49. నలువది తొమ్మిదవ అధ్యాయము
శంఖునియుద్ధము - భీమునిపరాక్రమము.
ధృతరాష్ట్ర ఉవాచ
శ్వేతే సేనాపతౌ తాత సంగ్రామే నిహతే పరైః ।
కిమకుర్వన్ మహేష్వాసాః పంచాలాః పాండవైః సహ ॥ 1
ధృతరాష్ట్రడిలా అడిగాడు.
"నాయనా! సేనాపతి అయిన శ్వేతుడు యుద్ధంలో శత్రువులచే చంపబడిన తర్వాత మేటివిలు కాండ్రయిన పాంచాలురు, పాండవులు ఏం చేశారు? (1)
సేనాపతిం సమాకర్ణ్య శ్వేతం యుధి నిపాతితమ్ ।
తదర్థం యతతాం చాపి పరేషాం ప్రపలాయినామ్ ॥ 2
మనః ప్రీణాతి మే వాక్యం జయం సంజయ శృణ్వతః ।
ప్రత్యుపాయం చింతయతః లజ్జాం ప్రాప్నోతి మే న హి ॥ 3
స హి వీరోఽనురక్తశ్చ వృద్ధః కురుపతిస్తదా ।
సంజయా? పాండవ సేనాపతి అయిన శ్వేతుడు యుద్ధంలో చనిపోయాడనీ, రక్షించటానికి ప్రయత్నించిన శత్రువులు పారిపోయారనీ విని, నా మనస్సు ఆనందిస్తోంది. శత్రువులపై ప్రతీకారాన్ని తీర్చుకొనే ఉపాయాన్ని ఆలోచిస్తూ నేను సిగ్గుపడటం లేదు. కురువృద్ధుడైన భీష్ముడు గొప్పవీరుడు, మా పై అనురాగం గలవాడు. (2,3 1/2)
కృతం వైరం సదా తేన పితుః పుత్రేణ ధీమతా ॥ 4
తస్యోద్వేగభయాచ్చాపి సంశ్రితః పాండవాన్ పురా ।
ధీమంతుడైన శ్వేతుడు తండ్రితోనే శత్రుత్వాన్ని వహించినవాడు. తండ్రి వలన కలగబోయే ఇబ్బందులు, భయం కారణంగా తాను ముందుగానే పాండవులను ఆశ్రయించాడు. (4 1/2)
సర్వం బలం పరిత్యజ్య దుర్గం సంశ్రిత్య తిష్ఠతి ॥ 5
పాండవానాం ప్రతాపేన దుర్గం దేశం నివేశ్య చ ।
సపత్నాన్ సతతం బాధన్ ఆర్యవృత్తిమనుష్ఠితః ॥ 6
అంతకు ముందు సమస్త సేనలనూ వీడి, ఒంటరిగా దుర్గంలో దాగి ఉండేవాడు. ఆపై పాండవుల ప్రతాపంతో దుర్గమ ప్రదేశాల్లో నివసిస్తూ, ఎప్పుడూ శత్రువులను బాధిస్తూ సదాచారాలను పాటిస్తూండేవాడు. (5,6)
ఆశ్చర్యం వై సదా తేషాం పురా రాజ్ఞాం సుదుర్మతిః ।
తతో యుధిష్ఠిరే భక్తః కథం సంజయ సూదితః ॥ 7
గతంలో తనతో శత్రుత్వాన్ని వహించిన రాజులను గూర్చి చెడుగా ఆలోచించేవాడు. ఆ పై యుధిష్ఠిరుని భక్తుడయ్యాడు. సంజయా! అటువంటివాడు ఎలా చనిపోయాడు? (7)
ప్రక్షిప్తః సమ్మతః క్షుద్రః పుత్రో మే పురుషాధమః ।
న యుద్ధం రోచయేద్ భీష్మః న చాచార్యః కథంచన ॥ 8
న కృపో న చ గాంధారీ నాహం సంజయ రోచయే ।
నా కుమారుడు - సుయోధనుడు పురుషాధముడు. క్షుద్రుడు. కర్ణాదులు మెచ్చుకొనే చపలుడు. సంజయా! భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ యుద్ధాన్ని ఇష్టపడరు. కృపునికి, గాంధారికి, నాకు కూడా యుద్ధం ఇష్టంలేదు. (8 1/2)
న వాసుదేవో వార్ ష్ణేయః ధర్మరాజశ్చ పాండవః ॥ 9
న భీమో నార్జునశ్చైవ న యమౌ పురుషర్షభౌ ।
వృష్ణికులజుడైన వాసుదేవునకు కానీ పాండుకుమారుడైన ధర్మరాజుకు కానీ, భీమార్జునులకు కానీ, పురుషోత్తములైన నకుల సహదేవులకు కానీ యుద్ధం ఇష్టం లేదు. (9 1/2)
వార్యమాణో మయా నిత్యం గాంధార్యా విదురేణ చ ॥ 10
జామదగ్న్యేన రామేణ వ్యాసేన చ మహాత్మనా ।
దుర్యోధనో యుధ్యమానః నిత్యమేవ హి సంజయ ॥ 11
కర్ణస్య మతమాస్థాయ సౌబలస్య చ పాపకృత్ ।
దుఃశాసనస్య చ తథా పాండవాన్ నాన్వచింతయత్ ॥ 12
సంజయా! నేను, గాంధారి, విదురుడు, పరశురాముడు మహాత్ముడైన వ్యాసుడు ఎంత వారించినా దుర్యోధనుడు ఎప్పుడూ యుద్ధమే కావాలంటాడు. కర్ణ శకుని, దుశ్శాసనుల అభిప్రాయాన్నే స్వీకరిస్తాడు ఆ పాపాత్ముడు. పాండవులను గూర్చి ఎప్పుడూ ఆలోచించడు. (10-12)
తస్యాహం వ్యసనం ఘోరం మన్యే ప్రాప్తం తు సంజయ ।
శ్వేతస్య చ వినాశేన భీష్మస్య విజయేన చ ॥ 13
సంక్రుద్ధః కృష్ణసహితః పార్థః కిమకరోద్ యుధి ।
సంజయా! అటువంటి దుర్యోధనుడికి శ్వేతుని మరణంతో, భీష్ముని విజయంతో పెద్ద చిక్కు వచ్చిందనే నేను భావిస్తున్నాను. కోపించిన అర్జునుడు రణభూమిలో ఏం చేశాడు? (13 1/2)
అర్జునాద్ధి భయం భూయః తన్మే తాత న శామ్యతి ॥ 14
స హి శూరశ్చ కౌంతేయః క్షిప్రకారీ ధనంజయః ।
మన్యే శరైః శరీరాణి శత్రూణాం ప్రమథిష్యతి ॥ 15
నాయనా! అర్జునుడంటే నాకెంతో భయం. ఇప్పటికీ తగ్గటం లేదు. అర్జునుడు మహాశూరుడు. వేగశాలి. ఆ ధనంజయుడు శత్రుశరీరాలను మథించి వేస్తాడని నేననుకొంటున్నాను. (14-15)
ఐంద్రిమింద్రానుజసమం మహేంద్రసదృశం బలే ।
అమోఘక్రోధసంకల్పం దృష్ట్వా వః కిమభూన్మనః ॥ 16
అర్జునుడు విష్ణువువలె ప్రభావశాలి. మహేంద్రునివలె బలశాలి. అతని క్రోధం కానీ సంకల్పం కానీ వ్యర్థం కాదు. అతన్ని గూర్చి మీ మనస్సులో ఏముందో? (16)
తథైవ వేదవిచ్ఛూరః జ్వలనార్కసమద్యుతిః ।
ఇంద్రాస్త్రవిదమేయాత్మా ప్రపతన్ సమితింజయః ॥ 17
వజ్రసంస్పర్శరూపాణామ్ అస్త్రాణాం చ ప్రయోజకః ।
స ఖడ్గక్షేపహస్తస్తు ఘోషం చక్రే మహారథః ॥ 18
అలాగే అర్జునుడు వేదవేత్త, శూరుడు, అగ్నివలె సూర్యుని వలె తేజస్వి, ఇంద్రాస్త్రం తెలిసినవాడు, అమేయబలుడు, వేగంగా ఆక్రమించి యుద్ధంలో గెలువగలవాడు, వజ్రస్పర్శ వంటి బాణాలను ప్రయోగించగలడు. ఆ మహారథుడు ఎప్పుడూ చేతిలోని కత్తిని ఎత్తి ఉంచుతాడు. భీకరంగా గర్జిస్తాడు. (17,18)
స సంజయ మహాప్రాజ్ఞః ద్రుపదస్యాత్మజో బలీ ।
ధృష్టద్యుమ్నః కిమకరోత్ శ్వేతే యుధి నిపాతితే ॥ 19
సంజయా! మహాప్రాజ్ఞుడు, బలవంతుడు అయిన ద్రుపద సుతుడు - ధృష్టద్యుమ్నుడు యుద్ధంలో శ్వేతుడు మరణించిన తర్వాత ఏం చేశాడు? (19)
పురా చైవాపరాధేన వధేన చ చమూపతేః ।
మన్యే మనః ప్రజజ్వాల పాండవానాం మహాత్మనామ్ ॥ 20
ముందుగానే సేనాపతిని చంపి, అపరాధం చేశారు కౌరవులు. దానితో మహాత్ములయిన పాండవుల మనస్సు మండిపడి ఉంటుందని భావిస్తున్నాను. (20)
తేషాం క్రోధం చింతయంస్తు అహః సు చ నిశాసు చ ।
న శాంతిమధిగచ్ఛామి దుర్యోధనకృతేన హి ।
కథం చాభూన్మహాయుద్ధం సర్వమాచక్ష్వ సంజయ ॥ 21
సంజయా! వారి కోపాన్ని తలచుకొంటుంటే పగలూ, రేయీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. దుర్యోధనుని కారణంగా ఇదంతా జరిగింది. ఆ ఘోర యుద్ధ మెలా జరుగుతోంది? వివరంగా చెప్పు." (21)
సంజయ ఉవాచ
శృణు రాజన్ స్థిరో భూత్వా తవాపనయనో మహాన్ ।
న చ దుర్యోధనే దోషమ్ ఇమమాధాతుమర్హసి ॥ 22
సంజయుడిలా చెప్తున్నాడు.
"రాజా! స్థిరంగా నిలిచి విను. ఈ యుద్ధంలో నీవల్లనే ఎక్కువ అన్యాయం జరిగింది. ఆ దోషాన్ని దుర్యోధనుని మీదకు నెట్టకూడదు. (22)
గతోదకే సేతుబంధః యాదృక్ తాదృక్ మతిస్తవ ।
సందీప్తే భవనే యద్వత్ కూపస్య ఖననం తథా ॥ 23
నీ బుద్ధి గతజలసేతుబంధనం వంటిది. ఇల్లు తగులబడుతుంటే బావి త్రవ్వటం లాంటిది. (23)
గతపూర్వాహ్ణభూయుష్ఠే తస్మిన్నహని దారుణే ।
తావకానాం పరేషాం చ పునర్యుద్ధమవర్తత ॥ 24
ఆ దారుణయుద్ధంలో దాదాపు పూర్వాహ్ణమంతా గడచిపోగా నీవారికీ, శత్రువులకు మధ్య మరల యుద్ధం జరిగింది. (24)
శ్వేతం తు నిహతం దృష్ట్వా విరాటస్య చమూపతిమ్ ।
కృతవర్మణా చ సహితం దృష్ట్వా శల్యమవస్థితమ్ ॥ 25
శంఖః క్రోధాత్ ప్రజజ్వాల హవిషా హవ్యవాడివ ।
విరాటుని సేనాపతి శ్వేతుడు మరణించటం, శల్యుడు కృతవర్మతో కలిపి రథంపై నుండటం చూసి, శంఖుడు హవిస్సుతో అగ్ని మండినట్లు క్రోధంతో మండిపడ్డాడు. (25 1/2)
స విస్ఫార్య మహచ్చాపం శక్రచాపోపమం బలీ ॥ 26
అభ్యధావజ్జిఘాంసన్ వై శల్యం మద్రాధిపం యుధి ।
బలవంతుడైన శంఖుడు ఇంద్రధనుస్సు వంటి గొప్ప వింటిని తీసికొని, చెవి వరకు లాగి, మద్రాధిపతి అయిన శల్యుని యుద్ధంలో చంపగోరుతూ, ఆయన పైకి ఉరికాడు. (26 1/2)
మహతా రథసంఘేన సమంతాత్ పరిరక్షితః ॥ 27
సృజన్ బాణమయం వర్షం ప్రాయాచ్ఛల్యరథం ప్రతి ।
రథాల సమూహాలు ఎన్నో తన చుట్టూ నిలిచి కాపుదలగా ఉంటే, బాణమయవృష్టిని కురిపిస్తూ శల్యరథంవైపు వెళ్ళాడు. (27 1/2)
తమాపతంతం సంప్రేక్ష్య మత్తవారణవిక్రమమ్ ॥ 28
తావకానాం రథాః సప్త సమంతాత్ పర్యవారయన్ ।
మద్రరాజం పరీప్సంతః మృత్యోర్ధంష్ట్రాంతరం గతమ్ ॥ 29
మదపుటేనుగువలె పరాక్రమిస్తూ శంఖుడు మీదికి రావటం చూసి, మృత్యువు కోరలలో చిక్కుకొన్న మద్రరాజును (శల్యుని) రక్షించటానికై నీ సేనలోని రథికులు ఏడుగురూ అన్నివైపులా ఆయనచుట్టూ నిలిచారు. (28,29)
బృహద్బలశ్చ కౌసల్యః జయత్సేనశ్చ మాగధః ।
తథా రుక్మరథో రాజన్ పుత్రః శల్యస్య మానితః ॥ 30
విందానువిందావావంత్యౌ కాంబోజశ్చ సుదక్షిణః ।
బృహత్ క్షత్రస్య దాయాదః సైంధవశ్చ జయద్రథః ॥ 31
రాజా! ఆ ఏడుగురు - కోసలాధిపతి బృహద్బలుడు, మగధాధీశుడు జయత్సేనుడు, శల్యుని కొడుకు, ప్రతాపశాలి అయిన రుక్మరథుడు, అవంతిదేశరాజులు విందుడు, అనువిందుడు; కంబోజరాజు సుదక్షిణుడు, బృహత్ క్షత్రకుమారుడు, సింధు దేశాధిపతి అయిన సైంధవుడు. (30,31)
నానాధాతువిచిత్రాణి కార్ముకాణి మహాత్మనామ్ ।
విస్ఫారితాన్యదృశ్యంత తోయదేష్వివ విద్యుతః ॥ 32
ఆ మహాత్ముల ధనుస్సులు రకరకాల రూపాలతో రంగులతో విచిత్రంగా ఉన్నాయి. వాటిని లాగిపడితే మేఘాలలోని మెరుపుల వలె కనిపిస్తున్నాయి. (32)
తే తు బాణమయం వర్షం శంఖమూర్ధ్ని న్యపాతయన్ ।
నిదాఘాంతేఽనిలోద్ధూతాః మేఘా ఇవ నగే జలమ్ ॥ 33
గ్రీష్మకాలంలో గాలికి చెలరేగిన మేఘాలు కొండపై నీటిని కురిసినట్లు ఆ మహారథులు శంఖుని తలపై బాణవృష్టిని కురిపించారు. (33)
తతః క్రుద్ధో మహేష్వాసః సప్తభల్లైః సుతేజనైః ।
ధనూంషి తేషామాచ్ఛిద్య ననర్ద పృతనాపతిః ॥ 34
అపుడు మేటివిలుకాడు, సేనాధిపతి అయిన శంఖుడు బాగా పదునుగల భల్లాలతో (బాణాలతో) వాళ్ళ ధనుస్సులను ఖండించి, గర్జించాడు. (34)
తతో భీష్మో మహాబాహుః వినద్య జలదో యథా ।
తాలమాత్రం ధనుర్గృహ్య శంఖమభ్యద్రవద్ రణే ॥ 35
ఆ పై మహాబాహువైన భీష్ముడు మేఘంలా గర్జించి, తాటిచెట్టంత ధనుస్సును చేతబట్టి, రణరంగంలో శంఖుని మీదకు వచ్చాడు. (35)
తముద్యంతముదీక్ష్యాథ మహేష్వాసం మహాబలమ్ ।
సంత్రస్తా పాండవీ సేనా వాతవేగహతేవ నౌః ॥ 36
మేటివిలుకాడు, మహాబలుడు అయిన భీష్ముడు ఉద్యమించటాన్ని చూసి, పాండవసేన వాయువేగంతో దెబ్బతిన్న నావవలె బెదిరిపోయింది. (36)
తతోఽర్జునః సంత్వరితః శంఖస్యాసీత్ పురఃసరః ।
భీష్మాద్ రక్ష్యోఽయమద్యేతి తతో యుద్ధమవర్తత ॥ 37
'ఇప్పుడు భీష్ముని నుండి ఇతనిని కాపాడా' లని భావించి, అర్జునుడు వేగంగా శంఖుని ముందుకు వచ్చాడు. అప్పుడు యుద్ధం జరిగింది. (37)
హాహాకారో మహానాసీద్ యోధానాం యుధి యుధ్యతామ్ ।
తేజస్తేజసి సంపృక్తమ్ ఇత్యేవం విస్మయం యయుః ॥ 38
యుద్ధం చేస్తున్న యోధుల హాహాకారాలు పెద్దగా చెలరేగాయి. తేజస్సు తేజస్సుతో కలిసిందని అందరూ విస్మయానికి లోనయ్యారు. (38)
అథ శల్యో గదాపాణిః అవతీర్య మహారథాత్ ।
శంఖస్య చతురో వాహాన్ అహనద్ భరతర్షభ ॥ 39
భరతర్షభా! అపుడు శల్యుడు గద చేతబట్టి, మహారథం నుండి దిగి, శంఖుని గుర్రాలను నాలుగింటిని చంపాడు. (39)
స హతాశ్వాద్ రథాత్ తూర్ణం ఖడ్గమాదాయ విద్రుతః ।
బీభత్సోశ్చ రథం ప్రాప్య పునః శాంతిమవిందత ॥ 40
శంఖుడు గుర్రాలు చనిపోయిన ఆ రథం నుండి వెంటనే కత్తిని తీసికొని, దూకి, అర్జునుని రథాన్నిచేరి, మరల ప్రశాంతిని పొందాడు. (40)
తతో భీష్మరథాత్ తూర్ణమ్ ఉత్పతంతి పతత్త్రిణః ।
యైరంతరిక్షం భూమిశ్చ సర్వతః సమవస్తృతా ॥ 41
ఆ తరువాత భీష్ముని రథం నుండి వేగంగా బాణాలు వెలువడుతూ భూమ్యాకాశాలు మొత్తం కప్పివేశాయి. (41)
పంచాలానథ మత్స్యాంశ్చ కేకయాంశ్చ ప్రభద్రకాన్ ।
భీష్మః ప్రహరతాం శ్రేష్ఠః పాతయామాస పత్రిభిః ॥ 42
అపుడు పాంచాలురను, మత్స్యదేశ వీరులను, కేకయ రాజ్యసేనలను, ప్రభద్రక వీరులను శ్రేష్ఠయోధుడైన భీష్ముడు బాణాలతో పడగొట్టాడు. (42)
ఉత్సృజ్య సమరే రాజన్ పాండవం సవ్యసాచినమ్ ।
అభ్యద్రవత పాంచాల్యం ద్రుపదం సేనయా వృతమ్ ॥ 43
ప్రియం సంబంధినం రాజన్ శరానవకిరన్ బహూన్ ।
రాజా! రణభూమిలో పాండుసుతుడైన అర్జునుని వీడి భీష్ముడు, సేనను చుట్టూ నిలుపుకొన్న పాంచాల రాజును - ద్రుపదుని ఆక్రమించాడు. తన ప్రియసంబంధి అయిన ఆయనపై ఎంతో బాణవృష్టిని కురిపించాడు. (43 1/2)
అగ్నినేవ ప్రదగ్ధాని వనాని శిశిరాత్యయే ॥ 44
శరదగ్ధాన్యదృశ్యంత సైన్యాని ద్రుపదస్య హ ।
శిశిరం గడిచిపోగానే అగ్నిదగ్ధమైన వనాలవలె, ద్రుపదుని సేనలు బాణదగ్ధాలై కనిపించాయి. (44 1/2)
అత్యతిష్ఠద్ రణే భీష్మః విధూమ ఇవ పావకః ॥ 45
మధ్యందినే యథాదిత్యం తపంతమివ తేజసా ।
న శేకుః పాండవేయస్య యోధా భీష్మం నిరీక్షితుమ్ ॥ 46
పొగలేని నిప్పులా భీష్ముడు రణరంగాన్ని ఆక్రమించాడు. మధ్యందిన భాస్కరునిలా తేజస్సుతో ప్రజ్వలిస్తున్న భీష్ముని పాండవసేనలోని యోధులు తేరి చూడలేకపోయారు. (45,46)
వీక్షాంచక్రుః సమంతాత్ తే పాండవా భయపీడితాః ।
త్రాతారం నాధ్యగచ్ఛంత గావః శీతార్దితా ఇవ ॥ 47
భయపీడితులైన పాండవయోధులు అన్ని దిక్కులా చూడసాగారు. చలికి వణికిపోతున్న గోవుల వలె వారు రక్షకుని పొందలేక పోయారు. (47)
సా తు యౌధిష్ఠిరీ సేనా గాంగేయశరపీడితా ।
సింహేనేవ వినిర్భిన్నా శుక్లా గౌరివ గోపతే ॥ 48
గాంగేయుని శరాలతో పీడింపబడిన ఆ ధర్మజసేన సింహం చీల్చిన తెల్లటి గోవు వలె కన్పించింది. (48)
హతే విప్రద్రుతే సైన్యే నిరుత్సాహే విమర్దితే ।
హాహాకారో మహానాసీత్ పాండుసైన్యేషు భారత ॥ 49
భారతా! పాండవసేనలోని సైనికులు దెబ్బతిని, చితికిపోయి పారిపోతుంటే, నిరుత్సాహం క్రమ్ముకొన్నది. హాహాకార ధ్వని చెలరేగింది. (49)
తతో భీష్మః శాంతనవః నిత్యం మండలకార్ముకః ।
ముమోచ బాణాన్ దీప్తాగ్రాన్ అహీనాశీవిషానివ ॥ 50
ఆ పై లాగిన ధనుస్సును ఆపకుండా శంతనుసుతుడు - భీష్ముడు విషసర్పాలవలె అగ్రభాగాలు ప్రజ్వలించే బాణాలను వదిలాడు. (50)
శరైరేకాయనీకుర్వన్ దిశః సర్వా యతవ్రతః ।
జఘాన పాండవరథాన్ ఆదిశ్యాదిశ్య భారత ॥ 51
భారతా! నియతవ్రతుడైన భీష్ముడు బాణాలతో అన్ని దిక్కులనూ ఒక్కటి చేస్తూ పాండవరథాలను చెప్పి, చెప్పి హింసించసాగాడు. (51)
తతః సైన్యేషు భగ్నేషు మథితేషు చ సర్వశః ।
ప్రాప్తే చాస్తం దినకరే న ప్రాజ్ఞాయత కించన ॥ 52
ఆ పై సేన అంతా మథింపబడి, వ్యూహాలన్నీ భంగం కాగా సూర్యుడు అస్తమించాడు. ఏదీ తెలియటం లేదు. (52)
భీష్మం చ సముదీర్యంతం దృష్ట్వా పార్థా మహాహవే ।
అవహారమకుర్వంత సైన్యానాం భరతర్షభ ॥ 53
భరతర్షభా! భీష్ముడు మరీ ప్రచండంగా పరాక్రమిస్తున్నాడు. అది చూసి పాండవులు మహాయుద్ధం నుండి తమ సేనలను ఉపసంహరించుకొన్నారు. (53)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి శంఖయుద్ధే ప్రథమదివసావహరే ఏకోనపంచాశత్తమోఽధ్యాయః ॥ 49 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున శంఖయుద్ధమున ప్రథమదివసావహారమను నలువది తొమ్మిదవ అధ్యాయము. (49)