50. ఏబదియవ అధ్యాయము
యుధిష్ఠిరుని చింత - క్రౌంచారుణవ్యూహ నిర్మాణము.
సంజయ ఉవాచ
కృతేఽవహారే సైన్యానాం ప్రథమే భరతర్షభ ।
భీష్మే చ యుద్ధసంరబ్ధే హృష్టే దుర్యోధనే తథా ॥ 1
ధర్మరాజస్తతస్తూర్ణమ్ అభిగమ్య జనార్దనమ్ ।
భ్రాతృభిః సహితః సర్వైః సర్యైశ్చైవ జనేశ్వరైః ॥ 2
శుచా పరమయా యుక్తః చింతయానః పరాజయమ్ ।
వార్ ష్ణేయమబ్రవీద్ రాజన్ దృష్ట్వా భీష్మస్య విక్రమమ్ ॥ 3
సంజయుడిలా చెప్తున్నాడు. భరతర్షభా! ప్రథమదిన యుద్ధంలో పాండవసేన వెనకకు మరలింది. భీష్మునిలో యుద్ధ సంరంభం పెరుగుతూనే ఉంది. దుర్యోధనుడు ఆనందించాడు. అప్పుడు ధర్మరాజు వేగంగా శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి సర్వసోదరులతో, సమస్త రాజులతో కలిసి, భీష్ముని పరాక్రమాన్ని, తమ పరాక్రమాన్ని గురించి చింతిస్తూ మహాశోకంతో శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. (1-3)
కృష్ణ పశ్య మహేష్వాసం భీష్మం భీమపరాక్రమమ్ ।
శరైర్దహంతం సైన్యం మే గ్రీష్మే కక్షమివానలమ్ ॥ 4
"కృష్ణా! భీష్ముని భీషణ పరాక్రమాన్ని చూడు. గ్రీష్మ కాలంలో చెత్తా చెదారాన్ని దహించే నిప్పులా నా సేనను బాణాలతో దహించాడు. (4)
కథమేనం మహాత్మానం శక్ష్యామః ప్రతివీక్షితుమ్ ।
లేలిహ్యమానం సైన్యం మే హవిష్మంతమివానలమ్ ॥ 5
అగ్ని ప్రజ్వలించి, హవిస్సులను గ్రహించినట్లు నా సేనను బాణజిహ్వతో నాకి వేస్తున్న ఈ మహాత్మునివైపు ఎలా చూడగలం? ఎలా నిరోధించగలం? (5)
ఏతం హి పురుషవ్యాఘ్రం ధనుష్మంతం మహాబలమ్ ।
దృష్ట్వా విప్రద్రుతం సైన్యం సమరే మార్గణాహతమ్ ॥ 6
పురుషోత్తముడు, మహాబలుడు అయిన భీష్ముడు వింటిని చేతబట్టగా చూసి, బాణాల దెబ్బలు తిని, నా సేన రణభూమి నుండి పారిపోతుంది. (6)
శక్యో జేతుం యమః క్రుద్ధః వజ్రపాణిశ్చ సంయుగే ।
వరుణః పాశభృద్ వాపి కుబేరో వా గదాధరః ॥ 7
న తు భీష్మో మహాతేజాః శక్యో జేతుం మహాబలః ।
కోపించిన యముని జయించవచ్చు. వజ్రధారి అయిన ఇంద్రుని కానీ, పాశధారి అయిన వరుణిని కానీ, గదను పట్టిన కుబేరుని కానీ యుద్దంలో గెలవవచ్చు. కానీ మహాబలుడు, మహాతేజస్వి అయిన భీష్ముని గెలవలేము. (7 1/2)
సోఽహమేవంగతే మగ్నః భీష్మాగాధజలేఽప్లవే ॥ 8
ఆత్మనో బుద్ధిదౌర్బల్యాద్ భీష్మమాసాద్య కేశవ ।
కేశవా! నా దుర్బలబుద్ధి వలన భీష్ముని ఎదిరించి, భీష్ముడనే అగాధ జలంలో పడవలేకుండా ఇలా మునిగిపోతున్నాను. (8 1/2)
వనం యాస్యామి వార్ ష్ణేయ శ్రేయో మే తత్ర జీవితుమ్ ॥ 9
న త్వేతాన్ పృథివీపాలాన్ దాతుం బీష్మాయ మృత్యవే ।
వార్ష్ణేయా! నేను అరణ్యానికి పోతాను. అక్కడ బ్రతకడమే నాకు మేలు. ఈ రాజులను భీష్మరూపమైన మృత్యువుకు అర్పించలేను. (9 1/2)
క్షపయిష్యతి సేనాం మే కృష్ణ భీష్మో మహాస్త్రవిత్ ॥ 10
యథానలం ప్రజ్వలితం పతంగాః సమభిద్రుతాః ।
వినాశాయోపగచ్ఛంతి తథా మే సైనికో జనః ॥ 11
కృష్ణ! మహాస్త్రవేత్త అయిన భీష్ముడు నా సేనను నాశనం చేస్తాడు. మండే నిప్పు మీదకు మిడుతలు దూకినట్లు నా సైనికజనం నశించిపోవటానికే భీష్ముని సమీపిస్తోంది. (10,11)
క్షయం నీతోఽస్మి వార్ ష్ణేయ రాజ్యహేతోః పరాక్రమీ ।
భ్రాతరశ్చైవ మే వీరాః కర్శితాః శరపీడితాః ॥ 12
వార్ష్ణేయా! రాజ్యం కోసం పరాక్రమించి, నశించి పోతున్నాను. నా వీరసోదరులు కూడా బాణాల దెబ్బలు త్ని, కృశించి పోతున్నారు. (12)
మత్కృతే భ్రాతృహార్దేన రాజ్యాద్ భ్రష్టాస్తథా సుఖాత్ ।
జీవితం బహు మన్యేఽహం జీవితం హ్యద్య దుర్లభమ్ ॥ 13
సోదరుడ నన్న ప్రేమతో నా కోసం రాజ్యం నుండి భ్రష్టులయ్యారు. సుఖాన్ని కోల్పోయారు. జీవించటమే గొప్పగా నేను భావిస్తాను. ఇప్పుడు ఆ జీవితమే దుర్లభమవుతోంది. (13)
జీవితస్య చ శేషేణ తపస్తప్స్యామి దుశ్చరమ్ ।
న ఘాతయిష్యామి రణే మిత్రాణీమాని కేశవ । 14
కేశవా! శేషజీవితంలో దుష్కరతపస్సు చేస్తాను. అంతే కానీ ఈ మిత్రుల నందరినీ యుద్దంలో చంపించలేను. (14)
రథాన్ మే బహుసాహస్రాన్ దివ్యైరస్త్రైర్మహాబలః ।
ఘాతయత్యనిశం భీష్మః ప్రవరాణాం ప్రహారిణామ్ ॥ 15
మహాబలుడైన భీష్ముడు తన దివ్యాస్త్రబలంతో నా పక్షంలో నుండి దెబ్బతీయటంలో నేర్పు గల రథికులను వేలకు వేలుగా నిరంతరాయంగా చంపుతున్నాడు. (15)
కిం ను కృత్వా హితం మే స్యాద్ బ్రూహి మాధవ మా చిరమ్ ।
మధ్యస్థమివ పశ్యామి సమరే సవ్యసాచినమ్ ॥ 16
మాధవా! ఇప్పుడు ఏం చేస్తే నాకు హితం చేకూరుతుంది. వెంటనే చెప్పు. ఈ యుద్ధంలో సవ్యసాచి తటస్థంగా ఉన్నట్లు నాకనిపిస్తోంది. (16)
ఏకో భీమః పరం శక్త్యా యుధ్యత్యేవ మహాభుజః ।
కేవలం బాహువీర్యేణ క్షత్రధర్మమనుస్మరన్ ॥ 17
మహాభుజుడైన భీమసేనుడొక్కడే కేవలం భుజబలంతో, క్షత్రధర్మాన్ని అనుసరిస్తూ, శక్తినంతా వినియోగించి, యుద్ధం చేస్తున్నాడు. (17)
గదయా వీరఘాతిన్యా యథోత్సాహం మహామనాః ।
కరోత్యసుకరం కర్మ రథాశ్వనరదంతిషు ॥ 18
మహామనస్వియై వీరులను చంపగల తన గదతో యథోత్సాహంగా రథాలపై, గుర్రాలపై, సైనికులపై, ఏనుగులపై దుష్కర పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. (18)
నాలమేష క్షయం కర్తుం పరసైన్యస్య మారిష ।
ఆర్జవేనైవ యుద్ధేన వీర వర్షశతైరపి ॥ 19
మాన్యవీరా! ఈ రీతిగా బుజుమార్గంలో ప్రవర్తిస్తూ యుద్ధం చేస్తే శత్రుసేనను క్షీణింపజేయటానికి వందసంవత్సరాలైనా చాలవు. (19)
ఏకోఽస్త్రవిత్ సఖా తేఽయం సోఽప్యస్మాన్ సముపేక్షతే ।
నిర్దహ్యమానాన్ భీష్మేణ ద్రోణేన చ మహాత్మనా ॥ 20
నీ మిత్రుడు ఈ అర్జును డొక్కడే అస్త్రవేత్త. కానీ అతడు కూడా మహాత్ములైన భీష్మద్రోణులు మన సేనను దహిస్తుంటే ఉపేక్షిస్తున్నాడు. (20)
దివ్యాన్యస్త్రాణి భీష్మస్య ద్రోణస్య చ మహాత్మనః ।
ధక్ష్యంతి క్షత్రియాన్ సర్వాన్ ప్రయుక్తాని పునః పునః ॥ 21
మహాత్ములైన భీష్మద్రోణుల దివ్యాస్త్రాలు పదే పదే ప్రయోగింపబడి, క్షత్రియుల నందరినీ తగుల బెడుతున్నాయి. (21)
కృష్ణ భీష్మః సుసంరబ్ధః సహితః సర్వపార్ధివైః ।
క్షపయిష్యతి నో నూనం యాదృశోఽస్య పరాక్రమః ॥ 22
కృష్ణ! బీష్ముడు క్రుద్ధుడై ఇతర రాజులతో కలిసి మనలను నాశనం చేస్తాడు. ఆయన పరాక్రమం దానిని సూచిస్తోంది. (22)
స త్వం పశ్య మహాభాగ యోగేశ్వర మహారథమ్ ।
భీష్మం యః శమయేత్ సంఖ్యే దావాగ్నిం జలదో యథా ॥ 23
మహాభాగా! యోగేశ్వరా! దావాగ్నిని మేఘం చల్లబరచినట్లు యుద్ధంలో భీష్ముని శాంతింపజేయగల మహారథుడు మనలో ఎవరున్నారో చూడు. (23)
తవ ప్రసాదాద్ గోవింద పాండవా నిహతద్విషః ।
స్వరాజ్యమనుసంప్రాప్తాః మోదిష్యంతే సబాంధవాః ॥ 24
గోవిందా! నీ అనుగ్రహం వలననే పాండవులు శత్రువులను సంహరించి, స్వరాజ్యాన్ని పొంది, సబాంధవంగా సుఖించగలరు." (24)
ఏవముక్త్వా తతః పార్థః ధ్యాయన్నా స్తే మహామనాః ।
చిరమంతర్మనా భూత్వా శోకోపహతచేతనః ।
శోకార్తం తమథో జ్ఞాత్వా దుఃఖోపహతచేతసమ్ ॥ 25
అబ్రవీత్ తత్ర గోవిందః హర్షయన్ సర్వపాండవాన్ ।
ఇలా పలికి మహామనస్కుడైన ధర్మరాజు శోకోపహచిత్తుడై చాలా సేపు అంతర్ముఖుడై, ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ధర్మరాజు శోకార్తుడై, దుఃఖంతో మనోధైర్యాన్ని కోల్పోయాడని గ్రహించి, కృష్ణుడు సర్వపాండవులను ఆనందింపజేస్తూ ఇలా అన్నాడు. (25 1/2)
మా శుచో భరతశ్రేష్ఠ న త్వం శోచితుమర్హసి ॥ 26
యస్య తే భ్రాతరః శూరాః సర్వలోకేషు ధన్వినః ।
అహం చ ప్రియకృద్ రాజన్ సాత్యకిశ్చ మహాయశాః ॥ 27
విరాటద్రుపదౌ చేమౌ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ।
తథైవ సబలాశ్చేమే రాజానో రాజసత్తమ ॥ 28
త్వత్ప్రసాదం ప్రతీక్షంతే త్వద్భక్తాశ్చ విశాంపతే ।
"భరతశ్రేష్ఠా! బాధపడవద్దు. నీవు బాధపడవలసినవాడవు కాదు. శూరులయిన నీ సోదరులు లోకప్రసిద్ధి గల విలుకాండ్రు. రాజా! నేనూ, మహాయశస్వి సాత్యకీ నీకు ప్రియం చేకూర్చేవారం. రాజా! ఈ విరాట ద్రుపదులు, ఈ ధృష్టద్యుమ్నుడు, సేనలతో సహా వచ్చిన ఈ రాజులు నీ అనుగ్రహానికై ఎదురుచూస్తున్నారు. రాజా! వీరంతా నీ భక్తులు. (26-28 1/2)
ఏష తే పార్షతో నిత్యం హితకామః ప్రియే రతః ॥ 29
సైనాపత్యమనుప్రాప్తః ధృష్టద్యుమ్నో మహాబలః ।
ద్రుపదపుత్రుడు, మహాబలుడు అయిన ఈ ధృష్టద్యుమ్నుడు నీ హితాన్ని కోరేవాడు. నీ కిష్టమైనదే చేయగోరేవాడు. నీ సేనల ఆధిపత్యాన్ని పొందినవాడు. (29 1/2)
శిఖండీ చ మహాబాహో భీష్మస్య నిధనం కిల ॥ 30
(కరిష్యతి న సందేహః నృపాణాం యుధి పశ్యతామ్ ।)
మహాబాహూ! రణరంగంలోని రాజులందరూ చూస్తుండగానే ఈ శిఖండి భీష్ముని సంహరిస్తాడు. సందేహం లేదు." (30)
ఏతచ్ఛ్రుత్వా తతో రాజా ధృష్ట్రద్యుమ్నం మహారథమ్ ।
అబ్రవీత్ సమితౌ తస్యాం వాసుదేవస్య శృణ్వతః ॥ 31
ఆ మాటలు విని, ధర్మరాజు శ్రీకృష్ణుడు వింటుండగా ఆ సభలో మహారథి అయిన ధృష్ట్రద్యుమ్నునితో ఇలా అన్నాడు. (31)
ధృష్ట్రద్యుమ్న నిబోధేదం యత్ త్వాం వక్ష్యామి మారిష ।
నాతిక్రమ్యం భవేత్ తచ్చ వచనం మమ భాషితమ్ ॥ 32
"మారిష! ధృష్టద్యుమ్నా! నేను చెప్పబోయేది విను. నా మాటను నీవు అతిక్రమించగూడదు. (32)
భవాన్ సేనాపతిర్మహ్యం వాసుదేవేన సమ్మితః ।
కార్తికేయో యథా నిత్యం దేవానామభవత్ పురా ॥ 33
తథా త్వమపి పాండూనాం సేనానీః పురుషర్షభ ।
నీవు మాకు సేనాపతివి. వాసుదేవునితో సమానుడవు నీవు. పురుషోత్తమా! గతంలో కార్తికేయుడు నిత్యమూ దేవతల సేనాధిపతిఅయినట్లు నీవు కూడా పాండవులకు సేనాధిపతివి కావాలి." (33 1/2)
(తచ్ఛ్రుత్వా జహృషుః పార్థాః పార్థివాశ్చ మహారథాః ।
సాధు సాధ్వితి తద్వాక్యమ్ ఊచుః సర్వే మహీక్షితః ॥
పునరప్యబ్రవీద్ రాజా ధృష్టద్యుమ్నం మహాబలమ్ ॥)
ఆ మాటలు విని పాండవులు, మహారథులయిన ఇతర రాజులు ఆనందించారు. 'భళా, భళా' అంటూ ధర్మజుని మాటను రాజులంతా అభినందించారు. మరల మహాబలుడైన ధృష్టద్యుమ్నునితో ధర్మజుడిలా అన్నాడు.
స త్వం పురుషశార్దూల విక్రమ్య జహి కౌరవాన్ ॥ 34
అహం చ తేఽనుయాస్యామి భీమః కృష్ణశ్చ మారిష ।
మాద్రీపుత్రౌ చ సహితౌ ద్రౌపదేయాశ్చ దంశితాః ॥ 35
యే చాన్యే పృథివీపాలాః ప్రధానాః పురుషర్షభ ।
"పురుషశార్దూలా! అటువంటి నీవు విక్రమించి కౌరవులను చంపాలి. మారిష! నేను, భీముడు, కృష్ణుడు, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, ప్రధానులైన ఇతర రాజులు కవచాలు ధరించి, నీవెంట నడుస్తాం." (34,35 1/2)
తత ఉద్ధర్షయన్ సర్వాన్ ధృష్టద్యుమ్నోఽభ్యభాషత ॥ 36
అహం ద్రోణాంతకః పార్థ విహితః శంభునా పురా ।
రణే భీష్మం కృపం ద్రోణం తథా శల్యం జయద్రథమ్ ॥ 37
సర్వానద్య రణే దృప్తాన్ ప్రతియోత్స్యామి పార్థివ ।
ఆ తరువాత అందరిని ఆనందింపజేస్తూ ధృష్టద్యుమ్నుడిలా అన్నాడు. "ధర్మజా! పరమేశ్వరుడు ముందే నన్ను ద్రోణ ప్రాణాంతకునిగా పుట్టించాడు. భీష్ముని, కృపుని, ద్రోణుని, శల్యుని, జయద్రథుని, గర్వించిన ఇతర రాజుల నందరినీ నేటి యుద్ధంలో ఎదిరిస్తాను. (36, 37 1/2)
అథోత్క్రుష్టం మహేష్వాసైః పాండవైర్యుద్ధదుర్మదైః ॥ 38
సముద్యతే పార్థివేంద్రే పార్షతే శత్రుసూదనే ।
తమబ్రవీత్ తతః పార్థః పార్షతం పృతనాపతిమ్ ॥ 39
యుద్ధోన్మత్తులైన పాండవసేనలలోని మేటి విలు కాండ్రంతా సింహనాదాలు చేశారు. రాజోత్తముడు, శత్రుసూదనుడు అయిన ధృష్టద్యుమ్నుడు ఉద్యమించగానే ఆ సేనాపతితో ధర్మరాజుడిలా అన్నాడు. (38,39)
వ్యూహః క్రౌంచారుణో నామ సర్వశత్రునిబర్హణః ।
యం బృహస్పతిరింద్రాయ తదా దేవాసురేఽబ్రవీత్ ॥ 40
"క్రౌంచారుణ మనే వ్యూహం సర్వశత్రువులను సంహరించగలది. దేవాసుర సంగ్రామకాలంలో బృహస్పతి దానిని ఇంద్రునకు చెప్పాడు. (40)
తం యథావత్ ప్రతివ్యూహ పరానీకవినాశనమ్ ।
అదృష్టపూర్వం రాజానః పశ్యంతు కురుభిః సహ ॥ 41
శత్రుసేనా వినాశకమైన దానిని యథాతథంగా నిర్మించు. ఇంతకుముందెప్పుడూ చూడని ఆ వ్యూహాన్ని నేడు కౌరవులతో పాటు సమస్తరాజులూ చూస్తారు." (41)
యథోక్తః స నృదేవేన విష్ణుర్వజ్రభృతా యథా ।
(బార్హస్పత్యేన విధినా వ్యూహమార్గవిచక్షణః) ।
ప్రభాతే సర్వసైన్యానామ్ అగ్రే చక్రే ధనంజయమ్ ॥ 42
వజ్రధారి అయిన ఇంద్రుడు విష్ణువుకు చెప్పినట్లు ధర్మరాజు ధృష్టధ్యుమ్నునకు చెప్పాడు. వ్యూహనిర్మాణంలో నేర్పరి అయిన ధృష్టద్యుమ్నుడు బృహస్పతి చెప్పిన రీతిగా ప్రాతః కాలంలోనే వ్యూహాన్ని నిర్మించి, అర్జునుని అగ్రభాగంలో నిలిపాడు. (42)
ఆదిత్యపథగః కేతుః తస్యాద్భుతమనోరమః ।
శాసనాత్ పురుహూతస్య నిర్మితో విశ్వకర్మణా ॥ 43
అద్బుతంగా, మనోరమంగా ఉన్న ధ్వజం సుర్యమార్గంలో రెపరెపలాడుతోంది. ఇంద్రుని ఆదేశంతో విశ్వకర్మ తయారు చేసిన దది. (43)
ఇంద్రాయుధసవర్ణాభిః పతాకాభిరలంకృతః ।
ఆకాశగ ఇవాకాశే గంధర్వనగరోపమః ॥ 44
దాని చుట్టూ ఇంద్రధనుస్సు వలె వివిధ వర్ణపతాకలు శోభిస్తున్నాయి. ఆకాశంలో చరించే పక్షిలా ఆ ధ్వజం నిరాధారంగా నిలిచి కదులుతూ, గంధర్వ నగరంలా కనిపిస్తోంది. (44)
నృత్యమాన ఇవాభాతి రథచర్యాసు మారిష ।
తేన రత్నవతా పార్థః స చ గాండీవధన్వనా ॥ 45
బభూవ పరమోపేతః సుమేరురివ భానునా ।
మారిషా! రథమార్గంలో ఆ ధ్వజం నృత్యం చేస్తున్నట్లుంది. రత్నయుక్త మయిన ధ్వజంతో అర్జునుడు, అర్జునునితో ఆ ధ్వజమూ శోభిల్లుతున్నాయి. మేరు పర్వత సూర్యులయి కలయిక పరస్పరం శోభ కూర్చినట్లు అది కనిపిస్తోంది. (45 1/2)
శిరోఽభూద్ ద్రుపదో రాజన్ మహత్యా సేనయా వృతః ॥ 46
కుంతిభోజశ్చ చైద్యశ్చ చక్షుర్భ్యాం తౌ జనేశ్వరౌ ।
దాశార్ణకాః ప్రభద్రాశ్చ దాశేరకగణైః సహ ॥ 47
అనూపకాః కిరాతాశ్చ గ్రీవాయాం భరతర్షభ ।
రాజా! మహాసేనతో కూడిన ద్రుపదుడు ఆ వ్యూహంలో శిరస్సుగా ఉన్నాడు. కుంతిభోజ, ధృష్టకేతువులు కన్నులు. దాశార్ణులు, దాశేరక గణాలతో సహ ప్రభద్రులు, అనూపకులు, కిరాతులు కంఠస్థానంలో ఉన్నారు. (46, 47 1/2)
పటచ్చరైశ్చ పౌండ్రైశ్చ రాజన్ పౌరవకైస్తథా ॥ 48
నిషాదైః సహితశ్చాపి పృష్ఠమాసీద్ యుధిష్ఠిరః ।
పక్షౌ తు భీమసేనశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ॥ 49
ద్రౌపదేయాభిమన్యుశ్చ సాత్యకిశ్చ మహారథః ।
పిశాచా దారదాశ్చైవ పుండ్రాః కుండీవిషైః సహ ॥ 50
మారుతా ధేనుకాశ్చైవ తంగణాః పరతంగణాః ।
బాహ్లికాస్తిత్తిరాశ్చైవ చోలాః పాండ్యాశ్చ భారత ॥ 51
ఏతే జనపదా రాజన్ దక్షిణం పక్షమాశ్రితాః ।
రాజా! పటచ్చరులు, పౌండ్రులు, పౌరవకులు, నిషాదులతో కూడి యుధిష్ఠిరుడు పృష్ఠ స్థానంలో నిలిచారు. భీమసేనుడు, ధృష్టద్యుమ్నుడు రెక్కలు, ద్రౌపది కొడుకులు అభిమన్యుడు, సాత్యకి, పిశాచులు, దారదులు, పుండ్రులు, కుండీవిషులు, మారుతులు, ధేనుకులు, తంగణులు, పరతంగణులు, బాహ్లికులు, తిత్తిరులు, చోలులు, పాండ్యులు - ఈ జానపదులంతా కుడిరెక్కగా నిలిచారు. (48 - 51 1/2)
అగ్నివేశాస్తు హుండాశ్చ మాలవా దానభారయః ॥ 52
శబరా ఉద్భసాశ్చైవ వత్సాశ్చ సహ నాకులైః ।
నకులః సహదేవశ్చ వామం పక్షం సమాశ్రితాః ॥ 53
అగ్నివేశులు, హుండులు, మాలవులు, దానభారులు, శబరులు, ఉద్భసులు, వత్సులు, నాకులులు, నకులుడు, సహదేవుడు ఎడమ రెక్కగా నిలిచారు. (52,53)
రథానామయుతం పక్షౌ శిరస్తు నియుతం తథా ।
పృష్ఠమర్బుదమేవాసీత్ సహస్రాణి చ వింశతిః ॥ 54
గ్రీవాయాం నియుతం చాపి సహస్రాణి చ సప్తతిః ।
పక్షస్థానంలో పదివేలు, శిరస్థానంలో ఒక లక్ష, పృష్ఠ భాగంలో పదికోట్ల ఇరవై వేలు, మెడభాగంలో లక్షాడెబ్బయివేల రథాలను నిలిపారు. (54 1/2)
పక్షకోటిప్రపక్షేషు పక్షాంతేషు చ వారణాః ॥ 55
జగ్ముః పరివృతా రాజన్ చలంత ఇవ పర్వతాః ।
పక్షాలలో, రెక్కల అగ్రభాగాలలో, ఈకలలో నడయాడే కొండల వలె ఏనుగులు తిరుగుతున్నాయి. వాటి చుట్టు సైనికులున్నారు. (55 1/2)
జఘనం పాలయామాస విరాటః సహ కేకయైః ॥ 56
కాశిరాజశ్చ శైబశ్చ రథానామయుతైస్త్రిభిః ।
విరాటుడు, కేకయులు, జఘనస్థానంలో రక్షకులయ్యారు. కాశిరాజు, శైబ్యుడు ముప్పయివేల రథాలతో దాని రక్షణకై నిలిచారు. (56 1/2)
ఏవమేనం మహావ్యూహం వ్యూహ్య భారత పాండవాః ॥ 57
సూర్యోదయం త ఇచ్ఛంతః స్థితా యుద్ధాయ దంశితాః ।
భారతా! ఈ రీతిగా పాండవులు మహావ్యూహాన్ని రచించి, సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ, కవచాలు ధరించి యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు.(57 1/2)
తేషామాదిత్యవర్ణాని విమలాని మహాంతి చ ।
శ్వేతచ్ఛత్రాణ్యశోభంత వారణేషు రథేషు చ ॥ 58
ఆదిత్య వర్ణంతో నిర్మలంగా ఉన్న గొప్ప గొప్ప తెల్లగొడుగులు ఏనుగుల మీదా, రథాల మీదా శోభిస్తున్నాయి. (58)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి క్రౌంచవ్యూహనిర్మాణే పంచాశత్తమోఽధ్యాయః ॥ 5
ఇది శ్రీ మహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున క్రౌంచవ్యూహ నిర్మాణమను ఏబదియవ అధ్యాయము (50)
(దాక్షిణాత్య అధికపాఠం 2 1/2 శ్లోకాలతో కలిపి 60 1/2 శ్లోకాలు)