూడా రథాలకు అతుక్కుపోయాయి. (10)
ఏకే రథం పర్యవహన్ తురగాః సతురంగమమ్ ।
యువానం నిహతం వీరం లంబమానం సకార్ముకమ్ ॥ 11
ఎన్నో గుర్రాలు తమతోపాటు రథాలను ఈడ్చుకొంటూ పారిపోయాయి. చనిపోయిన నవయువకులైన వీరులు ధనుస్సులతో పాటు వ్రేలాడుతున్నారు. (11)
ఉదీర్ణాశ్చ హయా రాజన్ వహంతస్తత్ర తత్ర హ ।
బద్ధఖడ్గనిషంగాశ్చ విధ్వస్తశిరసో హతాః ॥ 12
శతశః పతితా భూమౌ వీరశయ్యాసు శేరతే ।
రాజా! ఆ మేటిగుర్రాలు రథాలను ఈడ్చుకొంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. చేతిలో కత్తులను, వెనుక అమ్ముల పొదులను ధరించిన వీరులు వందలకొలది తలలు తెగి, నేలపై పడి, వీరోచితంగా శయనించి ఉన్నారు. (12 1/2)
పరస్పరేణ ధావంతః పతితాః పునరుత్థితాః ॥ 13
ఉత్థాయ చ ప్రధావంతః ద్వంద్వయుద్ధమవాప్నువన్ ।
పీడితాః పునరన్యోన్యం లుఠంతో రణమూర్ధని ॥ 14
ఒకరినొకరు ఆక్రమించాలనుకొంటూ ఎందరో క్రిందపడి, మరల లేచి, ముందుకురికి ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు పీడించి అందరూ రణభూమిపై పడి దొర్లుతున్నారు. (13,14)
సచాపాః సనిషంగాశ్చ జాతరూపపరిష్కృతాః ।
విస్రబ్ధహతవీరాశ్చ శతశః పరిపీడితాః ॥ 15
తేన తేనాభ్యధావంత విసృజంతశ్చ భారత ।
భారతా! వందల కొలది వీరులు ధనుస్సులను, అమ్ముల పొదులను ధరించి, బంగారు ఆభరణాలు ధరించి, నిర్భయంగా శత్రువీరులను చంపి, శత్రులచే పీడింపబడి, మరల వారిపై బాణాలు వేస్తూ అటూ, ఇటూ పరుగెత్తుతున్నారు. (15 1/2)
మత్తో గజః పర్యవర్తత్ హయాంశ్చ హతసాదినః ॥ 16
సరథా రథినశ్చాపి విమృద్నంతః సమంతతః ।
రథికులు మరణించిన గుర్రాలవెంట మదపుటేనుగులు పడుతున్నాయి. అలాగే రథాలనెక్కి రథికులు కూడా అంతటా నేలపై పడి ఉన్న శవాలను త్రొక్కుతూ తిరుగుతున్నారు. (16 1/2)
స్యందనాదపతత్ కశ్చిత్ నిహతోఽన్యేన సాయకైః ॥ 17
హతసారథిరప్యుచ్చైః పపాత కాష్ఠవద్ రథః ।
ఇతరులు బాణాలతో కొట్టగానే కొందరు రథం నుండి పడిపోతున్నారు. సారథులు మరణించగా కొన్ని రథాలు కట్టెల వలె నేలగూలుతున్నాయి. (17 1/2)
యుధ్యమానస్య సంగ్రామే వ్యూఢే రజసి చోత్థితే ॥ 18
ధనుః కూజితవిజ్ఞానం తత్రాసీత్ ప్రతియుద్ధ్యతః ।
గాత్రస్పర్శేన యోధానాం వ్యజ్ఞాస్త పరిపంథినమ్ ॥ 19
యుద్ధభూమిలో ధూళి దట్టంగా పైకి లేవటంతో ఎవరికీ ఏమీ తెలియటం లేదు. ధనుష్టంకారాలను బట్టి మాత్రమే ప్రతియోధులను గుర్తించగలుగుతున్నారు. చేతితో తడిమిచూసి శత్రువులను తెలిసికోగలుగుతున్నారు. (18,19)
యుద్ధ్యమానం శరై రాజన్ సింజినీధ్వజినీరవాత్ ।
అన్యోన్యం వీరసంశబ్దః నాశ్రూయత భటైః కృతః ॥ 20
రాజా! అల్లెత్రాటి చప్పుళ్ళవలన, సేనల కోలాహలం వలన మాత్రమే బాణయుద్ధం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు వీరులు ప్రతివీరుల నుద్దేశించి చేసే గర్జనలు కూడా వినిపించటం లేదు. (20)
శబ్దాయమానే సంగ్రామే పటహే కర్ణదారిణి ।
యుద్ధ్యమానస్య సంగ్రామే కుర్వతః పౌరుషం స్వకమ్ ॥ 21
నా శ్రౌషం నామగోత్రాణి కీర్తనం చ పరస్పరమ్ ।
చెవులను బ్రద్ధలు చేస్తూ, రణభూమిలో ఢక్కల శబ్దం వినిపిస్తోంది. తమ తమ పౌరుషాన్ని ప్రకటించుకొంటూ యోధులు పలికేమాటలు వినిపించటం లేదు. నామ గోత్రాలు తెలిపి, ఒకరినొకరు పరిచయం చేసికొనే మాటలు కూడా వినిపించటం లేదు. (21 1/2)
భీష్మచాపచ్యుతైర్బాణైః ఆర్తానాం యుధ్యతాం మృధే ॥ 22
పరస్పరేషాం వీరాణాం మనాంసి సమకంపయన్ ।
యుద్ధంలో భీష్ముని ధనుస్సు నుండి వెలువడిన బాణాలతో యోధులందరూ బాధలకు లోనయ్యారు. ఆ బాణాలు పరస్పరం వీరులందరి మనస్సులను చలింపజేశాయి. (22 1/2)
తస్మిన్నత్యాకులే యుద్ధే దారుణే లోమహర్షణే ॥ 23
పితా పుత్రం చ సమరే నాభిజానాతి కశ్చన ।
అందరినీ కలవరపరుస్తూ, రోమాంచాన్ని కలిగిస్తూ, జరుగుతున్న భయంకర యుద్ధంలో తండ్రి కొడుకును కూడా గుర్తించలేకపోతున్నాడు. (23 1/2)
చక్రే భగ్నే యుగే ఛిన్నే ఏకధుర్యే హయే హతః ॥ 24
ఆక్షిప్తః స్యందనాద్ వీరః ససారథిరజిహ్మగైః ।
భీష్ముని బాణాల తాకిడికి చక్రం విరిగి, కాడి ముక్కలై, మిగిలిన ఒక్క గుర్రమూ మరణించి, వీరుడొకడు సారథితో సహా బాణాలకు ఎరయై రథం నుండి నేలకొరిగాడు. (24 1/2)
ఏవం చ సమరే సర్వే వీరాశ్చ విరథీకృతాః ॥ 25
తేన తేన స్మ దృశ్యంతే ధావమానాః సమంతతః ।
ఈ రీతిగా వీరులందరూ యుద్ధంలో రథాలను కోలుపోయి విభిన్న మార్గాలలో అన్ని వైపులకూ పరుగెత్తుతున్నారు. (25 1/2)
గజో హతః శిరశ్ఛిన్నం మర్మ భిన్నం హయో హతః ॥ 26
అహతః కోఽపి నైవాసీద్ భీష్మే నిఘ్నతి శాత్రవాన్ ।
ఏనుగు మరణించింది. తల తెగిపడింది. మర్మస్థానం బ్రద్దలయింది. గుర్రం చనిపోయింది. భీష్ముడు శత్రువులను సంహరిస్తుంటే గాయపడనివాడు ఎవ్వడూ లేడు. (26 1/2)
శ్వేతః కురూణామకరోత్ క్షయం తస్మిన్ మహాహవే ॥ 27
రాజపుత్రాన్ రథోదారాన్ అవధీచ్ఛతసంఘశః ।
ఆ మహాయుద్ధంలో శ్వేతుడు కౌరవులను క్షీణింపజేస్తున్నాడు. మాకుమ్మడిగా వందలకొలదిగ రథికులయిన రాజకుమారులను సంహరిస్తున్నాడు. (27 1/2)
చిచ్ఛేద రథినాం బాణైః శిరాంసి భరతర్షభ ॥ 28
భరత శ్రేష్ఠా! రథికుల శిరస్సులను బాణాలతో ఖండించాడు. (28)
సాంగదా బాహవశ్చైవ ధనూంషి చ సమంతతః ।
రథేషాం రథచక్రాణి తూణీరాణి యుగాని చ ॥ 29
అంతటా బాణాలను ప్రయోగిస్తూ అంగదాలు అలాగే ఉన్న వీరుల బాహువులను, ధనుస్సులను, రథదండాలను, రథచక్రాలను, అమ్ముల పొదులను, కాడులను కూడా ఖండించాడు. (29)
ఛత్రాణి చ మహార్హాణి పతాకాశ్చ విశాంపతే ।
హయౌఘశ్చ రథౌఘాశ్చ నరౌఘాశ్చైవ భారత ॥ 30
వారణాః శతశశ్చైవ హతాః శ్వేతేన భారత ।
రాజా! భారతా! శ్వేతుడు గొప్పగొప్ప గొడుగులను, పతాకలను, అశ్వసమూహాలను, రథ సముదాయాలను, సేనలగుంపులను వందల కొలది ఏనుగులను చంపివేశాడు. (30 1/2)
వయం శ్వేతభయాద్ భీతాః విహాయ రథసత్తమమ్ ॥ 31
అపయాత్తాస్తథా పశ్చాద్ విభుం పశ్యామ ధృష్టవః ।
శరపాతమతిక్రమ్య కురవః కురునందన ॥ 32
భీష్మం శాంతనవం యుద్ధే స్థితాః పశ్యామ సర్వశః ।
మనవారు కూడా శ్వేతుని చూసి, భయపడి, భీష్ముని ఒంటరిగా వదలి పారిపోయారు. ఇప్పుడు మరలా వచ్చి రాజదర్శనం చేసికొంటున్నారు. కురునందనా! కౌరవులు శ్వేతుని బాణాలకు అందనంత దూరంలో నిలిచి, అంతటా ప్రేక్షకుల వలె శంతనుసుతుడైన భీష్ముని చూస్తున్నారు. (31,32 1/2)
అదీనో దీనసమయే భీష్మోఽస్మాకం మహాహవే ॥ 33
ఏకస్తస్థౌ నరవ్యాఘ్రః గిరిర్మేరురివాచలః ।
ఆ మహాయుద్ధంలో భయపడవలసిన సమయంలో కూడా బెదరకుండా నరోత్తముడైన భీష్ముడు ఒంటరిగా మేరుపర్వతం వలె నిశ్చలంగా నిలిచాడు. (33 1/2)
ఆదదాన ఇవ ప్రాణాన్ సవితా శిశిరాత్యయే ॥ 34
గభస్తిభిరివాదిత్యః తస్థౌ శరమరీచిమాన్ ।
శిశిరం వెళ్ళిన తర్వాత సూర్యుడు నీటిని ఎండింపజేసినట్లు భీష్ముడు సైనికుల ప్రాణాలను అపహరిస్తున్నాడు. కిరణాలతో సూర్యుడు ప్రకాశించనట్లు శరకిరణాలతో భీష్ముడు ప్రకాశిస్తున్నాడు. (34 1/2)
స ముమోచ మహేష్వాసః శరసంఘాననేకశః ॥ 35
నిఘ్నన్నమిత్రాన్ సమరే వజ్రపాణిరివాసురాన్ ।
మేటి విలుకాడైన ఆ భీష్ముడు, దేవేంద్రుడు రాక్షసులను చంపినట్లు శత్రువులను చంపుతూ, మాటిమాటికి బాణవృష్టిని కురిపించాడు. (35 1/2)
స ముమోచ మహేష్వాసః శరసంఘాననేకశః ॥ 36
స్వయూథాదివ తే యూథాత్ ముక్తం భూమిషు దారుణమ్ ।
గుంపులో నుండి బయటపడిన ఏనుగువలె మహాబలి అయిన భీష్ముడు సేన నుండి బయటపడి రణభూమిలో భయంకరంగా నిలిచాడు. ఆయనచే దెబ్బలు తిని, శత్రువులు ఆ ప్రదేశాన్ని వీడి, పారిపోతున్నారు. (36 1/2)
తమేవముపలక్ష్యైకః హృష్టః పుష్టః పరంతప ॥ 37
దుర్యోధనప్రియే యుక్తః పాండవాన్ పరిశోచయన్ ।
జీవితం దుస్త్యజం త్యక్త్వా భయం చ సుమహాహవే ॥ 38
పరంతపా! ముందు చెప్పినట్లుగా శ్వేతుడు కౌరవులను పీడించటం చూసి కూడా భీష్ముడొక్కడే ఉత్సాహంతో, ఆనందంతో, పాండవులకు దుఃఖాన్ని కలిగిస్తూ, జీవితంపై మోహాన్నీ, భయాన్ని వీడి, ఆ మహాయుద్ధంలో దుర్యోధనునకు ఆనందాన్ని కలిగించటంలో ఆసక్తుడయ్యాడు. (37,38)
పాతయామాస సైన్యాని పాండవానాం విశాంపతే ।
ప్రహరంతమనీకాని పితా దేవవ్రతస్తవ ॥ 39
దృష్ట్వా సేనాపతిం భీష్మః త్వరితః శ్వేతమభ్యయాత్ ।
రాజా! భీష్ముడు పాండవుల సేనలను పడగొట్టాడు. శ్వేతుడు మనసేనలను దెబ్బతీయటాన్ని చూసి, నీ తండ్రి - దేవవ్రతుడు వెంటనే ఆయనను నిలువరించటానికి వెళ్ళాడు. (39 1/2)
స భీష్మం శరజాలేన మహతా సమవాకిరత్ ॥ 40
శ్వేతం చాపి తథా భీష్మః శరౌఘైః సమవాకిరత్ ।
శ్వేతుడు లెక్కలేనంతగా బాణసమూహాన్ని భీష్మునిపై కురిపించాడు. భీష్ముడు కూడా అదే రీతిగా శ్వేతునిపై బాణ వృష్టిని కురిపించాడు. (40 1/2)
తౌ వృషావివ నర్దంతౌ మత్తావివ మహాద్విపౌ ॥ 41
వ్యాఘ్రావివ సుసంరబ్ధౌ అన్యోన్యమభిజఘ్నతుః ।
ఆ ఇద్దరూ రంకెలు వేస్తున్న ఆబోతుల వలె, మదించిన ఏనుగుల వలె, కోపించిన పులుల వలె ఒకరినొకరు దెబ్బ తీస్తున్నారు. (41 1/2)
అస్త్రైరస్త్రాణి సంవార్య తతస్తౌ పురుషర్షభౌ ॥ 42
భీష్మః శ్వేతశ్చ యుయుధే పరస్పరవధైషిణౌ ।
ఆ తరువాత పురుషోత్తమలయిన ఆ శ్వేత భీష్ములిద్దరూ ఒకరినొకరు చంపగోరుతూ, ఒకరి అస్త్రాలను మరొకరు నివారిస్తూ యుద్ధం చేస్తున్నారు. (42 1/2)
ఏకాహ్నా నిర్దహేద్ భీష్మః పాండవానామనీకినీమ్ ॥ 43
శరైః పరమసంక్రుద్ధః యది శ్వేతో న పాలయేత్ ।
తీవ్రంగా కోపించిన భీష్ముడు పాండవుల సేనను శ్వేతుడు కాపాడకపోతే ఒకే రోజులో దహించివేసేవాడు. (43 1/2)
పితామహం తతో దృష్ట్వా శ్వేతేన విముఖీకృతమ్ ॥ 44
ప్రహర్షం పాండవా జగ్ముః పుత్రస్తే విమనాఽభవత్ ।
శ్వేతుడు భీష్ముని యుద్ధవిముఖుని చేయగలిగాడు. అది చూసి, పాండవులు ఆనందించారు. నీ కుమారుని మనస్సు కలతపడింది. (44 1/2)
తతో దుర్యోధనః క్రుద్ధః పార్థివైః పరివారితః ॥ 45
ససైన్యః పాండవానీకమ్ అభ్యద్రవత సంయుగే ।
అపుడు దుర్యోధనుడు రాజులందరూ చుట్టూ నిలవగా, సైన్యంతో కూడి, కోపంతో యుద్ధంలో పాండవసేనను ఆక్రమించాడు. (45 1/2)
దుర్ముఖః కృతవర్మా చ కృపః శల్యో విశాంపతిః ॥ 46
భీష్మం జుగుపురాసాద్య తవ పుత్రేణ నోదితాః ।
దుర్ముఖుడు, కృతవర్మ, కృపుడు, శల్యరాజు నీ కుమారుని ప్రేరణతో భీష్ముని దగ్గరకు వచ్చి రక్షణగా నిలిచారు. (46 1/2)
దృష్ట్వా తు పార్థివైః సర్వైః దుర్యోధనపురోగమైః ॥ 47
పాండవానామనీకాని వధ్యమానాని సంయుగే ।
శ్వేతో గాంగేయముత్సృజ్య తవ పుత్రస్య వాహినీమ్ ॥ 48
నాశయామాస వేగేన వాయుర్వృక్షానివౌజసా ।
దుర్యోధనుని ముందుంచుకొని రాజులందరూ రణంలో పాండవ సేనలను చంపటాన్ని చూసి, శ్వేతుడు భీష్ముని వీడి, గాలి చెట్లను కూల్చివేసినట్లు నీ కుమారుని సేనను వేగంగా నాశనం చేశాడు. (47,48 1/2)
ద్రావయిత్వా చమూం రాజన్ వైరాటిః క్రోధమూర్ఛితః ॥ 49
ఆపతత్ సహసా భూయః యత్ర భీష్మో వ్యవస్థితః ।
రాజా! క్రోధమూర్ఛితుడైన శ్వేతుడు సుయోధన సేనను పారద్రోలి, వెంటనే మరల భీష్ముని మీదకు వచ్చాడు. (49 1/2)
తౌ తత్రోపగతౌ రాజన్ శరదీప్తౌ మహాబలౌ ॥ 50
అయుధ్యేతాం మహాత్మానౌ యథోభౌ వృత్రవాసవౌ ।
అన్యోన్యం తు మహారాజ పరస్పరవధైషిణౌ ॥ 51
రాజా! మహాత్ములు, మహాబలులు అయిన వారిద్దరూ, బాణాలతో వెలిగిపోతూ, ఒకరినొకరు చంపగోరుతూ, వృత్రాసుర దేవేంద్రులవలె యుద్ధం చేశారు. (50,51)
విహృహ్య కార్ముకం శ్వేతః భీష్మం వివ్యాధ సప్తభిః ।
పరాక్రమం తతస్తస్య పరాక్రమ్య పరాక్రమీ ॥ 52
తరసా వారయామాస మత్తో మత్తమివ ద్విపమ్ ।
శ్వేతుడు ధనుస్సును బాగా లాగి, భీష్ముని ఏడు బాణాలతో గాయపరిచాడు. పరాక్రమశాలి అయిన భీష్ముడు పరాక్రమించి, శ్వేతుని పరాక్రమాన్ని నిరోధించి, మదపుటేనుగు మదపుటేనుగును వారించినట్లు శ్వేతుని నిలువరించాడు. (52 1/2)
శ్వేతః శాంతనవం భూయః శరైః సన్నతపర్వభిః ॥ 53
వివ్యాధ పంచవింశత్యా తదద్భుతమివాభవత్ ।
మరలా శ్వేతుడు వంగిన కణుపులు గల ఇరవై అయిదు బాణాలతో భీష్ముని గాయపరిచాడు. అది అద్భుతమనిపించింది. (53 1/2)
తం ప్రత్యవిధ్యద్ దశభిః భీష్మః శాంతనవస్తదా ॥ 54
స విద్ధస్తేన బలవాన్ నాకంపత యథాచలః ।
అప్పుడు శంతనుసుతుడైన భీష్ముడు పదిబాణాలతో శ్వేతుని గాయపరిచాడు. కానీ బలవంతుడైన శ్వేతుడు దెబ్బతిని కూడా కొండలా నిశ్చలంగా నిలిచాడు. (54 1/2)
వైరాటిః సమరే క్రుద్ధః భృశయాయమ్య కార్ముకమ్ ॥ 55
ఆజఘాన తతో భీష్మం శ్వేతః క్షత్రియనందనః ।
క్షత్రియులకు ఆనందాన్ని కల్గించ గల విరాటరాజ కుమారుడు - శ్వేతుడు వింటిని బాగా లాగి, కోపంతో యుద్ధంలో భీష్ముని కొట్టాడు. (55 1/2)
సంప్రహస్య తతః శ్వేతః సృక్కిణీ పరిసంలిహన్ ॥ 56
ధనుశ్చిచ్ఛేద భీష్మస్య నవభిర్దశధా శరైః ।
ఆ తరువాత శ్వేతుడు నవ్వుతూ, తన పెదవుల కోణాలను నాకుతూ, తొమ్మిని బాణాలతో భీష్ముని ధనుస్సును పది ముక్కలు చేశాడు. (56 1/2)
సంధాయ విశిఖం చైవ శరం లోమప్రవాహినమ్ ॥ 57
ఉన్మమాథ తతస్తాలం ధ్వజశీర్షం మహాత్మనః ।
ఆ పై శ్వేతుడు రెక్కలు గలిగి, శిఖలేని ఒక బాణాన్ని సంధించి, భీష్ముని తాలధ్వజం పైభాగాన్ని ఖండించాడు. (57 1/2)
కేతుం నిపతితం దృష్ట్వా భీష్మస్య తనయాస్తవ ॥ 58
హతం భీష్మమమన్యంత శ్వేతస్య వశమాగతమ్ ।
భీష్ముని ధ్వజం పడిపోవటాన్ని గమనించి, నీ కుమారులు భీష్ముడు శ్వేతుని చేతికి చిక్కి మరణించాడనే భావించారు. (58 1/2)
పాండవాశ్చాపి సంహృష్టాః దధ్ముః శంఖాన్ ముదా యుతాః ॥ 59
భీష్మస్య పతితం కేతుం దృష్ట్వా తాలం మహాత్మనః ।
మహాత్ముడైన భీష్ముని కేతుపతనాన్ని చూసి, పాండవులు కూడా హర్షోల్లాసంతో ప్రసన్నులై శంఖాలు పూరించారు. (59 1/2)
తతో దుర్యోధనః క్రోధాత్ స్వమనీకమనోదయత్ ॥ 60
యత్తా భీష్మం పరీప్సధ్వం రక్షమాణాః సమంతతః ।
మా నః ప్రపశ్యమానానాం శ్వేతాన్మృత్యుమవాప్స్యతి ॥ 61
భీష్మః శాంతనవః శూరః తథా సత్యం బ్రవీమి వః ।
వెంటనే సుయోధనుడు కోపంతో తన సేనను ఇలా ఆదేశించాడు. సావధానులై భీష్ముని రక్షిస్తూ, చుట్టూ నిలవండి. మనం చూస్తుండగానే భీష్ముడు శ్వేతుని చేతిలో మరణించకూడదు. శంతను కుమారుడు భీష్ముడు గొప్ప శూరుడు. మీకు యథార్థం చెపుతున్నాను. (60,61 1/2)
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా త్వరమాణా మహారథాః ॥ 62
బలేన చతురంగేణ గాంగేయమన్వపాలయన్ ।
రాజుమాటలు విని, మహారథులంతా త్వరపడుతూ చతురంగ బలాలతో భీష్ముని రక్షణకై నిలిచారు. (62 1/2)
బాహ్లీకః కృతవర్మా చ శలః శల్యశ్చ భారతః ॥ 63
జలసంధో వికర్ణశ్చ చిత్రసేనో వివింశతిః ।
త్వరమాణాస్త్వరాకాలే పరివార్య సమంతతః ॥ 64
శస్త్రవృష్టిం సుతుములాం శ్వేతస్యోపర్యపాతయన్ ।
భారతా! బాహ్లీకుడు, కృతవర్మ, శలుడు, శల్యుడు, జలసంధుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి వీరంతా త్వరపడవలసిన ఆవేళలో త్వరపడుతూ భీష్ముని చుట్టూ నిలిచి, శ్వేతుని మీద ఘోరంగా శస్త్రవృష్టిని కురిపించారు. (63,64 1/2)
తాన్ క్రుద్ధో నిశితైర్బాణైః త్వరమాణో మాహారథః ॥ 65
అవారయదమేయాత్మా దర్శయన్ పాణిలాఘవమ్ ।
అమేయబలుడు, మహారథుడు అయిన శ్వేతుడు వేగంగా తన హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తూ కోపంతో, వాడిబాణాలతో వారిని నిరోధించాడు. (65 1/2)
స నివార్య తు తాన్ సర్వాన్ కేసరీ కుంజరానివ ॥ 66
మహతా శరవర్షేణ భీష్మస్య ధనురాచ్ఛినత్ ।
సింహం ఏనుగులను నిలువరించినట్లే శ్వేతుడు వారినందరినీ వారించి, మహాశరవర్షంతో భీష్ముని వింటిని విరిచివేశాడు. (66 1/2)
తతోఽన్యద్ ధనురాదాయ భీష్మః శాంతనవో యుధి ॥ 67
శ్వేతం వివ్యాధ రాజేంద్ర కంకపత్రైః శితైః శరైః ।
రాజేంద్రా! అప్పుడు శంతనుసుతుడు - భీష్ముడు మరొకవింటిని తీసికొని, కంకపత్రాలు గల వాడి బాణాలతో శ్వేతుని గాయపరిచాడు. (67 1/2)
తతః సేనాపతిః క్రుద్ధః భీష్మం బహుభిరాయసైః ॥ 68
వివ్యాధ సమరే రాజన్ సర్వలోకస్య పశ్యతః ।
రాజా! ఆ పై శ్వేతుడు కోపించి, అందరూ చూస్తుండగానే యుద్ధంలో లోహబాణాలను పెక్కంటిని ప్రయోగించి, భీష్ముని గాయపరిచాడు. (68 1/2)
తతః ప్రవ్యథితో రాజా భీష్మం దృష్ట్వా నివారితమ్ ॥ 69
ప్రవీరం సర్వలోకస్య శ్వేతేన యుధి వై తదా ।
విష్ఠానకశ్చ సుమహాంస్తవ సైన్యస్య చాభవత్ ॥ 70
సర్వలోక ప్రవీరుడైన భీష్ముని యుద్ధంలో శ్వేతుడు ముందుకు సాగనీకపోవటాన్ని చూసి, దుర్యోధనుడు కలతపడ్డాడు. అప్పుడు నీ సేనలో తీవ్రసంచలనం ఏర్పడింది. (69,70)
తం వీరం వారితం దృష్ట్వా శ్వేతేన శరవిక్షతమ్ ।
హతం శ్వేతేన మన్యంతే శ్వేతస్య వశమాగతమ్ ॥ 71
బాణాల దెబ్బలు తగిలిన ఆ భీష్ముని శ్వేతుడు నివారించటం చూసి, శ్వేతునికి లోబడి అతని చేతిలో భీష్ముడు మరణించబోతున్నాడని అందరూ భావించారు. (71)
తతః క్రోధవశం ప్రాప్తః పితా దేవవ్రతస్తవ ।
ధ్వజమున్మథితం దృష్ట్వా తాం చ సేనాం నివారితమ్ ॥ 72
ఆ తరువాత నీ తండ్రి దేవవ్రతుడు క్రోధానికి లోనయ్యాడు. తన ధ్వజం విరిగిపోవటం, సేన ఆగిపోవటం గమనించాడు. (72)
శ్వేతం ప్రతి మహారాజ వ్యసృజత్ సాయకాన్ బహూన్ ।
తానావార్య రణే శ్వేతః భీష్మస్య రథినాం వరః ॥ 73
ధనుశ్చిచ్ఛేద భల్లేన పునరేవ పితుస్తవ ।
మహారాజా! భీష్ముడు శ్వేతునిపైకి ఎన్నో బాణాలను ప్రయోగించాడు. కానీ రథికశ్రేష్ఠుడైన శ్వేతుడు భీష్ముని ఆ బాణాలను నిరోధించి, మరల భీష్ముని ధనుస్సును బల్లెంతో ఖండించాడు. (73 1/2)
ఉత్సృజ్య కార్ముకం రాజన్ గాంగేయః క్రోధమూర్ఛితః ॥ 74
అన్యత్ కార్ముకమాదాయ విపులం బలవత్తరమ్ ।
తత్ర సంధాయ విపులాన్ భల్లాన్ సప్త శిలాశితాన్ ॥ 75
చతుర్భిశ్చ జఘానాశ్వాన్ శ్వేతస్య పృతనాపతేః ।
ధ్వజం ద్వాభ్యాం తు చిచ్ఛేద సప్తమేన చ సారథేః ॥ 76
శిరశ్చిచ్చేద బల్లేన సంక్రుద్ధో లఘువిక్రమః ।
రాజా! క్రోధమూర్ఛితుడైన గాంగేయుడు ఆ వింటిని వదలి, అంతకన్న శక్తిమంతమై, విశాలమైన మరొక వింటిని చేపట్టి, రాతిమీద సానబెట్టిన ఏడు బాణాలను (భల్లాలు) సంధించాడు. నాలుగింటితో సేనాపతి అయిన శ్వేతుని గుర్రాలను, రెండింటితో ధ్వజాన్ని, మిగిలిన దానితో సారథితలను ఖండించాడు. ఆయన క్రోధం, పరాక్రమం అటువంటివి. (74 76 1/2)
హతాశ్వసూతాత్ స రథాద్ అవప్లుత్య మహాబలః ॥ 77
అమర్షవశమాపన్నః వ్యాకులః సమపద్యత ।
గుర్రాలు, సారథి చనిపోగానే మహాబలుడైన ఆ శ్వేతుడు రథంపై నుండి దూకి, అసహనానికి గిరి అయి కలతపడ్డాడు. (77 1/2)
విరథం రథినాం శ్రేష్ఠం శ్వేతం దృష్ట్వా పితామహః ॥ 78
తాడయామాస నిశితైః శరసంఘైః సమంతతః ।
రథిక శ్రేష్ఠుడైన శ్వేతుడు రథహీనుడు కావటాన్ని చూసి, భీష్ముడు వాడిబాణాల సమూహాలతో అన్ని వైపుల నుండి అతనిని కొట్టాడు. (78 1/2)
స తాడ్యమానః సమరే భీష్మచాపచ్యుతైః శరైః ॥ 79
స్వరథే ధనురుత్సృజ్య శక్తిం జగ్రాహ కాంచనీమ్ ।
భీష్ముని వింటి నుండి వెలువడిన బాణాలచే కొట్టబడుతున్న ఆ శ్వేతుడు రణరంగంలో వింటిని తన రథంలో విడిచి, కాంచన మయమైన శక్తిని చేతబట్టాడు. (79 1/2)
తతః శక్తిం రణే శ్వేతః జగ్రాహోగ్రాం మహాభయామ్ ॥ 80
కాలదండోపమాం ఘోరాం మృత్యోర్జిహ్వామివ శ్వసన్ ।
అబ్రవీచ్చ తదా శ్వేతః భీష్మం శాంతనవం రణే ॥ 81
అప్పుడు యుద్ధంలో కాలదండంవలె, మృత్యుజిహ్వవలె మహా ఘోరంగా, భయంకరంగా ఉన్న ఆ శక్తిని చేతబట్టి శ్వేతుడు విట్టూర్పువిడుస్తూ, శంతనుసుతుడైన భీష్మునితో ఇలా అన్నాడు. (80,81)
తిష్ఠేదానీం సుసంరబ్ధః పశ్య మాం పురుషో భవ ।
ఏవముక్త్వా మహేష్వాసః భీష్మం యుహి పరాక్రమీ ॥ 82
తతః శక్తిమమేయాత్మా చిక్షేప భుజగోపమామ్ ।
పాండవార్థే పరాక్రాంతః తవానర్థం చికీర్షుకః ॥ 83
"ఇప్పుడు సాహసంతో నిలు. నన్ను చూడు. మగవాడిలా విలు" అంటూ మేటివిలుకాడు, పరాక్రమశాలి, అమేయబలుడు అయిన శ్వేతుడు పాములా ఉన్న ఆ శక్తిని భీష్మునిపైకి విసిరాడు. ఆ శ్వేతుడు పాండవులకు మేలు, నీకు కీడు చేయాలని పరాక్రమిస్తున్నాడు. (82,83)
హాహాకారో మహానాసీత్ పుత్రాణాం తే విశాంపతే ।
దృష్ట్వా శక్తిం మహాఘోరాం మృత్యోర్దండసమప్రభామ్ ॥ 84
శ్వేతస్య కరనిర్ముక్తాం నిర్ముక్తోరగసన్నిభామ్ ।
రాజా! మృత్యుదండం వలె మెరిసిపోతూ, కుబుసం విడిచిన పాములా శ్వేతుని చేతినుండి వెలువడిన ఆ మహాఘోర శక్తిని చూసి, నీ కుమారులలో పెద్దగా హాహాకారధ్వని చెలరేగింది. (84 1/2)
అపతత్ సహసా రాజన్ మహోల్కేవ నభస్తలాత్ ॥ 85
జ్వలంతీమంతరిక్షే తాం జ్వాలాభిరివ సంవృతామ్ ।
అసంభ్రాంతస్తదా రాజన్ పితా దేవవ్రతస్తవ ॥ 86
అష్టభిర్మవభిర్భీష్మః శక్తిం చిచ్ఛేద పత్రిభిః ।
రాజా! అది ఆకాశం నుండి పెద్దతోక చుక్క పడుతున్నట్టు వెంటనే మీదికి వచ్చింది. మంటలతో చుట్టుముట్టినట్టు అంతరిక్షంలో వెలుగుతున్న ఆ శక్తిని నీ తండ్రి దేవవ్రతుడు కంగారు పడకుండా రెక్కలు గల బాణాలను ఎనిమిది, తొమ్మిదింటిని వేసి, ఖండించాడు. (85,86 1/2)
ఉత్కృష్ట హేమవికృతాం నికృతాం నిశితైః శరైః ॥ 87
ఉచ్చుక్రుశుస్తతః సర్వే తావకా భరతర్షభ ।
భరతర్షభా! మేలిమి బంగారుతో తయారు చేయబడిన ఆ శక్తిని వాడి బాణాలతో భీష్ముడు బ్రద్ధలు చేయగానే నీ వారంతా ఆనందంతో కోలాహలం చేశారు. (87 1/2)
శక్తిం వినిహతాం దృష్ట్వా వైరాటిః క్రోధమూర్ఛితః ॥ 88
కాలోపహతచేతాస్తు కర్తవ్యం నాభ్యజానత ।
క్రోధసమ్మూర్చ్ఛితో రాజన్ వైరాటిః ప్రహసన్నివ ॥ 89
గదాం జగ్రాహ సంహృష్టః భీష్మస్య నిధనం ప్రతి ।
శక్తి విఫలం కావటాన్ని చూసి శ్వేతుడు క్రోధంతో మూర్ఛపోయాడు. వివేకాన్ని కోల్పోయి ఏం చేయాలో తెలియని స్థితికి వచ్చాడు. రాజా! మరలా కర్తవ్య మెరిగి, ఉల్లాసంగా నవ్వుతూ, శ్వేతుడు భీష్ముని చంపటానికి గదను చేతబట్టాడు. (88,89 1/2)
క్రోధేన రక్తనయనః దండపాణిరివాంతకః ॥ 90
భీష్మం సమభిదుద్రావ జలౌఘ ఇవ పర్వతమ్ ।
క్రోధంతో శ్వేతుని కళ్ళు ఎర్రబడ్డాయి. దండాన్ని చేతబట్టిన యమధర్మరాజులా ఆయన కనిపిస్తున్నాడు. జలప్రవాహం కొండను ఢీ కొడుతున్నట్లు శ్వేతుడు భీష్ముని మీదికి ఉరికాడు. (90 1/2)
తస్య వేగమసంహార్యం మత్వా భీష్మః ప్రతాపవాన్ ॥ 91
ప్రహారవిప్రమోక్షార్థం సహసా ధరణీం గతః ।
శ్వేతుని వేగాన్ని నిరోధించటం కష్టమని భావించి, ప్రతాపశాలి అయిన భీష్ముడు గద దెబ్బనుండి తప్పించుకోవటానికి నేలపైకి దూకాడు. (91 1/2)
శ్వేతః క్రోధసమావిష్టః భ్రామయిత్వా తు తాం గదామ్ ॥ 92
రథే భీష్మస్య చిక్షేప యథా దేవో ధనేశ్వరః ।
క్రోధంతో నిండిన శ్వేతుడు ఆ గదను గిరగిర త్రిప్పి కుబేరుడు గదను విసిరినట్లు దానిని భీష్ముని రథం మీదకు విసిరాడు. (92 1/2)
తయా భీష్మనిపాతిన్యా స రథో భస్మసాత్కృతః ॥ 93
సధ్వజః సహ సూతేన సాశ్వః సయుగబంధురః ।
భీష్ముని చంపటానికి ఉద్దేశించిన శక్తి ఆ రథాన్ని ధ్వజ, సారథి, హయాలతో, కాడి, ఇరుసులతో సహ భస్మం చేసింది. (93 1/2)
విరథం రథినాం శ్రేష్ఠం భీష్మం దృష్ట్వా రథోత్తమాః ॥ 94
అభ్యధావంత సహితాః శల్యప్రభృతయో రథాః ।
రధిక శ్రేష్ఠుడైన భీష్ముడు రథహీనుడు కావటం గమనించి మహారథులయిన శల్యుడు మొదలగువారు ఒక్కటై, భీష్మునివైపు పరుగుతీశారు. (94 1/2)
తతోఽన్యం రథమాస్థాయ ధనుర్విస్ఫార్య దుర్మనాః ॥ 95
శనకైరభ్యయాచ్ఛ్వేతం గాంగేయః ప్రహసన్నివ ।
భీష్ముడు మరొక రథాన్ని ఎక్కి, ధనుష్టంకారం చేస్తూ, నిర్లిప్తంగా నవ్వుతూ, మెల్లగా శ్వేతునివైపు కదిలాడు. (95 1/2)
ఏతస్మిన్నంతరే భీష్మః శుశ్రావ విపులాం గిరమ్ ॥ 96
ఆకాశాదీరితాం దివ్యామ్ ఆత్మనో హితసంభవామ్ ।
భీష్మ భీష్మ మహాబాహో శీఘ్రం యత్నం కురుష్వ వై ॥ 97
ఏష హ్యస్య జయే కాలః నిర్దిష్టో విశ్వయోనినా ।
అంతలో తన హితాన్ని కోరుతూ ఆకాశం నుండి స్పష్టంగా వెలువడిన దివ్యవాణి భీష్మునకు ఇలా వినిపించింది. 'మహాబాహూ! భీష్మా! త్వరగా ప్రయత్నించు. శ్వేతుని గెలవటానికి ఇది తగినకాలంగా బ్రహ్మ నిర్దేశిస్తున్నాడు!' (96,97 1/2)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం దేవదూతేన భాషితమ్ ॥ 98
సంప్రహృష్టమనా భూత్వా వధే తస్య మనో దధే ।
ఆ దేవదూత మాటను విని, భీష్ముడు మనసా ఆనందించి, శ్వేతుని చంపటంపై మనస్సు పెట్టాడు. (98 1/2)
విరథం రథినాం శ్రేష్ఠం శ్వేతం దృష్ట్వా పదాతినమ్ ॥ 99
సహితాస్త్వభ్యవర్తంత పరీప్సంతో మహారథాః ।
రధికశ్రేష్ఠుడైన శ్వేతుడు రథహీనుడు కావటాన్ని గమనించి, ఆయనను రక్షించటానికి మహారథులు ఎందరో ఒక్కుమ్మడిగా వచ్చి చేరారు. (99 1/2)
సాత్యకిర్భీమసేనశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 100
కైకేయా ధృష్టకేతుశ్చ అభిమన్యుశ్చ వీర్యవాన్ ।
సాత్యకి, భీమసేనుడు, ద్రుపదకుమారుడైన ధృష్టద్యుమ్నుడు, కేకయరాజ కుమారుడు, ధృష్టకేతువు, పరాక్రమవంతుడైన అభిమన్యుడు - వీరంతా వచ్చి చేరారు. (100 1/2)
ఏతానాపతతః సర్వాన్ ద్రోణశల్యకృపైః సహ ॥ 101
అవారయదమేయాత్మా వారివేగానివాచలః ।
ఇలా మీద పడుతున్న అందరినీ అమేయబలుడైన భీష్ముడు ద్రోణశల్య కృపులతో కలిసి పర్వతం జలప్రవాహాలను నివారించినట్లు నిరోధించాడు. (101 1/2)
స నిరుద్ధేషు సర్వేషు పాండవేషు మహాత్మసు ॥ 102
శ్వేత ఖడ్గమథాకృష్య భీష్మస్య ధనురాచ్ఛినత్ ।
మహాత్ములైన పాండవులందరూ నిరోధింపబడగానే శ్వేతుడు కత్తిని ఒర నుండి లాగి, భీష్ముని వింటిని ముక్కలు చేశాడు. (102 1/2)
తదపాస్య ధనుశ్ఛిన్నం త్వరమాణః పితామహః ॥ 103
దేవదూతవచః శ్రుత్వా వధే తస్య మనో దధే ।
భీష్ముడు త్వరపడుతూ విరిగిన ఆ వింటిని విడిచి, దేవదూత మాటను తలచుకొని, శ్వేతుని చంపటంపై మనస్సు పెట్టాడు. (103 1/2)
తతః ప్రచరమాణస్తు పితా దేవవ్రతస్తవ ॥ 104
అన్యత్ కార్ముకమాదాయ త్వరమాణో మహారథః ।
క్షణేన సజ్యమకరోత్ చక్రచాపసమప్రభమ్ ॥ 105
ఆ తరువాత మహారథుడైన నీ తండ్రి దేవవ్రతుడు మరొక వింటిని తిసికొని, త్వరపడుతూ ఇంద్రచాపం వలె కాంతులీనుతున్న ఆ వింటిని క్షణంలో ఎక్కుపెట్టాడు. (104,105)
పితా తే భరతశ్రేష్ఠ శ్వేతం దృష్ట్వా మహారథైః ।
వృతం తం మనుజవ్యాఘ్రైః భీమసేనపురోగమైః ॥ 106
అభ్యవర్తత గాంగేయః శ్వేతం సేనాపతిం ద్రుతమ్ ।
భరతశ్రేష్ఠా! నరోత్తములు, మహారథులు అయిన భీమసేనుడు మొదలగు యోధులచే చుట్టుబడియున్న శ్వేతుని చూసి, నీ తండ్రి భీష్ముడు వెంటనే వేగంగా సేనాపతి అయిన ఆ శ్వేతుని ఆక్రమించాడు. (106 1/2)
ఆపతంతం తతో భీష్మః భీమసేనం ప్రతాపవాన్ ॥ 107
తత్ర తత్ర ప్రదృశ్యంతే రథవారణపత్తయః ।
ఆ పై సేనానాయకుడైన భీమసేనుడు ముందు కురకగా ప్రతాపవంతుడు, మహారథుడు అయిన భీష్ముడు అరవై బాణాలతో భీమసేనుని గాయపరిచాడు. (107 1/2)
అభిమన్యుం చ సమరే పితా దేవవ్రతస్తవ ॥ 108
ఆజఘ్నే భరతశ్రేష్ఠః త్రిభిః సన్నతపర్వభిః ।
భరతశ్రేష్ఠా! నీ తండ్రి దేవవ్రతుడు వంగిన కణుపులు గల మూడు బాణాలతో యుద్ధంలో అభిమన్యుని కూడా కొట్టాడు. (108 1/2)
సాత్యకిం చ శతేనాజౌ భరతానాం పితామహః ॥ 109
ధృష్టద్యుమ్నం చ వింశత్యా కైకేయం చాపి పంచభిః ।
సాదినశ్చ నరవ్యాఘ్ర యుధ్యమానా ముహుర్ముహుః ॥ 110
తత్ర తత్ర ప్రదృశ్యంతే రథవారణపత్తయః ।
భరత వంశపితామహుడుడైన భీష్ముడు రణంలో వందబాణాలతో సాత్యకిని, ఇరవై బాణాలతో దృష్టద్యుమ్నుని, అయిదు బాణాలతో కేకయ రాజకుమారుని గాయపరిచాడు. ఈ రీతిగా నీ తండ్రి దేవవ్రతుడు ఆ మేటివిలుకాండ్ర నందరినీ నివారించి, భయంకర బాణాలతో శ్వేతుని ఆక్రమించాడు. (109, 110 1/2)
తతః శరం మృత్యుసమం భారసాధనముత్తమమ్ ॥ 111
వికృష్య బలవాన్ భీష్మః సమాధత్త దురాసదమ్ ।
బ్రహ్మాస్త్రేణ సుసంయుక్తం తం శరం లోమవాహినమ్ ॥ 112
ఆ తరువాత బలవంతుడైన భీష్ముడు ఒక బాణాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి శ్వేతుని మీదకు విడిచాడు. ఆ బాణం రెక్కలు గలది. మృత్యువువంటిది. లక్ష్యసాధన చేయగలది. గొప్పదీ, ఎదిరింపరానిది. (111,112)
దదృశుర్దేవగంధర్వాః పిశాచోరగరాక్షసాః ।
స తస్య కవచం భిత్త్వా హృదయం చామితౌజసః ॥ 113
జగామ ధరణీం బాణః మహాశనిరివ జ్వలన్ ।
దేవతలు, గంధర్వులు, పిశాచులు, నాగులు, రాక్షసులు దానిని చూశారు. అది వజ్రంలా ప్రజ్వలిస్తూ మహాతేజస్వి అయిన శ్వేతుని కవచాన్ని, హృదయాన్ని భేదించి, నేలమీద పడిపోయింది. (113 1/2)
అస్తం గచ్ఛన్ యథాదిత్యః ప్రభామాదాయ సత్వరః ॥ 114
ఏవం జీవితమాదాయ శ్వేతదేహాజ్జగామ హ ।
అస్తమిస్తున్న సూర్యుడు తన కాంతిని లోగిని వెంటనే అస్తమించినట్లు ఆ బాణం శ్వేతుని శరీరం నుండి ప్రాణాలను తీసికొని పోయింది. (114 1/2)
తం భీష్మేణ నరవ్యాఘ్రం తథా వినిహతం యుధి ॥ 115
ప్రపతంతమపశ్యామ గిరేః శృంగమివ చ్యుతమ్ ।
నరోత్తముడైన ఆ శ్వేతుని భీష్ముడు యుద్ధంలో చంపటం, ఆయన పడిపోవటం కనిపించింది. అది కొండకొమ్ము విరిగి పడినట్టుంది. (115 1/2)
అశోచన్ పాండవాస్తత్ర క్షత్రియాశ్చ మహారథాః ॥ 116
ప్రహృష్టాశ్చ సుతాస్తుభ్యం కురవశ్చాపి సర్వశః ।
మహారథుడైన పాండవులు, మరెందరో రాజులు శ్వేతుని మృతితో శోకించారు. నీ కుమారులూ, కౌరవపక్షం వారందరూ ఆనందించారు. (116 1/2)
తతో దుఃశాసనో రాజన్ శ్వేతం దృష్ట్వా నిపాతితమ్ ॥ 117
వాదిత్రనినదైర్ఘోరైః నృత్యతి స్మ సమంతతః ।
అప్పుడు పడిపోయిన శ్వేతుని చూసి దుశ్శాసనుడు భీకర వాద్యధ్వనులు వినిపిస్తుండగా అన్ని దిక్కులా నృత్యం చేశాడు. (117 1/2)
తస్మిన్ హతే మహేష్వాసే భీష్మేనాహవశోభినా ॥ 118
ప్రావేపంత మహేష్వాసాః శిఖంసిప్రముఖా రథాః ।
ఆ మేటి విలుకాడు - శ్వేతుడు యుద్ధానికే శోభ తెచ్చే భీష్మునిచేత చంపబడగా శిఖంసి మొదలయిన మహాధనుర్ధరులు, మహారథులు వణికిపోయారు. (118 1/2)
తతో ధనంజయో రాజన్ వారేష్ణేయశ్చాపి సర్వశః ॥ 119
అవహారం శనైశ్చక్రుః నిహతే వాహినీపతౌ ।
తతోవహారః సైన్యానాం తవ తేషాం చ భారత ॥ 120
రాజా! సేనాపతి అయిన శ్వేతుడు మరణించగానే అర్జునుడు, కృష్ణుడు తమసేనను మెల్లగా ఉపసంహరించుకొన్నారు. భారతా! అప్పుడు నీసేనలు, పాండవ సేనలు కూడా యుద్ధవిముఖులయ్యారు. (119,120)
తావకానాం పరేషాంచ నర్దతాం చ ముహుర్ముహుః ।
పార్థా విమనసో భూత్వా న్యవర్తంత మహారథాః ।
చింతయంతో వధం ఘోరం ద్వైరథేన పరంతపాః ॥ 121
అప్పుడు నీ సేనలు, శత్రుసేనలు మాటిమాటికి గర్జిస్తున్నాయి. ద్వైరథ యుద్ధంలో ఘోరవధను చూసి, దానిని గురించి ఆలోచిస్తూ, పరంతపులైన మహారథులు - పాండవులు విమనస్కులై వెనుదిరిగారు. (121)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి శ్వేతవధే అష్టచత్వారింశోఽధ్యాయః ॥ 48 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున శ్వేతవధ అను నలువది యెనిమిదవ అధ్యాయము. (48)